కొత్త ప్రపంచానికి భారత్ ఇటలీ బాట
అంతర్జాతీయ వ్యవస్థ పెను మార్పులకు లోనవుతున్న ప్రస్తుత సందర్భంలో అత్యున్నత రాజకీయ, సంస్థాగత స్థాయిలలో క్రమబద్ధ సంప్రదింపులు రెండు దేశాల భాగస్వామ్యాన్ని నిర్దేశిస్తున్నాయి. ప్రస్తుత 21వ శతాబ్దంలో ఆయా దేశాల ఆవిష్కరణ సామర్థ్యం, ఇంధన పరివర్తన నిర్వహణ, వ్యూహాత్మక సార్వభౌమత్వం వంటివి ప్రజా శ్రేయస్సు, జాతీయ భద్రత వంటి అంశాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ విషయంలో మా ఉమ్మడి అవగాహనను రెండు దేశాల మధ్య సహకారం ప్రస్ఫుటం చేస్తోంది. రెండు దేశాల శక్తిసామర్థ్యాలను జోడించి, బంధాన్ని మరింత దృఢంగా తీర్చిదిద్దాలన్న మా సంకల్పాన్ని పునరుద్ఘాటిస్తున్నాం. అంతర్జాతీయ స్థాయి సూపర్ కంప్యూటర్ల తయారీ నైపుణ్యంతో పారిశ్రామిక కూడలిగా ప్రపంచంలో ఇటలీకి ప్రముఖ స్థానం ఉంది. అదేవిధంగా 100కు పైగా యూనికార్న్ సంస్థలు సహా 2,00,000 అంకుర సంస్థలతో పాటు ఇంజనీరింగ్ ప్రతిభ–విస్తృతి, ఆవిష్కరణ–వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థలను కలిగి ఉన్న భారత్ శరవేగంగా ఆర్థికవృద్ధి సాధిస్తోంది. రెండు దేశాలకు గల ఈ సామర్థ్యాల మధ్య శక్తిమంతమైన సమన్వయ సాధన లక్ష్యాన్ని మేం నిర్దేశించుకున్నాం. ఇది మా పారిశ్రామిక శక్తిని పరస్పరం బలోపేతం చేసుకునే విలువల వ్యవస్థను సంయుక్తంగా సృష్టిస్తుంది.
ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు ఇనుమడించేందుకు ఐరోపా సమాఖ్య–భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) బాటలు వేస్తుంది. రక్షణ–ఏరోస్పేస్, కాలుష్య రహిత సాంకేతికతలు, యంత్రాలు, ఆటోమోటివ్ విడిభాగాలు, రసాయన–ఔషధ, జౌళి, వ్యవసాయ–ఆహార, పర్యాటకం సహా మరిన్ని రంగాలపై ‘ఎఫ్‌టీఏ’ దృష్టి సారిస్తుంది. తద్వారా 2029 నాటికి ఇటలీ–భారత్ మధ్య నిర్దేశిత 20 బిలియన్ యూరోల వాణిజ్య లక్ష్యాన్ని చేరడంతో సరిపెట్టకుండా దాన్ని అధిగమించాలన్నది మా ఆకాంక్ష. ‘మేడ్ ఇన్ ఇటలీ’ అంటే ప్రపంచవ్యాప్తంగా నాణ్యతకు పర్యాయపదం. అదే నాణ్యత లక్ష్యాన్ని ‘మేక్ ఇన్ ఇండియా’ కూడా నిర్దేశించుకుంది. దీంతో భారత్‌లో తయారీ కోసం ఇటలీ కంపెనీలు ముందుకు వస్తున్నాయి. మరోవైపు ఇటలీలో భారత పరిశ్రమల సంఖ్య కూడా పెరగడం (ప్రస్తుతం రెండువైపులా వీటి సంఖ్య 1000కి పైగానే) మా సరఫరా వ్యవస్థల ఏకీకరణను బలోపేతం చేసే సానుకూల సంకేతం. మా భాగస్వామ్యానికి సాంకేతిక ఆవిష్కరణలే పునాది. కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటం కంప్యూటింగ్, అత్యాధునిక తయారీ, కీలక ఖనిజాలు, డిజిటల్ సదుపాయాలు వంటి రంగాల్లో నేటి పురోగమన వేగం రాబోయే దశాబ్దాల్లో సాంకేతిక విప్లవంగా రూపుదిద్దుకోగలదు. ఈ క్రమంలో చురకైన భారత ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థ, అత్యంత నైపుణ్యం గల వృత్తి నిపుణులు, ఇటలీకి గల ఆధునాతన పారిశ్రామిక శక్తి మేళవింపుతో పైన పేర్కొన్న రంగాలన్నింటా మా సహకారం వ్యూహాత్మకంగా రూపొందుతుంది. రెండు దేశాల్లోని విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థల మధ్య పెరుగుతున్న భాగస్వామ్యం ఈ పురోగతిని మరింత ముందుకు తీసుకెళ్తుంది. ఇక భారత సార్వజనీన డిజిటల్ మౌలిక సదుపాయాలకు ఇప్పటికే అనేక దేశాల్లో, ముఖ్యంగా వర్ధమాన ఆర్థిక వ్యవస్థలలో సానుకూల స్పందన లభిస్తోంది.
కృత్రిమ మేధ రంగం.. మా రెండు దేశాలతోపాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా ఇప్పటికే తనదైన ముద్ర వేసింది. ఈ ఆధునిక సాంకేతికత బాధ్యతాయుతంగా, మానవాళి కేంద్రితంగా కొనసాగేలా చూడటంలో భారత్, ఇటలీ కృషి చేస్తున్నాయి. ఈ దృక్కోణంతో ‘ఏఐ’ని సార్వజనీన ప్రగతికి.. ప్రత్యేకించి వర్ధమాన దేశాలకు ఒక శక్తిమంతమైన సాధనంగా మేం చూస్తున్నాం. సాంకేతికత పరిజ్ఞానాలను మానవాళి కేంద్రితంగా ఉంచేందుకు ‘మానవ్’ పేరిట భారత్ ఒక దార్శనిక విధానం అనుసరిస్తోంది. అదేవిధంగా మానవాళి కేంద్రితమైన ‘అల్గార్–ఎథిక్స్’ (AI వినియోగంలో నైతిక విలువలు పాటించడం) విధానాన్ని ప్రోత్సహించడంలో ఇటలీ ముందు నిలిచింది. ఈ రెండు దృక్కోణాలు ప్రాతిపదికగా కృత్రిమ మేధ పరిజ్ఞానం సామాజిక సాధికారతను ఉత్తేజితం చేయాలన్నది మా భాగస్వామ్యం నిర్దేశించుకున్న లక్ష్యం. ఈ దిశగా భారత డిజిటల్ స్థాయిని, ఇటలీ నైతిక– పారిశ్రామిక నైపుణ్యాన్ని మేళవిస్తూ సాంకేతిక పరిజ్ఞానం మానవాళి ఉన్నతికి సేవలందించేలా భరోసా ఇవ్వడమే మా విధానం.
డిజిటల్ సహకారం, నైపుణ్య అభివృద్ధి, మెరుగైన సైబర్ మౌలిక సదుపాయాల కల్పనలో ఉత్తమ విధానాలను ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా ప్రతి దేశం ‘ఏఐ’ని తీర్చిదిద్దుకోవాలని మేం గట్టిగా నమ్ముతున్నాం. తదనుగుణంగా ప్రయోజనం పొందగలిగే సార్వత్రిక, విశ్వసనీయ, సమాన అవకాశాలు గల డిజిటల్ ప్రపంచ సృష్టి మా ధ్యేయం. ఇటలీ జీ7 అధ్యక్షతకు, న్యూఢిల్లీలో నిర్వహించిన ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్–2026’ సత్ఫలితాలకు మూలం ఈ దృక్పథమే. అంతరిక్ష పరిశోధన, ఉపగ్రహ సాంకేతికతలలో భారత్ ఇప్పటికే అద్భుత ప్రగతి సాధించింది. ఇప్పుడిక ఇటలీ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ నైపుణ్యం తోడ్పాటుతో భావితరం సాంకేతిక పరిజ్ఞానాల రూపకల్పనకు గణనీయ అవకాశాలు అందివస్తాయి. ప్రపంచ దేశాల శ్రేయస్సుకు భరోసా లభించాలంటే జాతీయ భద్రత–స్థిరత్వం అత్యావశ్యకం. కాబట్టే రక్షణ–భద్రత, వ్యూహాత్మక సాంకేతికతలు వంటి రంగాల్లో సహకార బలోపేతానికి ఇటలీ, భారత్ సంకల్పించాయి. కీలక సముద్ర మార్గాల భద్రతకు భరోసాతోపాటు ఉగ్రవాదం, అంతర్జాతీయ నేర నెట్‌వర్క్‌లు, మాదకద్రవ్యాల దొంగ రవాణా, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణా వంటి ముప్పులను ఎదుర్కొనే సామర్థ్య పెంపులో ఈ సహకారం దోహదం చేస్తుంది.
మా భాగస్వామ్యానికి ఇంధన రంగం మరో మూలస్తంభం. పునరుత్పాదక ఇంధనాల నుంచి హైడ్రోజన్ సాంకేతికతల వరకు.. స్మార్ట్ గ్రిడ్‌ల నుంచి పునరుత్థాన మౌలిక సదుపాయాల వరకూ భారత్ –ఇటలీ ఇప్పటికే సహకారం కొనసాగిస్తున్నాయి. గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతుల కేంద్రంగా మారేందుకు భారత్ కృషి చేస్తోంది. అదే సమయంలో పునరుత్పాదక ఇంధన రంగంలో ఇటలీకి అధునాతన సాంకేతికత ఉంది. ఈ అంశాలు మా భాగస్వామ్యాన్ని మరింత శక్తిమంతం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ నేతృత్వాన ఏర్పడిన అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్‌ఏ), విపత్తు పునరుత్థాన మౌలిక సదుపాయాల కూటమి (సీడీఆర్‌ఐ), అంతర్జాతీయ జీవఇంధన కూటమి (జీబీఏ) వంటి సంకీర్ణ సంస్థల కృషిలో ఇతర దేశాలతోపాటు మా సహకారం కూడా కీలకం.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ఇండో–పసిఫిక్, మధ్యధరా ప్రాంతాల మధ్య భారత్, ఇటలీ ఉన్నాయి. కాబట్టి ఈ రెండు ప్రాంతాలను విడివిడిగా చూడకుండా, పరస్పరం అనుసంధానమైన ఒకే వ్యవస్థగా చూడాలి. హిందూ మహాసముద్రాన్ని యూరప్‌తో కలిపే వాణిజ్యం, సాంకేతికత, ఇంధనం, డేటా వంటి అన్ని రంగాల్లో భారత్–మధ్యధరా అనే కొత్త మార్గం రూపుదిద్దుకుంటోంది. దీనికి మా రెండు దేశాలూ పత్యక్ష సాక్షులు. సరిగ్గా ఈ అనుసంధానం వల్లనే మా స్నేహం సహజంగానే ఒక ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యంగా పెరిగింది — రెండు ఖండాలను కలుపుతూ, ప్రపంచానికి కొత్త దిశను చూపిస్తోంది.
ఈ పరిస్థితుల నడుమ ఆధునిక రవాణా, మౌలిక సదుపాయాలు, డిజిటల్ నెట్‌వర్క్‌లు, ఇంధన వ్యవస్థలు, పటిష్ఠ సరఫరా వ్యవస్థలతో మన ప్రాంతాలను అనుసంధానించడమే లక్ష్యంగా పెట్టుకున్న దార్శనికతకు భారత్–మధ్యప్రాచ్య–ఐరోపా ఆర్థిక కారిడార్ (ఐఎంఈసీ) ఒక ప్రతీక. ఈ దృక్కోణానికి వాస్తవికతను ఆపాదించడంలో ఇతర భాగస్వాములతో సమష్టిగా కృషి చేసేందుకు భారత్, ఇటలీ తమ నిబద్ధతను పునరుద్ఘాటిస్తున్నాయి.
మాకెదురయ్యే ఉమ్మడి సవాళ్ల పరిష్కారంలో రెండు దేశాల మధ్య గల పటిష్ట భాగస్వామ్యం, శాశ్వత సాంస్కృతిక సంబంధాలను సద్వినియోగం చేసుకుంటాం. భారతీయ సంస్కృతి ప్రబోధించే ‘ధర్మం’ అనే ఉదాత్త భావన మా చర్యలకు మార్గనిర్దేశం చేసే బాధ్యతా స్ఫూర్తిని ఉత్తేజితం చేస్తుంది. ఆ క్రమంలో నేటి పరస్పర సంధాన డిజిటల్ యుగంలోనూ ‘వసుధైవ కుటుంబకం’ (యావత్ ప్రపంచం ఒకే కుటుంబం) సూత్రం మానవాళి మొత్తాన్నీ ముడివేయడంలో శక్తిమంతంగా పనిచేస్తుంది. పునరుజ్జీవన పథంలో పయనించే ఇటలీ కూడా ఈ విలువలను సహజంగా ప్రతిబింబిస్తుంది. ప్రపంచంలోని ప్రతి వ్యక్తి గౌరవాన్ని, ప్రజలను–సమాజాలను ఏకం చేసే సంస్కృతికి గల అపార శక్తిని ఇది చాటిచెప్తుంది. అందుకే రెండు దేశాల ప్రజలను, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భారత్–ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యానికి పటిష్ఠమైన పునాది వేయాలన్నది మా ఉమ్మడి లక్ష్యం.
(మోదీ ఇటలీ పర్యటన నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనీ సంయుక్తంగా రాసిన వ్యాసం)

