ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రాతినిధ్యం కోసం బిజెపి, పరువు కోసం కాంగ్రెస్

మే 25న ప్రచారం ముగిసి, మే 27న ఓటింగ్ జరగనున్న వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం ఉప ఎన్నిక మునుపెన్నడూ లేని రీతిలో అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది. మొన్న అసెంబ్లీ, నిన్న లోక్ సభ, నేడు ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అన్నట్టు గత 6 నెలలకు పైగా తెలంగాణలో రాజకీయ వాతావరణ నిరంతరం ఉచ్ఛస్థాయిలోనే ఉంటోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. 2021 మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన ఉప ఎన్నిక కావడంతో ఈ పదవీకాలం మూడు సంవత్సరాల కన్నా తక్కువే. అయిన్నప్పటికీ ఈ ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాలకు ప్రభావితం చేసేలా తయారైంది.

తెలంగాణ శాసనమండలిలో పట్టభద్రులకు 3, ఉపాధ్యాయులకు 3 స్థానాలు ఉన్నాయి. ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాల పట్టభద్రులకు ఒకటి, టీచర్లకు ఒకటి….. రాజధాని హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల పట్టభద్రులకు ఒకటి, టీచర్లకు ఒకటి… ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రులకు ఒకటి, టీచర్లకు ఒకటి చొప్పున మొత్తం 6 స్థానాలకు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతాయి. వారి పదవీ కాలాన్ని బట్టి ప్రతి రెండేళ్లకు ఒకసారి ఈ ఎన్నికలు జరుగుతాయి. ఉత్తర తెలంగాణలోని నాలుగు ఉమ్మడి జిల్లాల్లో, అదేవిధంగా హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో 3 ప్రధాన రాజకీయ పక్షాలకు ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం ఉంది. కానీ ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలో 34 శాసనసభ స్థానాల్లో సూర్యాపేట, జనగామ బీఆర్ఎస్… కొత్తగూడెం సీపీఐ.. మిగిలిన 31 అసెంబ్లీ నియోజకవర్గాలను కాంగ్రెస్ గెలుచుకుంది. ఈ 34 శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కు ప్రాతినిధ్యం ఉంది, బిజెపికి లేదు కాబట్టి ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో బిజెపిని గెలిపిస్తే దక్షిణ తెలంగాణలో కూడా మూడు ప్రధాన పార్టీలకు ప్రాతినిధ్యం ఉంటుందని బిజెపి అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి చెప్తున్నారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా రెండవ స్థానం దక్కించుకున్న తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. అయితే ఈ మూడు సంవత్సరాల కాలంలో తీన్మార్ మల్లన్న చేసిన ఘోర తప్పిదాలు ప్రజల్లో ముఖ్యంగా పట్టభద్రుల్లో అతనిపై తీవ్ర వ్యతిరేకతను ఏర్పర్చాయి. ‘‘అంగి లాగు’’ సిద్ధాంతమని, ‘‘చాయ్ బిస్కట్లకు’’ అని ఒక్కొక్క రూపాయి అడుక్కున్న తీన్మార్ మల్లన్న ఇప్పుడు వందల కోట్ల ఆస్తులతో రేంజ్ రోవర్ కార్లలో తిరుగుతున్నారని గ్రాడ్యుయేట్లు ప్రశ్నిస్తున్న వీడియోలు పెద్దఎత్తున సర్క్యూలేట్ అవుతున్నాయి. బ్లాక్ మెయిలింగ్ లో రేవంత్ రెడ్డికి తీన్మార్ మల్లన్న కూడా తక్కువేమీ కాదని అనిపిస్తుంది. ఆపదలో ఉన్నప్పుడు (జైళ్లో) బిజెపి శరణుజొచ్చి, బయటకు రాగానే నేనే షేర్ అని ఐదు పార్టీలు మారిన తీన్మార్ మల్లన్నను గ్రాడ్యుయేట్లు అసహ్యించుకుంటున్నారు. అనవసరంగా ఉప ఎన్నిక తెచ్చారని పట్టభద్రులు బీఆర్ఎస్ ను చీదరించుకుంటున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన ప్రేమేందర్ రెడ్డి గత నాలుగు దశాబ్దాలుగా ఒకే సిద్ధాంతాన్ని నమ్ముకొని, ఒక దశాబ్ద కాలానికిపైగా పూర్తి సమయ కార్యకర్తగా సేవలందించి, మూడు దశాబ్దాలుగా బీజేవైఎం, బిజెపిలో వివిధ హోదాల్లో నిబద్ధతతో, నిజాయితీతో పని చేస్తున్నారు. బిజెపి అభ్యర్థి ఇమేజ్ ముందు ఈ అవకాశవాద, ఫిరాయింపుదారుల ఇమేజ్ దిగదుడుపే. ప్రస్తుత లోక్ సభ ఎన్నికల సమయంలో వీస్తున్న మోదీ గాలి ప్రభావం ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికపైనా కనిపిస్తోంది.

పెద్దల సభకు బ్లాక్ మెయిలర్లు, అవకాశవాదులను పంపకుండా హుందాతనంతో ఉండే (ప్రేమేందర్ రెడ్డి) వాళ్లను ఎన్నుకుంటే ఈ ఉమ్మడి మూడు జిల్లాల నిరుద్యోగులు, ఉద్యోగులకే కాకుండా యావత్ తెలంగాణకు మేలు జరుగుతుందని తెలంగాణ ఉద్యమకారులు కూడా చెప్తున్నారు. మే 27న పోలింగ్ జరిగి, జూన్ 5న కౌంటింగ్ జరిగే ఈ ఎన్నికలో అలాంటి అభ్యర్థి ఎన్నికవుతారని ఆశిద్దాం. మే 13న తెలంగాణలో  జరిగిన నాలుగో దశ పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపికి రెండంకెల స్థానాలు వస్తాయని, కాంగ్రెస్ కు అందులో సగం కూడా రావన్న సంకేతాలు వస్తుండడంతో ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకంగా, బిజెపికి ప్రాతినిధ్యంగా మారింది.