waqf board

ముస్లిం సామాజికాభివృద్ధికి ముందడుగు వక్ఫ్ సవరణ చట్టం!

రేంద్ర మోదీ ప్రభుత్వం లోతయిన పరిశీలన, అధ్యయనం, చర్చల అనంతరం పార్లమెంట్లో ఆమోదింప చేసిన వక్ఫ్ సవరణ చట్టం భారతదేశంలోని ముస్లింల సామాజిక, ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచడంలో ఒక పెద్ద ముందడుగు అని చెప్పవచ్చు. వక్ఫ్ ఆస్తుల నిర్వహణను సంస్కరించడం, వాటి ద్వారా అణగారిన ముస్లిం వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా చూడటం దీని ప్రధాన లక్ష్యం. మోదీ ప్రభుత్వ ప్రయత్నాలను ప్రశంసిస్తూ ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రజ్వీ ఈ చట్టం సాధారణ ముస్లింలకు ఒక వరం అని పేర్కొనడం గమనార్హం. ఇది వారికి ఏ విధంగానూ హానికరం కాదని స్పష్టం చేశారు. ‘‘వక్ఫ్ సవరణ చట్టం సాధారణ ముస్లింలకు హాని కలిగించదు. వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. విలువైన భూమిని చట్టవిరుద్ధంగా ఆక్రమించిన వక్ఫ్ భూ మాఫియాలు మాత్రమే నష్టపోతారు. దీనివల్ల సాధారణ, పేద ముస్లింలు ప్రభావితం కారు’’ అని ఆయన తెలిపారు.

ముస్లిం సమాజంలోని పేద, బలహీన వర్గాల ప్రయోజనాలను కాపాడటం ఈ చట్టం ప్రాథమిక లక్ష్యం. వక్ఫ్ భూమి నుండి వచ్చే ఆదాయం పేద ముస్లింల సామాజిక, ఆర్థిక స్థితిని మెరుగుపరిస్తుంది. ముస్లిం పిల్లలకు నాణ్యమైన విద్య అందించేందుకు తోడ్పడుతుంది. వక్ఫ్ భూమి నుండి వచ్చే ఆదాయాన్ని ముస్లింల ప్రయోజనాల కోసం, అనాథలు, వితంతువుల అభివృద్ధికి ఉపయోగిస్తారు. పేద ముస్లింల కోసం పాఠశాలలు, కళాశాలలు, మదర్సాలు, అనాథ శరణాలయాలను స్థాపించడంలో ఈ నిధులను ఉపయోగిస్తారు. ఈ చట్టం కారణంగా మసీదులు, మదర్సాలు, ఈద్గాలు, స్మశానవాటికలు లేదా పుణ్యక్షేత్రాలకు ఎటువంటి ముప్పు ఏర్పడదు. మతపరమైన సంస్థలపై ఈ చట్టం ప్రభావం ఉండబోదని, ప్రభుత్వం వాటి విద్యల్లో ఏ విధంగానూ జోక్యం చేసుకోదని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెబుతున్నా కొంతమంది రాజకీయ నాయకులు తమ ప్రయోజనాల కోసం ముస్లింలను ఈ విషయంలో తప్పుదారి పట్టిస్తున్నారు. 

గతంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) విషయంలో ఏ విధమైన వివాదాలను సృష్టించారో ఇప్పుడు అదే విధంగా వక్ఫ్ చట్టం విషయంలోనూ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సీఏఏ అమలు ప్రారంభమైన తర్వాత ముస్లింలెవ్వరూ పౌరసత్వం కోల్పోలేదని తేటతెల్లం కావడంతో వారిలో భయాందోళనలు తొలగిపోయాయి. వక్ఫ్ చట్టం లక్ష్యం వక్ఫ్ ఆస్తులను నిర్వహించడం, అందులో అక్రమాలను నియంత్రించడంలో ఎదురవుతున్న సమస్యలు, సవాళ్లను పరిష్కరించడానికి వక్ఫ్ చట్టం 1995ను సవరించారు. భారతదేశంలో వక్ఫ్ ఆస్తుల పరిపాలన, నిర్వహణను మెరుగుపరచడం ఈ సవరణ బిల్లు ప్రధాన లక్ష్యం. గతంలోని చట్టంలోని లోపాలను అధిగమించడం, చట్టం పేరు మార్చడం, రిజిస్ట్రేషన్ ప్రక్రియను మెరుగుపరచడం, వక్ఫ్ రికార్డులను సాంకేతికంగా నిర్వహిండచం వంటి మార్పులతో వక్ఫ్ బోర్డుల సామర్థ్యాన్ని పెంచడం సవరణ చట్టం ప్రధాన లక్ష్యం.

ముస్సల్మాన్ వక్ఫ్ (రద్దు) బిల్లు 2024 ప్రాథమిక లక్ష్యం ముస్సల్మాన్ వక్ఫ్ చట్టం 1923ను రద్దు చేయడం. ఇది వలస పాలన కాలం నాటి చట్టం. ప్రస్తుతం ప్రవేశపెట్టిన సవరణ చట్టంతో వక్ఫ్ ఆస్తుల పరిపాలన, నిర్వహణలో ఏకరూపత, పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతుంది. అసమానతలు, అస్పష్టతలను తొలగిస్తుంది. కొత్తగా తీసుకొచ్చిన చట్టం ద్వారా వక్ఫ్ ఆస్తులను ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేస్తుందనే దుర్మార్గపు ప్రచారాన్ని కొన్ని రాజకీయ వర్గాలు చేస్తున్నాయి. వక్ఫ్ ఆస్తులు అంటే అల్లాకు ఆస్తులను బదిలీ చేసినట్లు అర్థం. అల్లాకు ఒకసారి బదిలీ చేసిన తర్వాత వాటిని వెనక్కి తీసుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. అంటే ఒకసారి వక్ఫ్ ఆస్తిగా మారిన తర్వాత ఆ ఆస్తి యాజమాన్యం ఎల్లప్పటికీ వక్ఫ్ ఆధీనంలోనే ఉంటుందని గ్రహించాలి. ఉదాహరణకు 1850 నుండి వక్ఫ్ ఆస్తిగా క్లెయిమ్ చేస్తున్న బెంగళూరు ఈద్గా మైదానం, అదేవిధంగా మొఘల్ కాలంలో హజ్ సమయంలో సారాయ్గా చారిత్రాత్మకంగా ఉపయోగించబడినందున సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ భవనం కూడా వక్ఫ్ ఆస్తులుగానే ఉన్నాయి. మరో ముఖ్యమైన విషయం అన్ని ఇస్లామిక్ దేశాలలో వక్ఫ్ బోర్డులు, ఆస్తులు లేవని గ్రహించాలి. టర్కీ, లిబియా, ఈజిప్టు, సూడాన్, లెబనాన్, సిరియా, జోర్డాన్, ట్యునీషియా, ఇరాక్ వంటి ఇస్లామిక్ దేశాలలో వక్ఫ్ లు లేవు.

భారతదేశంలో రక్షణ, రైల్వే తర్వాత వక్ఫ్ బోర్డులకు భారీగా భూములున్నాయి. వాటిని చట్టబద్ధంగా రక్షించే చట్టం కూడా ఉంది. వక్ఫ్ బోర్డులు ప్రస్తుతం భారతదేశం అంతటా 9.4 లక్షల ఎకరాల విస్తీర్ణంలో 8.7 లక్షల ఆస్తులను నియంత్రిస్తున్నాయి. వీటి విలువ రూ.1.2 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత ఎక్కువగా వక్ఫ్ భూములు కలిగిన దేశం కావడం గమనార్హం. అయితే, వక్ఫ్ బోర్డు, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ రాజ్యాంగంలో పరిమిత వైవిధ్యం నెలకొనడం, ముతావలీల అధికార దుర్వినియోగం, ముతావలీలు ఆస్తులపై సరైన ఖాతాలను నిర్వహించకపోవడం, స్థానిక రెవెన్యూ అధికారులతో సమర్థవంతమైన సమన్వయం లేకపోవడం, ఆక్రమణలను అడ్డుకోకపోవడం, వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్, టైటిల్ ప్రకటన, వివాదాలు, వ్యాజ్యాలకు దారితీసే ఆస్తులను క్లెయిమ్ చేయడానికి వక్ఫ్ బోర్డులకు అధికారాన్ని విరమించుకోవడం, వర్గాల మధ్య అసమానతను సృష్టించే పట్టణ భూ పరిమితి చట్టం వర్తించకపోవడం వంటి సమస్యలతో వక్ఫ్ ఆస్తుల యాజమాన్యం సుదీర్ఘకాలంగా వివాదాలకు కేంద్రంగా మారుతూ వస్తున్నది. వీటన్నింటికీ మించి వక్ఫ్ ఆస్తుల ఆదాయం చాలా తక్కువగా, నామమాత్రంగా మాత్రమే ఉండడంతో ముస్లిం సమాజం కూడా వాటి ద్వారా చెప్పుకోదగిన ప్రయోజనం పొందలేకపోతున్నది. ‘‘ఒకప్పుడు వక్ఫ్, ఎల్లప్పుడూ వక్ఫ్’’ అనే సూత్రం వివిధ వివాదాలు, వాదనలకు దారితీసింది. వాటిలో కొన్ని, బెట్ ద్వారకలోని రెండు దీవులపై దావా వంటివి. ఇటువంటి వివాదాలతో కోర్టులు సైతం గందరగోళానికి గురవుతున్నాయి. 1995 వక్ఫ్ చట్టంకు 2013లో లోతైన అధ్యయనం, సంప్రదింపులు చేయకుండా సవరించడంతో వక్ఫ్ ఆస్తులు మరింత వివాదాల్లో చిక్కుకోవడంతో పాటు దుర్వినియోగం కూడా అవుతోంది. వక్ఫ్ ఆస్తుల యాజమాన్య హక్కు, స్వాధీనం సమస్య, రిజిస్ట్రేషన్, ట్రిబ్యునల్ పనితీరు, ఫిర్యాదులకు సంబంధించి అనేక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదు. వీటికి తోడు రాష్ట్ర వక్ఫ్ బోర్డులు కూడా చట్టంలో కొన్ని నిబంధనలను దుర్వినియోగపరచడంతో అసమానత, అసంతృప్తి ఏర్పడింది. వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 40ని దుర్వినియోగం చేయడంతో కోర్టు వివాదాలు ఎక్కువయ్యాయి. ప్రజల మధ్య అసమానతలకు కూడా దారితీసింది. వక్ఫ్ చట్టం అనేది మతపరమైన ఆస్తులకు మాత్రమే ప్రత్యేకమైన చట్టం. మరే ఇతర మతానికి అలాంటి చట్టం లేనప్పుడు రాజ్యాంగ బద్ధతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై ప్రస్తుతం దిల్లీ హైకోర్టులో ఇదే ప్రశ్నతో ఒక ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. వక్ఫ్ చట్టం రాజ్యాంగ చెల్లుబాటుకు సంబంధించిన ఈ పిటిషన్‌పై దిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది.

వక్ఫ్ భూములు ఆక్రమించడం, దుర్వినియోగం చేయడంపై ముస్లింలు, ముస్లిమేతరుల నుండి మైనారిటీ మంత్రిత్వ శాఖకు భారీగా ఫిర్యాదులు అందాయి. 2023 ఏప్రిల్ నుండి వచ్చిన ఫిర్యాదులను విశ్లేషిస్తూ వాటిలో 148 ఆక్రమణలు, అక్రమ అమ్మకాలు, సర్వేలు, రిజిస్ట్రేషన్లో జాప్యం, ముతావలీలకు సంబంధించినవని తేలింది. 2022 ఏప్రిల్ నుండి 2023 మార్చి వరకు సెంట్రలైజ్డ్ పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్ అండ్ మానిటరింగ్ సిస్టంకు వచ్చిన ఫిర్యాదులను మంత్రిత్వ శాఖ విశ్లేషిస్తే 566 ఫిర్యాదులలో 194 ఫిర్యాదులు వక్ఫ్ భూమిని అక్రమంగా ఆక్రమించడం, బదిలీ చేయడంపై వచ్చాయని, 93 ఫిర్యాదులు వక్ఫ్ బోర్డు/ముతావలీల అధికారులపై ఉన్నాయని తేలింది. అంతేకాకుండా, పలువురు పార్లమెంటు సభ్యులు వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్లో జాప్యం, వక్ఫ్ బోర్డు మార్కెట్ విలువ కంటే తక్కువ అద్దె పొందడం, వక్ఫ్ భూమిపై విచ్చలవిడి ఆక్రమణ, వితంతువుల వారసత్వ హక్కులు, సర్వే కమిషనర్ సర్వే పూర్తి చేయకపోవడం వంటి అంశాలను లేవనెత్తారు. వక్ఫ్ ఆస్తి రికార్డుల డిజిటలైజేషన్ కూడా పురోగతిలో లేకుండా నిదానంగా సాగుతోంది. ట్రిబ్యునళ్లలో 40,951 కేసులు పెండింగ్ లో ఉన్నాయని, వాటిలో 9942 కేసులు ముస్లిం సమాజం వక్ఫ్ నిర్వహించే సంస్థలపై దాఖలు చేశాయని తేలింది. ఈ కేసుల పరిష్కారంలో విపరీతమైన జాప్యం జరుగుతోంది. ట్రిబ్యునల్ నిర్ణయాలపై న్యాయ పర్యవేక్షణకు ఎటువంటి నిబంధన లేదు.

ముస్లింల స్థితిగతులపై అధ్యయనం జరిపిన సచార్ కమిషన్ వక్ఫ్ ఆస్తులను సమర్థవంతంగా ఉపయోగంలోకి తెస్తే, అవి కనీసం 10 శాతం, అంటే సంవత్సరానికి రూ.12,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగలవని అంచనా వేసింది. సచార్ కమిటీ 2006లో తన నివేదికను సమర్పించింది. వక్ఫ్ నిర్వహణను మెరుగుపరచడానికి పలు చర్యలు సిఫార్సు చేసింది. ముతావలీలపై నియంత్రణ అవసరమని పేర్కొంటూ, సమర్థవంతంగా రికార్డుల నిర్వహణ, వక్ఫ్ నిర్వహణలో సాంకేతిక నైపుణ్యాన్ని చేర్చడంతో పాటు సెంట్రల్ వక్ఫ్ బోర్డు, రాష్ట్రాల వక్ఫ్ బోర్డులలో ఇద్దరు మహిళా సభ్యులను చేర్చాలని, వక్ఫ్ బోర్డుల బలోపేతానికి సంస్కరణలు చేపట్టాలని సచార్ కమిటీ సూచించింది. వక్ఫ్ ఆస్తులను ఆర్థిక ఆడిట్ పథకం కిందకు తీసుకురావాలని స్పష్టం చేసింది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఇటువంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని వక్ఫ్ ఆస్తుల నిర్వహణను మెరుగుపరుస్తూనే వక్ఫ్ బోర్డుల ఏకపక్ష అధికారాలను హేతుబద్ధం చేసే విధంగా ఈ చట్టానికి సవరణలు తీసుకొచ్చారు. ముస్లిం సమాజం సమిష్టి ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకొని, వారి సమగ్రాభివృద్ధికి వక్ఫ్ ఆస్తులు ఉపయోగపడే విధంగా చారిత్రాత్మకమైన సంస్కరణగా ఈ చట్టం తీసుకు వచ్చారు. గత శతాబ్ద కాలంలో భారతదేశంలో ముస్లింల సామాజిక, ఆర్థికాభివృద్ధికి చేపట్టిన అత్యంత కీలకమైన ప్రయత్నంగా చెప్పవచ్చు. 

రాష్ట్రంలో నిర్వహించాల్సిన కార్యక్రమాలు

రాష్ట్రస్థాయి కార్యక్రమాలు

  1. మేధావుల సమావేశం : ప్రముఖ ముస్లిం నాయకులు, వైద్యులు, న్యాయవాదులు, నటులు, ప్రొఫెసర్లు, సోషల్ మీడియాను ప్రభావితం చేసే వ్యక్తులతో హాల్ మీటింగ్ ఏర్పాటు చేయాలి. ఈ సమావేశానికి ఆ ప్రాంతానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కావాలి.
  2. మహిళల సమావేశం : ప్రముఖ మహిళా నాయకురాళ్లు, మేధావులు, సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులతో సమావేశం నిర్వహించాలి.
  3. మదర్సాలు, సూఫీలు, బోహ్రా, ఆఘఖానీ, షియా, పస్మాండ ముస్లిం సంస్థల నాయకులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించాలి.
  4. సవరణ బిల్లుకు మద్దతుగా పోస్టు కార్డులపై సంతకాలు చేసే కార్యక్రమం సహా పలు చాయ్ పే చర్చా కార్యక్రమాలు నిర్వహించాలి.

జిల్లాస్థాయి కార్యక్రమాలు

  1. జిల్లా కేంద్రంలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, రాష్ట్ర బిజెపి పదాధికారులు జర్నలిస్టులు, మీడియా సంస్థలతో కొత్త వక్ఫ్ చట్టం గురించి సంభాషించాలి. ఆందోళనలు, అపోహలు తొలగించి వాస్తవాలను వివరించాలి.
  2. యువ మోర్చా నేతృత్వంలో యువకులు, విద్యార్థులతో ఒక ర్యాలీ నిర్వహించాలి. కొత్త వక్ఫ్ చట్టంను వివరించే ప్లకార్డులను ప్రదర్శించాలి. విద్య, ఉద్యోగ అవకాశాలపై వక్ఫ్ సంస్కరణలు ఏవిధంగా ప్రభావం చూపిస్తాయో వివరించాలి.
  3. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ముస్లిం ప్రభావవంతమైన నాయకులు, సంఘాలు, సమూహాలతో కనీసం ఒక్క సమావేశమైనా నిర్వహించాలి.
  4. కనీసం ఒకసారి ఈ అంశంపై పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించాలి.
  5. ప్రతి జిల్లాలో కనీసం ఒక క్రైస్తవ సామాజిక వర్గ సమావేశం నిర్వహించాలి.

మండల స్థాయి కార్యాచరణ

  1. ప్రధాన ప్రాంతాలు, నివాసాలు, కళాశాలలు, మార్కెట్ ప్రదేశాల్లో కరపత్రాలు, బుక్ లెట్లు పంపిణీ చేయాలి.
  2. ప్రతి గ్రామంలో స్థానికులతో చిన్న చిన్న సమావేశాలు నిర్వహించి వక్ఫ్ బిల్లు, మోదీ దార్శనికత గురించి వారికి అవగాహన కల్పించాలి.
  3. మహిళా ప్రభావిత వ్యక్తులతో చిన్న చిన్న సమావేశాలు నిర్వహించాలి.

డా.జి.మనోహర్ రెడ్డి,
భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు