నెహ్రూ వైఖరి వల్ల దేశానికి తీవ్ర నష్టం
ఆర్టికల్ 370 రద్దుతో పాటు, సరిహద్దులు దాటి పాకిస్థాన్‌లోని బాలాకోట్‌లో దాడులు చేయడం ద్వారా సీమాంతర ఉగ్రవాదాన్ని సహించబోమనే హెచ్చరికలు పంపామని కేంద్ర విదేశాంగ శాఖ

మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు. ఫోరం ఫర్ నేషనలిస్ట్ థింకర్స్ హైదరాబాద్‌లో ఏప్రిల్ 23న నిర్వహించిన కార్యక్రమంలో ‘భారతదేశ విదేశాంగ విధానం- విభేదాల నుంచి విశ్వాసం’ అనే అంశంపై జైశంకర్ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ, ఫోరం ఫర్ నేషనలిస్ట్ థింకర్స్ అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు సహా పలువురు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ స్వాతంత్య్రానంతరం మొదటి ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ అనుసరించిన వైఖరి మన విదేశాంగ విధానంపై ప్రభావం చూపి.. దేశానికి తీవ్ర నష్టం కలిగించిందని ఎస్.జైశంకర్ ఆరోపించారు. దూరదృష్టి లేకపోవడం, ఉదాసీనంగా వ్యవహరించడంతో చైనాతో స్నేహపూర్వక సంబంధాలపై వ్యతిరేక ప్రభావం చూపిందన్నారు. పాకిస్థాన్‌తోనూ సరిగ్గా వ్యవహరించకపోవడం వల్లే సరిహద్దుల వెంట సుదీర్ఘకాలం ఉద్రిక్తతలు కొనసాగాయన్నారు. చైనాతో సంబంధాలపై 1950లో నాటి హోంశాఖ మంత్రి సర్దార్ పటేల్ సూచనను నెహ్రూ పట్టించుకోని ఫలితంగానే 1962లో భారత్‌పై ఆ దేశం దురాక్రమణకు పాల్పడిందని అన్నారు. పాకిస్థాన్‌తో గత ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని, ఆక్రమిత కశ్మీర్‌ను ఎందుకు విస్మరించాయని ప్రశ్నించారు. గత పదేళ్లలో బిజెపి ప్రభుత్వం నాటి తప్పులను చాలావరకు సరిదిద్దిందని తెలిపారు.
‘‘2008లో ముంబయిపై ఉగ్రదాడుల అనంతరం.. నాటి యూపీఏ ప్రభుత్వం పాకిస్థాన్‌పై కఠిన చర్యలకు వెనుకాడింది. ఆనాటి జాతీయ భద్రతా సలహాదారు దీని గురించి రాస్తూ.. ‘మేం దీనిపై కూలంకషంగా చర్చించాం. పాకిస్థాన్‌పై దాడి చేయకపోవడం కంటే.. దాడి చేయడం వల్లే ఎక్కువ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అందుకే ఏమీ చేయకపోవడమే మంచిదన్న నిర్ణయానికొచ్చాం’ అని పేర్కొన్నారు. ఇక దీని భావం ఏమిటో మీరే అర్థం చేసుకోండి’’ అని జైశంకర్ వివరించారు. అప్పట్లో ఇలాంటి రక్షణాత్మక ధోరణి వల్ల ఉగ్రవాదాన్ని పరోక్షంగా ఆమోదించినట్లయ్యిందని అన్నారు. అలాంటి సంశయాత్మక వైఖరి నేడు లేదని.. ఇప్పుడున్నదంతా ఆత్మవిశ్వాసమేనని తెలిపారు.
స్వదేశీ అవసరాల కోసం కొవిడ్ వ్యాక్సిన్‌ను సొంతంగా తయారు చేసుకోవడమే కాకుండా.. ఇతర దేశాల అవసరాలనూ తీర్చిన దౌత్యనీతి మనదని జైశంకర్ తెలిపారు. ఆయుధాల తయారీలో స్వయంసమృద్ధి సాధించి.. బ్రహ్మోస్ క్షిపణులు సహా అనేక ఆయుధాలను ఇతర దేశాలకు విక్రయించే స్థితికి భారత్ చేరుకోవడంలో పదేళ్ల బిజెపి ప్రభుత్వ కృషి ఉందన్నారు. 2014కు ముందు కూడా ఇవే వనరులు, సదుపాయాలు, శాస్త్రవేత్తలు ఉన్నా.. ప్రభుత్వ ఆలోచన ధోరణిలో మార్పులే దేశ గమనాన్ని మార్చాయన్నారు. ఆత్మనిర్భర భారత్, మేకిన్ ఇండియా వంటి అనేక విధానాలతో సాధిస్తున్న ఫలితాలు ప్రపంచ దేశాల్లో మన ప్రత్యేకతను చాటుతున్నాయన్నారు. మాల్దీవులు చైనాకు చేరువై, భారత్‌కు దూరం కావడంపై స్పందిస్తూ.. దేశాల మధ్య సంబంధాలను ఒకటి రెండు అంశాలే కాకుండా అవసరాలు, వైద్యం, ఆహార పదార్థాలు సహా అనేక విషయాలు ప్రభావితం చేస్తాయన్నారు. విశ్వాసం, గ్యారంటీతో పదేళ్లలో వేసుకున్న బలమైన పునాదులపై ఆధారపడి.. సాధికారతతో 25 ఏళ్ల భవిష్యత్తు నిర్మాణానికి ఈసారి ఓటు వేస్తున్నామని గుర్తించాలన్నారు.

