కాంగ్రెస్ అన్యాయాలు, అక్రమాలు సరిదిద్దుతున్నాం
కాంగ్రెస్ గత 70 ఏళ్లలో దేశవ్యాప్తంగా చేసిన అన్యాయాలు, అక్రమాలను, అవినీతి, బంధుప్రీతిని సరిదిద్దుతున్నామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏప్రిల్ 21న బిజెపి రాష్ట్ర కార్యాలయంలో బిజెపి తెలుగు మేనిఫెస్టోను ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘2047 నాటికి వికసిత్ భారత్ నిర్మాణానికి ‘మోదీ గ్యారంటీ’తో ముందుకెళ్తున్నాం. 3 దశాబ్దాల తర్వాత దేశానికి ఓ సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందించాం. ఇది మోదీ గ్యారంటీ. ఉగ్రవాద దాడులు తగ్గిపోయాయి.. నక్సలైట్ల భరతం పడుతున్నాం. ఇది మోదీ గ్యారంటీ. అవినీతిపరులు జైళ్లలోకి పోయారు.. అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్నాం.. ఇది మోదీ గ్యారంటీ. ప్రపంచ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం.. రేపు మూడో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతాం.. ఇది మోదీ గ్యారంటీ. ఏ అంశంలోనైనా భారత్ ఏం చెబుతుందా అని ఇవాళ ప్రపంచమంతా చూస్తోంది. ఇది మోదీ గ్యారంటీ. అందరికీ నాణ్యమైన విద్య, వైద్యం, ఉండేందుకు ఇల్లు.. ఇది మోదీ గ్యారంటీ. దేశంలోని అన్ని వర్గాల భాగస్వామ్యంతో భారత్ ను మళ్లీ విశ్వగురువును చేయడం.. మోదీ గ్యారంటీ.’’ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్ న్యాయ పత్రం పేరుతో జారీచేసిన మేనిఫెస్టో రాహుల్ గాంధీ అన్యాయపత్రంగానే ప్రజలు భావిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన సంకల్ప పత్రంను మోదీ గ్యారంటీగా ప్రజలు విశ్వసిస్తున్నారు. కాంగ్రెస్ విభజన రాజకీయాలకు పాల్పడుతూ విభజిత భారత్ గా మార్చాలని కుట్రలు చేస్తోంది. కులం, మతం, ప్రాంతం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు ఓటుబ్యాంకు రాజకీయాలకు ముడిపెట్టిన పత్రమే రాహుల్ గాంధీ అన్యాయపత్రం. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి, భారతదేశం సమగ్రత, సమైక్యతను కాపాడుతూ, అభివృద్ధి, పేదల సంక్షేమమే ధ్యేయంగా వికసిత్ భారత్ లక్ష్యంగా నరేంద్ర మోదీ సంకల్ప పత్రాన్ని ప్రవేశపెట్టారు. వికసిత్ భారత్ కోసం బిజెపి పాటుపడుతుంటే.. విభజన భారత్ కోసం కాంగ్రెస్ కుట్రలు, కుతంత్రాలు పన్నుతోంది.’’ అని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, డా. కాసం వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శులు డా. ప్రకాశ్ రెడ్డి, కొల్లి మాధవి, గొట్టాల ఉమారాణి, రాష్ట్ర అధికార ప్రతినిధి రచనా రెడ్డి పాల్గొన్నారు.


