పర్యావరణ స్పృహ కలిగిన మోదీ ప్రపంచానికే వరం
అన్ని జీవరాశులు ఒకే మూలం నుండి ఉద్భవించి తిరిగి దానిలోనే తాదాత్మ్యం చెందుతాయనే భారతీయ విశ్వాస వ్యవస్థలో ఆత్మ, పరమాత్మ అనే తేడాలేదు. అంతేకాక, మానవ శరీరం పంచ భూతాలుగా పిలిచే ఐదు ప్రకృతి మూలకాలతో కూడి ఉందని భావిస్తాం: పృథ్వీ (భూమి), జలం (నీరు), అగ్ని (అగ్ని), వాయువు (వాయువు), ఆకాశం (అంతరిక్షం). ప్రశ్నోపనిషత్తులో ఈ అంశాలను దివ్యశక్తి వ్యక్తీకరణలుగా పరిగణిస్తారు. అందువల్ల భారతీయ సంస్కృతిలో అంతర్గత, బాహ్య అనే ద్వైతానికి ఆస్కారం లేదు. ఈ తత్వం మన ఆలోచనల్లో, ఆచరణలో బలంగా వ్యాపించి ఉన్నందున బాహ్య చైతన్యానికి బదులుగా మనం స్వీయ చైతన్యానికి ప్రాధాన్యం ఇచ్చాం. అంతేకాక మన ఈ విశ్వాసాలు పిడివాదం కాదు, ఇవి మానవ, మానవేతర జీవులు సమస్తం ప్రకృతిలో భాగమేనన్న తత్వాన్ని ప్రోత్సహిస్తాయి. దీనికి విరుద్ధంగా, పాశ్చాత్య సంస్కృతిలో ప్రకృతిని ‘పరాయిది’గా చూస్తారు. దానిపై మనుషులు ఆధిపత్యం వహించాలని, దోచుకోవాలని భావిస్తారు. ఏదేమైనా భారతీయుల దృష్టిలో ప్రకృతితో మమేకం కావడమంటే సుస్థిర మనుగడ కోసం కోసం భూమాతను కాపాడుకోవడమే. అందువల్ల భారతీయ నాగరికతకు విపత్కరమైన వాతావరణ మార్పుల సమస్యలను పరిష్కరించే సామర్థ్యం ఉంది.
ఏదేమైనా, మెకాలే విద్యావిధానం పెంపొందించి వలసవాద మనస్తత్వపు విషపూరిత ప్రభావంతో మనం భారతీయ విజ్ఞాన వ్యవస్థను అనుమానంతో చూస్తాం. తరచుగా దానిని అనాగరికమైనది, అశాస్త్రీయమైనది, కాలం చెల్లినదిగా తీసిపారేస్తాం. ప్రస్తుత పర్యావరణ సంక్షోభం కూడా అలాంటి మనస్తత్వం సృష్టించిందే. మన దురాశను తీర్చుకోవడానికి సహజ వనరులను అతిగా వినియోగించడం, మానవేతర జీవరాశులను, ప్రాపంచిక గుణాలను పూర్తిగా విస్మరించడం ఆధునిక విద్యావిధానం సృష్టించిన వ్యక్తులకు అలవాటుగా మారింది. ఈ కారణంగా ప్రకృతితో మమేకమయ్యే మన ఆలోచనా ధోరణి కారణంగా తరతరాలుగా సంరక్షించబడుతున్న సహజ వనరులు తీవ్రమైన ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ క్లిష్ట సమయంలో పర్యావరణ స్పృహ కలిగిన ప్రధాని నరేంద్ర మోదీ ఆగమనం మానవాళి సామాజిక, ఆర్థిక, రాజకీయ చర్చలో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రధాన మంత్రి అంతర్జాతీయ సమావేశాల్లో, అవి ద్వైపాక్షికం కానీ, ప్రాంతీయం లేదా బహుపాక్షిక సదస్సులు గానీ ప్రధాన అంశంగా వాతావరణ మార్పులే ఉంటోంది. వాతావరణ సంక్షోభం భారత విదేశాంగ విధానంలో, దౌత్యంలో అనివార్యమైన భాగంగా మారింది. పర్యావరణ పరిరక్షణపై భారత్ నిబద్ధత ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఆయన చేసే ప్రయత్నాలు మానవులు తమ మనుగడ కోసం, తమ తరువాతి తరాల వారి మనుగడ కోసం ప్రకృతితో ఏర్పరచుకునే అనుబంధాలన పునరుద్ధరించేందుకు ప్రాధాన్యమిస్తాయి. వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఆయన ప్రారంభించిన అనేక కార్యక్రమాలు పర్యావరణ అనుకూల సంప్రదాయ పద్ధతులను పునరుద్ధరించడానికి ఉద్దేశించినవి. బుద్ధిహీనమైన, స్వార్థపూరిత వినియోగానికి బదులు సహజ వనరులను విచక్షణతో, న్యాయబద్ధంగా వినియోగించుకోవడం తక్షణ అవసరమని ఆయన గట్టిగా నమ్ముతారు. సర్వజనుల మనుగడ, సంతోషం కోసం సమగ్ర పర్యావరణ వ్యవస్థను పునరుజ్జీవింపజేయడానికి గత దశాబ్దకాలంగా ఆయన చేస్తున్న కృషి ఆయనను మన నాగరిక చరిత్రకు నిజమైన ప్రతినిధిగా నిలిపింది.
నేడు 21వ శతాబ్దపు భారతదేశం ప్రధాని మోదీ దార్శనిక నాయకత్వంలో, ఉన్నతమైన ఆశయం, సాహసం, నిబద్ధత, లోతైన అవగాహనతో రూపొందించిన పకడ్బందీ ప్రణాళికతో వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో గణనీయమైన పురోగతిని సాధిస్తోంది. వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రపంచ వేదికలపై ప్రధాని మోదీ అనుసరిస్తున్న వైఖరి ప్రపంచ దృష్టిని బాగా ప్రభావితం చేసింది. ప్రకృతిని పరిరక్షించడానికి సమష్టి మానవ కార్యాచరణ తప్పనిసరి అని ఆయన దృఢంగా నమ్ముతారు. నిర్ణీత గడువు కంటే ముందుగానే పారిస్ ఒప్పంద లక్ష్యాలను నెరవేర్చిన ఏకైక దేశంగా భారత్ నిలిచింది. అంతర్జాతీయ సౌర విద్యుత్ కూటమి, వన్-సన్-వన్-వరల్డ్-వన్-గ్రిడ్ ప్రాజెక్ట్, వాతావరణ పరిరక్షణ కోసం విపత్తు స్థితిస్థాపక మౌలిక సదుపాయాల కూటమి, గ్రీన్ క్రెడిట్, స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్, అంతర్జాతీయ పులుల రక్షణ కూటమి వంటి విప్లవాత్మక కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి. మొత్తం పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని ఐదు రెట్లు పెంచే దిశగా ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక ఇంధన విస్తరణ కార్యక్రమాన్ని భారత్ అమలు చేస్తోంది. ప్రపంచ వాతావరణ ఉద్యమానికి ప్రధాని మోదీ నాయకత్వం వహిస్తున్నారు, వాతావరణ మార్పులపై పోరాటంలో భారత్ సారథ్యంలో ముందుకు సాగడానికి ప్రపంచం సంసిద్ధంగా ఉంది.
వాస్తవానికి, భారతదేశం తలసరి కార్బన్ విడుదల ప్రపంచ సగటు కంటే 60 శాతం తక్కువగా ఉంది, ఎందుకంటే మన జీవనశైలి కొంతవరకు స్థిరమైన సాంప్రదాయ పద్ధతులలో వేళ్లూనుకుని ఉంది. ప్రవర్తనలో వాతావరణ అనుకూల మార్పులను పెంపొందించడానికి ప్రధాని మోదీ పర్యావరణ స్పృహ కలిగిన జీవనశైలి కోసం ‘పర్యావరణ హిత జీవన శైలి’ (లైఫ్)ని ఒక ప్రజా ఉద్యమంగా మలిచారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ‘భూమాత-అనుకూలురు’గా తీర్చిదిద్దే లక్ష్యంతో చేపట్టిన ఈ ‘లైఫ్’ కార్యక్రమంలో సమిష్టి భాగస్వామ్యం భవిష్యత్తులో వాతావరణానికి బలమైన రక్షణగా మారనుంది. ఇటీవల ప్రారంభించిన ‘ఏక్ పేడ్ మా కే నామ్’ వాస్తవానికి ‘లైఫ్’ ఉద్యమానికి రెండో భాగం. రసాయనిక ఎరువులు, పురుగు మందుల నుంచి మట్టి, జలవనరులను కాపాడేందుకు భారతీయ ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం దోహదపడుతుంది. వ్యవసాయ వ్యర్థాలు, చెత్త నిర్వహణ, వాడి పారవేసే ప్లాస్టిక్స్ నిషేధం, ప్లాస్టిక్ వ్యర్థాల ప్రాసెసింగ్ ను తప్పనిసరి చేయడం, బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాలు, గ్రామీణ మహిళలకు గ్యాస్ స్టవ్ సరఫరా, విమానాశ్రయాల్లో పర్యావరణ హిత బ్యాగ్ ట్యాగ్ ల వాడకం, మట్టి టీ కప్పులు, మట్టి దీపాల వాడకాన్ని పెంచడం, టపాసుల వాడకాన్ని తగ్గించడం స్వచ్ఛ భారత్ మిషన్ కు ఎంతగానో దోహదపడతాయి.
స్వచ్ఛమైన గాలి కార్యక్రమం వాతావరణంలో పిఎమ్ 2.5, పిఎమ్ 10 కణ సాంద్రతలను తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలలో గ్రీన్ జాబ్స్ (పర్యావరణహిత ఉద్యోగాలు), గ్రీన్ గ్రోత్ (కాలుష్య రహిత వృద్ధి) ప్రాముఖ్యాన్ని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. యువతలో హరిత నైపుణ్యాలను పెంపొందించడానికి, పర్యావరణ పరిరక్షణ, పునరుత్పాదక ఇంధనం, అటవీ రంగాల్లో సుస్థిర ఉపాధి అవకాశాలను కల్పించడానికి హరిత (కాలుష్య రహిత) నైపుణ్యాల పెంపు కార్యక్రమం అమలు జరుతుతోంది. పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను ఉపయోగించి సృజనాత్మకమైన, సుసాధ్యమైన పరిష్కారాలను అందించే పర్యావరణ సాంకేతికతకు అనుగుణంగా భారత్ స్టార్టప్ కార్యక్రమాలు ఉన్నాయి. ప్రస్తుత వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రధాని మోదీ ‘పంచామృతం’ అనే ఐదు అమృత అంశాలను ప్రకటించారు. 2030 నాటికి భారతదేశ శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని 500 గిగావాట్లకు పెంచడం, 2030 నాటికి పునరుత్పాదక ఇంధనం ద్వారా 50 శాతం అవసరాలను తీర్చుకోవడం, 2030 నాటికి మొత్తం అంచనా వేసిన కర్బన ఉద్గారాలను ఒక లక్ష కోట్ల (బిలియన్) టన్నులకు తగ్గించడం, 2030 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ కర్బన తీవ్రతను 45 శాతానికి పైగా తగ్గించడం, 2070 నాటికి నికర శూన్య లక్ష్యాన్ని సాధించడం. గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలోనే ప్రథమ స్థానానికి ఎదగాలన్నది ప్రధాని మోదీ కల. అందువల్ల ఖర్చుతో కూడిన గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి వీలుగా జాతీయ హైడ్రోజన్ ఇంధన కార్యక్రమాన్ని ప్రారంభించారు. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సును ఇప్పటికే ప్రారంభించారు.
2030 నాటికి భారతీయ రైల్వేలు ‘నెట్ జీరో’ లక్ష్యాన్ని చేరుకోవాలన్న ఆయన సంకల్పం ఏటా ఆరుకోట్ల టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు దోహదంచేస్తుంది. ఎల్ఈడీ బల్బులపై నిర్వహించిన భారీ ప్రచార కార్యక్రమం ఇప్పటికే ఏటా 4 కోట్ల టన్నుల ఉద్గారాలను తగ్గిస్తోంది. పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు పేదల డబ్బును ఆదా చేయడానికి సౌర విద్యుత్ కార్యక్రమాలు దోహదపడ్డాయి. ఇవిగాక 2జి ఇథనాల్ పైలట్ కార్యక్రమం, ఉష్ణమండల ప్రాంతాల కోసం కంఫర్ట్ క్లైమేట్ బాక్స్, హైడ్రోజన్ వ్యాలీలు, వేడిని పెంచే, చల్లబరిచే వర్చువల్ రిపాజిటరీ వంటి వర్ధమాన సాంకేతికతలు కూడా ఆయన ఎజెండాలో ఉన్నాయి. తక్కువ కార్బన్ తో కూడిన బయో ఆధారిత ఉత్పత్తులను తయారుచేయడంలో భారతదేశం ఒక వ్యూహాన్ని కూడా రూపొందించింది.
గత పదేళ్లలో భారతదేశంలో చిత్తడి నేలలు, రామ్సర్ ప్రదేశాల సంఖ్య (అంతర్జాతీయ ప్రాధాన్యం గల చిత్తడి నేలల జాబితాలో ఉన్న ప్రదేశాలు) దాదాపు మూడు రెట్లు పెరిగింది. అమృత్ ధరోహర్ యోజన, మిష్టి యోజన మడ అడవుల పర్యావరణ వ్యవస్థను రక్షించడానికి, పునరుద్ధరించడానికి సహాయపడతాయి. జల్ జీవన్ మిషన్, ప్రతిపాదిత 50,000 అమృత్ సరోవర్ల నిర్మాణం నీటి భద్రతకు భోరోసా ఇస్తాయి. భారీ అడవుల పెంపకం కార్యక్రమం, మన రవాణా వ్యవస్థలో సంస్కరణలు, గ్రామాలు, చెరువులు, నగరాలు, నదులను శుభ్రపరచడం వంటి చర్యలు వాతావరణ సంక్షోభ ఉపశమనాన్ని వేగవంతం చేస్తాయి. ప్రధాని మోదీ నేతృత్వంలో వాతావరణ పరిరక్షణలో, వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో భారత్ అంతర్జాతీయంగా కీలక పాత్ర పోషిస్తోంది. పర్యావరణ స్పృహ కలిగిన ప్రధాని మోదీ తక్కువ కాలుష్యంతో, అభివృద్ధి విషయంలో రాజీ పడకుండా మన నాగరికతా విలువల స్ఫూర్తితో భూమి, నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణను సాధించవచ్చని నిరూపిస్తున్నారు. అంతేకాక 2047 నాటికి వికసిత్ భారత్ ను సాధించే లక్ష్యానికి మోదీ కట్టుబడి ఉన్నారు. మన సంప్రదాయం, సంస్కృతిలో నిక్షిప్తమై ఉన్న ప్రాథమిక లక్షణాల నుంచి ఆయన ప్రేరణ పొందారు. ‘ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్తు’ వాటి సారాంశం.
నిజానికి భూమిని కేవలం గ్రహశకలంగా మాత్రమే కాకుండా ‘అందరికీ తల్లి’గా భావించే మన గొప్ప నాగరికత, సంస్కృతులకు ఆయన బ్రాండ్ అంబాసిడర్. ఉపనిషత్తు నుంచి ప్రేరణ పొంది, మానవాళికి కొత్త దిశను ఇవ్వడానికి ఎర్విన్ ష్రోడింగర్ క్వాంటమ్ భౌతిక శాస్త్రాన్ని వైదిక తత్వశాస్త్రంతో అనుసంధానించాడు. నేడు నరేంద్ర మోదీ మానవాళి సంక్షేమం కోసం తన రాజకీయ చర్చలో వైదిక జ్ఞానాన్ని మిళితం చేస్తున్నారు. ప్రధాని మోదీ ఈ గొప్ప చొరవ మానవాళి భవిష్యత్తును ప్రపంచవ్యాప్తంగా మార్చే అద్భుత శక్తిని కలిగి ఉంది.
రాఘవేంద్ర పి తివారీ,
వైస్ ఛాన్సలర్, పంజాబ్ సెంట్రల్ యూనివర్శిటీ, భటిండా

