padma awards

ప్రజా పురస్కారాలుగా పద్మ అవార్డులు

1954 జనవరి 2న భారత రాష్ట్రపతి కార్యాలయం కార్యదర్శి రెండు పౌర పురస్కారాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఒకటి దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న, రెండవది, మూడు అంచెల పద్మ విభూషణ్. పద్మ విభూషణ్ ను ఆ తర్వాత మూడు తరగతులుగా వర్గీకరించారు. ఇది భారతరత్నకు దిగువన ఉంటుంది. అనంతరం 1955 జనవరి 15న పద్మ విభూషణ్ ను పునర్వ్యవస్థీకరించి విడివిడిగా మూడు అవార్డులు ఏర్పాటు చేశారు. అవి ఒకటి పద్మ విభూషణ్ (మూడింటిలోకి అత్యున్నతమైనది), రెండోది పద్మభూషణ్, మూడోది పద్మశ్రీ. 

భారత్ 1954 నుంచి విశిష్టమైన వ్యక్తులను పద్మ అవార్డులతో సత్కరిస్తూ వచ్చింది. కళలు, విద్య, సాహిత్యం, పరిశ్రమలు, సైన్స్, క్రీడలు, వైద్యం సామాజిక సేవా రంగాల్లో విశేష కృషి చేసిన వారిని ఈ పురస్కారాలతో గౌరవిస్తూ వచ్చారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ పురస్కారాలు సమూలమైన మార్పునకు గురయ్యాయి. ప్రజాస్వామ్యానికి నిజమైన ప్రతీక అయిన సమ్మిళితత్వానికి ప్రతీకలైన అసలైన ప్రజా పురస్కారాలుగా ఇవి పరివర్తన చెందాయి. ఈ పౌర పురస్కారాలు స్థాపన వెనుక గల అసలు ఉద్దేశాలను ఇప్పుడు ఇవి ప్రతిబింబిస్తున్నాయి. ఈ ఏడాది ప్రకటించిన పురస్కార గ్రహీతల జాబితా కూడా ఈ పరివర్తనను ప్రతిబింబిస్తుంది. జీవితంలోని భిన్న రంగాలకు చెందిన వ్యక్తులను, ముఖ్యంగా సామాజిక, సాంస్కృతిక రంగాలలో నిస్వార్థగా కృషి చేస్తున్న వారిని ప్రభుత్వం గుర్తించింది. ఎటువంటి కీర్తి ప్రతిష్టలను, గుర్తింపును ఆశించకుండా నిశ్శబ్దంగా దేశం కోసం, సమాజం కోసం నిరంతరంగా కృషి చేస్తున్న అజ్ఞాత వీరులను ఈ పురస్కారాలు వరించాయి. ఈ ఏడాది అవార్డులు అందుకున్న వారిలో నాగాలాండ్ కు చెందిన ఎల్ హాంగ్ థింగ్, ఈయనను ‘పళ్ళ వ్యక్తి’ అని కూడా అంటారు, హాంగ్ థింగ్ తన ప్రాంతంలో పళ్ళతోటల పెంపకంలో విప్లవం సృష్టించారు. అలాగే బీహార్ లోని బక్సర్ జిల్లాకు చెందిన భీమ్ సింగ్ భవేష్ మోసాహార్ తెగ ప్రజల రక్షకుడిగా ప్రశంసలు అందుకున్నారు. సామాన్యులు సమాజంలో పెనుమార్పులను ఏ విధంగా తీసుకురాగలరు అన్న దానికి ఈ విశిష్ట వ్యక్తులే ఉదాహరణ. రాష్ట్రపతి భవన్ లో పద్మ పురస్కారాన్ని అందుకున్న వారిలో పక్కాలి గిరిజన తెగకు చెందిన తులసి గౌడ, 106 సంవత్సరాల పర్యావరణ కార్యకర్త సాలు మరద తిమ్మక్క, ఈమెను స్థానికులు ఆప్యాయంగా ‘చెట్ల అమ్మ’గా పిలుస్తారు, తదితరులు ఉన్నారు. పద్మ అవార్డులను తొలుత ఏ ఉద్దేశంతో స్థాపించారో ఆ స్ఫూర్తికి ఈ సాధారణ వ్యక్తులు ప్రాతినిధ్యం వహిస్తారు. అంకిత భావాన్ని, సేవ, అద్భుతమైన ప్రతిభ ను గౌరవించే లక్ష్యంతో పద్మ అవార్డులను ఏర్పాటు చేశారు. 

ఎంపిక ప్రక్రియలో ప్రజాస్వామ్యం 

ప్రధానమంత్రి మోదీ హయాంలో చేపట్టిన అత్యంత కీలకమైన సంస్కరణల్లో ఒకటి పద్మ అవార్డుల ఎంపిక ప్రక్రియను ప్రజాస్వామీకరించడం. గతంలో ఈ అవార్డులు సమాజంలోని ఉన్నత వర్గాల వారికి మాత్రమే దక్కేవని, ఎంపిక ప్రక్రియ నిగూఢంగా ఉండేదనే విమర్శలు ఉండేవి. అంతేగాక రాజకీయ ప్రాబల్యం ఉన్నవారికి, ఆశ్రితులకు మాత్రమే అవార్డులు దక్కేవి. 2016లో మోదీ ప్రభుత్వం ఈ అవార్డుల నామినేషన్ ప్రక్రియలో సాధారణ ప్రజానీకానికి కూడా అవకాశం కల్పించింది. తద్వారా ఈ ప్రక్రియను పారదర్శకంగా మార్చి ప్రజలు పాల్గొనే అవకాశం కల్పించింది. ఇప్పుడు ఏటా 50 వేల నామినేషన్లు ప్రభుత్వానికి అందుతున్నాయి. వీటిని ఒక ఉన్నత స్థాయి కమిటీ నిశితంగా పరిశీలించి ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఆమోదం కోసం సిఫార్సులు పంపుతుంది. మొట్టమొదటిసారిగా ఏ భారతీయ పౌరుడైనా అర్హులైన వ్యక్తులను ఆన్ లైన్లో ఈ అవార్డులకు నామినేట్ చేయవచ్చు. అవార్డు గ్రహీతల ఎంపికకు ప్రతిభ, ఆయా వ్యక్తులు చేసిన కృషి ప్రధాన ప్రమాణం అవుతుంది. 

రాజకీయ సిద్ధాంతాలకు అతీతం 

ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలో అవార్డు గ్రహీతల ఎంపికలో ఒక కీలకమైన అంశం రాజకీయ ప్రత్యర్థులకు కూడా గుర్తింపు లభించడం. గతంలో తరచుగా రాజకీయ విశ్వాసాల ఆధారంగా అవార్డు గ్రహీతల అర్హతలను నిర్ణయించేవారు. సాధారణంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులను పట్టించుకునేవారు కాదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ దుస్సాంప్రదాయానికి స్వస్తి పలికారు. రాజకీయ పార్టీలు, విశ్వాసాలతో సంబంధం లేకుండా వ్యక్తుల కృషికి గుర్తింపు కల్పిస్తున్నారు. ములాయం సింగ్ యాదవ్, శరద్ పవార్, తరుణ్ గోగోయ్, గులాం నబీ ఆజాద్, బుద్ధదేవ్ భట్టాచార్య వంటి ప్రతిపక్ష ప్రముఖులకు నరేంద్ర మోదీ హయాంలో పద్మ విభూషణ్, పద్మభూషణ్ అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. అంతేగాక మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ప్రణబ్ ముఖర్జీకి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హయాంలో భారతరత్న ప్రకటించారు. ఈ చర్య మోదీ రాజనీతిజ్ఞతకు, రాజకీయాలకు అతీతంగా వ్యక్తులను గౌరవించే స్ఫూర్తికి అద్దం పడుతుంది. అవార్డులు ప్రతిభకు, కృషికి గుర్తింపుగా ఉండాలి తప్ప రాజకీయాల్లో భాగం కాకూడదన్న ప్రభుత్వ దృక్పథాన్ని ఈ అవార్డులు వెల్లడిస్తున్నాయి. 

మహిళలకు పెరిగిన ప్రాతినిధ్యం 

మోదీ ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న మరొక ముఖ్య పరిణామం పద్మ అవార్డులలో మహిళల సంఖ్య పెరగడం. 2024లో 30 మంది మహిళలకు పద్మ అవార్డులు లభించగా ఈ ఏడాది 23 మంది మహిళలకు అవార్డులు జాబితాలో చోటు లభించింది. మహిళల కృషికి మరింత గుర్తింపు ఇవ్వడం, మహిళా సాధికారీకరణ, వారికి పురుషులతో సమానంగా అవకాశాలను కల్పించాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని ఇది తెలియజేస్తోంది. ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో పద్మ అవార్డులు జీవితంలోని అన్ని రంగాల్లో మహిళల కృషిని గుర్తించే వేదికలుగా మారాయి. ఆయన సమ్మిళితత్వ, సాధికారీకరణ దార్శనికత భిన్న రంగాలకు చెందిన మహిళల విశిష్ట కృషికి గాను వారికి గుర్తింపు లభించేటట్లు చేసింది. సంగీతంలో చేసిన కృషికి గాను వాణి జయరాం, క్రీడల్లో సాధించిన విజయాలకు రాణి రాంపాల్, జానపద సంగీతాన్ని పరిరక్షించడంలో చేసిన కృషికి గాను బతుల్ బేగం, వైద్యరంగంలో చేసిన కృషికి డాక్టర్ నళిని పార్థసారథి వీరంతా మహిళల విజయ గాధలను ప్రపంచానికి తెలియ చెప్పాలన్న ప్రభుత్వ లక్ష్యం కారణంగా పద్మ అవార్డులు అందుకున్నారు. 

ప్రజాస్వామ్య స్ఫూర్తి పునరుద్ధరణ 

ఈనాడు పద్మ అవార్డులు భారత ప్రజాస్వామ్య స్ఫూర్తిని, విలువలను ప్రతిబింబిస్తున్నాయి. గతంలో లాగా అవి ఉన్నత వర్గాల వారికి పరిమితమై లేవు. ఆశ్రితపక్షపాతానికి చోటు లేదు. అందుకు భిన్నంగా ప్రభుత్వం నేడు కేవలం ప్రతిభ, దేశానికి చేసిన సేవలే ప్రమాణంగా తీసుకుని జీవితంలోని అన్ని రంగాలకు చెందిన వ్యక్తులను గౌరవిస్తోంది. ప్రధానమంత్రి మోదీ సారథ్యంలో సంభవించిన ఈ మార్పు పద్మ అవార్డుల అసలు స్ఫూర్తిని పునరుద్ధరించింది. ఈ అవార్డుల మౌలిక లక్ష్యం విశిష్ట కృషిని, అంకిత భావాన్ని, నిస్వార్థ సేవను సత్కరించడం. అజ్ఞాత వీరులను, అణగారిన వర్గాలను గుర్తించడం ద్వారా ఈ అవార్డులు కోట్ల మంది భారతీయుల ఆశలను, ఆకాంక్షలను ప్రతిబింబిస్తున్నాయి. పారదర్శకత, సమ్మిళితత్వం, ప్రతిభకు పట్టం ద్వారా పద్మ అవార్డులు నేడు అన్నిటికీ మించి ప్రజలకు విలువనిచ్చే ప్రభుత్వ నవభారత దార్శనికతకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఒకప్పుడు పలుకుబడికి చిహ్నాలుగా నిలిచిన ఈ పురస్కారాలు నేడు దేశ ప్రజలకు ప్రతీకలుగా మారాయి.

ప్రదీప్ బండారి,
బిజెపి జాతీయ అధికార ప్రతినిధి