రాజ్యాంగ సంస్థలు, ప్రక్రియలపై కాంగ్రెస్ నీచ దాడులు
రాజ్యాంగ ఆదేశాల ప్రకారం కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్-ఎస్ఐఆర్) ప్రక్రియ జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్న ఈ సర్ ప్రక్రియ 13వది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 11 సార్లు ఈ ప్రక్రియ జరిగింది. వాజ్ పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ కాలంలో 2002-04 మధ్య చివరిసారి 12వ సర్ ప్రక్రియ జరిగింది. 2004 నుంచి దశాబ్ద కాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం, రాజ్యాంగబద్ధ ప్రక్రియ సర్ ను జరపకుండా ఎన్నికల సంఘంపై తన దుష్ప్రభావాన్ని చూపించింది. ఎన్నికల సంఘంతో పాటు ప్రతి రాజ్యాంగ సంస్థను దుర్వినియోగం చేయడం కాంగ్రెస్ నైజం. ఇటీవల తెలంగాణలో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు నిర్ణయాల విషయంలో రాజ్యాంగబద్ధ స్పీకర్ పదవిలో ఉన్న గడ్డం ప్రసాదరావు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వ నీచ రాజకీయాలకు, రాజ్యాంగ సంస్థల దుర్వినియోగానికి మరో నిదర్శనం.
మనదేశంలో ఎన్నికల్లో ఓటమి చెందిన పార్టీలు కానీ, నాయకులు కానీ ఫలితాలను వినమ్రంగా స్వీకరించడం ఇప్పటివరకు ఉన్న ఆనవాయితీ. ఓటమి అనంతరం హుందాగా ప్రజల ముందుకు కూడా వెళ్లేవారు. ఎమర్జెన్సీ ఘోరాలు ఎన్ని ఉన్నప్పటికీ ఇందిరా గాంధీ 1977లో తను, తన కొడుకు ఓటమితో పాటు పార్టీ ఘోర పరాభవాన్ని వినమ్రంగా స్వీకరించారు. ఎన్నికల సంఘం మీద కానీ, ఎన్నికల ప్రక్రియపై కానీ ఎలాంటి విమర్శలు చేయలేదు. వాజ్ పేయి కూడా తన వ్యక్తిగత ఓటమిని హుందాగా స్వీకరించారు. గత మూడు లోక్ సభ ఎన్నికల్లో వరుస ఓటములు ఎదుర్కొన్న కాంగ్రెస్, ఇలాంటి ఓటములను మళ్లీ మళ్లీ ఎదుర్కొంటున్న ఇండీ కూటమి పార్టీలు ఆ హుందాతనానికి సంపూర్ణంగా తిలోదకాలు ఇచ్చి, రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎలక్షన్ కమిషన్, రాజ్యాంగ ప్రక్రియ అయిన సర్ మీద విషం చిమ్ముతూ దేశ విచ్ఛిన్నకర శక్తులతో మమేకమై, దేశంలో నిరంతరం అలజడులు సృష్టించి, దేశ శాంతిభధ్రతలను, ఐక్యతను, ఆర్థిక పటిష్టతను దెబ్బతీసే కుట్రలు వరుసగా చేస్తున్నాయి.
దశాబ్దంన్నర క్రితం ఉద్యమాల పేరుతో ప్రజాక్షేత్రంలోకి వచ్చిన అరవింద్ కేజ్రీవాల్.. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పేరుతో సొంత రాజకీయ పార్టీని స్థాపించారు. తనదైన రాజకీయ ఎత్తుగడలు, మాటల గారడీతో దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి, కాంగ్రెస్ మద్దతుతో ఒకసారి, సొంతంగా మరో రెండుసార్లు అధికారాన్ని అనుభవించారు. అయితే, గత ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం పాలవడంతో పాటు, కేజ్రీవాల్ స్వయంగా ఎమ్మెల్యేగా ఓటమి చవిచూడటంతో పార్టీ ప్రభ క్రమంగా మసకబారింది. ఈ నేపథ్యంలో, కొత్త రాజకీయ వేదిక కోసం ప్రయత్నాలు ప్రారంభించిన కేజ్రీవాల్.. అమెరికా నుంచి తన సోషల్ మీడియా వ్యవహారాలను నిర్వహిస్తున్న అభిజీత్ దీప్కేతో కలిసి ‘కాక్రోచ్ జనతా పార్టీ’ని ప్రకటించారు. దేశవ్యతిరేక శక్తుల అండదండలు, అంతర్జాతీయ శక్తుల మద్దతుతో కాంగ్రెస్తో కలిసి దేశంలో అరాచక కార్యకలాపాలకు తెరతీశారు.
గత మే మొదటి వారంలో జరిగిన నీట్ పరీక్ష పేపర్ లీక్ కావడంతో వెంటనే ఎన్టీఏ పేపర్ లీక్ అయిన విషయాన్ని ప్రకటించి, వెనువెంటనే రీఎగ్జామ్ షెడ్యూల్ ప్రకటించి, సత్వరం రీఎగ్జామ్ నిర్వహించి, అకడమిక్ డిస్టర్బెన్స్ లేకుండా విద్యార్థులు మెడికల్ యూజీ (అండర్ గ్రాడ్యుయేట్) సీట్ల అడ్మిషన్ ప్రక్రియ ప్రారంభించింది. అయితే, ర్యాంకులు రాని విద్యార్థుల నిరాశను ఆసరాగా తీసుకొని, వారిని రెచ్చగొట్టి, సీజేపీ దిల్లీలో కుట్రపూరిత ఉద్యమానికి తెరతీసింది. విద్యార్థులు తప్పుడు మార్గంలో వెళ్లి ద్రోహులకు, కుట్రలకు బలికాకూడదని, విద్యాశాఖ మంత్రి రాజీనామా ప్రకటించడం ప్రధాని రాజకీయ విజ్ఞతకు అద్దం పడుతుంది. కానీ, అదే కాక్రోచ్ జనతా పార్టీ పంజాబ్, జార్ఖండ్ లో జరిగిన పేపర్ లీకులకు వ్యతిరేకంగా చేపడుతున్నన్న ఉద్యమాలకు ఎలాంటి మద్దతు ఇవ్వలేదు. జార్ఖండ్ లో రీఎగ్జామ్ కోసం అక్కడి విద్యార్థులు జాతీయ జెండాతో ఉద్యమిస్తుంటే, అక్కడ బిజెపి ప్రభుత్వాలు లేవు కాబట్టి మేం ఉద్యమం చేయం అన్నట్టు తప్పించుకుంటున్నాయి. కేవలం మోదీ, బిజెపి వరుస విజయాలు, సమర్థ ప్రభుత్వాలపై విషం చిమ్మడానికే అటు నీట్ ఎగ్జామ్ మీద, ఇటు ఎలక్షన్ సర్ ప్రక్రియ మీద సీజేపీ, కాంగ్రెస్ కుట్రపూరిత విష ప్రచారం నిర్వహిస్తున్నాయని అర్థం అవుతుంది.
మహారాష్ట్ర, హరియాణా, దిల్లీలో బిజెపికి లోక్ సభ ఎన్నికల కంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ శాతం ఓట్లు రావడానికి కారణం జ్ఞానేశ్ కుమార్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా ఉండడమే అని సీజేపీ నేత అభిజీత్ దీప్కే ఆరోపించడం అతని అబద్ధాల దుష్ప్రచారాలకు నిలువెత్తు నిదర్శనం. ఈ మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు జ్ఞానేశ్ కుమార్ ఎలక్షన్ కమిషన్ లో లేరు. ఎలక్షన్ కమిషన్ ప్రతి ఎన్నికల ముందు సర్ ప్రక్రియ చేపట్టాలని రాజ్యాంగం అదేశించిన నేపథ్యంలో, సుదీర్ఘ కాలం పెండింగ్ లో ఉన్న సర్ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించింది. ఈ ప్రక్రియ అనంతరం జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రాష్ట్ర చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా ఒక్క బూత్ లోనూ రీపోలింగ్ అవసరం లేకుండా ఎన్నికలు నిర్వహించడం ఎన్నికల సంఘం, జ్ఞానేశ్ కుమార్ సమర్థతకు మరో తార్కాణం.
గత 12 ఏళ్లుగా మోదీ పాలనలో ఏ కుంభకోణం లేకపోవడాన్ని ఓర్వలేని కాంగ్రెస్, ఇతర ఇండీ కూటమి పార్టీలు, బొద్దింకల పార్టీ మన దేశ ఆర్థిక వ్యవస్థను, శాంతిభద్రతలను నాశనం చేసేవిధంగా, నకిలీ ఉద్యమాలతో, గోబెల్స్ విషప్రచారాలతో తీవ్ర అడ్డంకులు సృష్టిస్తుంటే, మోదీ ప్రభుత్వం చూపించిన ఓపిక చాలు, దేశం కోసం కఠిన నిర్ణయాలు అవసరం అనేవిధంగా అక్టోబర్ 10 నకిలీ ఉద్యమాన్ని సమర్థవంతంగా భగ్నం చేసి, దేశ ప్రజల మన్ననలు పొందింది. ఒకేసారి బాహ్య, అంతర్గత శక్తులు కుమ్మక్కై మన దేశాన్ని ఎన్నో విధాలుగా నాశనం చేసేవిధంగా ప్రయత్నిస్తుంటే, అధికారంలో ఉన్న సమర్థ నేత మోదీ, సేవానిరత బిజెపి ఇప్పుడు ఎంతో ఆవశ్యకంగా, అదృష్టంగా దేశ ప్రజలు భావిస్తున్నారు. గతంలో ఒక సంవత్సరం పాటు నకిలీ రైతు ఉద్యమం, నెలల కొద్దీ షహీన్ బాగ్ ధర్నాలు వంటి వాటికి ఇక ముందు అవకాశాల్లేవని అక్టోబర్ 10న ప్రభుత్వ చర్యలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. దేశంలో గతంలో జరిగిన దుష్పరిణామాలకు, దుష్ఫలితాలకు ముఖ్య కారణం కాంగ్రెస్, కమ్యూనిస్టులు, జిహాదీ, ఖలిస్థానీ లాంటి దేశద్రోహ శక్తులే కారణం. గత 12 ఏళ్లుగా కేంద్రంలో, చాలా రాష్ట్రాల్లో అధికారంలోకి వస్తున్న బిజెపి ప్రభుత్వాలు వీటి దుష్పలితాలను సవరించి, దేశాన్ని ఎన్నో విధాలుగా ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు భద్రత, సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అందించడంలో సఫలం అవుతున్నాయి.

