సంపన్న తెలంగాణను అప్పులకుప్పగా మార్చేస్తున్న రేవంత్ ప్రభుత్వం
దేశంలోనే సంపన్న రాష్ట్రాలలో ఒకటిగా, మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను పదేళ్ళపాటు పాలించిన బీఆర్ఎస్ నేతల బాటలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం సైతం అప్పుల కుప్పగా మార్చేస్తోంది. సగటున రోజుకు రూ.252.10 కోట్లు అప్పులు తెస్తున్నది. అలా ఏడాదిలో సమీకరించాల్సిన రుణాలను ఈ సంవత్సరం కేవలం 7 నెలల్లోనే తీసుకున్నది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందని, ఎక్కడా అప్పులు పుట్టడం లేదంటూ స్వయంగా ముఖ్యమంత్రి నిస్సహాయతను వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లో బహిరంగ మార్కెట్ నుంచి మొత్తం రూ.54,009 కోట్ల రుణాలు తెస్తామని రాష్ట్ర బడ్జెట్లో ప్రతిపాదించిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే ఆ లక్ష్యాన్ని దాటేసింది.
నవంబర్ 18 నాటికే రూ.55 వేల కోట్లు సమీకరించింది. ఇది చాలదన్నట్టు ఈ నెల 25న మరో రూ.5 వేల కోట్ల రుణాలు తీసుకుంటామని రిజర్వు బ్యాంక్‌కు ప్రాతిపాదనలు పంపించింది. నవంబర్ 25న నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొని 13 ఏండ్ల కాలపరిమితితో రూ.500 కోట్లు, 17 ఏండ్ల కాలపరిమితితో రూ.2 వేల కోట్లు, 23 ఏండ్ల కాలపరిమితితో రూ.1,500 కోట్లు, 26 ఏండ్ల కాలపరిమితితో రూ.1,000 కోట్లు తీసుకుంటామని తెలంగాణ ఆర్థికశాఖ ఇండెంట్ పెట్టినట్టు ఆర్బీఐ వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో రూ.2,29,720.62 కోట్ల రెవెన్యూ రాబడి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేయగా, అక్టోబర్ నాటికి రూ.94,555.97 కోట్లు మాత్రమే (41.16 శాతమే) వచ్చింది. దీంతో ఆదాయం, వ్యయాల మధ్య అంతరాన్ని పూడ్చుకునేందుకు రేవంత్ రెడ్డి సర్కారు పూర్తిగా అప్పులపైనే ఆధార పడుతున్నది. నవంబర్ 25న నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలంలో పాల్గొంటామని ఆర్బీఐకి 14 రాష్ర్టాలు ప్రతిపాదనలు పంపాయి. ఈ రాష్ర్టాలన్నీ కలిపి మొత్తం రూ.26,550 కోట్ల రుణాలు సమీకరిస్తామని ప్రతిపాదించాయని, వీటిలో తెలంగాణ రూ.5 వేల కోట్లతో టాప్‌లో ఉన్నదని ఆర్బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ అజిత్ ప్రసాద్ (కమ్యూనికేషన్స్) వెల్లడించారు. ఎఫ్ఆర్బీఎం నిబంధనల ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుంచి రూ.54,009 కోట్ల రుణాలు మాత్రమే తీసుకునేందుకు వీలున్నది. కానీ, తొలి రెండు త్రైమాసికాల్లోనే (ఏప్రిల్-సెప్టెంబర్) రూ.48 వేల కోట్ల అప్పలు తెచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో మరో రూ.9,600 కోట్ల రుణాలు తీసుకుంటామని ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపింది. నవంబర్ లోనే రూ.10 వేల కోట్ల రుణాలు సమీకరించనున్నది. అంటే ఎఫ్ఆర్బీఎం పరిమితికి మించి అప్పులు తీసుకోనున్నది. దీనికి అదనంగా చివరి త్రైమాసికం (జనవరి-మార్చి)లో మరిన్ని రుణాలు సమీకరించే అవకాశం ఉన్నది.
ఎన్నికల సమయంలో చెప్పిన గ్యారెంటీలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలపై మోయలేని రుణభారాన్ని మోపడంపై విస్మయం వ్యక్తం అవుతున్నది. ప్రభుత్వం యాసంగికి 4 లక్షల మంది రైతుల నుంచి 23.19 లక్షల టన్నుల సన్న వడ్లు కొనుగోలు చేసింది. క్వింటాలుకు రూ.500 చొప్పున రైతులకు రూ.1,160 కోట్లు చెల్లించాల్సి ఉంది. రైతులు ధాన్యం విక్రయించి 7 నెలలు గడుస్తోంది. ఇప్పటికీ రూపాయి కూడా విడుదల చేయలేదు. ప్రశ్నిస్తే ప్రభుత్వం వద్ద పైసల్లేవని పౌరసరఫరాల శాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారు. వానకాలం సీజన్లోనూ సన్నాల రైతులకు బోనస్ అరకొరగా చెల్లిస్తున్నది. సుమారు రూ.400 కోట్ల వరకు చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.36 కోట్లు మాత్రమే ఇచ్చినట్టు తెలిసింది. బోనస్‌పై నిర్లక్ష్యం చేస్తున్న ప్రచార ఆర్భాటాలకు మాత్రం వెనుకాడటం లేదు. పౌరసరఫరాలశాఖ నిధుల నుండే పథకాల వివరాలు ముద్రించిన ప్రత్యేక బ్యాగులను రేషన్‌కార్డుదారులకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్నది. రాష్ట్రంలోని 1.02 కోట్ల రేషన్‌కార్డుదారులకు ఒక్కొక్కరికి ఒక్కో బ్యాగు ఇస్తున్నది. బ్యాగుల కొనుగోలుకు సుమారు రూ.50 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు తెలిసింది. రేషన్ కార్డుపై ఒక్కొక్కరికి 6 కేజీల చొప్పున బియ్యం ఇస్తారు. ఇక రేషన్ కార్డుపై ఒకరి కంటే ఎక్కువ మంది ఉంటే బియ్యం పరిమాణం పెరుగుతుంది. ఉదాహరణకు ముగ్గురు లేదా నలుగురు సభ్యులుంటే 18-24 కేజీల బియ్యం పట్టే బ్యాగు ఇవ్వాలి. కానీ విచిత్రంగా ఐదు కేజీల పరిమాణం కలిగిన బ్యాగులను పంపిణీ చేస్తుండటంతో ఈ బ్యాగులలో బియ్యం ఇవ్వడం వీలుకాక, ఖాళీ బ్యాగులను కార్డుదారులకు అందిస్తున్నది. ఎలాంటి ప్రయోజనం లేని ఆ బ్యాగుల కోసం కేవలం ప్రచారం కోసం వ్యయం చేస్తున్నట్లు స్పష్టం అవుతుంది.
ప్రవీణ్

