Constitution Cover Page

రాజ్యాంగ విలువల పరిరక్షణకు కంకణం కట్టుకున్న బిజెపి

ప్రతి సంవత్సరం నవంబర్ 26న భారత్ రాజ్యాంగ దినోత్సవం (సంవిధాన్ దివస్)ను జరుపుకొంటుంది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి, రాష్ట్రాల్లోని పార్టీ ప్రభుత్వాలకు ఇది కేవలం ఒక ఉత్సవం కాదు; దేశ రాజ్యాంగంపై ఉన్న అచంచలమైన విశ్వాసాన్ని పునరుద్ఘాటించడానికి, దాని రూపకర్తలకు హృదయపూర్వక నివాళులు అర్పించడానికి, దాని అంతర్లీన స్ఫూర్తి ‘వికసిత భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం) వైపు ఎలా నడిపిస్తుందో చాటిచెప్పేందుకు ఇది అత్యంత ముఖ్యమైన సందర్భం. 1949లో రాజ్యాంగ పరిషత్ దేశ అత్యున్నత చట్టాన్ని ఆమోదించిన రోజు ఇదే. ఈ మౌలిక పత్రాన్ని భారతదేశ ఐక్యత, ప్రజాస్వామ్యం, జాతీయ గౌరవానికి ఆత్మగా, పునాదిగా బిజెపి పరిగణిస్తుంది.

జాతీయ వారసత్వాన్ని పునరుద్ఘాటించిన మోదీ

నవంబర్ 26ను రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానిదే. 2015లో అధికారికంగా ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించారు. దీనికి ముందు రాజ్యాంగం మహత్తర ప్రాముఖ్యాన్ని కలిగివున్నా దాన్ని ఆమోదించిన రోజుకు గుర్తింపు లేదు. జనవరి 26న జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల ముందు ఇది దాదాపుగా మరుగునపడిపోయింది. రాజ్యాంగం తుది రూపానికి దారితీసిన సమగ్ర చర్చలు, మేధోపరమైన శ్రమ, జాతీయవాద స్ఫూర్తిని గౌరవించడానికి ఈ తేదీని ప్రత్యేక ఉత్సవంగా జరుపుకోవడం అవసరమని బిజెపి భావించింది. రాజ్యాగం ప్రధాన రూపశిల్పి అయిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్‌కు తగిన గుర్తింపు ఇవ్వడం చాలా కీలకం. బాబాసాహెబ్ ఆలోచనకు, దార్శనికతకు బిజెపి ఎప్పుడూ ప్రాధాన్యం ఇస్తుంది. కేవలం అణగారిన వర్గాల నాయకుడిగానే కాకుండా, ఆయన్ను ఒక అత్యున్నత జాతీయ రాజనీతిజ్ఞుడిగా, ఆధునిక భారత రాజ్యానికి నిజమైన వాస్తుశిల్పిగా కీర్తిస్తోంది. గత ప్రభుత్వాలు, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వాలు, డాక్టర్ అంబేద్కర్‌కు తగిన గౌరవం ఇవ్వడంలో విఫలమయ్యాయి. తరచుగా ఆయన వారసత్వాన్ని సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం పరిమితం చేయడానికి ప్రయత్నించాయి. దీనికి విరుద్ధంగా బిజెపి ఆయన కృషిని స్మరించుకోవడానికి, సామాజిక న్యాయం, సమానత్వం, జాతీయ సమగ్రతలతో కూడిన ఆయన ఆలోచనలను క్రియాశీలంగా అమలు చేయడానికి అనేక చర్యలు చేపట్టి, ఆయన్ని యావత్ భారతదేశానికి జాతీయ చిహ్నంగా తిరిగి నిలిపింది.

రాజ్యాంగం నిజమైన స్ఫూర్తి: ఐక్యత, న్యాయం

 రాజ్యాంగం భారత్ నాగరికతా విలువలకు ఒక చైతన్యవంతమైన నిదర్శనం. ఇది న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం సూత్రాలను వ్యక్తీకరిస్తుంది. అదే సమయంలో విభిన్నమైన, సజీవమైన దేశం సమైక్యంగా ఉండేలా చూస్తుంది. ప్రభుత్వ ప్రధాన విధానాలు, శాసన చర్యలు ఈ రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఉండాలి, చారిత్రక తప్పిదాలను సరిదిద్దడానికి, దేశ మౌలిక నిర్మాణాన్ని బలోపేతం చేయడానికి నిరంతరం దోహదం చేయాలి. నరేంద్ర మోదీ సారథ్యంలోని బిజెపి ప్రభుత్వం ఈ స్ఫూర్తితో తీసుకున్న చర్యల్లో ఒకటి 2019 ఆగస్టు 5న అధికరణం 370 రద్దు. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన ఈ తాత్కాలిక నిబంధన రాజ్యాంగ విరుద్ధం, దేశంలో రాష్ట్రం సంపూర్ణ విలీనానికి ఇది ఆటంకం కలిగించింది. పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన ఈ అధికరణం రద్దు, రాజ్యాంగం నిజమైన భరోసాను నెరవేర్చే చర్య. అన్ని రాష్ట్రాలు సమానమని, సమైక్య, సార్వభౌమ భారతదేశంలో అంతర్భాగాలని ఉద్ఘాటించడం ద్వారా మోదీ ప్రభుత్వం సహకార సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేసింది. అంతేకాకుండా అణిచివేతకు, దోపిడీకి, వంచనకు గురైన దళితులు, గిరిజనులు, ఓబీసీలు, మహిళల సంక్షేమం కోసం ఉద్దేశించిన అనేక కార్యక్రమాలు, పథకాలు అమలు చేయడం ద్వారా బిజెపి ప్రభుత్వం సామాజిక న్యాయం సూత్రానికి తన నిబద్ధతను నొక్కి చెబుతోంది. కేవలం బుజ్జగింపు కాకుండా సాధికారతపై దృష్టి సారించే విధానాలను అమలు చేయడం ద్వారా డాక్టర్ అంబేద్కర్ ఆశించిన ఉమ్మడి పౌరస్మృతి (UCC), ట్రిపుల్ తలాఖ్ నిషేధం వంటి చర్యలతో సమానత్వం, వివక్ష లేని రాజ్యాంగ స్ఫూర్తిని నిజంగా పరిరక్షించేది, అమలు చేసేది తానేనని బిజెపి నిరూపించింది. 

 వికసిత్ భారత్ సంకల్పం 

గత ప్రభుత్వాల చర్యలకు బిజెపి విధానాలు పూర్తిగా భిన్నంగా ఉండటం రాజ్యాంగ దినోత్సవంపై బిజెపి దృక్పథంలో ఒక ప్రధాన అంశం. కాంగ్రెస్ ప్రభుత్వాలు రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగం ప్రాథమిక స్ఫూర్తిని అనేక సందర్భాల్లో ఉల్లంఘించాయి. అత్యవసర పరిస్థితి (1975-77) భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి అధ్యాయం. ఇందిరా గాంధీ ఆ సమయంలో ప్రాథమిక హక్కులను నిలిపి వేశారు. పత్రికా స్వేచ్ఛను అణిచివేశారు, రాజ్యాంగాన్ని బహిరంగంగా ఉల్లంఘించారు. రాజ్యాంగం విలువలపై ఒకప్పుడు దాడి చేసి, రాజకీయ లాభాల కోసం పదేపదే దాన్ని సవరించిన వారే ఇప్పుడు దాని రక్షకులమని చెప్పుకుంటున్నారు. దీనికి భిన్నంగా బిజెపి ప్రభుత్వం రాజ్యాంగం నిర్వచించిన ప్రజాస్వామ్య, వ్యవస్థాగత పరిమితులకు లోబడి విలువల పరిరక్షణకు చిత్తశుద్ధితో కృషిచేస్తోంది. న్యాయ వ్యవస్థలో పలు సంస్కరణలు, ఈ-కోర్ట్ ప్రాజెక్టుల వంటి కార్యక్రమాల ద్వారా న్యాయపరిపాలనలో పారదర్శకతను పెంచి బిజెపి ప్రభుత్వం న్యాయాన్ని ప్రజలకు చేరువ చేసింది. తద్వారా రాజ్యాంగం అత్యంత ముఖ్యమైన మౌలిక సూత్రాల్లో ఒకటైన స్వతంత్ర న్యాయవ్యవస్థను బలోపేతం చేసింది. 

 రాజ్యాంగ దినోత్సవం మన రాజ్యాంగ నిర్మాతల జ్ఞానాన్ని స్మరించుకునే సందర్భం మాత్రమే కాక భవిష్యత్తుకు సంబంధించి లక్ష్యాలు నిర్దేశించుకునే సందర్భం కూడా. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వాన్ని, దేశాన్ని సిద్ధం చేయాల్సిన సమయం ఇది. న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం అనే ఆదర్శాలు సంపూర్ణంగా నెరవేరాలని యావత్తు జాతి సంకల్పించాలి. ప్రజాస్వామ్య మౌలిక నిర్మాణాన్ని కాపాడటం, వ్యక్తి గౌరవాన్ని నిలబెట్టడం, డాక్టర్ అంబేద్కర్, ఇతర రాజ్యాంగ నిర్మాతలు ఆశించిన రాజ్యాంగ విలువలను ప్రభుత్వ విధానాలు ప్రతిబింబించేలా చూడటం బిజెపి ప్రభుత్వ లక్ష్యం.