సమర్థ పాలన వైపు మొగ్గు చూపిన బిహార్
బిహార్ ప్రజలు ఇచ్చిన తాజా తీర్పు ప్రాముఖ్యం సీట్ల లెక్కలకు అతీతమైంది. జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA) మొత్తం 243 శాసనసభ స్థానాల్లో 202 స్థానాలను గెలుచుకుంది, ఇందులో భారతీయ జనతా పార్టీ ఒక్కటే 89 సీట్లు సాధించింది—రాష్ట్రంలో పార్టీ ఇంత పెద్దసంఖ్యలో సీట్లు సంపాదించడం ఇదే మొదటిసారి. దశాబ్దాలుగా వివిధ కూటముల ద్వారా బిహార్ రాజకీయాలను శాసించిన మహాకూటమి కేవలం 35 సీట్లకే పరిమితమైంది. 7.4 కోట్లకు పైగా నమోదైన ఓటర్లలో 67.13 శాతం మంది పోలింగ్‌లో పాల్గొనడంతో ఇటీవల రాష్ట్ర చరిత్రలోనే ఇది అత్యంత ఉత్కంఠభరితమైన ఎన్నికల్లో ఒకటిగా నిలిచింది.
కుల సమీకరణాలకు అతీతంగా..
అనేక సంవత్సరాలుగా బిహార్‌పై వచ్చే వ్యాఖ్యానాలు ఆ రాష్ట్రాన్ని ఏమార్పునకూ నోచుకోని స్థితిలో స్తంభించిపోయిన దానిలా చిత్రీకరించాయి. ఎన్నికలను కుల సమీకరణాల లెక్కలుగానే పరిగణించారు. వివిధ కులాలు, వర్గాల జనాభా దానికదే రాజకీయ ఫలితాలుగా మారుతుందని ఊహించారు. అయితే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత రాజకీయాల రూపురేఖలు నిర్ణయాత్మకంగా అభివృద్ధి, సమ్మిళితత్వం, రాష్ట్ర సామర్థ్యం వైపు మళ్ళాయి. బిహార్ ఓటర్లు ఈ మార్పుకు అసాధారణమైన స్పష్టతతో ప్రతిస్పందించారు. ఓటర్లు మరింత పనితీరును, మంచి ఫలితాలను ఆశిస్తున్నారని బిహార్ ఎన్నికల ఫలితాలు వెల్లడిస్తున్నాయి. వీరు ఒకప్పటి అభద్రత, వెనుకబాటుతనంతో కూడిన బిహార్‌కు, మెరుగైన పాలన కలిగిన నేటి బిహార్‌కు మధ్య వ్యత్యాసాన్ని గమనించారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో అంచనాను అందుకోలేకపోయిన సమీకరణ దృష్ట్యా ఈ ఎన్నికల్లో మరింత బాధ్యతతో వ్యవహరించాలని అనేక మంది పౌరులు తమ సంభాషణలు, పోలింగ్ సరళి ద్వారా నిరూపించారు. దేశ విస్తృత ప్రయాణంలో బిహార్ ఎక్కడ నిలబడాలని వారు కోరుకుంటున్నారన్న దానిపై సొంతంగా నిర్ణయాలు తీసుకున్నారు.
స్పష్టమైన మార్పు
గత దశాబ్దంలో బిహార్‌లో 55,000 కిలోమీటర్లకు పైగా గ్రామీణ రహదారులను నిర్మించడమో లేదా నవీకరించడమో చేశారు. తద్వారా గ్రామాలు మార్కెట్లు, పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలతో అనుసంధానమయ్యాయి. కేంద్ర పథకాలు, రాష్ట్ర కార్యక్రమాల కలయిక ద్వారా కోట్ల గృహాలకు విద్యుత్, తాగునీరు, సామాజిక భద్రత లభించాయి. ‘సౌభాగ్య’, సంబంధిత కార్యక్రమాల కింద బిహార్‌లోని 35 లక్షలకు పైగా గృహాలను విద్యుదీకరించారు. దీనితో రాష్ట్రంలో దాదాపు అన్ని ఇళ్ళకు విద్యుదీకరణ జరిగింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద బిహార్‌కు 57 లక్షలకు పైగా పక్కా గృహాలు మంజూరయ్యాయి, వీటిలో చాలా వరకు మహిళల పేర్ల మీదే నమోదయ్యాయి. ఇటువంటి గణాంకాలు ప్రజలు చూడగలిగే, అనుభవించగలిగే స్పష్టమైన మార్పును సూచిస్తున్నాయి: అన్ని కాలాలకు అనువైన రోడ్డు, కోతలు లేని విద్యుత్తు, పని చేసే పంపు, గౌరవాన్ని అందించే ఇల్లు.. ఈ కనీస సౌకర్యాలు ప్రజల జీవితాల్లో పెనుమార్పు తెచ్చాయి. ఈ ప్రజా ప్రయోజనాలు విస్తరించడం వల్ల పాత ఆలోచనల పట్టు సడలింది. బిహార్ సమాజం విభిన్నంగా, పొరలు పొరలుగా ఉన్నప్పటికీ ఎన్నికల పరంగా ఆ పొరలు ఇకపై అభివృద్ధికి ఆటంకాలుగా పనిచేయడం లేదు. వేర్వేరు వర్గాల మహిళలు ఇప్పుడు భద్రత, చలనం, అవకాశాలపై ఒకే రకమైన ఆకాంక్షలను కలిగి ఉంటున్నారు. పరస్పర విరుద్ధ సామాజిక వర్గాలకు చెందిన కుటుంబాల యువత ఇప్పుడు ఒకే కోచింగ్ తరగతులు, కార్మిక మార్కెట్లలో కనిపిస్తున్నారు. వారి దైనందిన అనుభవాలు వారిని ఉమ్మడి ఆశయాల వేదికపైకి తీసుకువస్తున్నాయి. ఆ వేదికపై వారు రాజకీయ నాయకులను అడిగే ప్రశ్నలు ఉద్యోగాలు, మౌలిక సదుపాయాలు, స్థిరత్వం, న్యాయం గురించే ఉన్నాయి.
యువత ఆశయాలు
కుటుంబ ఆకర్షణ, వారసత్వంగా వచ్చిన పలుకుబడిపై ఆధారపడిన పార్టీలు చట్టసభల్లో తమ బలం వేగంగా తగ్గిపోవడాన్ని చూశాయి. బిహార్ ఇటువంటి పార్టీలను, కూటములు చాలా దశాబ్దాలుగా దగ్గర నుంచి చూసింది, వాటి పరిమితులను అర్థం చేసుకుంది. 2025 ఫలితం ఏమిటంటే, నాయకులు ప్రభుత్వంలో ఎలా వ్యవహరిస్తున్నారు, సంక్షోభాల సమయంలో ఎలా స్పందిస్తున్నారు, వ్యవస్థలతో ఎలా వ్యవహరిస్తున్నారు, ప్రజా వనరులను ఎలా ఉపయోగిస్తున్నారు అనేది ఓటర్లు గమనిస్తున్నారని సూచిస్తుంది. NDAలో ఎక్కడైనా కుటుంబ లేదా వారసత్వ నేపథ్యాలు ఉన్నా అవి కఠోర శ్రమ, సంస్థాగత సామర్థ్యం, సేవా చరిత్ర అనే పరీక్షలలో నెగ్గుకు రావాల్సిందే. దేశంలో యువజనాభా అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో బిహార్ ఒకటి. 2000 తర్వాత జన్మించిన కోట్ల మంది ఈ ఎన్నికల్లో ఓటు వేశారు. ఎక్స్‌ప్రెస్ వేలు, డిజిటల్ చెల్లింపులు, పోటీతత్వంతో కూడిన సమాఖ్య వ్యవస్థ, భారీ, విస్తృత సంక్షేమ పథకాలు ప్రజల ఆలోచనా సరళిని నిర్దేశించే భారతదేశంలో వారు పెరిగారు. వారు ఒక రాష్ట్రంతో మరో రాష్ట్రాన్ని పోల్చుకుని చూస్తారు. ప్రకటనలను గమనిస్తూ ఉంటారు. చెప్పే మాటలు ఎంతవేగంగా కంటికి కనిపించే మార్పుగా మారుతున్నాయో దాన్ని బట్టి నాయకులను అంచనా వేస్తారు. వారికి సమయానికి వేసిన రోడ్డుకు, ఫైల్‌లోనే ఉండిపోయిన రోడ్డుకు మధ్య తేడా కేవలం ఒక సాధారణ విషయం కాదు. యువ ఓటర్లు వ్యవస్థలను బలహీనపరిచే, వేర్పాటువాద భావనలతో కూడిన లేదా జాతీయ భద్రతను తేలికగా తీసుకునే వారి మాటలను జాగ్రత్తగా గమనిస్తారు. నిరుద్యోగం, అసమానతతో సహా విధాన చర్చల్లో వారు విమర్శనాత్మకంగా నిమగ్నమవుతారు. అయినప్పటికీ వారు రిపబ్లిక్‌ను మెరుగుపరచడానికి ఉద్దేశించిన విమర్శలకు, దాని సమన్వయం పట్ల ఉదాసీనంగా కనిపించే కథనాలకు మధ్య ఒక విభజన రేఖను గీస్తారు. బిహార్ తీర్పు ఈ వ్యత్యాసాన్ని ప్రతిబింబిస్తుంది. అభివృద్ధి, జాతీయ ప్రయోజనం అనే రెండింటి భాషను మాట్లాడే ఒక రాజకీయ కూటమికి ఓటర్లు అసాధారణమైన స్పష్టతతో స్పందించారు.
వ్యవస్థలపై విశ్వాసం
బిహార్ ఎన్నికలు ఒకప్పుడు బూత్ ల ఆక్రమణకు, హింసకు పర్యాయపదంగా ఉండేవి. ఇటీవలి ఎన్నికల్లో ఆ దృశ్యాలు చాలావరకు కనుమరుగయ్యాయి. కఠినమైన భద్రతా చర్యలు, ఆర్థిక అభివృద్ధి అనే ఉమ్మడి వ్యూహం ద్వారా కల్లోలిత ప్రాంతాలో పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్నాయి. ఇప్పుడు వ్యాపారులు తమ దుకాణాలను ఎక్కువసేపు తెరుస్తున్నారు, విద్యార్థులు మరింత విశ్వాసంతో ప్రయాణిస్తున్నారు. కుటుంబాలు నిర్భయంగా జీవిస్తున్నాయి. ఈ మెరుగుదలను చూసిన ఓటర్లు తమ ప్రతినిధులను ఎన్నుకునేటప్పుడు దానిని విస్మరించరు. తాము ప్రజల మద్దతు కోల్పోవడానికి గల కారణాల గురించి ఆలోచించకుండా కొందరు ప్రతిపక్ష నాయకులు ఎన్నికల సంఘంపై, ఓటర్ల జాబితాలపై లేదా ఎన్నికల జాబితా ప్రత్యేక సవరణపై సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ వైఖరి బిహార్ ఓటర్ల తెలివితేటలు, స్వీయ నిర్ణయాధికారానికి తగిన గౌరవాన్ని ఇవ్వదు. అదే సంస్థాగత యంత్రాంగం ఇతర రాష్ట్రాల్లో ప్రతిపక్షానికి అనుకూలమైన ఫలితాలను ఇచ్చిందనే వాస్తవాన్ని కూడా ఇది విస్మరిస్తుంది. వ్యవస్థను పూర్తిగా ఖండించడం కంటే పార్టీలు తమ ఆందోళనలపై మరింత శ్రద్ధ వహించాలని ఓటర్లు ఆశిస్తున్నారు.
బిహార్ తీర్పు ఇప్పుడు కొత్తగా రూపుదిద్దుకుంటున్న ఒక సరళిని బలపరుస్తుంది. అనేక ప్రజాస్వామ్యాలు ప్రజల మధ్య రాజీలేని వైరుధ్యాలు, ఆర్థిక సంక్షోభాలు, బలహీనమవుతున్న వ్యవస్థలతో కొట్టుమిట్టాడుతున్న సమయంలో భారతదేశం అధిక భాగస్వామ్యం, స్థిరమైన నాయకత్వం, వృద్ధి, సమ్మిళితత్వం, జాతీయ బలంపై ఆధారపడిన పయనాన్ని కొనసాగిస్తోంది. ఈ ప్రయాణానికి బిహార్ ఫలితం మరింత ఊపునిచ్చింది. భారత్ 2047 నాటికి అభివృద్ధి చెందిన, ఆత్మవిశ్వాసం కలిగిన దేశంగా మారే ప్రయాణంతో తమ పురోగతి ముడిపడి ఉందని భారతదేశంలో అత్యంత రాజకీయ స్పృహ కలిగిన రాష్ట్రాల్లోని ఓటర్లు భావిస్తున్నారని ఇది సూచిస్తుంది. ఎన్డీయే కోణం నుంచి చూస్తే మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు, భద్రతకు తాము ఇస్తున్న ప్రాధాన్యాన్ని ప్రజలు ఆమోదించారని అది భావిస్తోంది. అలాగే ఇది మరింత వేగంగా ఉద్యోగ కల్పన, లోతైన సంస్కరణలు, సంస్థల నిరంతర అభివృద్ధిని ప్రజలు కోరుకుంటున్నారని కూడా తెలియజేస్తోంది. సమర్థ పాలన, చిత్తశుద్ధి, జాతీయ సమన్వయం పట్ల గౌరవంపై ఆధారపడిన రాజకీయాలను తాము ఆశిస్తున్నామని బిహార్ ఓటర్లు సంకేతం ఇచ్చారు. ఆ అంచనాలు రాబోయే సంవత్సరాలలో భారత రాజకీయాల రూపురేఖల్ని నిర్ణయించే అవకాశం ఉంది.
హర్‌దీప్ సింగ్ పూరి,
కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి

