ఆదివాసీల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం పెద్దపీట
ఆదివాసీల సంక్షేమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం పెద్దపీట వేసిందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అన్నారు. ద్రౌపది ముర్మును రాష్ట్రపతిగా చేసి ఆదివాసీల గౌరవాన్ని పెంపొందించారని తెలిపారు. భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా చేపడుతున్న కార్యక్రమాల్లో భాగంగా ఆదివాసీ ప్రాంతంలో బిజెపి నాయకులు పర్యటించి, అక్కడ ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరుతున్నాయా లేదా అని స్వయంగా తెలుసుకుంటున్నారు. అటవీ ప్రాంతాల్లోని పేదలకు ప్రభుత్వం అందిస్తున్న విద్య, వైద్య, రవాణా, సౌకర్యాలు మరింత సమర్థవంతంగా చేరేలా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే నవంబర్ 24న ఎన్. రాంచందర్ రావు నేతృత్వంలోని బిజెపి బృందం నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీశైలం ప్రధాన రహదారి నుంచి 30 కి.మీల దూరంలో ఉన్న భౌరాపూర్-చెంచుపెంటలో పర్యటించింది. చెంచుపెంటలోని స్థానిక ఆదివాసీలతో సమావేశమై, వారి సమస్యలు, అభిరుచులు, అవసరాలను తెలుసుకున్నారు. అదేవిధంగా లింగాల మండలం అప్పపూర్ అనే మారుమూల గ్రామంలోనూ పర్యటించారు. అక్కడి ప్రభుత్వ తెలుగు మీడియం ఆశ్రమ పాఠశాలలో దాదాపు 100 మంది పిల్లలు చదువుతున్నారు. పాఠశాలలో సరైన వసతులు లేక పిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిశీలించారు. వారికి మెరుగైన విద్యా వాతావరణం, అవపకమూర సహాయం అందించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఎన్. రాంచందర్ రావు మాట్లాడుతూ.. ‘‘25 ఏళ్లకే బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలు అర్పించిన గిరిజన వీరుడు బిర్సాముండా 150వ జయంతి సందర్భంగా, భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో జనజాతీయ గౌరవ దివస్ (గిరిజన గౌరవ దినం)గా అన్ని రాష్ట్రాల్లో ఉత్సవాలు జరుపుతోంది. తెలంగాణలో కూడా ఈ వేడుకలు జరుగుతున్నాయి. బిర్సాముండా పోరాటాలు, త్యాగాలు దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడంలో గొప్ప పాత్ర పోషించాయి. స్వాతంత్ర్య పోరాటంలో అనేకమంది ఆదివాసీలు తమ వంతు త్యాగాలు చేశారు. భారతదేశ సంస్కృతి, సంపదను కాపాడడంలో ఆదివాసీల పాత్ర చాలా ముఖ్యమైనది.
నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచుపెంటలోని వెనుకబడిన ప్రాంతాలను పరిశీలిస్తున్నాం. ఇక్కడి ఆదివాసీలు ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉన్నారు. వైద్యం, విద్య, రవాణా సదుపాయాలు లేకుండా అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు. చెంచుపెంట ప్రాంతంలో భారత ప్రభుత్వం 176 ఇళ్లను పేదల కోసం నిర్మించింది, సోలార్ పవర్ కనెక్షన్లతో ఉచిత విద్యుత్ సౌకర్యాన్ని అందించింది. ఆదివాసీల ఆత్మనిర్భరత, ఆత్మవిశ్వాసం కోసం మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు వారికి అందించేందుకు కృషి చేస్తోంది. విద్య, వైద్యం, రవాణా వంటి సౌకర్యాలు సమగ్రంగా చేరేలా దృష్టి కేంద్రీకరించింది. చెంచుపెంటలో ఆదివాసీలకు కావాల్సిన సౌకర్యాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి. అలాగే, కేంద్రం నుండి అందుతున్న సహాయ సహకారాలు పక్కదారి పట్టకుండా ఇక్కడి వారికే చేరేలా కృషి చేస్తాం.’’ అని అన్నారు.

