సుసంపన్న, స్వయంసమృద్ధ భారతాన్ని నిర్మిద్దాం
ప్రధాని నరేంద్ర మోదీ సంకల్పమయిన 2047 నాటికి భారతదేశాన్ని ‘వికసిత భారత్’గా తీర్చిదిద్దడమే బిజెపి లక్ష్యమని పార్టీ నూతన జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ స్పష్టం చేశారు. అభివృద్ధి, వారసత్వం కలిసికట్టుగా ముందుకు సాగే భారతదేశాన్ని నిర్మిద్దామని పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ సుపరిపాలన నమూనాను అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించినప్పుడే అభివృద్ధి ఫలాలు సమాజంలో చివరి వ్యక్తి వరకు చేరగలుగుతాయని అన్నారు. నితిన్ నబీన్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత జనవరి 20న దిల్లీలోని బిజెపి కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన అభినందనలో ఆయన ప్రసంగిస్తూ.. ”ఈ సత్కార వేడుకలో నాకు లభించిన ఆత్మీయత నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాకు పూలమాల వేసి స్వాగతం పలికిన తీరు నా జీవితంలో ఎప్పటికీ మరువలేని జ్ఞాపకం. వేదికపై మన ఉద్యమానికి మూలస్తంభాలైన అగ్రనేతలు ఉన్నారు. మన మాజీ అధ్యక్షులు జె పి నడ్డా, రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, నితిన్ గడ్కరీ.. ఈ మహామహులు, అంకితభావం గల కార్యకర్తలు, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు నేను ముందుకు తీసుకెళ్లాల్సిన ఘనమైన వారసత్వాన్ని గుర్తుచేస్తున్నారు.
గుజరాత్ పాఠం
ప్రజా జీవితంలో నా ప్రయాణం ఈ పార్టీ నేర్పిన విలువల ఆధారంగానే రూపుదిద్దుకుంది. నేను బీజేవైఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు, గుజరాత్‌లో ‘సద్భావనా మిషన్’ సమయంలో మోదీతో కలిసి సన్నిహితంగా పనిచేసిన రోజులు నాకు స్పష్టంగా గుర్తున్నాయి. అక్కడ ఆయన ప్రతి ఒక్కరి మాటను ఎంత ఏకాగ్రతతో వింటారో నేను గమనించాను. అనంతరం గ్రీన్ రూమ్‌లో ఆయన నాతో ఒక లోతైన నిజాన్ని పంచుకున్నారు: ప్రజలు తనతో వ్యక్తిగతంగా అనుసంధానం కావట్లేదని, వారు ‘గుజరాత్ భావోద్వేగం’, అభివృద్ధిపై ఉన్న ఆశతో మమేకమవుతున్నారని ఆయన చెప్పారు. ఒక నాయకుడు తన వ్యక్తిత్వాన్ని ప్రజల భావోద్వేగాలతో విలీనం చేసినప్పుడే గొప్ప నాయకుడిగా ఎదుగుతారని ఆ రోజు నాకు అర్థమైంది.
2006లో నేను మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి నాకు ముందు అధ్యక్ష బాధ్యతలు నిర్వహించిన నాయకుల నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను:
- రాజ్‌నాథ్ సింగ్ పార్టీ పనిని ప్రతి ఒక్క కార్యకర్తకు ఎలా చేరువ చేయాలో నేర్పించారు.
- నితిన్ గడ్కరీ సంస్థలోని ప్రతి విభాగం, మోర్చాను ఎలా బలోపేతం చేయాలో చూపించారు.
- అమిత్ షా బూత్ స్థాయి కార్యకర్తపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ, మన కార్యాలయాలను శక్తినిచ్చే ‘పుణ్యక్షేత్రాలు’గా మార్చి సంస్థాగత బలానికి కొత్త నిర్వచనం ఇచ్చారు.
- జె.పి. నడ్డా కోవిడ్-19 వంటి అసాధారణ సవాళ్ల సమయంలో మమ్మల్ని నడిపించారు. ప్రతిపక్షాలు కనుమరుగైన వేళ, బిజెపి కార్యకర్తకు ‘సేవే పరమావధి’ (సేవా హీ సంఘటన్ ) అని నిరూపించారు.
నేను పాటలీపుత్ర పుత్రుడిగా ఇక్కడ నిలబడ్డాను—గౌతమ బుద్ధుడు, గురు గోవింద్ సింగ్, జననాయక్ కర్పూరీ ఠాకూర్ ఆశీస్సులు ఉన్న నేల అది. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం నా తల్లిదండ్రులు నేర్పిన విలువలు, ఈ గొప్ప సిద్ధాంతం అందించిన మార్గదర్శకత్వమే. నన్ను ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్న నా నియోజకవర్గ ప్రజలకు చెబుతున్నాను: మీ దీవెనలు, పార్టీ అందించిన శిక్షణే నన్ను ఈ మహత్తర బాధ్యత వరకు తీసుకువచ్చాయి.
నా దృష్టిలో ఇది అధికార పీఠం కాదు; ఇది ఒక జాతీయవాద ఉద్యమం నాకు అప్పగించిన ‘బాధ్యత’. శ్యామా ప్రసాద్ ముఖర్జీ అచంచల జాతీయవాదం, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ, అటల్జీ సుపరిపాలన (సుశాసన్) మనకు దిక్సూచి. నరేంద్ర మోదీ నాయకత్వంలో ఇవి కేవలం నినాదాలు మాత్రమే కాదు — 11 కోట్ల మరుగుదొడ్లు, 42 కోట్ల ఆయుష్మాన్ కార్డులు, 56 కోట్ల జన్‌ధన్ ఖాతాల రూపంలో సాకారమైన వాస్తవాలు.
ముందడుగు: వికసిత భారత్ 2047
తరతరాల కార్యకర్తలు దేనికోసం ప్రాణత్యాగం చేశారో, ఆ వాగ్దానాలను మనం నెరవేర్చాం. ‘మందిరం అక్కడే నిర్మిస్తాం’ (మందిర్ వహీం బనాయేంగే) అని చెప్పాం, చేసి చూపించాం. ‘ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు ఉండవు’ అని చాటిచెప్పాం, అధికరణం 370 రద్దు తర్వాత లాల్‌చౌక్ వద్ద త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగరడం చూశాం. అయితే, మన పని ఇంకా పూర్తి కాలేదు. వందేమాతరం 150వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న తరుణంలో ఆ శక్తిని భారతదేశంలోని ప్రతి యువతికి, యువకుడికి, ప్రతి మహిళకు అందించాలి. రాజకీయం అనేది 100 మీటర్ల పరుగు పందెం కాదు; అది ఓర్పు, సేవతో కూడిన ‘మారథాన్’. యువతకు నేను పిలుపునిస్తున్నాను: క్రియాశీల భాగస్వామ్యమే ఏ సమస్యకైనా పరిష్కారం.
తమిళనాడు, అస్సాం, బెంగాల్, కేరళ, పుదుచ్చేరిలలో మనకు సవాళ్లు ఎదురవుతున్నాయి. కార్తీక దీపం వంటి మన పవిత్ర సంప్రదాయాలను లేదా మన న్యాయవ్యవస్థ గౌరవాన్ని నీరుగార్చేందుకు ప్రతిపక్ష శక్తులు ప్రయత్నిస్తున్నాయి. ఈ శక్తులను మనం ఓడించాలి. మన సామాజిక నిర్మాణాన్ని సవాలు చేసే జనాభా మార్పుల పట్ల కూడా మనం అప్రమత్తంగా ఉండాలి. మన మంత్రం ఎప్పటికీ ఒకటే: దేశమే సర్వోన్నతం, ఆ తరువాత పార్టీ, చివరిది స్వప్రయోజనం. ఎటువంటి ప్రచారం ఆశించకుండా ‘తేరా వైభవ్ అమర్ రహే మా’ అని పాడుతూ శ్రమించే కార్యకర్తల వల్లే మనం ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఉన్నాం. ప్రధాని మోది నాయకత్వంలో త్యాగం, నిష్ఠతో మన విధులను నిర్వర్తిద్దాం. 2047 నాటికి సుసంపన్నమైన, శక్తిమంతమైన, ఆత్మనిర్భర ‘వికసిత భారత్’ను సాధిద్దాం.” అని అన్నారు.
బిజెపి విజయ ప్రయాణం తదుపరి దశకు నాంది
నితిన్ నబీన్ బిజెపి జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన క్షణం సంస్థాగత మార్పు మాత్రమే కాదని, బిజెపి సైద్ధాంతిక వారసత్వం, నిరంతర విజయ ప్రయాణం తదుపరి దశకు నాంది అని కేంద్రమంత్రి జగత్ ప్రకాష్ నడ్డా అభివర్ణించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో, నితిన్ నబీన్ అధ్యక్షతన బిజెపి అభివృద్ధి, సుపరిపాలన, దేశ నిర్మాణ ప్రయాణం మరింత ఊపందుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ”ప్రపంచంలో అతిపెద్ద పార్టీ అయిన బిజెపి జాతీయ అధ్యక్షుడిగా యువ, శక్తివంతమైన, ప్రతిభావంతుడైన నితిన్ నబీన్ బాధ్యతలు స్వీకరించిన ఈ రోజు చారిత్రాత్మకం. నితిన్ నబీన్ అట్టడుగు స్థాయి కార్యకర్త. సైద్ధాంతిక పునాదిపై పరిణతి చెందిన వ్యక్తి, చాలా చిన్న వయస్సులోనే ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీహార్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. యువ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శిగా దేశవ్యాప్తంగా పర్యటించి, దేశాన్ని లోతుగా అర్థం చేసుకున్నారు. సిక్కిం, ఛత్తీస్‌గఢ్ ఇంచార్జ్ గా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక సహకారం అందించారు.
2014 నుండి నరేంద్ర మోదీ నాయకత్వంలో, బిజెపి విజయ రథం ఆగకుండా ముందుకు సాగుతోంది. దీనికి ప్రధాన కారణం నరేంద్ర మోదీ నాయకత్వంలో మాత్రమే దేశం పురోగమిస్తుందని దేశ ఓటర్లు, గ్రామీణులు, పేదలు, అణగారిన వర్గాలు, బాధితులు, దళితులు అర్థం చేసుకోవడం. 2024 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ప్రజల మనోభావాలకు అద్దం పట్టాయి. రాబోయే ప్రతి ఎన్నికల్లో నరేంద్ర మోదీకి తమ పూర్తి ఆశీస్సులు ఇవ్వాలని, దేశవ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేయాలని దేశ ప్రజలు తీర్మానించారని స్పష్టమైంది. 2024 లోక్‌సభ ఎన్నికల తరువాత, హరియాణా ఎన్నికల సమయంలో ప్రతిపక్షాల అతివిశ్వాసం ప్రదర్శించారు, ఫలితాలకు ముందే కాంగ్రెస్ స్వీట్లు పంపిణీ చేయడానికి సన్నాహాలు ప్రారంభించింది. దేశ ఓటర్లు, ముఖ్యంగా హరియాణా ఓటర్లు అతివిశ్వాసం వల్ల కలిగే అనర్థాలను వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని నిర్ణయించుకున్నారు. దీనిని నిర్ణయాత్మకంగా ప్రదర్శించారు. నరేంద్ర మోదీ నాయకత్వంలో మహారాష్ట్రలో రికార్డు విజయం సాధించి దేశవ్యాప్తంగా విజయోత్సవాలు జరిగాయి. 27 సంవత్సరాల తర్వాత దిల్లీలో బిజెపి ప్రభుత్వం ఏర్పడింది. బీహార్ లో అత్యధిక స్ట్రైక్ రేటుతో విజయం సాధించింది. ఇటీవల, మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి-ఎన్డీఏ 29 స్థానాల్లో 25 గెలుచుకున్నాయి. బీఎంసీ ఎన్నికల్లో బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించింది. గోవా పంచాయతీ ఎన్నికల్లో కూడా బిజెపి విజయం సాధించింది. కేరళ తిరువనంతపురంలో స్వాతంత్య్రం తర్వాత తొలిసారి లోక్‌సభ స్థానంలో బిజెపి విజయం సాధించింది.
నరేంద్ర మోదీ నాయకత్వంలో 2014 తర్వాత ప్రారంభమైన విజయ యాత్ర దేశ ఓటర్ల ఆశీస్సులతో ముందుకు సాగుతోంది. ఇప్పుడు నితిన్ నబీన్ నాయకత్వంలో మరింత పురోగమిస్తుంది. 20 రాష్ట్రాల్లో ఎన్డీయే ప్రభుత్వాలు ఉన్నాయి. బిజెపికి 13 రాష్ట్రాల్లో సొంత ప్రభుత్వాలు ఉన్నాయి. గుజరాత్ లో బిజెపి వరుసగా ఆరుసార్లు అధికారంలో ఉంది. హరియాణా, గోవాలో పార్టీ వరుసగా రెండో, మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీహార్, ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, త్రిపుర, ఉత్తరాఖండ్, మణిపూర్, అసోం రాష్ట్రాల్లో బిజెపి రెండోసారి అధికారంలోకి వచ్చింది. నరేంద్ర మోదీ నాయకత్వంలో, నితిన్ నబీన్ అధ్యక్షతన పశ్చిమ బెంగాల్‌లో కూడా బిజెపి విజయం సాధిస్తుంది. పుదుచ్చేరి, తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. అసోంలో మరోసారి అధికారంలోకి వస్తుంది, కేరళలో మెరుగైన ఫలితాలను సాధిస్తుంది. ఈ నమ్మకం, విశ్వాసంతో పార్టీ ముందుకు సాగుతూనే ఉంటుంది.
నా పదవీ కాలంలో సహకరించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, పార్లమెంటరీ బోర్డు సభ్యులందరికీ, కోట్లాది కార్యకర్తలకు, రాష్ట్ర అధ్యక్షులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. దేశ ప్రధాన సేవకుడిగా బిజీగా ఉన్నప్పటికీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పార్టీకి సంబంధించిన చిన్న చిన్న విషయాలపై దృష్టి సారించి, పార్టీని ముందుకు తీసుకెళ్లడానికి పూర్తి సహకారం అందించారు. గత కొన్నేళ్లుగా పార్టీ అప్పగించిన బాధ్యతలను అందరి మద్దతు, సహకారంతో సామర్థ్యం మేరకు నిర్వర్తించేందుకు అన్ని ప్రయత్నాలు చేశా. ఈ సమయంలో ఏవైనా మాటలు ఎవరికైనా బాధ కలిగిస్తే, వారికి హృదయపూర్వక క్షమాపణలు చెప్తున్నాను. పార్టీ కోసం రాత్రింబవళ్లు అవిశ్రాంతంగా కృషి చేసిన కోట్లాది కార్యకర్తలకు కృతజ్ఞతలు. వారి సమిష్టి కృషి వల్లనే పార్టీ విజయవంతంగా ముందుకు సాగింది. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో నితిన్ నబీన్ ఏ అవకాశాన్ని వదిలిపెట్టరు. కార్యకర్తలందరూ నబీన్‌కు మద్దతుగా ఉంటే బిజెపిని కొత్త శిఖరాలకు తీసుకెళ్తారు, ఇప్పటి వరకు గెలవని రాష్ట్రాల్లో కూడా బిజెపి గెలుస్తుంది.” అని అన్నారు.

