Pariksha pe Charcha

విద్యార్థుల్లో మనోస్థైర్యం నింపుతున్న ‘పరీక్షా పే చర్చ’

Pariksha pe Charchaనేటికీ అత్యధిక మార్కులు సాధించడమే మెజారిటీ విద్యార్థుల ప్రధాన లక్ష్యంగా ఉంటోంది. దేశవ్యాప్తంగా తరగతి గదుల్లో, ఇళ్లలో, పరీక్షలను తరచుగా ఒక బిడ్డ భవిష్యత్తును నిర్ణయించే కీలక ఘట్టాలుగా పరిగణిస్తారు. ‘పరీక్షా పే చర్చ’ ద్వారా విద్యార్థికి స్నేహపూర్వకమైన, ఒత్తిడి లేని విద్యావ్యవస్థను ప్రోత్సహిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా, పరీక్షలు అనేవి భయానికి మూలాలు కాదని, అవి విద్యార్జనకు, ఆత్మపరిశీలనకు, స్వీయ అన్వేషణకు లభించే గొప్ప అవకాశాలని మనం గుర్తుంచుకోవాలి. మార్కులు ఎప్పుడూ ఒక బిడ్డ విలువను నిర్ణయించకూడదన్నదే ప్రధానమంత్రి నిరంతర సందేశం.

ప్రస్తుత దృక్పథం విసిరే సవాళ్లు

దురదృష్టవశాత్తు, తక్కువ గ్రేడ్లను వైఫల్యానికి లేదా వ్యక్తిగత అసమర్థతకు సంకేతాలుగా సమాజం తరచుగా పరిగణిస్తుంది. కేవలం విద్యాపరమైన ప్రతిభ ఆధారంగానే విద్యార్థి విలువను అంచనా వేసే ఈ అలవాటు, గ్రేడ్ల అసలు అర్థాన్ని వక్రీకరించింది. తక్కువ మార్కులను విద్యార్థిలోని రకరకాల సామర్థ్యాలకు ఏకైక కొలమానంగా తప్పుగా భావిస్తున్నారు. ఈ విధమైన మనస్తత్వం వల్ల కలిగే మానసిక వేదన నిరాశ, అవమానం, భయం, నిస్సహాయత రూపాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. నిరంతర విద్యాపరమైన పోరాటం చివరకు మనస్తత్వవేత్తలు వివరించే “అన్నీతెలిసీ నిస్సహాయత’ అనే స్థితికి దారితీస్తుంది, ఇక్కడ విద్యార్థులు తమ శ్రమకు ఇక ఎంతమాత్రం విలువ లేదని నమ్మడం ప్రారంభిస్తారు. ఈ దశలో నేర్చుకోవడానికి మూలాధారమైన జిజ్ఞాస క్రమంగా కనుమరుగవుతుంది.

‘పరీక్షా పే చర్చ’ పరిణామ క్రమం 

పరీక్షా ప్రక్రియలో విద్యార్థి మానసిక క్షేమానికి పెద్దపీట వేయడం ద్వారా ఈ అపోహను సరిదిద్దడానికి ‘పరీక్షా పే చర్చ’ ప్రయత్నిస్తుంది. పరీక్షలను వ్యక్తిగత విలువ నిర్ధారించే ప్రక్రియగా కాకుండా, మనిషి ఎదిగే ప్రయాణంలో మైలురాళ్లుగా చూడాలని ఇది విద్యార్థులను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను కోరుతుంది. 2018 ఫిబ్రవరి 16న ప్రారంభమైన మొదటి ఎడిషన్ నుంచి పరీక్షా పే చర్చ పరిధి, భాగస్వామ్యం క్రమంగా పెరుగుతూ వచ్చాయి. దిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో ‘టౌన్ హాల్’ (రచ్చబండ) తరహా చర్చతో మొదలై, నేడు ప్రత్యక్ష, వర్చువల్, హైబ్రిడ్ పద్ధతుల ద్వారా కోట్లమంది విద్యార్థులను చేరుకునే జాతీయ వేదికగా ఎదిగింది. ప్రారంభంలో కొన్ని పదుల వేల సంఖ్యలో ఉన్న విద్యార్థుల భాగస్వామ్యం, 2025 నాటికి 3.5 కోట్లకు పైగా రిజిస్ట్రేషన్లకు చేరుకుంది. ఈ కార్యక్రమం తన విస్తృత భాగస్వామ్యానికి గానూ గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా సొంతం చేసుకుంది, ఇది విద్యను మరింత మానవీయంగా, సహాయకారిగా మార్చడంలో దేశ నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

గ్రేడ్ల అసలు అర్థంపై అవగాహన 

గ్రేడ్లు అనేవి ఒక నిర్దిష్ట సమయంలో, ఒక నిర్దిష్ట సబ్జెక్టులో విద్యార్థి ప్రస్తుత అవగాహన స్థాయిని, నైపుణ్యాన్ని, పురోగతిని కొలవడానికి ఉద్దేశించినవి. అవి పనితీరును ప్రతిబింబిస్తాయి కానీ శాశ్వత సామర్థ్యాన్ని కాదు. తరగతి గదిలో ఏకాగ్రత, పఠన అలవాట్లు, సన్నద్ధతను అవి సూచించినప్పటికీ, అవి ఎప్పుడూ సంపూర్ణ కొలమానాలు కావు. ఆందోళన, ఆరోగ్యం, వ్యక్తిగత పరిస్థితులు, అభ్యాస శైలులు, బోధనా పద్ధతులు, మూల్యాంకన (మదింపు) రూపాలు వంటి అనేక అంశాలు ఈ ఫలితాలను ప్రభావితం చేస్తాయి. కాబట్టి విద్యార్థి తక్కువ పనితీరు సాధించినప్పుడు మెరుగుపడటానికి ఎప్పుడూ అవకాశం ఉంటుంది. సరైన దృక్పథం ఇక్కడ చాలా ముఖ్యం. గ్రేడ్లు ఎదుగుదల అవసరమైన కోణాలను తెలియజేసే తాత్కాలిక సూచికలు. వాటిని సామర్థ్యంపై తుది తీర్పులుగా భావించినప్పుడు, అవి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాయి, స్ఫూర్తిని బలహీనపరుస్తాయి. కానీ వాటిని ఒక మదింపు సాధనంగా (ఫీడ్ బ్యాక్) సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడు, అవి అభ్యాసానికి, అభివృద్ధికి శక్తిమంతమైన సాధనాలుగా మారుతాయి. ఈ కోణంలో చూస్తే, తక్కువ గ్రేడ్లు ప్రయాణానికి ముగింపు కాదు, అవి విద్యార్థులను మెరుగైన వ్యూహాల వైపు, లోతైన అవగాహన వైపు నడిపించే దిక్సూచీలు.

 ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పాత్ర

తక్కువ పనితీరు అనేది ఎక్కడ తప్పు జరిగింది? ఎందుకు జరిగింది? అనే దానిపై విలువైన సమాచారాన్ని అందిస్తుంది. సులభంగా లభించే విజయం కంటే వైఫల్యం ఆత్మపరిశీలనకు ఎక్కువ అవకాశం ఇస్తుంది. తప్పులను విశ్లేషించడం ద్వారా, విద్యార్థులు తమ అవగాహనలోని లోపాలను గుర్తించగలరు. ఈ ప్రక్రియ నేర్చుకోవడాన్ని, జ్ఞాపకశక్తిని బలోపేతం చేస్తుంది. తక్కువ గ్రేడ్లు విద్యార్థులు తమ అలవాట్లు, సమయ నిర్వహణ, అభ్యాస వ్యూహాలు, ప్రాధాన్యాలను పునఃసమీక్షించుకోవాలని గుర్తు చేస్తాయి. పరధ్యానం, పునరుశ్చరణలో లోపాలు లేదా చివరి నిమిషంలో చదవడం వంటివి పురోగతిని అడ్డుకుంటున్నాయని విద్యార్థి గ్రహించవచ్చు. ఆలోచించడం, ప్రయోగాలు చేయడం ద్వారా, విద్యార్థులు తమ సామర్థ్యాలకు, అవసరాలకు తగిన అధ్యయన పద్ధతులను అభివృద్ధి చేసుకోవచ్చు.

విద్యావేత్తలు, కుటుంబాల ప్రభావం

విద్యార్థులు విజయాన్ని, వైఫల్యాన్ని ఎలా అర్థం చేసుకుంటారనే విషయంలో ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తారు. ఉపాధ్యాయులు విద్యార్థులను ఇతరులతో పోల్చినప్పుడు లేదా ప్రతికూల వ్యాఖ్యలు చేసినప్పుడు వారు తెలియకుండానే విద్యార్థుల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉంది. దీనికి విరుద్ధంగా వారు తప్పులను స్పష్టంగా వివరించి, మార్గనిర్దేశం చేసినప్పుడు, విద్యార్థులు మెరుగుపడటానికి సహాయపడినవారవుతారు. మార్కుల కంటే ప్రతి విద్యార్థికి విలువ ఇవ్వడం ద్వారా ఉపాధ్యాయులు తరగతి గదులను భయం లేని వృద్ధి కేంద్రాలుగా మార్చగలరు. అనేక కుటుంబాలలో విద్యా ప్రతిభ అనేది అంచనాలు, సామాజిక హోదాతో ముడిపడి ఉంటుంది. పిల్లలు తక్కువ మార్కులు సాధించినప్పుడు, తల్లిదండ్రులు కోపంతో లేదా ఇతరులతో పోల్చడం ద్వారా ప్రతిస్పందిస్తే, అది భయాన్ని, ఒత్తిడిని సృష్టిస్తుంది. అయితే నిర్మాణాత్మక ప్రశ్నలు అడగడం, సమస్య పరిష్కారాన్ని ప్రోత్సహించడం వంటి చర్యలు పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఉత్సాహాన్ని పునరుద్ధరించడానికి సహాయపడతాయి.

మనోనిబ్బరానికి దన్ను 

వైఫల్యాన్ని అధిగమించడంలో తోటి విద్యార్థుల ప్రభావం కూడా ఉంటుంది. ఒకరికొకరు అర్థం చేసుకుంటూ సహాయం చేసుకోవడం ద్వారా విద్యార్థులు ఒత్తిడిలో ఉన్నవారిని ఆదుకోవచ్చు. ఒకరికొకరు సహాయం చేసుకోవడం వల్ల స్నేహాలు బలపడతాయి, నిజ జీవిత సవాళ్లను ఎదుర్కోవడానికి విద్యార్థులు సిద్ధమవుతారు. అంతిమంగా మనస్తత్వమే తక్కువ గ్రేడ్లు అడ్డంకులుగా మారుతాయా లేదా అవకాశాలుగా మారుతాయా అనేది నిర్ణయిస్తుంది. ‘ఎదిగే మనస్తత్వం’ సవాళ్లను అభివృద్ధికి అవకాశాలుగా చూస్తుంది. తక్కువ గ్రేడ్లను నిరుత్సాహపరిచేవిగా కాకుండా మనస్థితిని మనకు తెలియజేసేవిగా చూసే మనస్తత్వాన్ని మనం అలవర్చుకోవాలి. అవి అభివృద్ధి చెందాల్సిన అంశాలను సూచిస్తాయి తప్ప సామర్థ్యాల పరిమితులను కాదు.

చివరికి గ్రేడ్ ముఖ్యం కాదు, దానిని ఎలా అర్థం చేసుకున్నాం, ఎలా ఉపయోగించుకున్నాం అనేదే ముఖ్యం. వైఫల్యానికి సాక్ష్యంగా చూసినప్పుడు, తక్కువ గ్రేడ్లు ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తాయి. కానీ ఫీడ్‌బ్యాక్‌గా చూసినప్పుడు, అవి మెరుగుదల కోసం సాధనాలుగా మారుతాయి. ఈ బృహత్తర లక్ష్యంలో, ‘పరీక్షా పే చర్చ’ అనేది పరీక్షలను మానవీకరించే, యువ మనస్సులలో ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించే ఒక పరివర్తనాత్మక జాతీయ వేదికగా నిలుస్తుంది. విద్య మార్కుల కోసం పరుగు పందెం కాదు, అది వ్యక్తిత్వ నిర్మాణం, జిజ్ఞాస, ధైర్యంతో కూడిన ప్రయాణమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం దేశానికి గుర్తు చేస్తున్నారు. గ్రేడ్లను ఈ స్ఫూర్తితో అర్థం చేసుకున్నప్పుడు, అవి మన పిల్లలను బలహీనపరచవు – జీవితాన్ని బలంతో, వివేకంతో ఎదుర్కోవడానికి వారిని సిద్ధం చేస్తాయి.

సుకాంత మజుందార్,
కేంద్ర విద్యా, ఈశాన్య ప్రాంత అభివృద్ధి వ్యవహారాల సహాయ మంత్రి