వాణిజ్య ఒప్పందాల్లో ఎక్కడా రాజీలేదు
ప్రధాని మోదీ హయాంలో కుదుర్చుకున్న ప్రతి ఒప్పందం కూడా భారత్ వృద్ధికి మద్దతు ఇచ్చేదే అని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్ స్పష్టం చేశారు. ఆయా దేశాల పెట్టుబడులకు, సాంకేతికతకు భారత్‌లో అవకాశాలు కల్పిస్తూనే, మన దేశ యువతకు ఉద్యోగాలను సృష్టిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రతి ఒప్పందం న్యాయబద్ధంగా ఉంటుందని, భారత్ ఒక నమ్మకమైన భాగస్వామి అని నేడు ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయని తెలిపారు. H-1B వీసాలపై అమెరికా ఆంక్షలు భారత్‌కే మేలు చేస్తాయని సూత్రీకరించారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై ఉమ్మడి ప్రకటన వెలువడిన అనంతరం పీయుష్ గోయల్ ఒక ప్రముఖ ఆంగ్ల వారపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ ఒప్పందాలు భారత ఆర్థిక వృద్ధికి ఏ విధంగా దోహదపడతాయి, సామాన్యులకు చేకూరే ప్రయోజనాలేమిటి తదితర అంశాలను విశ్లేషించారు.
ప్ర: యూరోపియన్ యూనియన్ (EU), అమెరికాలతో కుదిరిన తాజా ఒప్పందాలు భారత వాణిజ్య విధానంలో ఒక మౌలికమైన మార్పునకు సంకేతాలా?
జ: భారత్ పై ఇప్పుడు అంతర్జాతీయంగా విశ్వాసం, నమ్మకం పెరుగుతోందని ఇవి నిరూపిస్తున్నాయి. నేడు మనది అత్యంత ఆత్మవిశ్వాసం కలిగిన దేశం. అభివృద్ధి చెందిన దేశాలతో ఒక సమాన భాగస్వామిగా భారత్ చర్చలు జరుపుతోంది. అంతిమంగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (FTAలు) భవిష్యత్తుకు సంబంధించినవి. భారత్ 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ దిశగా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్న తరుణంలో, 4 ట్రిలియన్ల నుండి 30 ట్రిలియన్లకు ఎదిగే క్రమంలో ఉండే అవకాశాలు అపారం, అసమానం. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో మనకు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోగల, దేశ ఆలోచనా విధానాన్ని మార్చగల శక్తిమంతమైన నాయకత్వం ఉంది. 30 ఏళ్ల లోపు వయసున్న యువత మనకు ‘జనాభా ప్రయోజనం’. మనం 30 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా ఎదిగే క్రమంలో రాబోయే 30 ఏళ్ల పాటు ఈ యువశక్తి మనకు తోడుంటుంది. దీన్నే నేను ’30-30-30′ శక్తి అని పిలుస్తాను.
140 కోట్ల జనాభాకు ఉన్న ఆకాంక్షలు భారీ డిమాండ్‌ను సృష్టిస్తాయి. భారత్ ఇప్పుడు వేగవంతమైన వృద్ధి పథంలో ఉంది. అమెరికా, యూరోపియన్ యూనియన్, బ్రిటన్ వంటి భాగస్వాములతో మనం జరిపే చర్చలు.. నాణ్యత విషయంలో మనం ప్రపంచ అత్యుత్తమ ప్రమాణాలతో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నామనడానికి నిదర్శనం. ఆర్థిక వ్యవస్థలో మన యువత ప్రతిభను, మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నాం. వెరసి ఈ ‘అమృత కాలం’లో సమగ్ర వృద్ధి, సుస్థిరతను మా మంత్రంగా మార్చుకున్నాం.
ప్ర: గతంలో భారత్ తన పరిశ్రమలను కాపాడుకోవడానికి రక్షణాత్మక సుంకాల కవచాన్ని కలిగి ఉండేది. ఇప్పుడు మన పరిశ్రమలను రక్షించుకుంటూనే, విదేశీ వస్తువులకు తలుపులు తెరిచే విశ్వాసం మనకు ఎక్కడి నుంచి వచ్చింది?
జ: గతంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం వాణిజ్య ఒప్పందాల విషయంలో ఒక ప్రాథమిక తప్పు చేసేది. వారు అభివృద్ధి చెందుతున్న లేదా వెనుకబడిన దేశాలతో ఒప్పందాలు చేసుకునేవారు, నిజానికి ఆ దేశాలు మనకు పోటీదారులు. జపాన్, కొరియా వంటి దేశాలను మినహాయిస్తే, అభివృద్ధి చెందిన దేశాలతో చర్చలు జరిపే ధైర్యం వారికి లేకపోయింది. దురదృష్టవశాత్తూ ఆ ఒప్పందాలు కూడా ఎంత దారుణంగా జరిగాయంటే గత 15 ఏళ్లలో ఆ రెండు దేశాలకు మన ఎగుమతులు ఏమాత్రం పెరగలేదు. కానీ ప్రధాని మోదీ గత కొన్నేళ్లుగా మారిషస్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఒమన్, యూఏఈ, EFTA బ్లాక్, యూరోపియన్ యూనియన్, బ్రిటన్‌లతో కుదుర్చుకున్న ప్రతి ఒప్పందం కూడా భారత్ వృద్ధికి మద్దతు ఇచ్చేదే. ఈ దేశాలు మనకు పోటీనిచ్చేవి కావు. వారి పెట్టుబడులకు, సాంకేతికతకు భారత్‌లో అవకాశాలు కల్పిస్తూనే, మన దేశ యువతకు ఉద్యోగాలను సృష్టిస్తున్నాం.
ప్ర: స్వదేశీ ఆర్థిక నమూనాను సమర్థించే బిజెపి లేదా సంఘ్ పరివార్ నుంచి ఈ వాణిజ్య ఒప్పందాలకు ఏవైనా అభ్యంతరాలు ఎదురయ్యాయా? ఎందుకంటే కొందరు వీటిని మనదేశంలోని కొన్ని వర్గాలు హాని కలిగిస్తాయని భావిస్తారు కదా?
జ: నాకు అటువంటి సమస్యలేవీ ఎదురుకాలేదు. ఏ ఒప్పందంలోనూ మనం జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీ పడలేదు కాబట్టే నేను ఇంత నమ్మకంగా చెబుతున్నాను. ఉదాహరణకు, ఏ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలోనూ మన పాడి పరిశ్రమను దిగుమతులకు తెరవలేదు. స్విట్జర్లాండ్, న్యూజిలాండ్, యూరోపియన్ యూనియన్ వంటి దేశాలు పాడి పరిశ్రమ లేకుండా ఎప్పుడూ ఒప్పందాలు చేసుకోవు. కానీ మన దగ్గర కేవలం మూడు నాలుగు పశువులు ఉండి జీవనం సాగించే చిన్న రైతులు, పశుసంవర్ధక కార్మికుల ప్రయోజనాలను దెబ్బతీయలేమని వారికి స్పష్టంగా వివరించగలిగాం. చర్చల సమయంలో మేం చాలా నిజాయితీగా, కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడతాం. ప్రధాని మోదీ నేతృత్వంలో ప్రతి ఒప్పందం న్యాయబద్ధంగా ఉంటుందని, భారత్ ఒక నమ్మకమైన భాగస్వామి అని నేడు ప్రపంచ దేశాలు విశ్వసిస్తున్నాయి. మా విధానం చాలా సరళం—సమస్యలు లేని రంగాలలో ముందుకెళ్లడం, ఉమ్మడి ప్రయోజనాలను వెతకడం. మేం వారికి సంబంధించిన సున్నిత అంశాలను గౌరవిస్తాం, వారు మన ప్రయోజనాలను గౌరవిస్తారు.
ప్ర: అమెరికా ఒప్పందంలో వ్యవసాయ రంగం విషయంలో రాజీ పడ్డారని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ఇది నిజమేనా?
జ: వ్యవసాయ రంగంలో మేం అస్సలు రాజీ పడలేదు. భారతీయ కోణంలో సున్నితమైన ఉత్పత్తుల విషయంలో ఎటువంటి వెనకడుగు వేయలేదు. ఇది ఇరు దేశాలకు లాభదాయకమైన ఒప్పందం.
ప్ర: సోయాబీన్, యాపిల్స్ సంగతేంటి?
జ: సోయాబీన్ లేదా సోయాబీన్ మీల్ దిగుమతులకు మేం అనుమతించలేదు. సోయాబీన్ నూనె మాత్రం దిగుమతి చేసుకుంటున్నాం. అది కాంగ్రెస్ ప్రభుత్వాల కాలం నుంచే జరుగుతోంది. అలాగే అమెరికా, ఇతర దేశాల నుంచి పండ్లను దిగుమతి చేసుకుంటాం. దీనివల్ల వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు దొరుకుతాయి. ఉదాహరణకు టర్కీ నుంచి వచ్చే యాపిల్స్ కంటే అమెరికా యాపిల్స్ నాణ్యత బాగుంటుంది. కనుక అక్కడ రాయితీలు ఇవ్వడం వల్ల వచ్చే నష్టమేమీ లేదు.
ప్ర: అమెరికాకు చెందిన అన్ని పారిశ్రామిక వస్తువులపై ‘మోస్ట్ ఫేవర్డ్ నేషన్’ (MFN) సుంకాలను తొలగించడానికి భారత్ అంగీకరించింది. కానీ అమెరికా మాత్రం పరస్పర సుంకాలను మాత్రమే తగ్గించింది. తమ సుంకాల తగ్గింపు షరతులతో కూడినది అని చెప్పగా భారత్ ఎందుకు శాశ్వతంగా సుంకాలు తగ్గించింది?
జ: దీనికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, అన్ని పారిశ్రామిక వస్తువులపై మేం సుంకాలను పూర్తిగా రద్దు (సున్నా) చేయలేదు. కొన్నింటికి సమయానుకూలంగా మార్పులు చేస్తాం, మరికొన్నింటికి కోటాలను నిర్ణయించాం. మన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి అవసరమైన వస్తువులు (ఉదాహరణకు ఎన్విడియా చిప్స్ వంటివి) ఎటువంటి అభ్యంతరాలు లేకుండా దిగుమతికి అనుమతించాం. అంటే ఇది ప్రతి వస్తువును క్షుణ్ణంగా పరిశీలించి తీసుకున్న నిర్ణయం. రెండవది, పరస్పర సుంకాల గురించి ప్రపంచమంతా చర్చలు నడుస్తున్నాయి. ఒకవేళ అమెరికా అందరికీ ఆ సుంకాలను తొలగిస్తే, మేం కూడా మా రాయితీలను పునఃసమీక్షించుకునే అవకాశం ఉంటుందని అమెరికాతో మాకు స్పష్టమైన అవగాహన ఉంది. కాబట్టి ఇది సమతుల్యమైన సంబంధం. అమెరికా ప్రతినిధులు కూడా చాలా న్యాయబద్ధంగా వ్యవహరించారు.
ప్ర: అమెరికా నుంచి 500 బిలియన్ (500 కోట్ల) డాలర్ల విలువైన వస్తువులను కొనుగోలు చేస్తామన్న ప్రతిపాదన గురించి చెప్పండి? ప్రస్తుతం ఇరు దేశాల వాణిజ్యం 212 బిలియన్ డాలర్లు మాత్రమే ఉన్నప్పుడు, ఐదేళ్లలో ఆ లక్ష్యాన్ని ఎలా చేరుకుంటారు?
జ: మేం దీనిపై లోతైన విశ్లేషణ చేశాం. అనేక అమెరికన్ ఉత్పత్తులు ఇతర దేశాల కంటే గిట్టుబాటుగా ఉన్నాయి. ప్రస్తుతం మనం ప్రపంచవ్యాప్తంగా 300 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాం. ఆ అవసరం వేగంగా పెరుగుతోంది. ఉదాహరణకు, ఐసీటీ (ఐటి, సాంకేతిక) ఉత్పత్తుల దిగుమతి ఏటా 20 శాతం పెరుగుతోంది. రాబోయే ఐదేళ్లలో ముడి చమురు, ఎల్‌పీజీ, విలువైన లోహాలు, సెమీకండక్టర్ చిప్స్, విమాన భాగాలు వంటి వాటి కోసం మనం దాదాపు 2 ట్రిలియన్ డాలర్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఆ 2 ట్రిలియన్ డాలర్ల మార్కెట్‌లో అమెరికా నుంచి దిగుమతి చేసుకునే అవకాశం భారత దిగుమతిదారులకు ఎందుకు ఉండకూడదు? మనం ఎలాగూ కొనే వస్తువుల విషయంలో పోటీ ఎక్కువగా ఉంటేనే మనకు మేలు. దీనివల్ల భారత వినియోగదారులకు తక్కువ ధరకు నాణ్యమైన వస్తువులు అందుతాయి, ఆర్థిక వృద్ధి పెరుగుతుంది.
ప్ర: ట్రంప్ తన రెండవ విడతలో H-1B వీసాలపై ఆంక్షలు విధించి, వాటి రుసుము పెంచిన నేపథ్యంలో వలస/ప్రయాణ ఒప్పందం పరిస్థితి ఏమిటి?
ప్ర: ఏ దేశమైనా తన చట్టాలను, నిబంధనలను మార్చుకునే హక్కు కలిగి ఉంటుంది. H-1B వీసాలపై ఆంక్షలు మన వాణిజ్య సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని నేను అనుకోను. నిజానికి ఇది భారత్‌కే మంచిది. ఎందుకో వివరిస్తాను. నేడు భారత్‌లో 1,800 కంటే ఎక్కువ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCలు) ఉన్నాయి. న్యూయార్క్ లేదా టోక్యోలోని కార్యాలయాల్లో కూర్చుని చేయాల్సిన పనిని మనం ఇక్కడి నుంచే చేయవచ్చు. భారీ జీతాలు ఇచ్చి అమెరికాకు పంపే బదులు, విదేశీ కంపెనీలు భారత్‌లోనే GCCలను ఏర్పాటు చేసి ఇక్కడి ప్రతిభను ఉపయోగించుకోవచ్చు. దీనివల్ల భారతీయులకు స్వదేశంలోనే ఉద్యోగాలు లభిస్తాయి. మనం మన కుటుంబాలతో, మన సంస్కృతితో కలిసి ఉంటూనే పని చేయవచ్చు. మనం ఇక్కడే పన్నులు కడతాం, ఇక్కడే ఖర్చు చేస్తాం. దీనివల్ల రియల్ ఎస్టేట్, హోటళ్లు వంటి రంగాలు పుంజుకుంటాయి. అన్నింటికీ మించి విదేశీ మారక ద్రవ్యం మన దేశానికి వస్తుంది. విదేశాల్లో ఉండి పంపే నామమాత్రపు సొమ్ము కంటే ఇది దేశానికి ఎంతో మేలు చేస్తుంది.
ప్ర: రష్యా నుంచి చమురు కొనడం నిలిపివేస్తే, అదనపు 25 శాతం పెనాల్టీ నుంచి మినహాయింపు ఇస్తామన్న అమెరికా ప్రతిపాదనపై మీ స్పందన ఏమిటి? మన అవసరాలకు తక్కువ ఖర్చుతో చమురును ఎలా పొందగలం?
జ : ఆ అంశాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ చూసుకుంటుంది. వారు దీనిని చాలా సమర్థంగా నిర్వహిస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం ఇస్తున్నారు. మీరు వారిని అడిగితే మరిన్ని వివరాలు తెలుస్తాయి.
ప్ర: ఈ ఒప్పందాల వల్ల సామాన్యుడికి కలిగే ప్రయోజనం ఏమిటి? ఏ రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి?
జ: ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగం దీనివల్ల లబ్ధి పొందుతుంది. జౌళి, దుస్తులు, పాదరక్షలు, తోలు వస్తువులు, క్రీడా సామాగ్రి వంటి శ్రమ ఆధారిత రంగాలతో పాటు మత్స్యకారులు, రైతులు, హస్తకళాకారులు, చేనేత కార్మికులకు గొప్ప అవకాశాలు లభిస్తాయి. ఈ ఒప్పందాలు ‘మేక్ ఇన్ ఇండియా’కు బాగా ఊతమిస్తాయి. తద్వారా భారీగా పెట్టుబడులు, ఉద్యోగాలు వస్తాయి. మన స్టార్టప్‌లకు స్థిరత్వం లభించడమే కాకుండా విదేశీ పెట్టుబడులను ఆకర్షించే వీలు కలుగుతుంది.
ప్ర: ఉపాధి కల్పన విషయంలో మీరు ఏదైనా ఒక లక్ష్యాన్ని చెప్పగలరా?
జ: ఆ సంఖ్య పెట్టుబడిదారులు, మన ఎగుమతిదారుల సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. మన ఎగుమతిదారులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటే కోట్ల ఉద్యోగాలు సృష్టించవచ్చు. ప్రధాని మోదీ కల్పిస్తున్న అంతర్జాతీయ అవకాశాలను మనం అందిపుచ్చుకోవాలి. గత ఆరు నెలల్లో ప్రధాని మోదీ సంస్కరణల వేగాన్ని పెంచారు. మన చట్టాలను సరళతరం చేయడం, వ్యాపార ప్రక్రియలను సులభతరం చేయడం వంటివి చేయకపోతే 2047 నాటికి మనం అభివృద్ధి చెందిన దేశంగా మారలేం. ఇది 140 కోట్ల భారతీయుల సంకల్పం. 2047 నాటికి ‘వికసిత భారత్’ లక్ష్యం విషయంలో ఎటువంటి రాజీ లేదు.

