kolagani srinivas

సామాన్యుడికే ‘మేయర్’ పీఠం

kolagani srinivasరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ”మేయర్” పదవి సామాన్యుడికే దక్కింది. ఏబీవీపీ నుండి రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టి అంచలంచెలుగా ఎదిగిన సామాన్య కార్యకర్త కొలగాని శ్రీనివాస్ కరీంనగర్ మేయర్ పీఠాన్ని అధిష్టించాడు. కరీంనగర్ కార్పొరేషన్‌లో అద్భుత విజయం సాధించిన బిజెపి కొలగాని శ్రీనివాస్ ను మేయర్‌గా, సునీల్ రావును డిప్యూటీ మేయర్‌గా ఎంపిక చేసింది. 

వాస్తవానికి మేయర్ పదవి తనను వరిస్తుందని కొలగాని శ్రీనివాస్ అస్సలు ఊహించలేదు. బిజెపి కార్పొరేటర్ల సమావేశంలో పార్టీ జిల్లా ఇంఛార్జీ గంగిడి మనోహర్ రెడ్డి కొలగానిని మేయర్ అభ్యర్థిగా రాష్ట్ర నాయకత్వం ఖరారు చేసిందని తెలియజేయడంతో ఆయన ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు. ఆనందంతో కళ్లు చెమర్చాయి. ప్రధాని నరేంద్ర మోదీ, జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్, రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్‌లకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సామాన్య కార్యకర్తనైన తనను మేయర్‌గా ఎంపిక చేస్తారని కలలో కూడా ఊహించలేదన్నారు. బిజెపిలో కష్టపడి, విధేయతతో పని చేస్తే పదవులు వాటంతట అవే వస్తాయనే దానికి తానే నిదర్శనం అని చెప్పారు.

37 ఏళ్ల కొలగాని శ్రీనివాస్ 1989 జూన్ కరీంనగర్ జిల్లా తీగలగుట్టపల్లిలో జన్మించారు. MBA, MSW చేసిన కొలగాని చిన్నప్పటి నుండే ఆర్ఎస్ఎస్ శాఖలో చురుకుగా పాల్గొనే వారు. 2013లోనే ప్రాథమిక శిక్షణను పూర్తి చేశారు. చిన్ననాటి నుంచే స్వామి వివేకానంద ఆలోచనలతో ప్రభావితమై NSS, NYP, ఏక్తా పరిషత్ సంస్థల ద్వారా అనేక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. విద్యార్థి దశ నుండే రాజకీయాల పట్ల ఆసక్తి ఉండేది. 2005 నుండి 2007 వరకు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ లో పనిచేసి విద్యార్థుల సమస్యలపై పోరాడారు. 2007 నుండి 2009 వరకు భారతీయ జనతా యువ మోర్చాలో పనిచేసి యువజన పోరాటాల్లోనూ పాలు పంచుకున్నారు. 2007 నుండి 2009 వరకు ఎన్ఎస్ఎస్ వలంటీర్‌గా పనిచేసి 2010లో కాకతీయ విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ వాలంటీర్ అవార్డును అందుకున్నారు. దేశ సేవకు అంకితం కావాలని భావించిన కొలగాని 2009లో అసోంలో జరిగిన నేషనల్ ఇంటిగ్రేషన్ అండ్ పీస్ క్యాంప్ కు హాజరయ్యారు. లక్షద్వీప్, బెంగళూరు, యూపీ, రాజస్తాన్, ఉత్తరాఖండ్, హర్యానా, అండమాన్ నికోబార్‌లలో నిర్వహించిన అనేక జాతీయ స్థాయి శిబిరాల్లోనూ పాల్గొన్నారు. యువత, పిల్లలతోపాటు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొనేవారు. 2009 నుండి 2013లో ఏక్తా పరిషత్ కార్యక్రమాల్లో పాల్గొని ఆదివాసీల హక్కుల కోసం పోరాటం చేశారు. కొలగాని సేవలకు గాను 2005లో భాయీజీ సేవా పురస్కార్ (NYP), 2010లో NSS ఉత్తమ వలంటీర్, 2021 – కరోనా కాలంలో అందించిన సేవలకుగాను కేంద్ర మంత్రి మనోహర్‌లాల్ కట్టర్ చేతుల మీదుగా ‘రక్షక్ అవార్డు’లను అందుకున్నారు.

ఇక రాజకీయ ప్రస్థానాన్ని పరిశీలిస్తే… 2014 నుండి 2019 వరకు బిజెపి మండల ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 2020 నుండి 2025 వరకు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ కార్పొరేటర్‌గా కొనసాగారు. 2021 లో కరోనా వ్యాక్సిన్ జిల్లా కన్వీనర్‌గా, 2023 నుండి 2024 వరకు కరీంనగర్ టౌన్-1 కన్వీనర్‌గా, 2024 లో NIFFA రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2025 లో చొప్పదండి మండల సర్పంచ్ ఎన్నికల ఇన్‌చార్జ్ గా పనిచేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 2వ డివిజన్ కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.

కరీంనగర్ మేయర్ అభ్యర్థిగా కొలగాని శ్రీనివాస్ పేరును ఖరారు చేయడం పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రాంచందర్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్ర నాయకత్వం అందించిన సహకారం, న్యాయ సాయం ఎనలేనిదని పేర్కొన్నారు.

భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఫిబ్రవరి 24న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నేతృత్వంలో హైదరాబాద్ పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం లాల్ దర్వాజ మహంకాళి ఆలయాన్ని సందర్శించారు.