JanDhan

ఆయుష్మాన్ భారత్: సామాన్యుడికి వరం

యుష్మాన్‌ భారత్‌ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన (ఏబీ-పీఎంజేఏవై) విజయవంతంగా ఆరో వార్షికోత్సవం జరుపుకొంటోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 2018 సెప్టెంబరులో ఏబీ-పీఎంజేఏవై ప్రారంభమైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల్లో ఒకటిగా అది నిలుస్తోంది. ఏ ఒక్క భారతీయుడూ తన ఆర్థిక స్థితిగతుల కారణంగా ఆరోగ్య సేవల విషయంలో తిరస్కరణకు గురికాకూడదన్నదే ఆయుష్మాన్‌ భారత్‌ లక్ష్యం. ఇందులో కుటుంబానికి అయిదు లక్షల రూపాయల వార్షిక కవరేజీతో పెద్దాసుపత్రుల్లో మెరుగైన చికిత్స అందుతుంది. ఏబీ-పీఎంజేఏవై పథకాన్ని సామాజిక ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా 70 ఏళ్లకు పైబడిన సీనియర్‌ సిటిజన్లు అందరికీ వర్తింపజేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిశ్చయించింది. మారుతున్న మన జనాభా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని వేసిన కీలక ముందడుగు ఇది. సామాజిక ఆరోగ్య కార్యకర్తలైన ఆశా, అంగన్‌వాడీ వర్కర్లు, అంగన్‌వాడీ సహాయకుల కుటుంబాలనూ ఈ పథకం పరిధిలోకి తీసుకువచ్చాం. ప్రస్తుతం ఈ పథకం కింద ఆరోగ్య సేవలు పొందేందుకు అర్హులైన ప్రజల సంఖ్య 55కోట్లకు పైబడింది. 7.5 కోట్లకుపైగా చికిత్సలు జరిగాయి. అందుకుగాను లక్ష కోట్ల రూపాయలకుపైగా నిధులను ప్రభుత్వం సమకూర్చింది. ఇదొక గణనీయమైన విజయం. అడ్డగోలు వైద్య ఖర్చులతో పేదరికంలోకి జారిపోయే కుటుంబాలకు ఆర్థిక రక్షణ కల్పిస్తూ, సంక్షోభాల బారిన పడకుండా సామాన్యులను ఈ పథకం కాపాడుతోంది. రైతులు మొదలుకొని దినసరి కూలీల దాకా ఎంతోమంది లబ్ధిదారుల ప్రత్యక్ష అనుభవాలే ఇందుకు తార్కాణం. ఆర్థిక కష్టాల్లో చిక్కుకోకుండా తమను ఈ పథకం ఎలా కాపాడిందో పలువురు చెబుతున్నారు. ఈ కోణంలో ఆయుష్మాన్‌ భారత్‌ తన హామీని నిలబెట్టుకున్నట్లయ్యింది. ఈ పథకం 1900కుపైగా వైద్య చికిత్సలను అందజేస్తోంది. గుండెకు బైపాస్‌ వంటి సంక్లిష్ట సర్జరీలు మొదలు కీలుమార్పిడి శస్త్రచికిత్సలు, క్యాన్సర్, కిడ్నీ వ్యాధుల చికిత్సలకూ భరోసా ఇస్తోంది. ఇలాంటి చికిత్సలను గతంలో చాలామంది తమ శక్తికి మించినవిగా భావించేవారు. ఆ దుస్థితిని ఏబీ-పీఎంజేఏవై మార్చింది. ఖరీదైన వైద్యాన్ని సామాన్యులకు అందుబాటులోకి తెచ్చింది. పౌరులందరికీ ఆరోగ్య సేవలను సమానంగా అందుబాటులోకి తీసుకురావాలన్న ప్రభుత్వ నిబద్ధతకు ఏబీ-పీఎంజేఏవై నిదర్శనం. గత ఆరేళ్లలో ఈ పథకం లక్షల మందికి చేరువైంది. చాలా కేసుల్లో ప్రాణాలను కాపాడే చికిత్సలను అందించింది. ప్రజారోగ్యాన్ని కాపాడాలన్న సమష్టి లక్ష్యంతో దేశమంతా ఏకతాటిపై నిలిస్తే ఎలాంటి విజయాలు సిద్ధిస్తాయనేందుకు ఏబీ-పీఎంజేఏవై ప్రత్యక్ష తార్కాణం.

ఆరోగ్యకరమైన పోటీని…

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 29 వేలకుపైగా ఆసుపత్రులు ఏబీ-పీఎంజేఏవై పరిధిలో సేవలు అందిస్తున్నాయి. ఇందులో 13 వేలకుపైగా ప్రైవేటు ఆసుపత్రులే. ఈ నెట్‌వర్క్‌ గ్రామీణ, పట్టణ ప్రాంతాలకూ వ్యాపించింది. దేశంలోని అత్యంత మారుమూల ప్రాంతంలో నివసించే వారికి సైతం నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందుబాటులో ఉంటున్నాయి. లబ్ధిదారులు ఏ రాష్ట్రానికి చెందినవారైనా సరే, దేశవ్యాప్తంగా ఏ ఆసుపత్రిలోనైనా చికిత్సను పొందే సదుపాయం ఉండటం ఈ పథకంలో మరో విశేషం. విస్తృత నెట్‌వర్క్‌కు బలమైన ఐటీ మౌలిక సదుపాయాల అండతో క్లెయిముల పరిష్కారంలో పారదర్శకత, సమర్థత, వేగం సుసాధ్యమవుతున్నాయి. ఇలాంటి భారీ ప్రజాసంక్షేమ పథకాలకు సవాళ్లు విసిరే మోసాలను ఆధార్‌ ఆధారిత బయోమెట్రిక్‌ తనిఖీ, కాగితం రహిత క్లెయిమ్‌ ప్రాసెస్‌ వంటివి బాగా తగ్గించాయి. ఆయుష్మాన్‌ భారత్‌ పథకం విజయం ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలోని ఇతర విభాగాల్లో గణనీయమైన మెరుగుదలకు దారితీసింది. నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించాలన్న పథకం లక్ష్యం ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు తమనుతాము మెరుగుపరచుకునేలా పురికొల్పింది. ఆరోగ్యకరమైన పోటీని పెంపొందించింది.

వ్యాధుల నివారణకు ప్రాధాన్యం

ఏబీ-పీఎంజేఏవైతో పాటు, ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌ (ఏఏఎం)ల ఏర్పాటు ద్వారా ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఇలాంటి ఆరోగ్య సంరక్షణ కేంద్రాలు వ్యాధుల నివారణకు ప్రాధాన్య మిస్తున్నాయి. ఇప్పటిదాకా, దేశవ్యాప్తంగా 1.73 లక్షల ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిరాలు ఏర్పాటయ్యాయి. వీటిలో సాధారణ అనారోగ్య సమస్యలతోపాటు మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్‌ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు ఉచితంగా పరీక్షలు, రోగనిర్ధారణ, మందుల పంపిణీ జరుగుతోంది. సమగ్ర, సంపూర్ణ ఆరోగ్య సంరక్షణ దిశగా అడుగులు వేసేందుకు ఈ కేంద్రాలు తోడ్పడతాయి. జనారోగ్య శ్రేయస్సుకు పాటుపడటం, ముందస్తు రోగ నిర్ధారణ సౌకర్యాలను పెంపొందించడం ద్వారా ఆసుపత్రిలో చేరాల్సిన అవసరాలను తగ్గించవచ్చు.

ఆయుష్మాన్‌ భారత్‌ విజయాలతోపాటు ముందున్న సవాళ్లనూ గుర్తించాల్సి ఉంటుంది. ఈ పథకం స్థాయి అపారమైనది కావడం వల్ల మరింతగా మెరుగులు దిద్దుతూ కొనసాగించాల్సి ఉంది. ఆసుపత్రులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా, ప్రతి లబ్ధిదారుడికీ నాణ్యమైన ఆరోగ్యసేవలు అందేలా జాగ్రత్తపడుతూ పథకాన్ని విస్తరించేందుకు నిరంతర కృషి జరుగుతోంది. సమగ్ర ఆరోగ్య సేవలను నాణ్యంగా చవగ్గా అందించే కృషిలో భాగంగా ఆయుష్మాన్‌ భారత్‌ను మరింత బలోపేతం చేస్తాం. ఈ పథకం కింద అందజేస్తున్న చికిత్సల జాబితాను విస్తరించేందుకు కృషిచేస్తాం. పథకం పరిధిలో సేవలు అందించే ఆసుపత్రుల సంఖ్యనూ పెంచుతాం. ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌ల విజయాన్ని కొనసాగించేందుకూ కట్టుబడి ఉన్నాం.

వికసిత్‌ భారత్‌ దార్శనికత

ఒక దేశ ఆరోగ్యమే దాని శ్రేయస్సుకు పునాది. ఆరోగ్యకరమైన జనాభా దేశ వృద్ధికి, ఉత్పాదకతకు, ఆవిష్కరణలకు తోడ్పడుతుంది. ఆరోగ్యవంతమైన, బలమైన, వికసిత్‌ భారత్‌ దార్శనికతకు ఆయుష్మాన్‌ భారత్‌ కార్యక్రమం కీలకం. ఈ పథకం విజయం ప్రభుత్వం, ఆరోగ్యసేవల ప్రదాతలు, ప్రజల కఠోర పరిశ్రమ, అంకితభావం, సమన్వయానికి నిదర్శనంగా నిలుస్తుంది. ఈ దిశగా మున్ముందుకు సాగాల్సి ఉంది. దేశంలోని ప్రతి పౌరుడి ఆరోగ్యం, సౌభాగ్యానికి కట్టుబడి ఉన్నాం. ఏబీ-పీఎంజేఏవై ఆరో వార్షికోత్సవం సందర్భంగా… కరుణతో కూడిన సమ్మిళిత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థను తీర్చిదిద్దేందుకు పునరంకితమవుదాం. రాబోయే తరాల కోసం ఆరోగ్య భారతాన్ని నిర్మించే క్రతువు కోసం అందరం కలిసి నడుద్దాం!

జె.పి. నడ్డా,
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి,
బిజెపి జాతీయ అధ్యక్షుడు