Nadda

మాయమాటల కాంగ్రెస్‌పై పోరాడుదాం

Saroornagar Sabhaకాంగ్రెస్‌ను రైతులు, మహిళలు, యువత, తెలంగాణ ప్రజల వ్యతిరేక పార్టీగా బిజెపి జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అభివర్ణించారు. కాంగ్రెస్​ నాయకులు మాయమాటలు చెప్పేవాళ్లని విరుచుకుపడ్డారు. రేవంత్​ రెడ్డి కూడా మాయమాటలు చెప్పే వ్యక్తేనని స్పష్టం చేశారు. తమ మీద తమకు భరోసా లేని వారు తెలంగాణకు ఏం భరోసా ఇస్తారని ఎద్దేవా చేశారు. డిసెంబర్ 7న హైదరాబాద్ సరూర్ నగర్ లో ఏడాది కాంగ్రెస్ పాలన వైఫల్యాలపై బిజెపి తెలంగాణ నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని, ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సభలో ప్రసంగిస్తూ కాంగ్రెస్ నాయకులు విద్యాభరోసా కార్డు హామీ ఇచ్చారని, ఆ భరోసా ఏమైందని ప్రశ్నించారు. నిరుద్యోగులకు భత్యం దొరకలేదని విమర్శించారు. రైతులకు, కౌలు రైతులకు ఇస్తామన్న రూ.15వేలు ఏమైందని ప్రశ్నించారు. రైతు కూలీలకు రూ.12వేలు అందాయా అని ప్రశ్నించారు. అందుకే వీరిని మాయమాటలు చెప్పేవాళ్లని అంటున్నానని అన్నారు. తెలంగాణలో రూ.12వేలు ప్రతీ ఆటోడ్రైవర్​ కు ఇస్తామని మోసం చేశారని, మహిళలకు ప్రతి నెలా రూ.2500 ఇస్తామని, ఆడబిడ్డల పెళ్లిలకు ​తులం బంగారం, లక్ష రూపాయల నగదు ఇస్తామని హామీ ఇచ్చి మోసం చేశారన్నరు. కాంగ్రెస్ నిరుపేద వర్గాలకు అన్యాయం చేసిందని మండిపడ్డారు. మహాత్మా జ్యోతిబా పూలే ఆశయాలను నెరవేరుస్తామని అవాస్తవాలు మాట్లాడారని, యాదవ, కురుమ సంఘాల అభివృద్ధికి నిధులు ఇస్తామని ఇవ్వలేదని విమర్శించారు. అప్పులు చేసి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్​ నాలుగు వ్యాఖ్యల సిద్ధాంతాన్ని పాటిస్తుందని, ఎన్ని రోజులైతే అధికారంలో ఉంటామో అప్పులతో నడిపిద్దామని, ఆ తరువాత ప్రభుత్వాన్ని అడిగే వారు ఉండరని, ప్రభుత్వం మనుగడలో ఉంటుందో లేదో తెలియదనే విధానంలో ఉంటుందని అన్నారు. అప్పులపై ఆధారపడిన ప్రభుత్వాలు ఎక్కువకాలం మనుగడ సాగించలేవన్నారు.

కాంగ్రెస్ హిమాచల్​, కర్ణాటక, తెలంగాణలోని ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందన్నారు. హిమాచల్​ లో కార్మికుల ఓల్డ్​ పెన్షన్​ స్కీమ్​ ఏమైందని ప్రశ్నించారు. 5 లక్షల ఉద్యోగాలేమయ్యాయన్నారు. మహిళలకు రూ.1500 ఇస్తామని మూడేళ్లయినా ఇంతవరకు ఇవ్వలేదన్నారు. 300 యూనిట్ల ఉచిత విద్యుత్​ ఇస్తామని అసత్య వాగ్ధానాలు చేశారన్నారు. స్థానికంగా ఉన్న విద్యాలయాలు కూడా మూసివేత దిశగా ఉన్నాయన్నారు. కర్ణాటకలో అంగన్‌వాడీ కార్మికులకు రూ.15వేలు ఇస్తామన్నారు, కానీ ఇంతవరకు దిక్కు దివాణం లేదన్నారు. పాల రైతులకు సబ్సిడీ, 10 కేజీల ఉచిత బియ్యం ఇస్తామని నిరుపేదలను మోసం చేశారని అన్నారు.

తెలంగాణకు మోదీ అండ

‘‘తెలంగాణకు కేంద్రం రూ.1.1 లక్షల కోట్లు ఇచ్చింది. స్మార్ట్‌సిటీల కింద వరంగల్, కరీంనగర్‌లకు భారీగా నిధులు ఇవ్వడంతో పాటు పీఎం మిత్ర పథకం కింద జౌళి పార్కు ఏర్పాటు చేసింది. రైల్వే లైన్లు, మూడు వందేభారత్‌లు, భారత్‌ మాలా ప్రాజెక్టు కింద హైదరాబాద్‌-ఇండోర్, సూరత్‌-చెన్నై, హైదరాబాద్‌-విశాఖపట్నం జాతీయ రహదారులు, బీబీనగర్‌లో ఎయిమ్స్‌ వంటి ప్రాజెక్టులను రాష్ట్రానికి ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చారు’’ అని జేపీ నడ్డా వివరించారు. బిజెపి హామీ ఇవ్వనివి కూడా చేస్తుందని, కాంగ్రెస్ ఇచ్చిన హామీలను కూడా అమలు చేయలేక చతికిలపడుతుందని విమర్శించారు. త్వరలో మన దేశం ప్రపంచ మూడో ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని, అందులో తెలంగాణ కూడా భాగస్వామ్యం కావాలని ఆకాంక్షించారు.

ఒకసారి గెలిస్తే మళ్లీ మళ్లీ

అధికారాన్ని బిజెపి ప్రజా సమస్యల పరిష్కారానికి, రాష్ట్ర అభివృద్ధికి పని చేస్తుందని అన్నారు. 60 యేళ్ల తరువాత మూడుసార్లు దేశంలో ప్రధానిగా ఎన్నికైన వారు మోదీ ఒక్కరే అని అన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా వారి పాచికలు పారలేదని, మోదీ మూడోసారి ప్రధాని పీఠం ఎక్కారన్నారు. 70యేళ్లుగా కాంగ్రెస్ ప్రజల ఆశలపై వీళ్లు నీళ్లు జల్లుతూనే ఉందన్నారు. బిజెపి ప్రభుత్వం ఇక ప్రతీసారి అధికారంలోకి వచ్చి దేశాభివృద్ధి చేస్తుందన్నారు. పార్లమెంట్​ ఎన్నికలలో బిజెపి ఓట్ల శాతం భారీగా పెరిగిందన్నారు. 19 రాష్ర్టాలలో బిజెపి ప్రభుత్వాలు ఉన్నాయని, 6 రాష్ర్టాల్లో ఎన్డీయే రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయన్నారు. ఒక్కసారి రాష్ట్రంలో బిజెపి వస్తే ఇక పర్మినెంట్‌గా ఉంటుందన్నారు. గుజరాత్​ లో 6, గోవాలో 3, మధ్యప్రదేశ్​ లో 3, యూపీలో రెండోసారి బిజెపి ప్రభుత్వం వచ్చిందన్నారు. మహారాష్ట్రలోనూ మూడోసారి అధికారంలోకి వచ్చామన్నారు. ఉత్తరాఖండ్​ లో రెండు, మణిపూర్​ లో మూడు, అసోంలో రెండు, హరియాణాలో మూడుసార్లు అధికారంలోకి వచ్చామన్నారు. ఒక్కసారి కాదు ఎన్నోసార్లు గెలుపు రికార్డులు ఉన్నాయన్నారు. జమ్మూకశ్మీర్​ లో అత్యధిక స్థానాలను బిజెపి కైవసం చేసుకుందన్నారు. ఉప ఎన్నికల్లోనూ బిజెపి విజయం సాధించిందన్నారు. చత్తీస్​ గఢ్​, మధ్యప్రదేశ్​, గుజరాత్​ లో 64 సీట్లపై బిజెపి–కాంగ్రెస్​ మధ్య ముఖాముఖి పోటీ జరగ్గా ఇందులో 62 స్థానాలను బిజెపి గెలిచిందన్నారు. ప్రాంతీయ పార్టీలు గెలిపించిన స్థానాల్లోనే కాంగ్రెస్ అభ్యర్థులు గెలుస్తున్నారని, సొంతంగా గెలవడం లేదని చురకలంటించారు.

తెలంగాణ ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా రైతులు, మహిళలు, యువకులు, కార్మికుల సమస్యలపై పోరాటం చేయాలని బిజెపి తెలంగాణ నిర్ణయించిందన్నారు. తెలంగాణ సంపూర్ణాభివృద్ధి, మంచి భవిష్యత్తు బిజెపితోనే సాధ్యమన్నారు. తెలంగాణ గుండెచప్పుడై రాష్ట్ర అభివృద్ధికి ముందుకు వెళుతుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఏడాది పాలనను ప్రజల ముందు ఎండగట్టేందుకు వచ్చానని అన్నారు. కాంగ్రెస్​ చేస్తున్న అన్యాయం, అబద్ధాలను ప్రజలకు తెలియజెప్పేందుకు తెలంగాణ బిజెపి నడుం బిగించిందని ఇందుకు తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి. కిషన్​ రెడ్డి, బిజెపి నేతల చేస్తున్న ఈ ప్రయత్నంపై హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్​ అవాస్తవాలపై తెలంగాణ బిజెపి చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని జేపీ నడ్డా సూచించారు.

కాంగ్రెస్ వైఫల్యాలపై శంఖారావం: కిషన్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలపై ఉద్యమ శంఖారావం పూరించామని బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చెప్పారు. ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించి బిజెపి జెండా ఎగురవేసేంత వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం అనేక సంవత్సరాల పాటు పోరాటం చేశాం. అనేక బలిదానాలు జరిగాయి. సకలజనుల సమ్మె చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాం. గతంలో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ కుటుంబ, అహంకార, అవినీతి పాలనతో తెలంగాణ ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేసింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నాయకులు 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారు, 420 హామీలు గుప్పించారు. ఏడాది పాలన గడిచినా కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా సరిగ్గా అమలు చేయలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ ప్రజలకు మేలు జరగలేదు. ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదు. కాంగ్రెస్ పాలనలోనూ అదే జరుగుతోంది. బీఆర్ఎస్ -కాంగ్రెస్ పార్టీలవి ఒకే డీఎన్ఏ. ఒకే తానుముక్కలు. పాలనలో కేసీఆర్-రేవంత్ రెడ్డి కవలపిల్లల్లాంటివారు. బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ అవినీతి, కుటుంబ, అహంకార పాలన కొనసాగిస్తోంది. ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదు. డిసెంబరు 9న సోనియా జన్మదినం సందర్భంగా రైతు రుణమాఫీ చేస్తామని, పెన్షన్లు రూ.2000 నుంచి రూ.4 వేలు చేస్తామని హామీలిచ్చారు. రుణమాఫీ పూర్తిచేయలేదు. పెన్లన్లు రూ. 4 వేలకు పెంచలేదు. ఒక కొత్త పెన్షన్ కూడా ఇయ్యలేదు. ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇయ్యలేదు. తెలంగాణ ఉద్యమకారులు, మేధావులు, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్రంలో నిజమైన మార్పు రావాలంటే భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది.’’ అని అన్నారు.

అర్బన్ నక్సల్స్ చేతిలో రేవంత్ సర్కార్: బండి సంజయ్

అర్బన్ నక్సల్స్ చేతిలో రేవంత్ రెడ్డి సర్కార్ బందీగా మారిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ లో మాదిరిగా భాగ్యనగర్ లోనూ హిందూ దేవాలయాలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి వాడుతున్న భాష, ఆడుతున్న అబద్దాలను చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని విమర్శించారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్‌కు మూడో స్థానం తథ్యమన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎగిరేది కాషాయ జెండాయేనని ధీమా వ్యక్తం చేశారు. సంక్రాంతి లోగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడిని గల్లీలో తిరగనీయమని డెడ్ లైన్ విధించారు. రైతులతో సహా ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డిదేనని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ కుమార్ ప్రసంగిస్తూ ‘‘ఇంకా 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ అమలు చేయనిది నిజమా? రైతులకు ఎకరాకు రూ.15 వేలు, వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇస్తామని ఎగ్గొట్టింది నిజం కాదా? తాలు, తరుగు, తేమతో పని లేకుండా వడ్లు కొంటామని మాట తప్పింది నిజం కాదా? యూత్ డిక్లరేషన్ పేరుతో 2 లక్షల ఉద్యోగాలను ఏడాదిలో భర్తీ చేస్తామన్నరు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డి సాక్షాత్తు 13 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చాం… 12 వేలు మాత్రమే భర్తీ చేస్తామన్నడు. అవిగాక డీఎస్సీ పేరుతో మరో 10 వేల ఉద్యోగాలను భర్తీ చేశారు. మహా అంటే 25 వేలకు మించి ఉద్యోగాలను భర్తీ చేయని మీరు… 55 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు ఎట్లా చెప్పుకుంటారు? కొత్త ఉద్యోగాల సంగతి దేవుడెరుగు… ఉన్న ఉద్యోగాలను ఊడగొడుతున్నరు. 6,500 మంది పార్ట్ టైం లెక్చరర్లను నిర్దాక్షిణ్యంగా తొలగించిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి.

బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే. కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి జరిగితే కాంప్రమైజ్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ చేస్తే అరెస్టుల్లేవు? ఈ ఫార్ములా కార్ల రేసులో స్కాం జరిగితే చర్యల్లేవు. గొర్రెల, బర్రెల స్కాం జరిగితే చర్యల్లేవు. రాష్ట్రంలో ఆర్కే పాలన కొనసాగుతోంది(రేవంత్ రెడ్డి, కేసీఆర్). ఈ రెండు కుటుంబాల మధ్య రాజకీయ, వ్యాపార లావాదేవీలు నడుస్తున్నాయి. ఆ లావాదేవీలను బయట పెట్టేందుకు మేం సిద్ధం.’’ అని అన్నారు.

ఏం ఒరగబెట్టారని విజయోత్సవాలు?: డి.కె. అరుణ

బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్‌నగర్‌ పార్లమెంటు సభ్యులు డి.కె. అరుణ మాట్లాడుతూ ‘‘ఉచిత బస్సు ప్రయాణం అమలు చేశామంటూ చెప్పుకుంటున్న కాంగ్రెస్ పాలనలో.. గ్రామాల్లో ఆర్టీసీ బస్సులు కూడా సరిగ్గా తిరగడం లేదు. డిసెంబరు 9న సోనియమ్మ పుట్టినరోజున రూ. 2 లక్షల చొప్పున రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ సంవత్సరం గడిచినా పూర్తిగా రుణమాఫీ ఎందుకు చేయలేదు..? సంక్రాంతికి రైతు భరోసా పేరుతో, ఇండ్లు కట్టిస్తామని చెబుతూ మరోసారి మాయమాటలు చెబుతోంది. ప్రజలకు ఏం ఒరగబెట్టిందని కాంగ్రెస్ విజయోత్సవాలు, సంబురాలు చేసుకుంటోంది..? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష తీరు ప్రజలు అసహ్యించుకునేలా ఉంది. రేవంత్ రెడ్డి లక్కీ లాటరీతో ముఖ్యమంత్రి అయ్యిండు. గతంలో రాష్ట్రాన్ని ఒక కుటుంబం పాలిస్తే.. ఈరోజు మరో కుటుంబం పాలిస్తున్నది. ప్రజలు కోరుకుంటున్నది ఇటువంటి మార్పు కాదు. గతంలో నియంత పాలన వద్దని, తెలంగాణ సంపదను కొల్లగొట్టి అప్పులపాల్జేసిన కుటుంబం నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలని కాంగ్రెస్‌ను గెలిపిస్తే లంకెబిందెలు ఉన్నాయనుకొని వచ్చామంటూ రేవంత్ రెడ్డి చెబుతున్నడు. కాంగ్రెస్ పాలన చేసేది ప్రజలను దోచుకోవడానికా..? ప్రజల కోసం పని చేసేందుకా..? రాష్ట్రాన్ని పాలించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తెలంగాణలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి ని గెలిపించాలి. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి తీసుకువచ్చేలా పనిచేయాలి.’’ అని అన్నారు.

అబద్ధాలతో అధికారంలోకి కాంగ్రెస్: డా. కె.లక్ష్మణ్

బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యాసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ ‘‘కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటిని అటకెక్కించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీలు.. ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. ఫేక్ ప్రచారాలు, అబద్ధాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ ఫలాలు అందుతున్నాయి. భారత్ కు వ్యతిరేకంగా విదేశీ శక్తులు అమెరికాలో కుట్రలు పన్నుతుంటే వారికి రాహుల్ గాంధీ వంతపాడుతున్నారు. భారతదేశంలో అన్నింటా అగ్రగామిగా మారుతోందని, నరేంద్ర మోదీ ప్రపంచంలోనే తిరుగులేని నాయకుడుగా మారుతున్నారనే అక్కసుతో రాహుల్ గాంధీ పార్లమెంటు కార్యకలాపాలను స్తంభింపజేసే ప్రయత్నం చేస్తున్నారు. విదేశీ శక్తుల కుట్రలకు ఊతమచ్చేలా రాహుల్ గాంధీ వ్యవహరిస్తున్నారు. జార్జ్ సోరోస్ -రాహుల్ గాంధీ శరీరాలు వేరు కావచ్చు.. వారిద్దరి ఆత్మ ఒక్కటే. దేశాన్ని అస్థిరపర్చేలా కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతోంది.’’ అని అన్నారు.

సర్పంచులు, ఆటోడ్రైవర్ల ఆత్మహత్యలు: ఈటల రాజేందర్

మల్కాజ్‌గిరి పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ మాట్లాడుతూ ‘‘గత ప్రభుత్వంలో చేసిన పనులకు బిల్లులు రాక సర్పంచులు, ఉపసర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి నెలకొంది. ఆటోడ్రైవర్లకు రూ. 12 వేలు దేవుడెరుగు.. రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో 50 మంది ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నరు. మహిళలకు రూ. 2500 సాయం అందలేదు.. ఆడబిడ్డలకు తులం బంగారం ఇయ్యలేదు. ప్రభుత్వమంటే సమస్యలు తీరుస్తదని భావిస్తారు. కాని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా పేరుతో సంవత్సర కాలంగా డ్రామా చేస్తున్నడు. ఏ బస్తీలో ఎప్పుడు బుల్డోజర్లతో ఇండ్లు కూలగొడుతారేమోననే భయంతో బిక్కుబిక్కుమంటూ బతుకుతున్న ప్రజలకు బిజెపి అండగా నిలబడింది. రేవంత్ రెడ్డి.. కేవలం మాటలతో, మీడియా మేనేజ్‌మెంట్‌తో, అబద్ధపు ప్రచారాలతో బుకాయించే ప్రయత్నిస్తున్నడు తప్పితే ప్రజలకు ఇచ్చిందేమీ లేదు.’’ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో బిజెపి ఎంపీలు రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బిజెపి శాసనమండలి పక్షనేత ఏవీఎన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర పదాధికారులు, నాయకులు, కార్యకర్తలు, పెద్దసంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.