వృద్ధికి ఊతమిచ్చే బడ్జెట్
దేశ ప్రజానీకంలో చాలా మంది మధ్యతరగతికి ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో ఎటువంటి రాయితీలు, ఊరట లభించిందన్న ఆసక్తితో మాత్రమే వార్షిక బడ్జెట్ ను గమనిస్తారు. ఈసారి ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వారిని నిరాశపరచలేదు. ఆదాయం పన్ను మినహాయింపు పరిమితిని పెంచనందుకు అనేక సంవత్సరాలుగా ఆర్థిక మంత్రి విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఏడాదికి 12 లక్షల రూపాయల ఆదాయం వరకు ఆదాయం పన్నును మినహాయిస్తున్నట్టు సీతారామన్ ప్రకటించారు. ఇప్పటివరకు ఈ పరిమితి 7 లక్షలు మాత్రమే ఉండేది. దేశంలోని మధ్యతరగతి ప్రజల అభ్యర్థనలను, ఆకాంక్షలను పరిగణనలోనికి తీసుకొని ఆమె ఈ నిర్ణయం ప్రకటించారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనపై దేశవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. స్వల్ప కాలంలో ఈ నిర్ణయం కచ్చితంగా సానుకూల ఫలితాలు ఇస్తుంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజల చేతుల్లో ఎక్కువ డబ్బులు ఉండి వారు ఖర్చులు కూడా ఎక్కువ పెడతారు. దీని ఫలితంగా ఉత్పత్తి పెరిగి ఉద్యోగాల సృష్టి జరుగుతుంది.
గత ఏడాది వినియోగ వస్తువుల మార్కెట్లో లాభాలు క్షీణించాయి. వంట నూనెలు, పప్పులు, అలాగే నిత్యం వాడే సబ్బులు, షాంపూలు వంటి వస్తువుల అమ్మకాలు కూడా తగ్గిపోయాయి. దీనికి కారణాలు ఏమిటో సవివరమైన అధ్యయనం జరగాలి. కానీ పైకి కనిపించే ఒక కారణం గిగ్ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా విస్తరించడం. ఇళ్ల దగ్గర వండుకోవడం తగ్గించి స్విగ్గి, జొమాటో వంటి డెలివరీ అగ్రిగేటర్ల ద్వారా ఆహారాలను బయట నుంచి కొనుగోలు చేయడం, అలాగే షాంపూలు, ఇతర సౌందర్య సాధనాల వాడకాన్ని ఇళ్లల్లో తగ్గించి పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బ్యూటీ పార్లర్లకు వెళ్లే వారి సంఖ్య మధ్య తరగతిలో పెరిగిపోవడం కూడా దీనికి కారణం కావచ్చు. ప్రపంచవ్యాప్తంగా వస్తూత్పత్తి రంగంలో అత్యధిక సంఖ్యలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. కానీ భారతదేశంలో మాత్రం ఈ తయారీ రంగం బలహీనంగానే ఉంది. నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రయత్నాల ఫలితంగా ఇటీవల కాలంలో తయారీ రంగంలో కూడా వృద్ధి పుంజుకుంటోంది.
వార్షిక పరిశ్రమల సర్వే (ఏఎస్ఐ) సమాచారం ప్రకారం 2023 ఆర్థిక సంవత్సరంలో తయారీ రంగం 7.5 శాతం వృద్ధిరేటు సాధించి అందులో పని చేసే వారి సంఖ్య కూడా కోటి 85 లక్షలు పెరిగింది. ఈ రంగం ఏమాత్రం మందగించినా ఉద్యోగాల కోసం చూసే జనాభాపై దాని ప్రభావం తీవ్రంగా ఉంటుంది. పనిచేసే వయసులో ఉన్న జనాభా పెద్ద సంఖ్యలో ఉన్న దేశం భారత్. ఏటా శ్రామిక శక్తిలోకి ప్రవేశిస్తున్న కోట్ల మంది యువతీయువకుల కారణంగా ఉద్యోగ, ఉపాధి రంగానికి సంబంధించి ప్రభుత్వంపై ఒత్తిడి తీవ్రంగా పెరుగుతుంది. సంప్రదాయ ఉపాధి రంగాల్లో అర్హులైన ఉద్యోగుల కొరత ఆర్థిక వ్యవస్థకు సమస్యలు సృష్టిస్తుండగా పెద్దసంఖ్యలో యువత కొత్తగా అభివృద్ధి చెందుతున్న గిగ్ రంగంలో ఉపాధి పొందుతున్నారు. దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో గిగ్ రంగం ఒకటని అంచనాలు వెల్లడిస్తున్నాయి. ఇందులో ఇప్పుడు కోటి మంది ఉపాధి పొందుతున్నారు. ఈ సంఖ్య ఏడాదికి 17 శాతం చొప్పున పెరుగుతోందని అసోచామ్ విశ్లేషకులు చెబుతుండగా 2029-30 నాటికి గిగ్ రంగంలో ఉపాధి పొందుతున్న వారి సంఖ్య 2.35 కోట్లు దాటుతుందని నీతి ఆయోగ్ అంచనా వేస్తోంది. ‘గిగ్ పని’ అనే పదానికి సరైన నిర్వచనం లేదు. స్థూలంగా యజమాని-ఉద్యోగి అనే సంప్రదాయ నిర్వచనానికి వెలుపల తాత్కాలికమైన ఏర్పాటు అని దీన్ని నిర్వహించవచ్చు.
పన్ను మినహాయింపు పరిమితులను పెంచితే భారత్ లో వినిమయంపై ఎక్కువ ఖర్చు చేసే మధ్యతరగతి ప్రజల చేతుల్లో డబ్బు మిగులుతుంది, అప్పుడు దేశంలో వినియోగం పెరుగుతుంది అన్న సంప్రదాయ తర్కాన్ని ఆర్థిక మంత్రి అనుసరించినట్లు కనిపిస్తోంది. ప్రజలు ఎక్కువ డబ్బులు ఖర్చు చేస్తే ప్రభుత్వానికి పన్నుల ద్వారా ఆదాయం కూడా పెరుగుతుంది. అయితే ఈసారి ఆర్థిక మంత్రి గిగ్ రంగంపై కూడా శ్రద్ధ చూపించారు. గిగ్ కార్మికులకు కూడా బీమా సదుపాయం కల్పించాలని కార్మిక సంఘాలు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాయి. వారి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని సీతారామన్ గిగ్ రంగంలోని వారికి పలు సామాజిక భద్రతా చర్యలను ప్రకటించారు. కోటి మందికిపైగా గిగ్ కార్మికులకు ఆరోగ్య భద్రత కల్పించే పీఎం జన ఆరోగ్య యోజన వంటి సదుపాయాలు ఇందులో ఉన్నాయి. గిగ్ రంగంలోని కొన్ని కీలకమైన కంపెనీలు ఇప్పటికే తమ కార్మికుల కోసం కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం ఆమెకు తెలిసే ఉంటుంది. డిజిటలీకరణ, ఏఐ (కృత్రిమ మేధ)ల కారణంగా ఉద్యోగాలు అంతర్థానమయ్యే ప్రమాదం ఒకపక్క పొంచి ఉండగా వస్తూత్పత్తి రంగంలోకి పెట్టుబడులను ఆకర్షించడం భారత్ ముందు ఉన్న అతి పెద్ద సవాలు.
గత కొన్ని సంవత్సరాలుగా ఎన్డీఏ ప్రభుత్వం ఉపాధి అవకాశాలను పెంచడానికి మౌలిక సదుపాయాల రంగంపై భారీయెత్తున ఖర్చు పెడుతూ వచ్చింది. ఈ బడ్జెట్ లో కూడా దీన్ని కొనసాగించారు. ఏదేమైనా ఇది తాత్కాలిక చర్య మాత్రమే. ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్న పరిశ్రమల్లోకి మరింత దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించినప్పుడే నిరుద్యోగ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఇప్పటివరకు రక్షణ ఉత్పత్తుల రంగం మాత్రమే ఆశాజనకమైన వృద్ధిని కనబరిచింది. ఇప్పుడు ప్రభుత్వం శ్రామిక శక్తిని ఎక్కువగా ఉపయోగించే నౌక నిర్మాణం వంటి ఇతర రంగాలను కూడా ప్రోత్సహించేందుకు నడుంబిగించింది. భారత్ ఎగుమతులు, దిగుమతుల్లో 95 శాతాన్ని సముద్ర మార్గంలోనే కొనసాగిస్తున్నా అంతర్జాతీయ నౌకా పరిశ్రమలో మన దేశం పాత్ర నామమాత్రంగానే ఉంది. నౌకా నిర్మాణానికి పరిశ్రమల హోదా కల్పించడం ద్వారా ఆర్థిక మంత్రి ఈ రంగంలో పెట్టుబడుల వృద్ధికి ద్వారాలు తెరిచారు. అయితే బడ్జెట్లో ప్రకటించిన అత్యంత కీలకమైన సంస్కరణ నియంత్రణ వ్యవస్థలకు సంబంధించినది. నియంత్రణ సంస్థలు ఆర్థిక కార్యకలాపాలు సులభంగా కొనసాగడానికి వీలు కల్పించినప్పుడు మాత్రమే ఆర్థిక వ్యవస్థ సజావుగా ముందుకు సాగుతుంది. దీనికి బదులుగా భారత్ లో నియంత్రణ వ్యవస్థలు అత్యుత్సాహంతో వ్యవహరిస్తూ విదేశీ పెట్టుబడులను నిరుత్సాహపరుస్తున్నాయి.
ఈ అవరోధాలను గుర్తించిన ఆర్థిక మంత్రి నియంత్రణా వ్యవస్థలు సాంకేతిక ఆవిష్కరణలను అందిపుచ్చుకుంటూ అంతర్జాతీయంగా అనుసరిస్తున్న విధానాలకు అనుగుణంగా వ్యవహరించాలని హితవు పలికారు. “నమ్మకం” పునాదిగా ఎక్కువ ఇబ్బందులకు గురి చేయని నియంత్రణా వ్యవస్థలను ఏర్పాటు చేస్తామని హామీ ఇస్తూ “అధునాతనమైన, స్థితిస్థాపకమైన ప్రజానుకూలమైన, విశ్వాసం ఆధారంగా నడిచే 21వ శతాబ్దానికి అనుకూలమైన” నియంత్రణా వ్యవస్థను నిర్మించేందుకు ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్థిక మంత్రి చేసిన మరొక కీలకమైన ప్రకటన జనవిశ్వాస బిల్లు 2.0. 2023 లో ఇటువంటి ఒక బిల్లు ద్వారా ప్రభుత్వం వివిధ మంత్రిత్వ శాఖల పరిధిలోగల విభాగాలకు సంబంధించి 180 న్యాయనిబంధనలను నేరాల జాబితా నుంచి తొలగించింది. వాణిజ్య సౌలభ్యాన్ని మరింత పెంచేందుకు మరో 100 వివిధ న్యాయనిబంధనలను నేరాల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు సీతారామన్ ప్రకటించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రధాన ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ ప్రభుత్వ మనోగతాన్ని బడ్జెట్ పూర్వ ఆర్థిక సర్వేలో ఒక్క వాక్యంలో ఇలా వ్యక్తీకరించారు: “ప్రభుత్వం వాణిజ్య కార్యకలాపాలలో జోక్యం చేసుకోకూడదు”.
రామ్ మాధవ్,
బిజెపి నాయకులు

