వాజ్‌పేయి సుపరిపాలన సిద్ధాంతం
సుపరిపాలన లేదా సుశాసన్ భారతదేశం పురాతన సంస్కృతి, నైతికతల వారసత్వం. బౌద్ధమతానికి చెందిన గణసంఘం ద్వారా మనకు లభించిన ప్రజాస్వామిక విలువలు, 11వ శతాబ్దంలో బసవేశ్వరుడు స్థాపించిన అనుభవ్ మండపం, చాణక్యుడి అర్థశాస్త్రం, సింధు లోయ నాగరికతలో నగర పాలన, మౌర్య చక్రవర్తి అశోకుడి వారసత్వం మొదలైనవి మెరుగైన పాలనకు దోహదపడే వారసత్వ జ్ఞానాన్ని మనకు అందించాయి. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదినాన్ని పురస్కరించుకుని మనం జరుపుకొంటున్న ఈ సుపరిపాలన దినోత్సవం సందర్భంగా స్వతంత్ర భారతావనిలో అమలులో ఉన్న అద్భుతమైన పాలనా విధానాలను సంస్థాగతం చేయడంలో ఆయన పోషించిన విశేష పాత్రను వెలుగులోకి తేవడం అత్యవసరం.
స్వాతంత్య్రానంతరం సుపరిపాలన పాలనా సంస్కరణలకు కేంద్ర బిందువుగా ఉంది. కానీ అప్పటివరకు దీనిపై మాటలు, చర్చలే నడిచేవి. ప్రణాళికా సంఘం వంటి సంస్థలు తయారు చేసిన విధాన పత్రాలు, రాజ్యాంగ అసెంబ్లీ చర్చల్లో ఇది ప్రస్తావనకు వచ్చింది. కానీ సుపరిపాలన అమలు పేలవంగా ఉండేది. కాగితాలకే పరిమితమై ఉంది. వాజ్‌పేయి దార్శనిక నాయకత్వంలో ఆ పరిస్థితి మారి పాలనను మెరుగుపరిచే ప్రయత్నాలు ప్రజల జీవితాల్లో ప్రతిబింబించడం ప్రారంభమైంది. వాజ్‌పేయి పార్లమెంటులో సుదీర్ఘకాలం పనిచేశారు. ఆయన 10 సార్లు లోక్ సభ ఎంపిగా, రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. సుపరిపాలనను పరిపాలనలో ఒక ప్రధానాంశంగా చేయడానికి పార్లమెంటు అనే వేదికను ఆయన ఉపయోగించుకున్నారు. ప్రతిపక్ష సభ్యుడిగా ఆయన హేతుబద్ధమైన వాదన, నిర్మాణాత్మక విమర్శలు ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుని సంక్షేమం కేంద్రబిందువుగా గల పాలనా వ్యవస్థ ఏర్పాటుకు స్ఫూర్తినిచ్చాయి.
ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో ఉద్భవించిన ప్రజాకేంద్రిత కార్యక్రమాలు భారతదేశ పరివర్తనా ప్రస్థానంలో మైలురాళ్లుగా మారాయి. కిసాన్ క్రెడిట్ కార్డు, ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన, స్వర్ణ చతుర్భుజి, నదుల అనుసంధానం, జాతీయ గ్రామీణ ఆరోగ్య కార్యక్రమం, సర్వశిక్షా అభియాన్, గిరిజన వ్యవహారాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ వంటి పథకాలు, ఆలోచనలు సమాజంలోని ప్రతి వర్గాన్ని స్పృశించాయి. పాక్షిక న్యాయాధికారాలు గల కేంద్ర విద్యుత్ నియంత్రణా కమిషన్ ను ఏర్పాటు చేసి విద్యుత్ రంగంలో నియంత్రణా యంత్రాంగాన్ని మెరుగుపరిచేందుకు విద్యుత్ చట్టాన్ని సవరించారు. 1998 మేలో జరిగిన అణుపరీక్షలు భారత్‌ను అణ్వస్త్ర రాజ్యంగా మార్చాయి. సంక్లిష్టమైన కాశ్మీర్ సమస్యను పరిష్కరించడానికి వాజ్‌పేయి ప్రసిద్ధ సిద్ధాంతం ‘ఇన్సానియత్, జమ్హురియత్, కశ్మీరియత్’ (మానవత్వం, శాంతి, కాశ్మీరీ ప్రజల పవిత్రత) ప్రజల మనోభావాలను ప్రతిధ్వనించింది. “మీరు స్నేహితులను మార్చగలరు గాని ఇరుగుపొరుగువారిని మార్చలేరు” అనే ఆయన వ్యాఖ్యలు భారతదేశ విదేశాంగ విధానానికి మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాయి. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన సైనికులకు ప్రజలు నివాళులు అర్పించేందుకు వీలుగా అమరవీరుల పార్థివ దేహాలను వారి ఇళ్లకు తీసుకురావడానికి వాజ్‌పేయి ప్రభుత్వం అనుమతించింది. అంశమేదైనా ఏకాభిప్రాయం సాధించే పట్టువిడుపుల మనస్తత్వం గల వ్యక్తి వాజ్‌పేయి. అందువల్లే 2000 సంవత్సరంలో ఛత్తీస్ గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ అనే మూడు కొత్త రాష్ట్రాలు శాంతియుతంగా ఏర్పాటుచేయగలిగారు.
భవిష్యత్తుకు సంబంధించి అంబేద్కర్ దృక్పథం, జాతి నిర్మాణంలో ఆయన పాత్ర వాజ్‌పేయిని ఎంతగానో ప్రభావితం చేశాయి. వాజ్‌పేయి, ఎల్ కే అద్వానీల ప్రోద్బలంతోనే బిజెపి మద్దతుతో వీపీ సింగ్ ప్రభుత్వం 1990 మార్చి 31న అంబేద్కర్ ను భారతరత్నతో సత్కరించింది. 1951లో కేంద్ర మంత్రి పదవికి అంబేద్కర్ రాజీనామా చేసిన తరువాత రాజస్థాన్‌కు చెందిన సిరోహి మహారాజా ఆయనను బస చేయమని ఆహ్వానించిన దిల్లీలోని 26 అలీపోర్ రోడ్డులోని భవనాన్ని అభివృద్ధి చేయాలనే వాజ్‌పేయి సంకల్పం ఫలితంగా ఈ ప్రాంగణాన్ని సామాజిక సమానత్వం కోసం ప్రజలను ప్రేరేపించే మ్యూజియంగా అభివృద్ధి చేశారు. పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ 2003 అక్టోబరు 14న వాజ్‌పేయి పర్యవేక్షణలో ఈ ప్రైవేట్ ఆస్తి బదిలీ పత్రంపై సంతకం చేసింది. డిసెంబర్ 2003లో అభివృద్ధి పనులను ప్రారంభించింది. అయితే యూపీఏ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిలిపివేసింది. ఆ తర్వాత మోదీ ప్రభుత్వం రూ.100 కోట్లతో అంబేద్కర్ జాతీయ స్మారక చిహ్నంగా అభివృద్ధి చేసి 2018 ఏప్రిల్ 13న జాతికి అంకితం చేసింది.
21వ శతాబ్ధం ప్రారంభంలో అనేక కార్యక్రమాలు చేపట్టి వాజ్‌పేయి సుపరిపాలనను ఆచరణలో చూపించారు. ప్రధాని మోదీ తన లక్ష్యాలను సాధించడానికి ఈ చర్యల వేగాన్ని, స్థాయిని పెంచారు. ప్రత్యక్ష నగదు బదిలీ (DBT), జామ్ (జన్‌ధన్, ఆధార్, మొబైల్) వంటి సాంకేతిక కార్యక్రమాలు వ్యవస్థలపై ప్రజల విశ్వాసాన్ని బలపరిచాయి. భారత్‌మాల, సాగరమాల, జాతీయ ఆస్తుల నగదీకరణ, వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి తదితరాల ద్వారా మౌలిక సదుపాయాల రంగానికి నరేంద్ర మోదీ పెద్దపీట వేశారు. అధికరణం 370 రద్దుతో జమ్మూ కాశ్మీర్ లో మెరుగైన సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల కెన్-బెట్వా నదుల అనుసంధాన పథకానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ‘కనీస ప్రభుత్వం, గరిష్ట పాలన’ అనే మంత్రం పౌరుల జీవన సౌలభ్యాన్ని మెరుగుపరిచింది. పీఎం గతి శక్తి, ‘ప్రగతి’, మిషన్ కర్మయోగి ద్వారా సామర్థ్యాన్ని పెంపొందించడం, ప్రక్రియలను సరళతరం చేయడం, వ్యాపారాలు, వ్యక్తులు, ఇతర సంబంధిత పక్షాలపై అమలు భారాన్ని తగ్గించడం వంటి కార్యక్రమాలతో వివిధ మంత్రిత్వ శాఖల మధ్య మెరుగైన సమన్వయం ద్వారా పాలనా వ్యవస్థలు మెరుగుపడుతున్నాయి. జీఎస్టీ అమలు, లేబర్ కోడ్లు, దివాలా కోడ్, నూతన విద్యావిధానం, ముద్ర, పీఎం ఆవాస్ పథకాలు, పీఎం కిసాన్, పన్ను వివాదాలను నిరాటంకంగా పరిష్కరించడం వంటివి పారదర్శకత, జవాబుదారీతనం, సుపరిపాలనలోని ఇతర కోణాలను బలోపేతం చేశాయి.
సులభతర వాణిజ్యంలో (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో 2015లో 145వ స్థానంలో ఉన్న భారత్ 2020 నాటికి 63వ స్థానానికి ఎదిగింది. అదేవిధంగా ప్రపంచ నవకల్పనా సూచి (గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ర్యాంకింగ్) 81 (2015) నుంచి 46 (2021)కు భారత్ ర్యాంకు మెరుగుపడింది. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని, ఒకే ఓటరు జాబితా, న్యాయ సంస్కరణలు చేపట్టాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. సుపరిపాలన రాజ్యాంగ చట్రంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడం ద్వారా వారికీ సేవ చేయడానికి ఒక సాధనం. అటల్ జీ దార్శనికత, నాయకత్వం, మార్గదర్శకత్వం, అమూల్యమైన అవగాహన వర్తమాన, భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ నేపథ్యంలో దేశం సుపరిపాలన దినోత్సవాన్ని జరుపుకొంటున్న తరుణంలో ఆత్మపరిశీలన చేసుకుని నవభారత నిర్మాణం కోసం ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’ స్ఫూర్తితో పనిచేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం.
(ఈ వ్యాసం 2021 డిసెంబర్ 24న ప్రచురితమైంది)
అర్జున్ రాం మేఘ్వాల్,
కేంద్ర మంత్రి

