ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు
నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 11 సంవత్సరాలుగా అంబేడ్కర్ కలలను సాకారం చేసేలా పాలన అందిస్తున్నామని బిజెపి తెలంగాణ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. సామాజిక న్యాయం కోసం మనమంతా నిరంతరం అంకితభావంతో పనిచేయాలన్నారు. ప్రజలందరికీ గొప్ప రాజ్యాంగాన్ని ఇచ్చి, పౌరులందరికీ సమాన హక్కులను కల్పించి, కోట్లాది హృదయాల్లో అంబేడ్కర్ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారన్నారు. ఏప్రిల్ 14న భారతరత్న డా బీ.ఆర్. అంబేడ్కర్ జయంతి సందర్భంగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో ఆయన అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులార్పించారు. అనంతరం బిజెపి రాష్ట్ర కార్యాలయం నుంచి ట్యాంక్ బాండ్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహం వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొని స్వయంగా బైక్ నడిపారు. ట్యాంక్ బండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘‘నేటి ప్రజాస్వామ్య వ్యవస్థలో మనకు లభించిన హక్కుల వెనుక అంబేడ్కర్ మేథస్సు, త్యాగం, దూరదృష్టి ఉంది. ప్రజాస్వామ్య ఫలాలను అనుభవిస్తున్నామంటే అంబేడ్కర్ వల్లే. నిత్యం ఆయనను స్మరించుకోవాలి. బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రసాదించిన రాజ్యాంగాన్ని కాలరాసి కాంగ్రెస్ ఎమర్జెన్సీ (అత్యవసర పరిస్థితి)ని విధించి, స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను హరించింది. లక్షలాది ప్రజాస్వామ్య ప్రేమికులను, ఉద్యమకారులను, పత్రికా విలేకరులను, రాజకీయ నాయకులను జైలులో పెట్టింది. రాజ్యాంగ స్ఫూర్తితో దేశ ప్రజలందరూ రాజ్యాంగాన్ని పునరుద్ధరించుకునేలా జనతా పార్టీ రూపంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఓడించారు.
75 సంవత్సరాల భారత రాజ్యాంగం కాంగ్రెస్, నెహ్రూ కుటుంబ పాలనలో అనేక రకాల ఒడిదుడుకులు ఎదుర్కొంది. రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి, తూట్లు పొడవాలని కుట్ర చేసిన కాంగ్రెస్ తీరుపై అందరూ చర్చించాల్సిన అవసరం ఉంది. బాబాసాహెబ్ అంబేడ్కర్‌ను కాంగ్రెస్ అడుగడుగునా అవమానపర్చింది. ఆనాడు న్యాయశాఖ మంత్రిగా ఉన్న అంబేడ్కర్‌ను రాజీనామా చేసేలా అనేక రకాలుగా అవమానించింది. పార్లమెంటు ఎన్నికల్లో అంబేడ్కర్‌ను ఓడించిన నీచమైన మనస్తత్వం కాంగ్రెస్ పార్టీది. దేశానికి విశేష సేవలందించిన ప్రముఖులు మరణించినప్పుడు వారి అంత్యక్రియలు దిల్లీలో నిర్వహించే సంప్రదాయం ఉంది. అయితే, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ మరణించినప్పుడు ఆ గౌరవం కల్పించకుండా, ఆయన పార్థివదేహాన్ని దిల్లీ నుంచి ముంబైకి పంపించారు. ఇది కాంగ్రెస్ అంబేడ్కర్‌పై చూపిన నిర్లక్ష్యాన్ని, అవమాన దృక్పథాన్ని సూచిస్తుంది.
కాంగ్రెస్ పార్టీకి బాబాసాహెబ్ అంబేడ్కర్ అంటే కోపం కాబట్టే పార్లమెంటులో ఆయన చిత్రపటాన్ని పెట్టలేదు. ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాజ్ పేయి నేతృత్వంలో పార్లమెంటు సెంట్రల్ హాల్లో అంబేడ్కర్ చిత్రపటాన్ని ఆవిష్కరించారు. అంబేడ్కర్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నించి, ఆయన చిత్రపటాన్ని పార్లమెంటులో పెట్టకపోవడం కాంగ్రెస్ తీరుని స్పష్టం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి రిజర్వేషన్ల పట్ల ఎప్పటినుంచో విముఖతే. నాటి ప్రధాని నెహ్రూ స్వయంగా కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాసి, రిజర్వేషన్లను అమలు చేయవద్దని సూచించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అంబేడ్కర్ కలలు నెరవేర్చేలా గత 11 సంవత్సరాలుగా దేశంలో బిజెపి ప్రభుత్వం పని చేస్తోంది. అంబేడ్కర్ స్ఫూర్తిని గ్రామీణ స్థాయికి తీసుకెళ్లేలా బిజెపి కృషి చేస్తోంది. సమానత్వం, సామాజిక న్యాయం కోసం అంకితభావంతో పని చేయడమే బిజెపి ధ్యేయం.’’ అని అన్నారు.

