రాజ్యాంగ హత్యా దినానికి 50 ఏళ్లు
1966లో అప్పటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి అనుమానాస్పద మృతి అనంతరం ఇందిరా గాంధీ ప్రధానిగా నియమితులయ్యారు. కాంగ్రెస్ పార్టీని తన గుప్పెట పెట్టుకునేందుకు, సీనియర్ నాయకులు నిజలింగప్ప, మొరార్జీ దేశాయ్, నీలం సంజీవ రెడ్డితో కలిసి పని చేయడం ఇష్టం లేని ఇందిరా గాంధీ 1968 రాష్ట్రపతి ఎన్నికల సమయంలో పార్టీ అభ్యర్థి నీలం సంజీవ రెడ్డికి పోటీగా వి.వి.గిరిని స్వతంత్ర్య అభ్యర్థిగా నిలబెట్టారు. అంతరాత్మ ప్రబోధం పేరుతో గెలిపించుకొని, కాంగ్రెస్ పార్టీ మొదటి చీలికకు కారణమైంది. లోక్ సభ లో 80 శాతం పైగా సభ్యులను తన వర్గంలో కలుపుకొని, ముస్లిం లీగ్, కమ్యూనిస్ట్ పార్టీల సహకారంతో మెజారిటీ లేనప్పటికీ ఇందిరా గాంధీ ప్రభుత్వాన్ని నడిపించారు. సొంత మెజారిటీ కోసం లోక్ సభ రద్దుకు సిఫార్సు చేసి, అత్యంత ఆకర్షణీయమైన గరీబీ హఠావో నినాదంతో 1971 ఎన్నికల్లో అఖండ మెజారిటీ సంపాదించుకొని కాంగ్రెస్ పార్టీని తన జేబు సంస్థగా మార్చుకుంది. 1971 పాకిస్తాన్ యుద్ధంతో తన ఇమేజ్ పెంచుకొని, ఇందిరే ఇండియా, భారత సామ్రాజ్ఞిగా ప్రచారం చేయించుకొంది. రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా ఎమ్మెల్యేలు ఎన్నుకోకుండా తనే నియమించే స్థితికి చేరుకుంది. ఇందిరా గాంధీ నియంతృత్వ పరిపాలనకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు, ప్రముఖ సోషలిస్ట్ నాయకుడు జయప్రకాశ్ నారాయణ్ గుజరాత్, బీహార్ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఛాత్ర సంఘర్ష సమితి, లోక్ సంఘర్ష సమితి ద్వారా ఉద్యమాలు నడిపారు.
12 జూన్ 1975న అలహాబాద్ హైకోర్ట్ నాటి ప్రధాని ఇందిరా గాంధీ ఎన్నిక చెల్లదని ఇచ్చిన చారిత్రాత్మక తీర్పు ఆమెకు పెద్ద షాక్ ఇచ్చింది. పదవీగండం నుంచి బయటపడేందుకు, అధికారంపై తన పట్టు పెంచుకునేందుకు, క్యాబినెట్ నిర్ణయం కాకపోయినప్పటికీ, కేవలం అప్పటి ప్రధాని రికమండేషన్ తో నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ మహ్మద్ 1975 జూన్ 25 అర్ధరాత్రి దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఈ వార్త, దాని మీద విశ్లేషణలు పత్రికల్లో రాకుండా ఉండేందుకు ప్రింటింగ్ జరగకుండా విద్యుత్ సరఫరా కూడా నిలిపేశారు. ఆల్ ఇండియా రేడియో ద్వారా మాత్రమే ఈ సమాచారం ప్రజలకు తెలియజేసే విధంగా వ్యవహరించారు. పత్రికా స్వేచ్ఛను నిషేధించారు. పౌరుల ప్రాథమిక హక్కులపై ఆంక్షలు విధించారు. ప్రతిపక్ష నాయకులైన మొరార్జీ దేశాయ్, అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ, జార్జ్ ఫెర్నాండెజ్, ములాయం సింగ్ యాదవ్, చంద్రశేఖర్, లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ్ తో సహా వందలాది మందిని జైళ్లల్లో నిర్బంధించారు.
డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అటల్ బిహారీ వాజ్పేయి, లాల్ కృష్ణ అద్వానీ వంటి నాయకుల కృషి వల్ల దేశభక్త జనసంఘ్ కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగడాన్ని జీర్ణించుకోలేని ఇందిరా గాంధీ ఈ ఎమర్జెన్సీ కాలంలో ఆరెస్సెస్ పై నిషేధం విధించారు. సంఘ పెద్దలతో పాటు, జనసంఘ్, ఏబీవీపీ, వీహెచ్పీ వంటి సంస్థల నాయకులను కూడా జైళ్లల్లో వేసి ఎన్నో దారుణాలకు పాల్పడ్డారు. పీఠికతో సహా ఇష్టారీతిన రాజ్యాంగాన్ని సవరించి ప్రజాస్వామ్య హక్కులను కాలరాశారు. లోక్ సభ పదవీ కాలాన్ని 5 నుంచి 6 సంవత్సరాలకు పెంచుకున్నారు. ప్రముఖ సినీ నటి, సామాజిక కార్యకర్త స్నేహలతా రెడ్డి జైలులో చిత్రహింసలకు గురవడం, చివరకు చనిపోవడం ఎమర్జెన్సీ దురాగతాలకు ఓ మచ్చుతునక.
తన గెలుపుపై నమ్మకం కుదిరి, 6 సంవత్సరాల పదవీ కాలం కూడా పూర్తి కావొస్తున్న నేపథ్యంలో ఇందిరా గాందీ 1977 జనవరిలో లోక్ సభ ఎన్నికలను ప్రకటించారు. దేశ ప్రజాస్వామ్యానికే పెను ప్రమాదం వచ్చిన తరుణంలో లోకనాయక్ జయప్రకాశ్ నారాయణ్ పిలుపుతో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన జనసంఘ్, లోక్ దళ్, ఓల్డ్ కాంగ్రెస్, సోషలిస్టు పార్టీలు ఏకమై జనతా పార్టీ ఆవిర్భవించింది. రైతు నాగలి గుర్తుతో పోటీ చేసిన ఈ నాలుగు పార్టీలతో సహా జగ్జీవన్ రాం నేతృత్వంలోని కాంగ్రెస్ ఫర్ డెమొక్రసీ 1977 చారిత్రాత్మక ఎన్నికల్లో 300 స్థానాలు గెలుచుకున్నాయి. 2 దశాబ్దాలు స్వతంత్ర్య భారతదేశాన్ని నిరాటంకంగా పరిపాలించిన కాంగ్రెస్ 154 స్థానాలకే పరిమితమైంది. ఏకంగా ప్రధాని ఇందిరా గాంధీ, ఆమె తనయుడు సంజయ్ గాంధీలు కూడా ఓడిపోయారు. జనతా పార్టీ విజయంతో 1978 మార్చ్ 21న చీకటి పాలనకు ముగింపు పలుకుతూ ఎమర్జెన్సీని ఎత్తేశారు.
42వ రాజ్యాంగ సవరణకు మార్పులు తెస్తూ ప్రజాస్వామ్యం బలపడేలా 44వ సవరణ తీసుకొచ్చిన జనతా ప్రభుత్వం లోక్ సభ పదవీ కాలాన్ని మళ్లీ 5 ఏళ్లకు సవరించింది. షా కమిషన్ ద్వారా ఇందిరా గాంధీ అవినీతి, అక్రమాలపై జరిగిన విచారణలో ఇందిరా గాంధీ జైలుకు వెళ్లారు. ఇందిరా గాంధీ నియంతృత్వం వల్ల ఓడిపోయామని కాంగ్రెస్ అధ్యక్షుడు కాసు బ్రహ్మానంద రెడ్డి, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు వై.బి. చవాన్ తీర్మానించి, పార్టీ నుంచి ఆమెను బహిష్కరించారు. అప్పుడామె ఇందిరా కాంగ్రెస్ పేరుతో తన సొంత కుంపటి పెట్టుకుంది. నాయకుల మధ్య ఐక్యమత్య లోపం, కొద్దిమంది పదవీ కాంక్ష, ఇందిరా గాంధీ కుట్రలు.. అద్భుతంగా కొనసాగుతున్న జనతా ప్రభుత్వానికి అడ్డంకులు కలిగించాయి.
చరణ్ సింగ్ కు ప్రధాని పదవిని ఎరగా వేసి, మద్దతిస్తానని చెప్పి ప్రమాణ స్వీకారం చేయించి, ఓటింగ్ సమయంలో ఇవ్వక, ఇందిరా గాంధీ మళ్లీ ఎన్నికలు వచ్చేలా కుట్ర పన్నింది. జైలుకు వెళ్లిన సానుభూతి, బూటకపు హామీలు, సుస్థిర పాలన నినాదంతో ఇందిరా గాంధీ తిరుగులేని మెజారిటీతో మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఈ ఓటమి తర్వాత జనతా పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ సహా ఒక వర్గం ద్వంద్వ సభ్యత్వం పేరుతో జనసంఘ్ నాయకులు భారతీయ జనతా పార్టీ పెట్టుకునేలా తప్పనిసరి పరిస్థితులు సృష్టించింది. అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో ఏప్రిల్ 6, 1983లో బిజెపి అవతరించి, కాలక్రమంలో పెనుమార్పులు జరిగి, తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది.
దేశ స్వాతంత్ర్య సమయంలో మన భూభాగం నుంచి విడిపోయి రెండు ముక్కలైన బాంగ్లాదేశ్, పాకిస్తాన్ లో ప్రజాస్వామ్య ప్రక్రియ నిరంతరం పని చేయలేదు. మిలిటరీ పెత్తనం ఎంతో కాలం కొనసాగింది. కానీ, మన దేశ ప్రజాస్వామ్యానికి ఎమర్జెన్సీ ఒక మాయని మచ్చగా మిగిలిపోయింది. నాటి ఎమర్జెన్సీ దురాగతాలపై అవగాహన లేని నేటి తరానికి మిగిలి ఉన్న కొద్ది మంది పెద్దలు తమ జ్ఞాపకాలు, అనుభవాలతో ఆ దారుణాలు తెలియజెప్పాల్సిన ఆవశ్యకత ఉంది. దేశంలో కాంగ్రెస్ ఉన్నంత కాలం “ఎమర్జెన్సీ భూతం” ఆ పార్టీ వెన్నంటే ఉంటుంది.

