పసుపు వ్యాపారానికి నిజామాబాద్‌ను అంతర్జాతీయ కేంద్రంగా మార్చడమే మా లక్ష్యం
నిజామాబాద్‌ను పసుపు వ్యాపారానికి అంతర్జాతీయ కేంద్రంగా మార్చాలన్నది మా లక్ష్యమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. ఎఫ్‌పీఓలకు బలం, రైతులకు మార్కెటింగ్ మద్దతు, బ్రాండింగ్, ఎగుమతి వంటి అంశాలన్నింటికీ మద్దతుగా త్వరలో రెండు కొత్త సహకార సంస్థలు- ‘భారత్ ఎక్స్‌పోర్ట్ కోఆపరేటివ్ లిమిటెడ్’, ‘భారత్ ఆర్గానిక్’ శాఖలను నిజామాబాద్‌లో ప్రారంభిస్తామన్నారు. భారత ప్రభుత్వం 2026 మార్చ్ 31 నాటికి దేశంలో నక్సలిజాన్ని అరికట్టాలన్న కృతనిశ్చయంతో ఉందన్నారు. తెలంగాణలో మావోయిస్టులకు ఆశ్రయం కల్పించడానికి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నిస్తున్నారనీ, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రాన్ని మావోయిస్టులకు అడ్డాగా మార్చొద్దని సీఎం రేవంత్ రెడ్డికి హితువు పలికారు. తెలంగాణను మరోసారి నక్సలిజానికి కేంద్రంగా మార్చే ప్రయత్నాలు చేస్తున్న వారిని ప్రజలు అడ్డుకోవాలని సూచించారు. జూన్ 29న నిజామాబాద్‌లో పసుపు బోర్డు కార్యాలయాన్ని అమిత్ షా ప్రారంభించారు. అనంతరం స్థానిక పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో జరిగిన కిసాన్ మహాసమ్మేళనం సభలో ప్రసంగించారు.
జాతీయ పసుపు బోర్డు ఏర్పాటైన నేపథ్యంలో అమిత్ షా నిజామాబాద్ రైతులకు అభినందనలు తెలిపారు. నాలుగు దశాబ్దాలుగా రైతులు చేస్తున్న డిమాండ్ మోదీ ప్రభుత్వంలో నెరవేరిందన్నారు. పసుపు బోర్డు కేంద్రాన్ని నిజామాబాద్‌లో ఏర్పాటు చేయడం ద్వారా మోదీ రైతులకు భరోసాగా నిలిచారన్నారు. మోదీ హామీ ఇచ్చినదాన్ని ఖచ్చితంగా నెరవేర్చే నాయకుడని, అందుకే ప్రజలు ఆయనపై నమ్మకం పెట్టుకుంటారన్నారు. పసుపు ధరలు వరుసగా పడిపోతున్న సమయంలో, భవిష్యత్‌లో అలా జరగకుండా జాతీయ పసుపు బోర్డు ధరలకు స్థిరత్వాన్ని తీసుకువస్తుందన్నారు. పసుపులో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయని.. మార్కెటింగ్‌కు, ఎగుమతులకు ఉపయోగపడుతుందన్నారు. పసుపు ఉత్పత్తి చేస్తున్న రైతులకు ప్యాకేజింగ్, మార్కెటింగ్, ఎగుమతి తదితర వ్యవస్థలను త్వరలో సిద్ధం చేస్తామన్నారు. సేంద్రియ పసుపును అమెరికా, యూరోప్, కెనడా, యూకే, వియత్నాం, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు ఎగుమతి చేయాలని అమిత్ షా ఆకాంక్షించారు.
మోదీ 2014లో దేశ ప్రధాని అయిన తర్వాత దేశ భద్రతా వ్యవస్థను బలోపేతం చేశారన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో పాక్ ఉగ్రవాదులు దాడులు చేసి వెళ్లిపోయేవారని… మోదీ ప్రభుత్వం ఉరి దాడి తర్వాత సర్జికల్ స్ట్రైక్స్, పుల్వామా తరువాత ఎయిర్ స్ట్రైక్స్ వంటి చర్యలు చేపట్టిందన్నారు. దేశ భద్రత కోసం నరేంద్ర మోదీ రాజీ పడరని అన్నారు. నక్సలిజం వల్ల దేశంలో నాలుగు దశాబ్దాలుగా వేలాది మంది ఆదివాసీలు, పోలీసులు, జవాన్లు ప్రాణాలు కోల్పోయారన్నారు. ఆయుధాలు చేతబట్టిన వారితో మోదీ ప్రభుత్వం ఎటువంటి చర్చలూ జరపదన్నారు. ఆయుధాలు వదిలి లొంగిపోయిన మావోయిస్టులకు జనజీవన స్రవంతిలో కలిసే అవకాశం ఇస్తుందని అన్నారు. కానీ ఆయుధాలు పట్టుకున్న మావోయిస్టులను ఉపేక్షించదని స్పష్టం చేశారు. తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ స్థాయిలో అవినీతికి పాల్పడిందని విమర్శించారు. ధరణి, కాళేశ్వరం, టీఎస్‌పీఎస్సీ, సింగరేణి నియామకాలు, వివిధ పరీక్షలు అన్నింటిలోనూ అవినీతి, అక్రమాలు జరిగాయన్నారు. వీటన్నింటిపై కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క కేసును తేల్చలేదని అమిత్ షా విమర్శించారు.
కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ.. ‘‘నిజామాబాద్ రైతుల అనేక సంవత్సరాల పోరాటానికి ఫలితం లభించింది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో పసుపు సాగు జరుగుతున్నప్పటికీ, జాతీయ పసుపు బోర్డును నిజామాబాద్‌లో ఏర్పాటు చేయడం ఒక గొప్ప పరిణామం. దేశంలో విద్యుత్ కోతలు లేకుండా నూతన భారతదేశాన్ని మోదీ నిర్మిస్తున్నారు. రైతులు అవసరమైన కరెంటును మోదీ ప్రభుత్వం సమర్థవంతంగా అందిస్తోంది. గతంలో ఎరువుల కోసం రైతులు దుకాణాల వద్ద లైన్లలో నిలబడాల్సివచ్చేది. నేడు రైతులకు అవసరమైనంత ఎరువును మోదీ ప్రభుత్వం రైతులకు అందిస్తోంది. మోదీ ప్రభుత్వం రూ.3500కు పైగా సబ్సీడీ ఇవ్వడం వల్లే రైతులకు కేవలం రూ.267కే యూరియా లభిస్తోంది. రామగుండంలో ఎరువుల పరిశ్రమను ప్రారంభించిన ఘనత మోదీదే. యూపీఏ ప్రభుత్వం చేయలేకపోయిన పనిని మోదీ ప్రభుత్వం చేసి చూపించింది. నిజామాబాద్ రైతులకు పసుపు బోర్డు ఒక గొప్ప కానుక. ‘మోదీ ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసింది?’ అని ప్రశ్నించే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూపీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను గమనించాలి.’’ అని అన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రసంగిస్తూ..‘‘తెలంగాణ ప్రజలారా…. మీరు అందరికీ ఇచ్చారు అవకాశం. ఈసారి బిజెపికి ఇవ్వండి అధికారం’’ అంటూ రాష్ట్ర ప్రజలను అభ్యర్థించారు. ‘‘నిజామాబాద్ జిల్లా వాళ్లు గొప్పోళ్లు. మీరు కొట్లాడి సాధించుకున్నరు. మీరు చేసిన ఉద్యమాలు మామూలు కాదు. అరవింద్‌ను అంతా పసుపు అరవింద్ అంటున్నారు. రైతును రాజును చేయాలనేది గత నినాదం.. కానీ రైతును రారాజు, మహారాజు చేయాలనేది మోదీ సర్కార్ నినాదం.’’ అని బండి సంజయ్ కుమార్ అన్నారు.
ఎంపీ దర్మపురి అర్వింద్ మాట్లాడుతూ.. పసుపు బోర్డును కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. పసుపు మసాలా దినుసు మాత్రమే కాదు.. మన సంస్కృతి, సంప్రదాయా లకు ప్రతిబింబం అని అన్నారు. ఇందూరులో జాతీయ పసుపు బోర్డు నెలకొల్పడం ఓ చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు. ఆపరేషన్ సిందూర్ అనగానే అమిత్ షా గుర్తొస్తారని, ఉగ్రవాదంపై యువత పోరాడేలా ఆయన ప్రేరణగా నిలిచారని కొనియాడారు. నిజామాబాద్‌లోని కంఠేశ్వర్ బైపాస్ రోడ్డులో స్థానిక ఎంపీ ధర్మపురి అర్వింద్ తండ్రి, సీనియర్ నాయకుడు ధర్మపురి శ్రీనివాస్ విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించారు.

