Taking Charge

పండుగ వాతావరణంలో బాధ్యతల స్వీకరణ

taking chargeపండుగ వాతావరణంలో ఎన్. రాంచందర్ రావు జూలై 5న బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా లాంచనంగా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా పాతబస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి బిజెపి కార్యకర్తలు, నాయకులు పెద్దఎత్తున వెంటరాగా ర్యాలీగా నాంపల్లి గన్ పార్క్‌లోని తెలంగాణ అమరవీరుల స్థూపానికి చేరుకున్నారు. అమరవీరులను నివాళులు అర్పించి ర్యాలీగా బిజెపి రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు. అధ్యక్షు బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి రాష్ట్ర కార్యాలయానికి విచ్చేసిన రాంచందర్ రావుకు బిజెపి నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. పెద్దఎత్తున బానాసంచా కాల్చారు. మిఠాయిలు పంచుకున్నారు. అనంతరం మొదటి అంతస్తులోని అధ్యక్షుడి కార్యాలయంలో అసీనులయ్యారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె. అరుణ, సీనియర్ నాయకులు పి. మురళీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎన్. రాంచందర్ రావు మాట్లడుతూ పార్టీ అధిష్టానం నమ్మకంతో రాష్ట్ర అధ్యక్ష బాధ్యతను అప్పజెప్పడం నా కృషికి గుర్తింపుగా భావిస్తున్నానని అన్నారు. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పిస్తూ ‘‘గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రజలను మభ్యపెట్టే హామీలు ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత, డబ్బుల్లేవు… ప్రభుత్వం భిక్షాటన స్థితిలో ఉంది… ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేకపోతున్నాం అని ఏడుస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీల్లో ఏవీ అమలు చేయలేదు. బిజెపి పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని తెలుసుకున్న కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది. “తెలంగాణలో యూరియా లేదంటూ” దుష్ప్రచారం చేస్తున్నారు. యూరియా కొరత యూపీఏ ప్రభుత్వంలోనే ఉండేది. అప్పుడు యూరియా కోసం రైతులు షాపుల ముందు క్యూలలో నిలబడాల్సి వచ్చేది. యూరియా దొరక్క రైతులు ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనలు జరిగాయి. మోదీ ప్రభుత్వం తెలంగాణకు అవసరమైన మేరకు 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సరఫరా చేసింది. అదనంగా 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను మంజూరు చేసింది. కేంద్రం పంపిన యూరియాను సకాలంలో సరఫరా చేయలేని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇబ్బందులు కలిగిస్తోంది. ఆ యూరియా ఏమైందో చెప్పాలి? యూరియా సరఫరా విషయంలో బిజెపి చర్చకు సిద్ధంగా ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమా..?

Bhagyalaxmiకాంగ్రెస్ అవినీతి పాలనతో విసిగిపోయిన ప్రజలు కాంగ్రెస్ ముక్త్ భారత్ కోరుకుంటూ వరుసగా మూడు సార్లు ఆ పార్టీని ఓడించారు. కాంగ్రెస్ మత రాజకీయాల కోసమే రాజ్యాంగంలో “సెక్యులరిజం”, “సోషలిజం” పదాలను చేర్చింది. దేశ చరిత్రలో ఎమర్జెన్సీ విధించి ప్రజల హక్కులను కాలరాసిన పార్టీ కాంగ్రెస్. AICC అంటే ఆల్ ఇండియా చీటింగ్ కమిటీ అన్నట్టుగా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేసింది. ఆ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే ఆలోచన లేదు. 42 శాతం రిజర్వేషన్ల విషయంలో తీసుకొచ్చిన బీసీ బిల్లుకు బిజెపి మద్దతు ఇచ్చింది. దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. అధికారంలోకి వచ్చిన కొద్ది కాలంలోనే కాంగ్రెస్ ప్రజల మధ్య విపరీతమైన వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. ఇంత తక్కువ కాలంలో ఇంతటి వ్యతిరేకత వచ్చిన పార్టీ మరొకటి లేదు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రజలు గట్టి బుద్ధిచెబుతారు. కాంగ్రెస్ నిర్వహించిన “సామాజిక న్యాయ సమర భేరి” సభలో మోదీ, బిజెపి, ఆర్ఎస్ఎస్‌ను విమర్శించడమే తప్ప సామాజికంగా వెనుకబడిన వర్గాల గురించి కనీసం మాట్లాడలేదు. దేశాన్ని 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ప్రజల గురించి ఒక్కసారి కూడా ఆలోచించలేదు. కాంగ్రెస్ నాయకులు టంగ్ స్లిప్ అయి వచ్చే ఎన్నికల్లో 100 ఎమ్మెల్యేలు, 15 ఎంపీ సీట్లు గెలుస్తామని చెప్పారు. 100 మంది ఎమ్మెల్యేలు, 15 ఎంపీ సీట్లు బిజెపి గెలుస్తుందని చెప్పబోయి పొరపాటుగా కాంగ్రెస్ గెలుస్తుందని అన్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. బిజెపి మూడు ఎమ్మెల్సీ సీట్లు గెలుచుకుంది.

Gun Parkగ్రామీణ ప్రాంతాల్లో బిజెపికి విశేష ఆదరణ లభిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 ఎమ్మెల్యేలు, లోక్‌సభలో 8 ఎంపీ స్థానాల్లో గెలుపుతో పాటు, తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 సీట్లలో విజయం సాధించాం. ఇవి బిజెపి బలపడుతున్న సంకేతాలు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటు శాతం స్థిరంగా పెరుగుతుండటం ప్రజల విశ్వాసానికి నిదర్శనం. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ల నుంచి జడ్పీటీసీల వరకు అన్ని సీట్లలో బిజెపి పోటీ చేస్తుంది. అత్యధిక స్థానాల్లో గెలుస్తుంది. హర్యానా, త్రిపుర వంటి రాష్ట్రాల్లో బిజెపిని గెలిపించినట్లుగా ప్రజలు తెలంగాణలోనూ గెలిపిస్తారు. తెలంగాణను వికసిత రాష్ట్రంగా మార్చేందుకు డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అవసరం. అందుకు కార్యకర్తలంతా కృషి చేయాలి.’’ అని అన్నారు.