బీసీలకు 42% రిజర్వేషన్ల విషయంలో గందరగోళం
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోగా బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలలో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పుడు సంవత్సరంన్నర అవుతున్నా ఈ విషయంలో దిక్కుతోచక గందరగోళంలో చిక్కుకున్నట్లు స్పష్టం అవుతుంది. 16 నెలలకు అసెంబ్లీలో రెండు బిల్లులను ఆమోదింపచేసి బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చామని సంబరాలు చేసుకున్నారు. తాజాగా ఓ ఆర్డినెన్స్ గవర్నర్ ఆమోదం కోసం పంపి కూర్చున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలంటే, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కాంగ్రెస్ నాయకులు చెప్పడాన్ని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు ప్రస్తావిస్తూ ఈ విషయమై అసలు న్యాయసలహాలు తీసుకున్నారా? అని ప్రశ్నించేసరికి అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. తాము బిల్లులు తెస్తే, ఎందుకైనా మంచిదని ఆర్డినెన్స్ కూడా తీసుకొస్తే అడ్డుకోవడం ద్వారా బీసీలకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తున్నారంటూ బిజెపిపై, కేంద్ర ప్రభుత్వంపై ఎదురుదాడికి ప్రయత్నం చేస్తున్నారు. కేవలం బీసీలలో భావోద్వేగాలు రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ పబ్బం గడుపుకొనే ప్రయత్నాలు తప్ప అసలు కాంగ్రెస్ నేతలలో చిత్తశుద్ధి కనిపించడం లేదు.
స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు మొదలుకొని కామారెడ్డి బీసీ డిక్లరేషన్ దాకా అడుగడుగునా దగా చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసం అలవికాని హామీలిచ్చి నెరవేర్చడంలో అలసత్వం చూపుతున్నారు. బీసీ డిక్లరేషన్ పేరుతో కాంగ్రెస్ ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయకుండా బీసీలకు తీవ్రమైన అన్యాయం చేస్తున్నది. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్న అంశంలో కాంగ్రెస్ మొదటి నుంచి చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నది. తాము చేపట్టిన ప్రతి ప్రక్రియలో ఉన్న లోపాలు, లొసుగులు ముందే తెలిసినా, బీసీలను మోసం చేయాలన్న దురాలోచనతో ఇప్పుడు కోర్టుల పేరుతో, చట్టపరమైన నిబంధనలు చూపిస్తూ తప్పించుకోవడానికి కాంగ్రెస్ రంగం సిద్ధం చేసుకున్నట్లు కనిపిస్తోంది. బీసీలకు 42 శాతం కోటా హామీని తప్పించుకొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకో రకంగా డ్రామాలు ఆడుతున్నట్లు స్పష్టం అవుతుంది. బీసీల జనాభాను ఉద్దేశపూర్వకంగానే తగ్గించి చూపించడంతో పాటు, సుప్రీంకోర్టు నిర్దేశించిన మేరకు 50 శాతం లోపు రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసినా మాయమాటలు చెప్తూ బీసీలను వంచించే ప్రయత్నం చేస్తున్నారు.
9వ షెడ్యూల్‌లో చేర్చినా, ఆ చట్టం న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని తెలిసే ప్రభుత్వం ప్రజలను వంచించే ప్రయత్నం చేస్తున్నట్లు అనుమానించాల్సి వస్తున్నది. జయలలిత ప్రభుత్వం తమిళనాడులో చేసిన రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చినా, అది ఇప్పటికీ కోర్టులో పెండింగ్‌లో ఉండడంతో ఇంకా తుది నిర్ణయం రాలేదని తెలియదా? కాబట్టి 42% బీసీ రిజర్వేషన్ కోసం 9వ షెడ్యూల్‌ను చూపిస్తూ మళ్లీ మళ్లీ ప్రజలను మభ్యపెట్టడం సబబుకాదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు హితవు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తుంది. మధ్యప్రదేశ్‌లో 50% పైగా రిజర్వేషన్లు బిజెపి ప్రభుత్వం అమలు చేసింది. అక్కడకు వెళ్లి వారేవిధంగా చేస్తున్నారో అధ్యయనం చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసినట్లు కనిపించడం లేదు.
హైకోర్టు చివాట్లు పెట్టేంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్‌పై ఆలోచించక పోవడం గమనార్హం. స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపనకే కులగణన ప్రక్రియను తెరపైకి తెచ్చారు. అసమగ్రంగా నిర్వహించడమే కాకుండా బలహీనవర్గాల జనాభాను తగ్గించి చూపించారు. తద్వారా పథకాలను ఎగ్గొట్టేందుకు ఎత్తుగడలు వేయడం ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కులగణన మరింత శాస్త్రీయంగా జరగాలని చెప్పే కాంగ్రెస్ అత్యంత లోపభూయిష్టంగా నిర్వహించిన కుల గణన సర్వేను జాతీయ రోల్ మోడల్‌గా చెప్పడం ద్వారా తెలంగాణ ప్రజలను మోసం చేయడమే కాకుండా, జాతీయ వేదికలపై అబద్ధాలు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉంది.

