Young Girls

యుక్తవయసు బాలికలను సాధికారీకరించే ‘నవ్య’

వృత్తి శిక్షణ ద్వారా యుక్తవయసు బాలికల ఆకాంక్షలు నెరవేర్చే కార్యక్రమం నవ్యను 2025, జూన్ 24న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. 16 నుండి 18 సంవత్సరాల వయస్సు గల బాలికలకు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన 4.0 (PMKVY 4.0) కింద నైపుణ్య శిక్షణ ఇవ్వడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ శిక్షణలో డిజిటల్ మార్కెటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి కొత్త, సంప్రదాయేతర రంగాల్లో ఉద్యోగాల కోసం నైపుణ్యాలు నేర్పుతారు. దీనికి అదనంగా 7 గంటల శిక్షణ మాడ్యూల్ ద్వారా వ్యక్తిగత నైపుణ్యాలైన పరిశుభ్రత, సమస్యల పరిష్కారం, సంభాషణ నైపుణ్యాలు, పని ప్రదేశాల్లో భద్రత, బాలలపై లైంగిక నేరాల నిరోధక చట్టాల గురించి అవగాహన, ఆర్థిక అక్షరాస్యత (బడ్జెట్, డబ్బు నిర్వహణ) వంటి అంశాలపై ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమం 19 రాష్ట్రాల్లోని 27 ఆకాంక్షాత్మక జిల్లాల్లో మొత్తం 3,850 మంది బాలికలకు వర్తిస్తుంది. ప్రస్తుతం ఇది 9 రాష్ట్రాల్లోని 9 జిల్లాలలో ప్రయోగాత్మకంగా అమలవుతోంది. కేంద్ర ప్రభుత్వంలోని నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ, మహిళా, శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా అమలు చేస్తున్నాయి. 

కార్యక్రమం లక్ష్యాలు

  • బాలికలకు కొత్త రంగాల్లో ఉద్యోగాల కోసం నైపుణ్య శిక్షణ ఇవ్వడం.
  • వ్యక్తిగత పరిశుభ్రత మొదలుకుని కమ్యూనికేషన్, పని ప్రదేశంలో భద్రత, ఆర్థిక అక్షరాస్యత వరకు అవసరమైన నైపుణ్యాలతో వారిని సాధికారీకరించడం
  • వారిలో ఆత్మవిశ్వాసం, ఉద్యోగ సామర్థ్యం, వ్యవస్థాపక స్ఫూర్తిని పెంచడం.

 ఈ కార్యక్రమాన్ని మొదట ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్రలో ప్రారంభించారు. 16-18 సంవత్సరాల వయస్సు ఉండి, కనీసం పదో తరగతి ఉత్తీర్ణులైన బాలికలు దీనికి అర్హులు. ముఖ్యంగా వెనుకబడిన, గిరిజన ప్రాంతాలకు చెందిన 3,850 మంది బాలికలకు ఈ శిక్షణ ఇస్తారు.

పథకాలతో అనుసంధానం 

నవ్య కార్యక్రమం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY), పీఎం విశ్వకర్మ వంటి ముఖ్య పథకాల వనరులను వాడుకుంటూ, మార్కెట్‌లో డిమాండ్ ఉన్న కొత్త ఉద్యోగాలకు శిక్షణ ఇస్తుంది. ఈ ఉద్యోగాలలో డిజిటల్ మార్కెటింగ్, సైబర్ సెక్యూరిటీ, కృత్రిమ మేధ (AI)-ఆధారిత సేవలు, గ్రాఫిక్ డిజైన్, డ్రోన్ అసెంబ్లింగ్, ప్రొఫెషనల్ మేకప్ ఆర్టిస్ట్, సీసీటీవీ, సోలార్ పీవీల ఏర్పాటు వంటివి ఉన్నాయి. శిక్షణతో పాటు ఆరోగ్యం, పోషకాహారం, ఆర్థిక అక్షరాస్యత, జీవన నైపుణ్యాలు వంటి మాడ్యూల్స్ ద్వారా బాలికలకు స్వయం ఉపాధి, ఇంటర్న్‌షిప్‌లు, అప్రెంటిస్‌షిప్‌లకు అవకాశాలను కల్పించి, విద్య, జీవనోపాధి మధ్య అంతరాన్ని ఈ కార్యక్రమం తగ్గిస్తుంది.

2015 జూలై 25న ప్రారంభించిన ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన (PMKVY) యువతకు ఉచిత, స్వల్పకాలిక నైపుణ్య శిక్షణ సర్టిఫికేషన్ కోసం ఆర్థిక ప్రోత్సాహకాలు అందిస్తుంది. అలాగే 2023 సెప్టెంబర్‌లో ప్రారంభించిన పీఎం విశ్వకర్మ పథకం కుమ్మర్లు, కంసాలులు, శిల్పులు వంటి సంప్రదాయ కళాకారులకు, చేతివృత్తుల వారికి శిక్షణ, ఆధునిక పనిముట్లు, ఆర్థిక సహాయం అందిస్తుంది.

ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం 

“నవ్య కార్యక్రమం యుక్తవయస్సు బాలికలను స్వయంసమృద్ధంగా మార్చడంలో ఒక మైలురాయి అవుతుంది. వారు స్వతంత్రంగా, సాధికారత పొందిన పౌరులుగా మారడానికి అవసరమైన నైపుణ్యాలను అందించడమే మా లక్ష్యం. ఈ కార్యక్రమం వారికి గౌరవప్రదమైన, ఆత్మవిశ్వాసంతో కూడిన జీవితాన్ని అందించేందుకు సహాయపడుతుంది,” అని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ అన్నారు. నవ్య కార్యక్రమం యువతులకు సాంకేతిక నైపుణ్యాలను అందించి, పోటీ ప్రపంచంలో విజయం సాధించడానికి లేదా సొంత వ్యాపారాలు ప్రారంభించడానికి అవసరమైన ఆత్మవిశ్వాసాన్ని కల్పించి స్థైర్యాన్ని పెంపొందిస్తుంది. PMKVY 4.0 కింద 3,850 మంది బాలికలకు శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న ఈ కార్యక్రమం, ‘వికసిత్ భారత్@2047’ ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా ఉంది.

డిమాండ్-ఆధారిత వృత్తి శిక్షణ: సాంకేతికత, ఆరోగ్య సంరక్షణ, హస్తకళల వంటి సంప్రదాయ, కొత్త రంగాల్లో బాలికలకు శిక్షణ ఇవ్వడం.

సమగ్ర అభివృద్ధి: ఆరోగ్యం, పోషకాహారం, ఆర్థిక అక్షరాస్యత, జీవిత నైపుణ్యాలు, చట్టాలపై అవగాహన మాడ్యూల్స్ ద్వారా బాలికలను సాధికారీకరించడం.

ఉద్యోగ సామర్థ్యాలను పెంచడం: ఇంటర్న్‌షిప్‌లు, అప్రెంటిస్‌షిప్‌లు, ఉద్యోగ అవకాశాల ద్వారా ఉపాధి, స్వయం ఉపాధిని ప్రోత్సహించడం.

సురక్షితమైన శిక్షణా వాతావరణం: సమానత్వం, సమ్మిళితత్వానికి సంబంధించిన నైపుణ్యాన్ని బలోపేతం చేయడం, సురక్షితమైన, అండగా ఉండే శిక్షణా వాతావరణాన్ని సృష్టించడం. సైబర్ భద్రత వంటి సంప్రదాయేతర రంగాల్లో బాలికలను ప్రోత్సహించడం.

విద్య-ఉపాధిల మధ్య అంతరాన్ని తగ్గించడం: ముఖ్యంగా వెనుకబడిన, మారుమూల ప్రాంతాల్లోని బాలికలకు విద్యను సుస్థిరమైన జీవనోపాధితో అనుసంధానం చేయడం.

ప్రత్యేకంగా రూపొందించిన ఈ 7-గంటల మాడ్యూల్ నాలుగు ముఖ్యమైన అంశాలపై దృష్టి పెడుతుంది:

వ్యక్తిగత నైపుణ్యాలు: వృత్తిపరమైన ప్రవర్తన పెంపొందించేందుకు వ్యక్తిగత శుభ్రత, స్వీయ వ్యక్తీకరణ, సమస్యల నిర్వహణపై శిక్షణ.

సంభాషణ నైపుణ్యాలు: శ్రద్ధగా వినడం, సమర్థంగా సంభాషించడంపై సూచనలు.

పని ప్రదేశాల్లో భద్రత: సురక్షితమైన పని వాతావరణం కోసం పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నివారణ చట్టం, పిల్లలకు లైంగిక నేరాల నుంచి రక్షణ చట్టాల గురించి అవగాహన.

ఆర్థిక అక్షరాస్యత: డబ్బు నిర్వహణ, బడ్జెట్, ప్రాథమిక ఆర్థిక అంశాల గురించి ప్రాథమిక పరిజ్ఞానం.

ప్రస్తుతం ఈ కార్యక్రమం మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, పంజాబ్, ఉత్తర ప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ 9 రాష్ట్రాల్లోని 9 జిల్లాలలో ప్రయోగాత్మకంగా అమలవుతోంది. ఈ జిల్లాలను నీతి ఆయోగ్ ‘ఆకాంక్షాత్మక జిల్లాలు’గా గుర్తించింది. ఈ కార్యక్రమం బాలికలు ఆత్మవిశ్వాసం, నైపుణ్యం, స్వావలంబన సాధించి దేశాభివృద్ధికి చోదకులుగా మారేందుకు దోహదం చేస్తుంది.