ఓటరు జాబితాలను కలుషితం చేసిన యూపీఏ
ఎన్నికల ఓటరు జాబితాల సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమం ఇంతకుకుముందు అనేకసార్లు జరిగింది. కానీ ఇప్పుడున్నంత అవసరం గతంలో ఎప్పుడూ లేదు. గతంలో కొన్ని ‘ఇండీ’ కూటమి ప్రభుత్వాలు అక్రమ వలసదారులను నకిలీ గుర్తింపులతో ఆధార్ జాబితాలో చేర్చాయనే ఆరోపణలు ఉండడమే దీనికి కారణం. ఆపై ఆ ఆధార్ కార్డులను ఉపయోగించి వారిని ఓటరు జాబితాలోకి చేర్చారు. ఈ విధంగా అక్రమ వలసదారుల ద్వారా ఆధార్, ఓటరు జాబితాలను ఉపయోగించి భారత ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచిన ఈ కథనాన్ని ప్రజల దృష్టికి తీసుకురావాలి.
గతంలోకి వెళితే…
2002లో అప్పటి ప్రధానమంత్రి ఏబీ వాజ్‌పేయి, హోంమంత్రి ఎల్.కె. అద్వానీ జాతీయ గుర్తింపు కార్డును ప్రతిపాదించారు. పౌరులను, పౌరులు కానివారిని/నివాసితులకు ఒక గుర్తింపు పత్రాన్ని జారీచేయడం ఈ కార్యక్రమం ఉద్దేశం. 2004లో మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2009లో నందన్ నీలేకని ఛైర్మన్‌గా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఏర్పడింది. 2009 నుండి 2012 వరకు, UIDAI, దాని లక్ష్యాలు, సాంకేతికత వంటి వాటిపై ఎలాంటి బహిరంగ చర్చా జరగలేదు. 2010లో పౌరసత్వానికి ఉండవలసిన నిబంధనలను సడలించి ‘నివాసితులు’ అందరికీ ఆధార్‌ను ప్రారంభించారు. పౌరసత్వాన్ని ధృవీకరించడానికి లేదా పౌరులు కానివారిని, పౌరులను వేరు చేయడానికి ఎలాంటి ప్రయత్నం జరగలేదు. అదే సంవత్సరం యశ్వంత్ సిన్హా నేతృత్వంలోని పార్లమెంటరీ స్థాయీ సంఘం ‘నివాసితులు’ అన్న నిర్వచనంపై, అలాగే పౌరసత్వ ప్రమాణాలను సడలించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. సరైన పరిశీలన లేకుండా ప్రైవేట్ సంస్థల ద్వారా నమోదు ప్రక్రియ చేపట్టడంపైనా అభ్యంతరం తెలిపింది. ఈ అంశాన్ని పార్లమెంటులో లేదా బయట చర్చించాలని ఆ తరువాత వచ్చిన డిమాండ్లను అప్పటి యూపీఏ ప్రభుత్వం పట్టించుకోలేదు. పార్లమెంటు స్థాయీ సంఘం జాతీయ గుర్తింపు ప్రాధికార సంస్థ బిల్లు 2010ని అప్పట్లో ఉన్న రూపంలో తిరస్కరించింది. UIDAI పథకాన్ని పునఃపరిశీలించి, కొత్త చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఆధార్‌కు చట్టబద్ధమైన మద్దతు ఇవ్వాలని కూడా కోరారు. 2011లో యుఐడి పేరును ఆధార్‌గా మార్చారు.
అక్రమ వలసదారులకు ‘ఆధార్’
2010లో ప్రైవేట్ సంస్థల ద్వారా ఆధార్ నమోదు మొదలైంది. 2012 నాటికి UIDAI నమోదు 40 కోట్లను దాటేసింది. చాలా తక్కువ లేదా అసలు ధృవీకరణ లేకపోవడం వల్ల నకిలీ పత్రాలతో పెద్ద సంఖ్యలో అక్రమ వలసదారులు ఆధార్‌లో చేరినట్లు అనేక వార్తలు వచ్చాయి. కానీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం వాటిని పట్టించుకోలేదు. పి. చిదంబరం ఆధ్వర్యంలోని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, UIDAIను జాతీయ జనాభా రిజిస్టర్‌తో సమన్వయం చేయాలని ప్రయత్నించింది. కానీ 2012లో సింగ్ ప్రభుత్వం హోం మంత్రిత్వ శాఖ సూచనను తిరస్కరించి, ‘నివాసితుల’ ‘ఆధార్’ గుర్తింపు ప్రక్రియను స్వతంత్రంగా కొనసాగించడానికి పచ్చజెండా ఊపింది. 2011-2013 మధ్య ఈ సమస్యను పార్లమెంట్‌లో పదేపదే లేవనెత్తారు. పౌరులు కానివారు ఆధార్ పొందడం, దానితో ముడిపడి ఉన్న భద్రతాపరమైన సమస్యలు పెరిగాయి. 2013లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నికల కమిషన్ ఆధార్ ఐడీని ఓటు వేయడానికి అర్హతను తెలిపే రుజువుగా ప్రకటించింది. 2013లో జస్టిస్ కేఎస్ పుట్టస్వామి, మాథ్యూ థామస్, రాజీవ్ చంద్రశేఖర్ తదితరులు ఆధార్‌కి వ్యతిరేకంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. 2014లో ప్రభుత్వం మారే సమయానికి, మొత్తం ఆధార్ నమోదు 65 కోట్లు దాటింది. ఈ ప్రాజెక్ట్‌పై సుమారు 15-20 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.
ఆధార్ ప్రక్షాళనకు మోదీ ప్రభుత్వ నిర్ణయం
ఆధార్‌ను రద్దు చేయాలనే పిలుపుల మధ్య, పెట్టిన భారీ పెట్టుబడిని వృథా చేయకుండా ఆధార్‌ను ప్రక్షాళన చేయాలని నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. 2016లో ఆధార్ చట్టాన్ని ఆమోదించి, నమోదు ప్రక్రియలను కఠినతరం చేశారు. అవసరమైన పత్రాలు లేకుండా, నమోదు భాగస్వాముల పర్యవేక్షణ లేకుండా 2010, 2016 మధ్య పెద్ద సంఖ్యలో ఆధార్ నమోదులు జరిగాయని 2020లో కాగ్ నివేదికలు ధృవీకరించాయి. ‘వ్యక్తిగత గుర్తింపును ధృవీకరించేందుకు తొలి ఆధార్ జారీ కోసం సేకరించిన సమాచారం నాణ్యత సరిగా లేదు’ అని 2021 నాటి కాగ్ నివేదిక పేర్కొంది. అంతేకాకుండా “ఒక దరఖాస్తుదారు నిర్దేశిత కాలంలో భారతదేశంలో నివసించాడని నిర్ధారించడానికి UIDAI ఎటువంటి నిర్దిష్ట రుజువు/పత్రాన్ని లేదా ప్రక్రియను సూచించలేదు. దరఖాస్తుదారు నుంచి సాధారణ స్వీయ-ప్రకటన ద్వారా నివాస స్థితిని నిర్ధారిస్తున్నారు. దరఖాస్తుదారు చేసిన ధృవీకరణలను తనిఖీ చేయడానికి ఎలాంటి వ్యవస్థ లేదు. అందువల్ల, దేశంలో ఆధార్ కలిగి ఉన్న వారంతా ఆధార్ చట్టం ప్రకారం నిర్వచించిన ‘నివాసితులే’ అన్న హామీ లేదు. అన్ని ఆధార్ నంబర్‌లను వాటిని కలిగిఉన్న వారి వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన పత్రాలతో జత చేయలేదు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత కూడా, UIDAI సరిపోలని అంశాలను కచ్చితంగా గుర్తించలేకపోయింది” అని పేర్కొంది.
ఎన్నికల జాబితాలు కలుషితం
యూపీఏ ప్రభుత్వం పౌరసత్వ నిబంధనలను సడలించడం, వాటి స్థానంలో అస్పష్టమైన, నిర్వచనంలేని ‘నివాసి’ అనే పదాన్ని తీసుకురావడం ద్వారా ఎన్నికల జాబితాల సమగ్రతను, జాతీయ భద్రతను బలహీనపరిచింది. పెద్దయెత్తున అక్రమ వలసదారులు ఆధార్‌లో చేరారని స్పష్టమవుతోంది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం విధానాల కారణంగా, అక్రమ వలసదారులు, విదేశీ పౌరులు కూడా ఓటరు జాబితాల్లోకి చేరారని అర్థమవుతోంది. ఓటరు జాబితాల్లో చేరిన ఈ అక్రమ వలసదారులలో చాలామంది స్థానిక జనాభా రూపురేఖలను మార్చివేసేందుకు ఒక పథకం ప్రకారం పనిచేస్తున్నారని కూడా స్పష్టమవుతోంది. భారతదేశ ఓటరు జాబితాలు కలుషితమయ్యాయి. ఈ జాబితాలు ఎంత బలంగా ఉంటే ఎన్నికల ప్రక్రియలు, జాతీయ భద్రత, ప్రజాస్వామ్యం అంత బలంగా ఉంటాయి. అందువల్ల ఓటర్ల జాబితా ముమ్మర లేదా సమగ్ర సవరణ అనేది సరిహద్దు రాష్ట్రాల్లోనే కాక, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ అవసరం.
రాజీవ్ చంద్రశేఖర్,
బిజెపి కేరళ అధ్యక్షుడు

