nizam patel

నిజాం దుష్ట యత్నాలను భగ్నం చేసిన సర్దార్ పటేల్

దేశంలోని సంస్థానాలను విడదీసి, దేశ విచ్ఛిన్నానికి బ్రిటిష్ వారు పన్నిన కుట్రను ఆసరా చేసుకొని స్వతంత్ర రాజ్యంగా ఏర్పడాలని నిజాం రాజు చేసిన ప్రయత్నాలు సర్దార్ పటేల్ ధృడ సంకల్పం ముందు ఫలించలేదు. బ్రిటిష్ కుట్రలను వమ్ము చేసి సర్దార్ పటేల్ రాజనీతిజ్ఞతతో దేశాన్ని ఒక్కటి చేశారు. “ఈ దేశం అన్ని వ్యవస్థలతో సహా ఇక్కడ నివసించే ప్రజల గర్వోన్నత వారసత్వం. కొందరు సంస్థానాల్లో, కొందరు బ్రిటిష్ ఇండియాలో ఉండటం కేవలం యాదృచ్ఛికం. అందరూ ఒకే సంస్కృతిలో భాగం. మనమందరం మన ప్రయోజనాల వల్లనే గాక మన రక్తసంబంధం చేత, భావసారూప్యత చేత అనుబంధితులం. మనలను ఎవ్వరూ ముక్కలుగా చేయలేరు” అని ఆయన స్పష్టం చేశారు. ఆయన పిలుపునకు అత్యధిక సంస్థానాలు సానుకూలంగా స్పందించగా కొన్ని మాత్రమే మొండికేశాయి. వాటిలో హైదరాబాద్ ఒకటి. ఇటు భారత్‌లోగాని, అటు పాకిస్తాన్‌లోగాని చేరనని నిజాం ఫర్మాన జారీచేసి, కామెన్వెల్త్ స్వతంత్ర దేశంగా ప్రకటింపచేసే ప్రయత్నం చేశారు. బ్రిటిష్ వారు వెళ్లడంతో తనది స్వతంత్ర సార్వభౌమిక రాజ్యమైనదని 1947 ఆగష్టు 27న ప్రకటించాడు. బ్రిటిష్ అధికారుల పర్యవేక్షణలో ప్రజాభిప్రాయ సేకరణకు కూడా ఒప్పుకోలేదు.

నిజాం మరోవైపు పాకిస్తాన్ నిర్మాత జిన్నాతో సంబంధాలు కొనసాగించాడు. సంస్థానం భారత్‌లో విలీనమైతే హైదరాబాద్‌లో ముస్లింలు సహించరని హెచ్చరించాడు. మొత్తం దక్షిణ భారత్‌లోనే పెద్ద ఎత్తున రక్తపాతం, మత కలహాలు జరుగుతాయని బెదిరించాడు. ఈ విషయమై నిజాం ప్రతినిధులకు, భారత ప్రభుత్వానికి మధ్య నెలల తరబడి జరిగిన సమాలోచనలు ఎటువంటి పురోగతి సాధించలేక పోయాయి. ఈ విషయంలో కేంద్రం ఎంతగా సంయమనం చూపుతున్న నిజాం దిగిరాలేదు. అనేక సమస్యలతో సతమతమవుతున్న భారత్ ఇప్పుడేమీ చేయలేదని, పట్టుబడితే మనదే పెచేయి అవుతుందని రజ్వి చేసిన వాదనలతో నిజాం ఏకీభవించటంతో ప్రతిష్టంభన ఏర్పడింది. నిజాం ప్రభుత్వాన్ని రజ్వి తన చెప్పుచేతల్లోకి తీసుకోవడం ప్రారంభించాడు. పలు దఫాలుగా చర్చల అనంతరం నిజాం కేంద్రంతో ‘యధాతథ స్థితి ఒడంబడిక’ను నవంబర్ 29న కుదుర్చుకున్నారు.

ఈ ఒప్పందం ప్రకారం భారత ప్రభుత్వం కె.యం.మున్షిని తన ఏజెంట్ జనరల్ గా హైదరాబాద్‌కు పంపింది. ఈ విషయమై నిజాం ఎన్నో మడత పేచీలు పెట్టాడు. ఆయన నివాసం విషయమై కూడా వివాదాలు రేపి, తాత్కాలిక నివాసం ఏర్పాటుకు తిరస్కరించాడు. ఈ ఒప్పందం సిరా ఆరకముందే దానిని ఉల్లంఘిస్తూ నిజాం ప్రభుత్వం రెండు ఆర్డినెన్సులను జారీ చేసింది. ఒకటి విలువైన లోహాలకు సంబంధించిన ఎగుమతులను నిషేధించగా, మరొకటి సంస్థానంలో భారత కరెన్సీ చెల్లకుండా చేశారు. మరో వంక భారత ప్రభుత్వ సెక్యూరిటీల రూపంలో పాకిస్తాన్‌కు రూ.20 కోట్ల రుణాన్ని నిజాం మంజూరు చేశారు. పలు విదేశాలలో ఏజెంట్ల నియామకానికి ప్రయత్నం చేపట్టింది. అప్పటికే పాకిస్తాన్‌లో ఒక ఏజెంట్ ను నియమించింది. ఈలోగా రజ్వి పెట్రేగిపోవడాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. హైదరాబాద్‌లో ముస్లింల ప్రాణాలకు ప్రమాదం ఉందని రజాకార్లు ఆ విధంగా చేస్తున్నారని నిజాం ప్రధానమంత్రి లాయక్ ఆలీ విచిత్ర సమాధానం ఇచ్చాడు. భారత ప్రతినిధి మున్షి పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తున్నారు. ఆయన దాదాపు ‘గృహ నిర్బంధం’లో ఉన్నట్లు మీనన్ పేర్కొన్నారు.

రెండు ఆర్డినెన్సులను ఉపసంహరించుకోమని తీవ్ర పదజాలంతో భారత ప్రభుత్వం పంపిన లేఖను మున్షి స్వయంగా అందచేయగానే లాయక్ ఆలీ రెచ్చి పోయారు. నిజాం ఒక అమరవీరుడిగా మరణించదలిచాడని, అతనితో పాటు లక్షల మంది ముస్లింలు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నారని అంటూ తిరుగుబాటు ధోరణిలో మాట్లాడాడు. రజాకార్ల దన్నుతో తిరుగుబాటు ధోరణి ప్రదర్శిస్తున్న నిజాంకు భారత్ ఆర్థిక ఆంక్షలు విధించినా వాటిని తట్టుకొని నిలబడగలమని, కొద్దిరోజులలోనే ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టుకోవచ్చని సలహాదారులు ఇచ్చిన మాయలో పడ్డాడు. ముస్లిం దేశాలన్నీ హైదరాబాద్‌కు మిత్ర దేశాలు కావడంతో అవి సైనికచర్య తీసుకోకుండా భారత్‌ను నిరోధించగలవని భావించాడు.

హైదరాబాద్ రేడియో ఒక ప్రకటన చేస్తూ యుద్ధం అంటూ వస్తే వేలమంది పఠానులు భారతదేశంపై దండయాత్రకు ఉపక్రమిస్తారని బెదిరించారు. హైదరాబాద్ సర్వసైన్యాధ్యక్షుడు ఎల్.ఎండ్రస్ రేడియోలో ప్రసంగిస్తూ ఎలాంటి అత్యవసర స్థితికైనా ప్రజలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఒక చేత్తో ఖురాను, మరో చేత్తో కరవాలాన్ని పట్టుకొని ‘జిహాద్’ కోసం ముందుకు సాగాలని, భారత్‌లోని 4.5 కోట్ల మంది ముస్లింలంతా వెంట నడుస్తారని అంటూ రజ్వి చేస్తున్న రెచ్చగొట్టే ప్రసంగాల పట్ల నెహ్రూ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తనను కలసిన లాయక్ ఆలీతో “భారత్ యూనియన్ హైదరాబాద్‌ను గనుక విలీనం చేసుకొంటే కోటిన్నర మంది హిందువుల్ని ఊచకోత కోస్తానని అన్నాడు రజ్వి, అదే జరిగితే నిజాం, అతని వంశ భవిష్యత్ కూడా ప్రమాదంలో పడక తప్పదు. హైదరాబాద్ ఎలాగైనా భారత్‌లో విలీనం కావలసిందే” అని సర్దార్ పటేల్ హెచ్చరించాడు. సైనిక చర్య తప్పనిసరని భావించి, పటేల్ ఈ నిర్ణయాన్ని సదరన్‌ కమాండ్‌కు తెలియచేశారు. అదను కోసం ఎదురు చూస్తున్న సర్దార్‌ పటేల్‌కు సెప్టెంబర్‌ 12, 1948న జిన్నా మరణం ఒక సదవకాశంగా లభించింది. సెప్టెంబర్‌ 13 తెల్లవారుజాము ఆపరేషన్‌ పోలోకు ఆదేశాలందాయి.

లెఫ్టినెంట్‌ జనరల్‌ మహరాజ రాజేంద్ర సింగ్‌ నిర్దేశకత్వంలో మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌.చౌదరి నాయకత్వాన ఈ పోలీస్‌ చర్య జరిగింది. యూనియన్‌ సేనలు మొత్తం 8 విభిన్న ప్రాంతాల నుంచి సంస్థానాన్ని ముట్టడించాయి. భారత సేనల వ్యూహమేంటో నిజాం సైన్యానికి అంతుపట్టలేదు. ఎర్రకోట మీద అసఫ్‌ జా పతాకాన్ని ఎగరేస్తామని బీరాలు పలికినవారు కనీస ప్రతిఘటన ఇవ్వలేకపోయారు. భారత సేనలు వెంట తెచ్చిన ఆధునాతన శకటాలు, యుద్ధ విమానాలను చూసి నిజాం సైన్యం పూర్తిగా స్థైర్యం కోల్పోయాయి. చాలాచోట్ల నిజాం సైనికులు, రజాకార్లు ఆయుధాలు పారేసి పారిపోయారు. కొన్ని చోట్ల తికమకతో స్వపక్షం మీదే కాల్పులు జరుపుకొన్నారు. నాలుగు రోజుల్లోనే నిజాం సేనల, రజాకార్ల ప్రతిఘటన దాదాపు పరిసమాప్తమైంది. సెప్టెంబర్‌ 17న ఉదయం నిజాం సైన్యాధిపతి ఇద్రూస్‌ వచ్చి కే.ఎం.మున్షీని లేక్‌వ్యూ అతిథి గృహంలో కలుసుకున్నాడు. అప్పటి వరకు మొండిగా తిరస్కరించిన లాయక్‌ అలీ మధ్యాహ్నం ఒంటి గంటలకు రాజీనామా చేశాడు. రజాకార్లను నిషేధిస్తున్నామని, భారత సేనలను సికింద్రాబాద్‌కు అనుమతిస్తున్నామని, యుద్ధ విరమణను ప్రకటిస్తున్నామని గవర్నర్‌ జనరల్‌ రాజాజీకి తెలియజేయమని కే.ఎం. మున్షీని నిజాం ఆర్థించాడు. సాయంత్రం 7 గంటలకు నిజాం రేడియో ద్వారా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ తాను లొంగిపోతున్నట్టు ప్రకటించారు. కే.ఎం.మున్షీతోనూ మాట్లాడిచ్చారు. తదుపరి భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్‌ 18 జె.ఎన్‌.చౌదరి మిలిటరీ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. తన బావమరిది ఇంట్లో దాక్కున్న ఖాసిం రజ్వీని సెప్టెంబర్‌ 19న అరెస్టు చేశారు. సెప్టెంబర్‌ 23న నిజాం హైదరాబాద్‌ కేసును ఉపసంహరించుకున్నట్టు భద్రతా మండలికి తంతి పంపారు. 

నిజాం ప్రభుత్వ నిరంకుశ పాలన, రజాకార్ల దురాగతాలకు హైదరాబాద్‌ సంస్థాన ప్రజలు ఎదురొడ్డి ఎన్నో వీరోచిత పోరాటాలు సల్పారు. సర్దార్‌ పటేల్‌ అపర చాణక్యనీతి, దృఢ సంకల్పం, భారత సైన్యం సామర్థ్యం, హైదరాబాద్‌ సంస్థానంలోని హిందువులను రక్షించగలిగాయి. 1948 సెప్టెంబర్‌ 17 హైదరాబాద్‌ సంస్థాన విమోచన దినంగా చరిత్రలో నిలిచిపోయింది.