తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం అసంభవం!
‘తెలంగాణలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం అసంభవం.. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇస్తే సర్వనాశనం చేసిండు..’ ఇదేదో ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు కాదు. స్వయంగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పిన మాటలు! ఇప్పటివరకు పదేళ్ళపాటు కాంగ్రెస్ అధికారంలో ఉంటుందని, తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని రేవంత్ రెడ్డి చెప్పుకొంటూ వస్తున్నారు. అయితే, రెండేళ్ల కంటే ముందుగానే ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఏర్పడిన అసంతృప్తిని గమనిస్తే ఆ పార్టీ అధిష్ఠానానికే రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తు పట్ల ఆశలు వమ్మయినట్లు స్పష్టం అవుతుంది. “సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేకసార్లు లోక్‌సభకు ఎన్నికైన వ్యక్తిగా, ప్రజా జీవితంలో సుదీర్ఘ అనుభవం ఉన్న వ్యక్తిగా చెప్తున్న. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యం” అని స్వయంగా ఖర్గే తెలంగాణకు చెందిన పార్టీ నేతల ముందే తేల్చి చెప్పడం కాంగ్రెస్ వారే నమ్మలేక పోతున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ రెండేళ్ల పాలన కూడా పూర్తి చేసుకోకముందే పతనం ప్రారంభం కావడం పట్ల ఖర్గే తీవ్ర ఆందోళన చెందుతునట్టుగా ఓ ప్రముఖ జాతీయ పత్రిక సంచలన కథనాన్ని రాసింది. ఒక ప్రభుత్వం ఇంత తక్కువ పాలనా కాలంలో ఇంత దారుణంగా క్షీణించడం తాను ఎన్నడూ చూడలేదని పేర్కొనట్టు తెలిపింది. అధికారంలోకి వచ్చి రెండేండ్లు కూడా కాకముందే ఇంత పతనం కావడం దారుణమైన అంశమని వాపోయినట్టు పేర్కొంది. ప్రజల్లో వ్యతిరేకత మూటగట్టుకోవడంపై ఆయన తీవ్ర ఆవేదన, ఆందోళన వ్యక్తం చేసినట్టు తెలిసింది. ఇటీవల గుండెకు సంబంధించిన చిన్న చికిత్స చేయించుకున్న మల్లికార్జున ఖర్గేను అక్టోబర్ 15న కాంగ్రెస్ మంత్రి దామోదర రాజనర్సింహ, అసంతృప్త ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, కూచుకుళ్ల రాజేశ్‌రెడ్డి, యెన్నం శ్రీనివాస్‌రెడ్డి దిల్లీలో కలిసి పరామర్శించారు. ఆ సమయంలో అసంతృప్త ఎమ్మెల్యేలు రాష్ట్రంలో జరుగుతున్న వ్యవహారాలపై ఖర్గేకు ఫిర్యాదు చేసిన సమయంలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుతెన్నులపై ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. రేవంత్ రెడ్డి గ్యారెంటీల అమలులో ఘోరంగా విఫలం అయ్యాడని ఖర్గే విమర్శించారు.
రేవంత్‌రెడ్డి పాలనా వైఫల్యం పార్టీకి తీవ్రనష్టం చేసినట్టుగా ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. వాటాల కోసం మంత్రుల మధ్య కీచులాటలు, ఒకరినొకరు బహిరంగంగా తిట్టుకోవడం వంటి చర్యలు పార్టీని, ప్రభుత్వాన్ని ప్రజల్లో చులకన చేశాయని.., సీఎం, మంత్రుల మధ్య విభేదాలు పార్టీకి తీవ్ర ప్రతిబంధకాలుగా మారాయని పేర్కొన్నట్టుగా తెలిసింది. బీసీ రిజర్వేషన్ అంశాన్ని రేవంత్ సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం వల్ల మన పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడి అయ్యిందని కాంగ్రెస్ ఎమ్మెల్యేల దగ్గర ఖర్గే వాపోయారట. మొదటి నుంచి పార్టీలో అందరినీ కలుపుకొని పోలేదని, ఇతర పార్టీలతో కూడా సరిగ్గా సమన్వయం చేసుకోలేదని ఖర్గే అన్నారని సమాచారం. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అంశంలో కాంగ్రెస్ విఫలం అయ్యిందనే సంకేతాలు వెళ్తున్నాయని, అది పార్టీకి తీవ్ర నష్టం చేసిందని తెలిపారట. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీకి దన్నుగా ఉన్న రెడ్లు, దళితులు ఈ అంశం వల్ల మనకు దూరం అయ్యారని పేర్కొన్నారు. పోనీ బీసీలు అయినా మనకు దగ్గర అయ్యారా అంటే అదీ లేదు. రేవంత్ చేసిన నిర్వాకం వల్ల అన్ని కులాల వాళ్లూ కాంగ్రెస్ మీద ఆగ్రహంగానే ఉన్నారని మండిపడ్డారట. అనవసరంగా రేవంత్ ఇందులోకి రాహుల్ గాంధీ పేరును లాగాడని, ఇది రాహుల్ ఇమేజ్‌ను కూడా డ్యామేజ్ చేసిందని బాధపడ్డారట.
ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైదని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తూ ఉండటం సాధారణమే. అయితే, స్వయంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడే ఈ విషయమై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ నేతలు అధికారంలోకి రాగానే ఇష్టానుసారంగా వ్యవహరించారని, ఒక పద్ధతి, ప్రణాళిక లేకుండా ముందుకెళ్లారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి ఆయన పలు ఉదాహరణలు కూడా చెప్పినట్టుగా తెలిసింది. రైతులకు ఇచ్చిన రూ.2 లక్షల రుణమాఫీని కొర్రీలు, కోతలతో అరకొరగా అమలు చేయడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు వివరించింది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం రైతులకు రైతు భరోసా పెట్టుబడి సాయాన్ని కూడా సకాలంలో ఇవ్వకపోవడం, కోతలు పెడుతూ పూర్తిగా చెల్లించకపోవడంపైనా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రభుత్వానికి సానుకూలంగా కంటే ప్రతికూలంగా మారిందని, ఇక ఎన్నికల్లో మెజార్టీ ప్రభావం చూపే మహిళలకు, వృద్ధులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఇప్పటి వరకు అమలు చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మహిళలకు ప్రతి నెలా రూ.2500, వృద్ధులకు పింఛన్‌ను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామనే హామీ నెరవేరలేదని వాపోయారు.
ప్రవీణ్

