Gorakshak

గోరక్షకుడిపై ఎంఐఎం గూండా కాల్పులు

క్టోబర్ 22న ఘట్కేసర్ వద్ద గోవుల రవాణాను అడ్డుకుంటున్న గోరక్షక్ సోనుసింగ్ (ప్రశాంత్)పై ఎంఐఎం గూండా కాల్పులు జరపడం కలకలం రేపింది. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు సహా బిజెపి నాయకులు, హిందూ జాగరణ సంస్థలు ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాల్పుల్లో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సోనూసింగ్ ను రాంచందర్ రావు తదితర బిజెపి నాయకులు పరామర్శించారు. ఈ ఘటనతో కాంగ్రెస్ పాలనలో హిందువులకు రక్షణ ఉండదన్న ఆందోళన నిజమైంది. 

 గోరక్షకుడిపై ఎంఐఎం గూండా దాడికి వ్యతిరేకంగా, ఈ దాడిపై రాష్ట్ర ప్రభుత్వం మౌనంగా ఉండటాన్ని నిరసిస్తూ అక్టోబర్ 23న హైదరాబాద్ లక్డికాపూల్‌లోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో డీజీపికి వినతిపత్రం సమర్పించేందుకు వెళ్లిన బిజెపి నాయకులను పోలీసులు అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అరెస్టయిన వారిలో రాంచందర్ రావు, బిజెపి రాష్ట్ర, జిల్లా, యువ మోర్చా, గోసేవా సమితి నాయకులు 100 మంది వరకు ఉన్నారు. బిజెపి నాయకులు ఎలాంటి అల్లర్లు లేకుండా, గాంధేయ పద్ధతిలో వినతి పత్రం ఇవ్వడానికి మాత్రమే వెళ్ళినా ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువులకు విరుద్ధంగా ఆందోళన స్వరాలను అణగదొక్కడానికి పోలీసులను వినియోగించింది. బిజెపి నాయకులపై తప్పుడు కేసులను బనాయించింది. దీనిపై రాంచందర్ రావు స్పందిస్తూ.. ‘‘తెలంగాణలో నడుస్తున్నది రేవంత్ రెడ్డి సర్కారు కాదు.. రేవంతుద్దీన్ సర్కారు. ఎంఐఎం గూండాలను కాపాడటానికే రేవంత్ సర్కారు ఉందా..? గోరక్షకుడు ప్రశాంత్ (సోనూసింగ్)పై ఆవుల అక్రమ రవాణా మాఫియా కాల్పులు జరిపితే, నిందితులపై కఠిన చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్, రాష్ట్ర ప్రభుత్వం గోరక్షకుడిపై అభాండాలు మోపి తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటు.

గోవులను తరలిస్తుండగా ఘట్కేసర్ వద్ద అడ్డుకోవడంతో, ఎంఐఎం గూండాలు జరిపిన కాల్పుల్లో సోనూ సింగ్ తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోనూ సింగ్ పై లేనిపోని అభాండాలతో, కేసు సెటిల్‌మెంట్ కోసం డబ్బులు డిమాండ్ చేస్తున్నాడంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య చికిత్స పొందుతున్న బాధితుడిపై తప్పుడు ఆరోపణలు చేయడం దారుణం. తెలంగాణ రాష్ట్రంలో గోశాలల ఏర్పాటు, నిర్వహణ, గోవుల సంరక్షణ కోసం కొత్తగా పాలసీ తెస్తానని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి, ఇప్పుడు గోవులను కోసేవాళ్లకు గన్ లైసెన్సులు ఇస్తోందా..? అసలు రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా? అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత గోవులను తరలించే మాఫియా రెచ్చిపోతోంది. గోరక్షకులపై అనేక దాడులు పెరిగాయి. ఈ ఘటనకు సంపూర్ణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాలి. సోనూసింగ్ పై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణలో ప్రభుత్వం గోవధ నిషేధ చట్టం తీసుకురావాలి. లేనిపక్షంలో, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం ఉదృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం.’’ అని అన్నారు.