పటేల్ స్ఫూర్తితో సమ్మిళిత భారతాన్ని నిర్మిద్దాం
ఆధునిక భారతదేశాన్ని నిర్మించిన మహానాయకులలో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఒకరు. దేశ చరిత్రలోనే అత్యంత సంక్లిష్ట సమయంలో, విభజన పరిస్థితుల్లో ఆయన కృషి మరవలేనిది. దేశ సమైక్యత కోసం దృఢంగా నిలబడిన తీరు సాటిలేనిది. బ్రిటిష్ పాలకుల కుయుక్తులతో ముక్కలు కాకుండా ఉక్కు సంకల్పంతో దేశాన్ని ఏకం చేశారు. సమైక్య భారత నిర్మాతగా, ప్రధాన శిల్పిగా చరిత్రలో నిలిచిపోయారు.
నేటితరం ఒక ముఖ్యమైన విషయాన్ని తెలుసుకోవాలి. 1947లో మనకు స్వాతంత్య్రం వచ్చినప్పుడు, ఒక పెద్ద సవాలు ఎదురైంది. అప్పటికి భారతదేశంలో 565 స్వతంత్ర సంస్థానాలు ఉండేవి. విభజించు-పాలించు సూత్రాన్ని ఒంటబట్టించుకున్న ఆనాటి బ్రిటిష్ పాలకులు దేశాన్ని విడిచి వెళ్తూ ఒక సమస్యను సృష్టించి వెళ్లాలనుకున్నారు. ఆ సంస్థానాలు భారతదేశంలో లేదా పాకిస్థాన్‌లో విలీనం అవ్వొచ్చని, లేదా స్వతంత్రంగా ఉండొచ్చని బ్రిటిష్ ప్రభుత్వం మెలిక పెట్టింది. ఇది దేశ భవిష్యత్తుకే పెను ప్రమాదంగా పరిణమించింది. అలాంటి క్లిష్ట సమయంలో సర్దార్ పటేల్ తన అసాధారణ దార్శనికత, మొక్కవోని ధైర్యం, అమోఘమైన దౌత్య నైపుణ్యంతో ఆ సంస్థానాలన్నింటినీ మన జాతీయ జెండా కిందకు చేర్చారు.
భారతదేశంలో విలీనం కాకుండా మొండికేసిన రాజ్యాల్లో హైదరాబాద్ ఒకటి. అప్పటి నిజాం పాలకుడు స్వతంత్రంగా ఉంటానని లేదా పాకిస్థాన్‌లో కలుస్తానని ప్రకటించడం దేశ సమగ్రతకు ముప్పుగా పరిణమించింది. ఆ సమయంలో పటేల్ రంగంలోకి దిగారు. ఆయన దృఢ సంకల్పంతో, 1948లో ‘ఆపరేషన్ పోలో’ పేరుతో సకాలంలో తీసుకున్న పోలీసు చర్య హైదరాబాద్‌కు నిజాం పాలన నుంచి విముక్తి కల్పించింది. ఆ సాహసోపేతమైన నిర్ణయం కారణంగానే భారతదేశ సమైక్యత సాధ్యమైంది. వ్యక్తిగత, ప్రాంతీయ ప్రయోజనాల కంటే దేశ సమైక్యత, సమగ్రతే గొప్పవని చాటిచెప్పిన సర్దార్ పటేల్ దార్శనికత, అచంచలమైన దేశభక్తి మనకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకాలే. పండిట్ జవహర్లాల్ నెహ్రూ సైతం సర్దార్ పటేల్ సేవలను ఎంతగానో ప్రశంసించారు. ‘సర్దార్ ఉక్కు పట్టుదలతో ఒక దేశాన్ని నిర్మించారు. చరిత్ర దీన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఆయనను నవభారత నిర్మాతగా, సంఘటితకర్తగా కీర్తిస్తుంది’ అని నెహ్రూ పేర్కొన్నారు. పటేల్‌ది అకుంఠిత కార్యదీక్ష. గొప్ప దక్షత కలిగిన నాయకుడు. అసామాన్యమైన దేశభక్తికి తోడు ఇలాంటి లక్షణాలతో సర్దార్ పటేల్ అత్యంత ప్రభావవంతమైన నాయకుడిగా కీర్తి పొందారు. భారతదేశాన్ని రాజకీయంగా ఏకం చేయడమే కాకుండా, దేశ నైతిక, జాతీయ పునాదులను కూడా బలోపేతం చేశారు. కర్తవ్య దీక్షలో సర్దార్ పటేల్ ఆదర్శనీయులు. బారిస్టర్ చదివి న్యాయవాద వృత్తిలోనూ రాణించిన పటేల్‌కు వృత్తి పట్ల ఎంతటి నిబద్ధత ఉండేదో చెప్పే సంఘటన ఇది. 1909లో, ఆయన భార్య జవేర్బా క్యాన్సర్ శస్త్రచికిత్స కోసం బొంబాయి(ప్రస్తుత ముంబయి)లోని ఆసుపత్రిలో చేరారు. అత్యవసర శస్త్రచికిత్స విజయవంతమైనప్పటికీ, దురదృష్టవశాత్తు ఆమె ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించి మరణించారు. కోర్టులో పటేల్ ఒక కేసు వాదిస్తున్న సమయంలో ఈ వార్తను ఒకరు చిన్న చీటీపై రాసి ఆయనకు అందించారు. పటేల్ ఆ చీటీని చదివి జేబులో పెట్టుకుని, తన వాదనను కొనసాగించి ఆ కేసును గెలిచారు. తాను ఆ రోజు కోర్టులో నిలబడి వాదన కొనసాగించబట్టే ఒక అమాయకుణ్ని రక్షించగలిగానని పటేల్ వివరించారు. గాంధీజీకి అత్యంత నమ్మకమైన అనుచరుడిగా, ఆయన సిద్ధాంతాలతో ప్రేరణ పొంది తన విదేశీ వస్త్రధారణను వదిలేశారు. సంప్రదాయ భారతీయ వస్త్రధారణలోకి మారిపోయారు. ‘ఖేడా’, ‘బార్డోలి’ సత్యాగ్రహాలలో రైతులను పెద్దయెత్తున సమీకరించి, నాయకత్వం వహించి, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఏకతాటిపై నడిపించారు. చరిత్రాత్మక ‘బార్డోలి’ సత్యాగ్రహంలో పటేల్ చూపిన అసమాన నాయకత్వ పటిమకు అక్కడి ప్రజలు ఆయనకు ప్రేమతో ‘సర్దార్’ అనే బిరుదు ఇచ్చారు.
ఆధునిక, ప్రజాస్వామ్య భారతదేశానికి పునాదులు వేయడానికి పటేల్ అవిశ్రాంతంగా కృషి చేశారు. వ్యక్తిగత అభిప్రాయాల కన్నా దేశ సమైక్యత, స్థిరత్వమే తనకు ముఖ్యమని ఆయన ఆచరణలో చూపించారు. అయితే, దేశానికి పటేల్ చేసిన సేవలకు చాలాకాలం పాటు సరైన గుర్తింపు దక్కలేదనేది వాస్తవం. గుజరాత్‌లోని నర్మదా నది ఒడ్డున, సర్దార్ సరోవర్ డ్యామ్ ఎదురుగా నిర్మించిన ‘ఐక్యతా విగ్రహం’ ఆయన కీర్తిని ప్రపంచానికి చాటిచెబుతోంది. దేశాన్ని ఏకం చేయడంలో, స్వతంత్ర భారత గమ్యాన్ని రూపొందించడంలో పటేల్ పోషించిన అద్భుతమైన పాత్రకు శాశ్వత నివాళిగా ఈ విగ్రహం నిలుస్తోంది. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. భారతదేశ పరిపాలన వ్యవస్థకు వెన్నెముక లాంటి అఖిల భారత సివిల్ సర్వీసెస్‌కు పటేల్ రూపకల్పన చేశారు. దేశ సమైక్యత, సమగ్రతను కాపాడటంలో అఖిల భారత సేవలు ‘ఉక్కు చట్రం’లా పని చేస్తాయని ఆయన బలంగా విశ్వసించారు. సివిల్ సర్వెంట్లు రోజువారీ పరిపాలనలో నిజమైన సేవా స్ఫూర్తితో నడుచుకోవాలంటూ 1947లో సివిల్ సర్వీస్ ప్రొబేషనర్లను ఉద్దేశించి చేసిన స్ఫూర్తిదాయక ప్రసంగంలో పటేల్ సూచించారు. సర్దార్ పటేల్ ఒక దార్శనికులు, సమర్థ పాలకులు, అద్భుతమైన కార్యనిర్వాహకులు. గొప్ప పరిష్కర్త. ఈ అమృతకాలంలో వడివడిగా ముందడుగు వేస్తున్న మనం, పటేల్ కలలు కన్న ‘సురాజ్’ను సాధించడానికి, సమ్మిళిత భారతాన్ని నిర్మించడానికి ఐక్యతా స్ఫూర్తితో కృషి చేయాలి. 150వ జయంతి సందర్భంగా ఆ గొప్ప రాజనీతిజ్ఞుడికి మనమందరం అర్పించే నిజమైన నివాళి ఇదే అవుతుంది!
ఎం.వెంకయ్య నాయుడు,
భారత మాజీ ఉపరాష్ట్రపతి

