Patel

సమగ్ర భారత దార్శనికుడు పటేల్

స్వతంత్ర భారతదేశానికి మొదటి ఉప ప్రధాని, హోం శాఖ మంత్రి ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉంది. తెలంగాణ బిడ్డలుగా సర్దార్ పటేల్ కు గౌరవ వందనం చేయడం మన అదృష్టం. ఆయనే లేకపోతే హైదరాబాద్ లో భాగమైన మనం ఏ పాకిస్తాన్ ప్రాంతంలోనో కలిపి ఉండేవాళ్లం. ఆయన చూపిన ధైర్యం, రాజకీయ చాణక్యం, స్థిరమైన సంకల్పం వల్లనే దక్కన్ ప్రాంతానికి గుండెకాయ అయిన ఈ హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్ లో అవిభాజ్య భాగంగా నిలిచింది.

1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు అప్పటి మన నేతలు దేశంలో ఉన్న సుమారు 565 సంస్థానాలను ఒక సార్వభౌమ దేశంగా ఏకీకరించే మహత్తరమైన కార్యానికి పూనుకున్నారు. బ్రిటిష్ వారు వెళ్ళేటప్పుడు భారతదేవ: విభజిత ఉపఖండంలా ఉంది. అదొక రాజకీయ పజిల్. దీనిని పరిష్కరించడానికి మొక్కవోని ధైర్యం, అకుంఠిత కార్యదీక్ష కావాలి. అప్పటికి చాలా సంస్థానాలు స్వచ్ఛందంగానే భారత్ లో అంతర్భాగం అయ్యేందుకు అంగీకరించాయి. హైదరాబాద్, జునాగడ్, కాశ్మీర్ వంటి రాజ్యాలు స్వతంత్రంగా ఉండాలని లేదా పాకిస్థాన్లో భాగం కావాలని కోరుకున్నాయి. కానీ ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ మాత్రం భారతదేశ హృదయంలో భాగమైన ఏ ఒక్క స్వతంత్ర రాష్ట్రాన్ని విడిగా ఉంచేందుకు అంగీకరించలేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ రాజకీయ చతురత, కృత నిశ్చయంతో కేవలం భౌగోళిక కారణాల వల్ల మాత్రమే కాదు, భారతదేశ స్వరూపాన్ని, అఖండమైన సమగ్రతను కాపాడడానికి హైదరాబాద్ భారత యూనియన్ లో ఉండాల్సిందే అని కార్యదీక్ష చేపట్టారు.

అప్పటి నిజాం నవాబు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నేతృత్వంలోని హైదరాబాద్ మిగిలిన రాష్ట్రాల మాదిరిగా సాధారణమైన రాష్ట్రం కాదు. సమృద్ధిగా, స్వావలంబనతో ఉన్న రాష్ట్రం. దీనికి స్వంత కరెన్సీ, సైన్యం, పరిపాలన కూడా ఉన్నాయి. అప్పటికి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన నిజాం భారత యూనియన్ నుండి తాను స్వతంత్రంగా ఉండగలనని బలంగా నమ్మాడు. భారత హోం మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ మాత్రం ఏకీకృత భారతంలో హైదరాబాద్ ప్రత్యేకంగా ఉండలేదని స్పష్టం చేశారు. ఆయన దృష్టి కేవలం రాజకీయ పరిమితులపై కాదు, ఈ దేశ నాగరికత మూలాలపై ఉంది. ఈ దేశాన్ని ఒకే దేశంగా కలిపి ఉంచడం ఇక్కడి సంస్థానాధీశులు, వారి వంశాల కంటే గొప్ప కార్యమని ఆయన అర్థం చేసుకున్నారు.

భారత ప్రభుత్వం హైదరాబాద్ ను కలుపుకొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం ఉన్నా.. రజాకార్లు, నిజాం వ్యక్తిగత సైన్యం భారత్ లో విలీనానికి ఒప్పుకోలేదు. నిజాం సైన్యం, రజాకార్లు తెలంగాణ పౌరులపై ప్రత్యేకించి భారత్ లో విలీనం కోసం నిలబడిన హిందువులపై అనేక దాడులు చేశారు. నిజాం పాకిస్తాన్ కు ఆర్థిక మద్దతు ఇవ్వడం వంటి చర్యలు పటేల్ సంకల్పాన్ని మరింత బలపరిచాయి. 1948 సెప్టెంబర్ 13న ‘ఆపరేషన్ పోలో’ కింద భారత సైన్యం మేజర్ జనరల్ జె.ఎన్.చౌదరి నాయకత్వంలో వేగంగా హైదరాబాద్ వైపు మళ్లింది. నిజాం సైన్యం కనీస పోరాటాన్ని కూడా చూపలేదు. కేవలం నాలుగు రోజుల్లో నిజాం ఓటమిని ఒప్పుకొని లొంగిపోయాడు. వ్యూహం, దౌత్యం, నిర్ణయాత్మకమైన సైనిక చర్యలతో పటేల్ హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత్ లో విలీనం చేశారు. ప్రధాని నెహ్రూ ఊహించినట్లు విషయం ఐక్య రాజ్య సమితి వరకు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. దీనిని ఆధునిక భారతదేశ చరిత్రలో అత్యుత్తమ రాజనీతిజ్ఞతకు, ధైర్యానికి ఉదాహరణగా చెప్పవచ్చు. పటేల్ చూపించిన రాజకీయ చాణక్యం భారత హృదయంలో భాగంగా ఉన్న దక్కన్ ప్రాంతం ఒక ప్రమాదకర విదేశీ భూభాగం కాకుండా అడ్డుకుంది.

సర్దార్ పటేల్ ఆధునిక భారతదేశ నిర్మాణానికి రూపకర్త. అనేక అడ్డంకులను అధిగమించి విభిన్న ప్రాంతాలను ఒక దేశంగా ఏకీకృతం చేశారు. కేవలం మాటలతో కాకుండా చేతలతో అప్పటి సంస్థానపు రాజుల నమ్మకాన్ని పొందుతూ సుస్థిరమైన నాయకత్వ లక్షణాలతో ఈ విజయాన్ని సాధించగలిగారు. మనం భారతదేశ ఐకమత్యాన్ని ఇంత గొప్పగా జరుపుకుంటున్నామంటే అది సర్దార్ పటేల్ కృషి అని చెప్పుకోవాలి. ఆయన అసాధ్యాన్ని సుసాధ్యంగా మార్చిన ధైర్యశాలి. ఇప్పటికీ దేశంలోని కొన్ని శక్తులు ఈ సమగ్రతను వ్యతిరేకిస్తున్నారు. వీళ్ళు ఆయుధాలు, బాంబులు, వివిధ ప్రచార మాధ్యమాలు ఉపయోగించి ప్రజలను విభజిస్తున్నారు. పటేల్ నిర్మించిన ఈ దేశ సమైక్యతను ప్రశ్నిస్తున్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాల నాయకత్వం భారతదేశ సమగ్రత, అంతర్గత భద్రతపై ప్రజలకు నమ్మకం కలిగించింది. ఉదాహరణకు 2014లో నక్సలైట్ల ప్రభావం 128 జిల్లాల్లో ఉండేది, 2025 నాటికి కేవలం మూడు జిల్లాలకే పరిమితమైంది. 2026 మార్చి 30 నాటికి నక్సలిజాన్నీ అంతం చేస్తామని అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు. ఇది కేవలం గణాంకాల విజయం కాదు. భారత నాగరికత, దేశ సమైక్యత, శాంతి, స్థిరత్వం కోసం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో ఇది ఒక పెద్ద ముందడుగు.

దురదృష్టవశాత్తూ సర్దార్ వల్లభాయ్ పటేల్ కు మన పాఠ్యపుస్తకాలలో సరైన స్థానాన్ని ఇవ్వలేకపోయాం. స్వాతంత్రం కోసం పోరాడిన ఎంతో మంది గొప్ప నాయకుల చరిత్రను పుస్తకాలలో లేకుండా చేసి, వారిని కనీసం గుర్తించకపోవడం వాస్తవ చరిత్రను కప్పి ఉంచడమే. నెహ్రూ, పటేల్ మధ్య ఉన్న వ్యత్యాసాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అంతర్జాతీయంగా దేశాల మధ్య భౌగోళిక రాజకీయ అనిశ్చితి ఏర్పడినప్పుడు, ఏ దేశమైనా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సమస్యలను ఎదుర్కొంటుంది. వివిధ దేశాల్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ప్రజలందరూ సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన ఏకతా మార్గంలో ఈ దేశ భవిష్యత్తు కోసం ఏకాత్మత పాటించాల్సిన అవసరం ఉంది.

నేడు సర్దార్ వల్లభాయ్ పటేల్ ను గౌరవిస్తూ, ఆయన గుండె ధైర్యాన్ని, దూరదృష్టిని, ఏకీకృత భారతదేశానికై చూపిన అచంచల విశ్వాసాన్ని స్మరించుకుందాం. ఆయన జీవితాన్ని ప్రేరణగా తీసుకుంటూ ఒక ఆత్మనిర్బర భారతాన్ని, సుస్థిరమైన ప్రజాస్వామ్యాన్ని నిర్మించడానికి మనమందరం కృషి చేద్దాం. ఐక్యత అనేది కేవలం నినాదాల ద్వారా కాదు… త్యాగం, సంకల్పం, దృఢమైన విశ్వాసం ద్వారా సిద్ధిస్తుందని పటేల్ మనకు ఆచరణలో చూపించారు. నర్మదా తీరంలో నిలిచిన ఐక్యత ప్రతిమ నుండి, మన పాలనకు దారి చూపే సహకార సమాఖ్య వరకు పటేల్ ఆలోచనలతో భారతదేశ భవిష్యత్తును ప్రస్తుత నాయకత్వం రూపొందిస్తోంది. 2047 వికసిత భారత్ వైపు అడుగులు వేస్తున్న ఈ తరుణంలో సర్దార్ పటేల్ చూపిన ఆదర్శం మనకు మార్గదర్శకం. ఆయన వారసత్వం కేవలం చరిత్ర కాదు, మనం నిర్మించుకునే భవిష్యత్తుకు పునాది. త్రివర్ణ పతాకం ఎగురుతున్నంత కాలం సర్దార్ పటేల్ ఆత్మ, ఆయన జీవితం మనతో కొనసాగుతూనే ఉంటాయి. 

ఎన్. రాంచందర్ రావు,
బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు