Revanth Reddy

ఆర్థిక పరిస్థితిపై చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి

రాష్ట్ర ఆదాయం పెరిగే పరిస్థితే లేదని, ఏం చేయాలో తోచడం లేదంటూ తమ ప్రభుత్వ ఆర్థిక నిర్వహణపై స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులెత్తేశారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మరోసారి తన నిస్సహాయ, నిర్వేద, అసహన వ్యాఖ్యలు చేశారు. పదేళ్లలో సంపన్న రాష్ట్రాన్ని అప్పులకుప్పగా బీఆర్ఎస్ మారిస్తే, రేవంత్ రెడ్డి ఆర్థిక పరిస్థితులను మరింత దిగజారేవిధంగా చేస్తున్నారు. ‘ఎక్కడా అప్పు పుడుతలేదు, బజార్లో ఎవరూ మనల్ని నమ్మడం లేదు. మీరు నన్ను కోసినా ఒక్క రూపాయి కూడా లేదు. ఏం చేస్తరయా నన్ను.. కోసుకుని తింటరా’ అంటూ ఆర్నెల్ల క్రితం ఉద్యోగుల సమావేశంలో అప్పులు, ఆదాయంపై సీఎం రేవంత్‌రెడ్డి నిస్సహాయతను వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు బిల్లులడిగినా, ఉద్యోగులు బకాయిలు అడిగినా, కాలేజీలు ఫీజు బకాయిలు అడిగినా, ఇలా ఎవరు బకాయిలు అడిగినా సరే సీఎం రేవంత్‌రెడ్డి టక్కున ఆదాయం, అప్పుల గురించి చెప్పి చేతులెత్తేయడం పరిపాటిగా మారింది.

ఉన్న ఆదాయంతో పాలన సాగడం లేదని, అభివృద్ధి, సంక్షేమ పథకాలు ముందుకు సాగడం లేదని, కనీసం ఉద్యోగులకు జీతాలు ఇచ్చుకోవడమే గగనమైపోతున్నదని చేతులెత్తేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల గురించి ముఖ్యమంత్రి తాజాగా ప్రస్తావిస్తూ ప్రభుత్వం వద్ద ఆర్థిక వనరులు లేవంటూ లెక్కలను చెప్పుకొచ్చారు. “ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.18,500 కోట్ల ఆదాయం మాత్రమే వస్తుంది. రూ.6,500 కోట్లు జీతాలు, పెన్షన్లకు పోతున్నది. రూ.13 వేల కోట్ల ఖర్చులు పోగా.. రూ.5,500 కోట్లు మాత్రమే మిగులుతున్నది” అని తెలిపారు. “ఈ నిధులతో రైతు రుణమాఫీ ఏం చేయాలి? రైతు భరోసా ఏమివ్వాలి? ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణంకు ఏమివ్వాలి? షాదీముబారక్‌ లకు ఏమివ్వాలి? కల్యాణలక్ష్మి ఏమివ్వాలి? పెండింగ్‌ ప్రాజెక్టులను ఏమి కట్టాలి? గవర్నమెంట్‌ ఉద్యోగస్తులకు పెన్షన్స్‌, రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ ఏమివ్వాలి? పిల్లల ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఏమివ్వాలి? సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఏమివ్వాలి?” అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 

పదివేల కోట్ల నిధులు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయని, నిత్యం తల బద్దలు కొట్టుకుంటున్నామని, ఏం చేయాలో తనకు తోచడంలేదంటూ తన ప్రభుత్వ దివాలాకోరు ఆర్థిక నిర్వహణ గురించి ఆయనే బహిరంగంగా మీడియా సమావేశంలోనే నిస్సహాయత వ్యక్తం చేయడం విస్మయం కలిగిస్తోంది. సర్కారును నడపడం, ఆర్థిక సమతుల్యం చేయడం తనతో కావడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పిన్నట్లు అవుతుంది. ఆదాయం పెంచి సంక్షేమానికి పంచడం వీలైతలేదని చేతులెత్తేశారు. చార్జీలు పెంచుతామంటే ప్రతిపక్ష పార్టీ అడ్డుకుంటుందని చెబుతూ ‘సర్కారు గల్లపెట్టె మీకే అప్పగిస్తా. వచ్చే ఆదాయంలో ఎవరికి ఎలా పంచుతారో పంచండి’ అంటూ ప్రతిపక్షాలను, పెండింగ్ బిల్లులను చెల్లించామని అడిగేవారిని ఉద్దేశించి పేర్కొనడం ఆయనలో నెలకొన్న అసహనాన్ని వెల్లడిస్తుంది.

ముఖ్యమంత్రిగా తన పరిపాలన బాధ్యతలు నెరవేర్చడం చాతకావడం లేదని అంగీకరిస్తున్నట్లే అయింది. ప్రభుత్వ ఉద్యోగుల పట్ల మరోసారి అసహనం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ఆదాయమంతా ఉద్యోగులకే పోతున్నదన్న రీతిలో వ్యాఖ్యలు చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఆపడం కోసం ఏం చేయాలో చెప్పాలంటూ విలేకరులను, పరోక్షంగా కాలేజీల యాజమాన్యాలను, అధికారులను ఉద్దేశించి మండిపడ్డారు. ‘ప్రభుత్వ ఉద్యోగులకు ఒక నెల జీతం ఆపుదామంటే ఆపుదాం. ఆరువేల కోట్లు వస్తే.. వీళ్ల పైసలు(రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు) మొత్తం ఇచ్చేద్దాం. అర్థం పర్థం ఉండాలె. ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆలోచించాలె. లెక్కలన్నీ మీ దగ్గరే ఉన్నాయి. నా ఇంట్లో ఏమీ లేవు’ అంటూ చేతులెత్తేశారు.

కృష్ణచైతన్య