Rahul Gandhi

తెలంగాణలో ప్రభుత్వ వ్యతిరేకతపై కాంగ్రెస్ అధిష్టానం ఆందోళన

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా వ్యక్తమవుతున్న ప్రభుత్వ వ్యతిరేకత కాంగ్రెస్ అధిష్టాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్డదిడ్డంగా చూపెట్టిన 42 శాతం బీసీ రిజర్వేషన్లను ఆచరణలో పార్టీని ఆ వర్గానికి దూరం చేస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. మరోవంక, ఎన్నికల హామీలను ప్రభుత్వం అమలు చేయలేక పోవడం, మంత్రుల మధ్య సఖ్యత లేకపోవడంతో రాష్ట్రంలో పాలన అదుపు తప్పిందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అందుకనే ఉపఎన్నిక ఫలితంతో సంబంధం లేకుండా త్వరలోనే మంత్రివర్గంలో భారీ మార్పులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. మంత్రుల శాఖల్లోనూ భారీ మార్పులు ఉంటాయని చెబుతున్నారు. మంత్రివర్గంలో ఇంకా రెండు ఖాళీలున్నాయని, కొత్తగా ముగ్గురిపై వేటు పడనుందని భావిస్తున్నారు. ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో పాటు, బీసీ వర్గానికి చెందిన నేతకు రెండో ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలనే యోచనలో ఉన్నారు. 

పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్‌ను కేబినెట్‌లోకి తీసుకుని, పీసీసీ అధ్యక్షుడిగా మరో బీసీ నేతను నియమించే ప్రతిపాదన కూడా ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలో పొన్నం ప్రభాకర్ పేరు వినిపిస్తోంది. తరచూ వివాదాలలో పార్టీని, ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్న కొండా సురేఖతో పాటు మరో ఒకరిద్దరిని మంత్రివర్గం నుండి తొలగించేందుకు సిద్ధమవుతున్నారు. ఆమె స్థానంలో బీసీ వర్గానికే చెందిన ఎమ్మెల్సీ, సినీనటి విజయశాంతికి ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు భావిస్తున్నారు. మంత్రుల శాఖల్లో సమూలంగా మార్పులు రానున్నట్లు చెబుతున్నారు. భట్టి విక్రమార్కతో సహా చాలామంది మంత్రుల శాఖలు మారే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి వద్దనే ఉండిపోయిన కీలకమైన హోం, విద్య, మునిసిపల్ పరిపాలన వంటి శాఖలను మంత్రులకు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

మరోపక్క, మంత్రివర్గంలో చోటు కోసం ఇప్పటికే కొందరు నేతలు ప్రయత్నాలు ప్రారంభించారు. బీసీ కోటాలో ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్‌, బీర్ల అయిలయ్య తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. చట్టసభల్లో సభ్యత్వం లేకున్నా అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇచ్చినట్లుగా కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన తమకూ మంత్రివర్గంలో స్థానం కల్పించాలని అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన బీసీ నేతలు అంజన్‌ కుమార్‌ యాదవ్‌, మధుయాష్కీ గౌడ్‌ ప్రయత్నాల్లో ఉన్నట్లు చెబుతున్నారు. ఎస్టీ లంబాడా కోటాలో ఎమ్మెల్యేలు బాలూ నాయక్‌, రామచంద్రు నాయక్‌ తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ సర్కారుపై వ్యతిరేకత మరింత పెరగకముందే కాయకల్ప చికిత్స చేసేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్దమవుతుంది. ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు పెరిగిపోయాయన్న ఫిర్యాదులు బాగా వస్తున్నాయని, మంత్రులు ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకోవడం, అధికారులతో కలిసి దందాలు చేస్తున్నట్టు పార్టీ అధిష్టానం గుర్తించినట్టు తెలుస్తున్నది. రెండేండ్ల క్రితం కాంగ్రెస్‌కు తెలంగాణలో ఉన్న ఆదరణ ఇప్పుడు కరువైందని పార్టీ అంతర్గత సర్వేలో సైతం తేలింది.

జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో ఎంఐఎం చెప్పిన అభ్యర్థినే ఎంపిక చేసినా ముస్లింల నుండి చెప్పుకోదగిన మద్దతు రాకపోవడం కాంగ్రెస్ నాయకులను ఆందోళనకు గురిచేస్తుంది. అందుకే అర్ధాంతరంగా ఈ సీట్ ఆశించి భంగపడిన అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకపోయింది. పైగా, హోం మంత్రిత్వ శాఖ కావాలని పట్టుబట్టడంతో నాలుగు రోజుల తర్వాత గాని అంతగా ప్రాధాన్యత లేని రెండు శాఖలను కేటాయించలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఎప్పుడూ పార్టీ మొఖం చూడని అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకోవడం పట్ల పార్టీ కోసం ఎంతో కాలంగా పని చేస్తున్న షబ్బీర్ అలీ వంటి సీనియర్ నేతలు ఆగ్రవేశాలు వ్యక్తం చేస్తున్నారు. అజారుద్దీన్ తో జూబ్లీహిల్స్ లో ఎలా గెలుస్తారో చూస్తాం అంటూ ఇతర సీనియర్ నాయకులు సైతం అలిగి కూర్చున్నారు. దాంతో మంత్రివర్గ విస్తరణతో సరికొత్త సమస్యలను కొనితెచ్చుకున్నట్లే అయ్యిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాపోతున్నారు. ఏది ఏమైనా ప్రభుత్వంపై, మంత్రులపై రేవంత్ రెడ్డి పట్టు సంపాదించుకోలేక పోతున్నారని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా వెల్లడైంది. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం పార్టీని కాపాడుకొనేందుకు ఏవిధంగా కాయకల్ప చికిత్స చేస్తుందో కాంగ్రెస్ వర్గాలలో ఆసక్తి కలిగిస్తోంది.

ప్రవీణ్