మొలకెత్తిన ధాన్యాన్నీ కొనుగోలు చేయాలి
ఇటీవలి భారీ వర్షాలకు నాని, మొలకెత్తిన ధాన్యాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు డిమాండ్ చేశారు. రైస్ మిల్లర్లు – కాంగ్రెస్ నాయకుల మధ్య జరుగుతున్న దళారీ వ్యాపారాన్ని వెంటనే ఆపాలన్నారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, తేమ ఆర్పే మిషన్లు, నిల్వ సదుపాయాలు తక్షణమే కల్పించాలన్నారు. భారీ వర్షాల కారణంగా రైతులు, పేద ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు గారు అక్టోబర్ 31న నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన నకిరేకల్, చిట్యాల మార్కెట్ యార్డులకు వెళ్లి రైతులతో స్వయంగా మాట్లాడి, వర్షాల వల్ల జరిగిన పంట నష్టాలను వివరంగా తెలుసుకున్నారు. అనంతరం సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రంతో పాటు మోతే మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి, రైతులతో మాట్లాడి, కేంద్రాల్లో ఉన్న పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా తమ ధాన్యం పూర్తిగా తడిసిపోయిందని, రాష్ట్ర ప్రభుత్వం సమయానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదని, తమ రెక్కల కష్టం నీటిపాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. భారీ వర్షాలకు ధాన్యం తడిసిపోవడంతో మొలకలు ఎత్తే పరిస్థితి ఏర్పడిందని, పలుచోట్ల కాంగ్రెస్ నాయకులు–రైస్ మిల్లర్లు కుమ్మక్కై తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి రైతులను దోచుకుంటున్నారని వివరించారు.
ఈ సందర్భంగా రాంచందర్ రావు గారు మాట్లాడుతూ.. ”కొనుగోలు కేంద్రాల్లో సరైన సౌకర్యాలు లేక రైతుల ధాన్యం తడిసినా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరం. చాలా కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు, తేమ ఆర్పే మిషన్లు, నిల్వ సదుపాయాలు లేవు,” అని అన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ నాయకులు, రైస్ మిల్లర్లతో కుమ్మక్కై దళారీలతో రైతులను దోచుకుంటున్నారని రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ”ట్రాన్స్‌పోర్ట్, బస్తాలు, సుతిల్, హమాలి చార్జీలు — అన్నింటినీ కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. రాష్ట్రం కొనుగోలు కోసం అప్పు తీసుకుంటే దాని వడ్డీ కూడా కేంద్రమే చెల్లిస్తోంది. మరి రాష్ట్ర ప్రభుత్వం రైతుల ధాన్యం కొనడంలో ఎందుకు ఆలస్యం చేస్తోంది,” అని రాంచందర్ రావు ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధర (MSP)కు రైతుల ధాన్యం కొనుగోలు చేయడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అని గుర్తు చేశారు.
భారీ వర్షాల్లో పంట నష్టపోయిన రైతులను పరామర్శించే నిమిత్తం నవంబర్ 3న యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం తుక్కాపూర్ గ్రామంలో బిజెపి శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి పర్యటించారు. తుక్కాపూర్ లోని ప్యాక్ (PACC) సెంటర్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తుఫాన్ వల్ల 5 లక్షల ఎకరాల్లో, 3 లక్షల మంది రైతులకు నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. రైతులు కన్నీరు కార్చుతుంటే ముఖ్యమంత్రి ముంబైలో సల్మాన్ ఖాన్ తో ఫోటోలు దిగటం తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదని మండిపడ్డారు. రైతులకు నష్ట పరిహారం రాలేదని, ఎకరాకు రూ.10 వేలు నష్టపరిహారం ఇస్తా అని ఇవ్వలేదన్నారు. గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి పంట నష్టానికి రూ.20 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎందుకు ఇవ్వటం లేదని నిలదీశారు. రైతుకు ఎకరాకు పెట్టుబడి ఖర్చు రూ.30 వేలు అవుతుందని, కనీసం పెట్టుబడి నష్టం జరగొద్దంటే రూ.30 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేంద్రం ఇచ్చే పంట బీమాలో రాష్ట్రం భాగస్వామ్యం కావటం లేదని, పంట నష్టం, సబ్సిడీ, బోనస్ ఇవ్వటం లేదని అన్నారు. రుణ మాఫీ కూడా అందరికీ ఇవ్వలేదని విమర్శించారు.

