Nitin Nabin Sinha

బిజెపి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నితిన్ నబీన్ సిన్హా

Nitin Nabin Sinhaబిహార్ యువకెరటం నితిన్ నబీన్ సిన్హా బిజెపి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులయ్యారు. బిహార్ కు చెందిన 45 ఏళ్ల నితిన్ చాలా చిన్న వయస్సులోనే స్వయంకృషితో బిజెపి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి నితీష్ కుమార్ క్యాబినెట్‌లో మంత్రిగా సమర్థ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. సుమారు రెండు దశాబ్దాల కార్యనిర్వాహక అనుభవం ఆయన సొంతం. పాలన, సంస్థాగత అనుభవాన్ని గడించిన నాయకుడు. చిన్నవయసులోనే ప్రజా జీవితాన్ని ప్రారంభించారు. తన కార్యనిర్వహణ సామర్థ్యంతో క్షేత్రస్థాయిలో వేరువేరు వర్గాలను సమర్థవంతంగా అనుసంధానించారు. యువమోర్చాలోనూ అనేక బాధ్యతలు నిర్వర్తించారు. క్షేత్రస్థాయిలో పనిచేసిన అనుభవంతో నాయకుడిగా రాటుదేలారు. 

విజయవంతమైన ప్రజాప్రతినిధి

నితిన్ నబీన్ 1980 మే 23న రాంచీలో జన్మించారు. ఆయన తండ్రి నబీన్‌ కిశోర్‌ ప్రసాద్‌ సిన్హా బిహార్‌ బిజెపిలో కీలక నేతగా గుర్తింపు పొందారు. నబీన్‌ సిన్హా విద్యాభ్యాసం దిల్లీలో పూర్తయింది. కాయస్థ సామాజికవర్గానికి చెందిన వారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో పనిచేశారు. 2005లో తండ్రి ఆకస్మిక మరణంతో నితిన్‌ 26 ఏళ్ల వయసులో ఎన్నికల రంగంలో అడుగుపెట్టారు. 2006లో జరిగిన ఉప ఎన్నికలో 65,000 మెజారిటీతో తొలిసారి గెలిచిన ఆయన ఆ తర్వాత ఎన్నడూ ఓటమి చవిచూడలేదు. బాంకీపూర్ నియోజకవర్గం నుండి వరుసగా 5 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇటీవలి ఎన్నికల్లో ప్రముఖ సినీనటుడు శతృఘ్నసిన్హా కుమారుడు లవ్‌సిన్హాపై 84వేల ఓట్ల భారీ ఆధిక్యంతో గెలుపొందారు. బిహార్ రాష్ట్ర రహదారుల నిర్మాణం, పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 2021 నుంచి 2022 వరకు రాష్ట్ర రహదారుల నిర్మాణ శాఖ మంత్రిగా, 2024లో న్యాయశాఖ, పట్టణాభివృద్ధి మరియు గృహనిర్మాణ శాఖ మంత్రిగా పనిచేశారు.

గొప్ప నిర్వహణ చాతుర్యం

యువమోర్చాలోనూ చురుగ్గా పని చేశారు. మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడిగా, బిహార్ రాష్ట్ర అధ్యక్షుడిగా, జాతీయ ప్రధాన కార్యదర్శిగా తనదైన పాత్ర పోషించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఛత్తీస్‌గఢ్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జిగా పనిచేసి అక్కడ బిజెపిని అధికారంలోకి తీసుకురావడంలో కీలకపాత్ర పోషించారు. 2019లో సిక్కిం బిజెపి ఎన్నికల, సంస్థాగత ఇంచార్జీగానూ పని చేశారు. 2011లో ‘జాతీయ ఐక్యతా యాత్ర’కు నాయకత్వం వహించారు. గౌహతి నుండి తవాంగ్ వరకు ‘షహీద్ శ్రద్ధాంజలి యాత్ర’ నిర్వహించారు. పాట్నాలో 14 ఏళ్లుగా శ్రీరామ నవమి శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. ప్రతిభావంతుల కోసం ‘నబిన్ సిన్హా ప్రతిభా సమ్మాన్’ పురస్కారాన్ని ప్రారంభించారు. 2013లో యునైటెడ్ స్టేట్స్ లో జరిగిన ‘అంతర్జాతీయ సందర్శకుల నాయకత్వ కార్యక్రమంలో’ పాల్గొని ప్రపంచ పాలనా నమూనాలపై అవగాహన సాధించారు. నితిన్ నబీన్ బిజెపి నాయకత్వంలోని కొత్త తరానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన రెండో నేత. ఇంతకుముందు ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా తొలుత కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులై, అనంతరం జాతీయ అధ్యక్షులయ్యారు. ఇప్పుడు నితిన్ నబీన్ సిన్హా కూడా త్వరలో జాతీయ అధ్యక్షుడు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

శుభాకాంక్షల వెల్లువ 

నబీన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ‘కష్టపడి పనిచేసే కార్యకర్తగా నబీన్‌ మంచి గుర్తింపు పొందారు. ఆయనకు సంస్థాగతంగా మంచి అనుభవం ఉంది. అద్భుతమైన రికార్డు ఉంది. ఆయన పనితీరు రానున్న కాలంలో పార్టీని మరింత బలోపేతం చేస్తుందని విశ్వసిస్తున్నాను’ అని పేర్కొన్నారు. నితిన్ నబీన్ కు శుభాకాంక్షలు తెలుపుతూ బిజెపి జాతీయ అధ్యక్షుడు జె.పి. నడ్డా ‘బిజెపి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నియమితులైన బిహార్ క్రియాశీలక నాయకుడు, రాష్ట్ర మంత్రి నితిన్ నబీన్ సిన్హాను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్గదర్శకత్వంలో, మీ నాయకత్వంలో పార్టీ దేశ, ప్రజా సేవ స్ఫూర్తితో కొత్త శిఖరాలకు చేరుకుంటుందని పూర్తి నమ్మకం ఉంది.’ అని పేర్కొన్నారు. నితిన్ నబీన్ కు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అభినందనలు తెలిపారు. ‘మీ మార్గదర్శకత్వంలో, బిజెపి ఖచ్చితంగా కొత్త శిఖరాలను అధిరోహిస్తుంది. ఈ ప్రతిష్టాత్మక పాత్రలో మీరు గొప్ప విజయాన్ని సాధించి, పార్టీ సంకల్పాన్ని, దేశ సేవ పట్ల దాని నిబద్ధతను మరింత బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను.’ అని అన్నారు.

వ్యక్తిగత వివరాలు

  • పేరు: నితిన్ నబీన్ సిన్హా
  • వయసు: 45 సంవత్సరాలు (జన్మదినం మే 23, 1980, రాంచీ)
  • తండ్రి: నబీన్ కిశోర్ ప్రసాద్ సిన్హా (పాట్నా పశ్చిమ మాజీ ఎమ్మెల్యే)
  • తల్లి: మీరా సిన్హా
  • భార్య: డా. దీపమాలా శ్రీవాస్తవ
  • సంతానం: ఇద్దరు (ఒక కొడుకు, ఒక కూతురు)
  • వృత్తి: ప్రజాసేవ, వ్యాపారవేత్త (రియల్ ఎస్టేట్)

 

సంస్థాగత బాధ్యతలు

  • 2008: బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యుడు
  • 2010-2016: బీజేవైఎం జాతీయ ప్రధాన కార్యదర్శి
  • 2016- 2019: బీజేవైఎం బిహార్ రాష్ట్ర అధ్యక్షుడు
  • 2019: బిజెపి సిక్కిం రాష్ట్ర ఎన్నికల, సంస్థాగత ఇంచార్జ్
  • 2021-2024: ఛత్తీస్ గఢ్ బిజెపి సహ ఇంచార్జ్
  • 2024: ఛత్తీస్ గఢ్ లోక్‌సభ ఎన్నికల ఇంచార్జ్ 
  • 2024-ప్రస్తుతం: ఛత్తీస్ గఢ్ బిజెపి ఇంచార్జ్
  • 2025: బిజెపి జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు 

 

ప్రజాప్రతినిధిగా

  • 2006-2010: పాట్నా పశ్చిమ ఎమ్మెల్యే
  • 2010-2025: బాంకీపూర్ ఎమ్మెల్యేగా వరుసగా ఐదు సార్లు
  • 2021-2022: బిహార్ రాష్ట్ర రహదారుల నిర్మాణ శాఖా మంత్రి
  • 2024-2024: బిహార్ న్యాయ, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి
  • 2025: బిహార్ రహదారుల నిర్మాణం, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రి