శతాబ్దాలుగా భారతీయ ముస్లింలలో అదే ‘అభద్రత’!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరిపాలనలో భారతదేశంలో ముస్లింలు అణచివేతకు గురవుతున్నారా? ఆయన పాలనలో అభద్రతా భావనతో జీవిస్తున్నారా? అసలు భారత ఉపఖండంలో ముస్లింలు ఎప్పుడు సురక్షితంగా, తమకు పూర్తి రక్షణ, భద్రత ఉన్నట్టు భావించారు? గాంధీజీ, పండిట్ నెహ్రూ భారతీయ ప్రజా జీవనాన్ని శాసించిన కాలంలో అయినా వారు హాయిగా ఉన్నారా? వారిలో అభద్రతా భావానికి దోహదపడే అంశాలు ఏమిటి? ఇటీవల జరిగిన రెండు సంఘటనల నేపథ్యంలో ఈ ప్రశ్నలు తెరపైకి వచ్చాయి. డిసెంబర్ 5న గర్భవతి అయిన ముస్లిం మహిళ సునాలి ఖాతూన్, ఆమె ఎనిమిదేళ్ల కుమారుడు – ఈ ఏడాది ప్రారంభంలో బంగ్లాదేశ్‌కు పంపించిన తర్వాత సుప్రీంకోర్టు ఉత్తర్వు మేరకు తిరిగి రావడాన్ని ‘సెక్యులర్’ గుంపు పండుగలా జరుపుకుంది. ఇదిలావుండగా రోహింగ్యాలు శరణార్థులా లేక జాతీయ భద్రత దృష్ట్యా బహిష్కరించాల్సినన అక్రమ చొరబాటుదారులా అనే అంశాన్ని నిర్ణయించడానికి సుప్రీంకోర్టులో మరో కేసు విచారణలో ఉంది. సునాలి ఖాతూన్ భారతదేశంలో తన బిడ్డకు జన్మనివ్వాలని ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉల్లాసంగా ఉంది. ఈ విషయం ‘సెక్యులర్ మీడియా’ దృష్టిని ఆకర్షించింది. ఆమెను భారతదేశంపై ఒక ముస్లిం మహిళ ప్రేమకు చిహ్నంగా చూపుతున్నారు. అదేవిధంగా, మయన్మార్‌లోని తమ స్వదేశం నుంచి బహిష్కరణకు గురైన తర్వాత రోహింగ్యా శరణార్థులు భారతదేశంలో ఆశ్రయం పొందాలనే కోరికను వ్యక్తీకరించేందుకు కూడా ఈ భావోద్వేగాన్ని తరచుగా ప్రస్తావిస్తున్నారు. ఇందులో వైరుధ్యం స్పష్టంగా, విస్మరించలేని విధంగా ఉంది. వామపక్ష ఉదారవాదులు ఇప్పుడు సునాలి తిరిగి రావడాన్ని ‘చారిత్రక సంఘటన’గా కీర్తిస్తున్నారు. వారు రోహింగ్యాలకు కూడా భారతదేశంలో పునరావాసం కల్పించాలని కోరుతున్నారు. ప్రధానమంత్రి మోదీ హయాంలో భారతదేశం ‘ముస్లిం వ్యతిరేకి’, ‘అసహనం’తో నిండిన దేశమని, ముస్లింలకు సురక్షితం కాదని దశాబ్దానికి పైగా అవిశ్రాంతంగా ప్రచారం చేసింది కూడా వీరే. ఈ వైరుధ్యాన్ని చూడండి. భారతదేశం ‘సురక్షితం’ కాకపోతే సునాలి తన తదుపరి బిడ్డను భారతదేశంలో కనాలని తీసుకున్న నిర్ణయంపై వారెందుకు అంతగా సంబరపడాలి? అందుకు బదులుగా ఆమె ‘సెక్యులర్ శ్రేయోభిలాషులు’ ఆమెకు అలాంటి నిర్ణయం తీసుకున్నందుకు హెచ్చరించాలి. బిజెపి ఆధిపత్యం గల భారతదేశంలో ఆ తల్లి, ఇంకా జన్మించని ఆమె బిడ్డ సురక్షితంగా ఉంటారా?
రోహింగ్యాలు భారత్ లో స్థిరపడేటట్టు చేయడానికి ఇప్పుడు ఎందుకు పట్టుదలతో ప్రయత్నాలు జరుగుతున్నాయి? ఈ ‘సెక్యులర్’ గుంపు విశ్వాసఘాతుక ప్రవర్తనను ఎలా వివరించాలి? ఈ వర్గం తన వలసవాద మనస్తత్వం కారణంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్ల తీవ్రమైన ద్వేషాన్ని పెంచుకుంది. మోదీపై దేశీయంగా, అంతర్జాతీయంగా బురద జల్లేందుకు సులభమైన వ్యూహాలలో ఒకటి – ఆయన నాయకత్వంలో భారతదేశం మైనారిటీలకు, ముఖ్యంగా ముస్లింలకు సురక్షితం కాదని ప్రచారం చేయడమే. నిజానికి భారతదేశంలోని ముస్లింలు అభద్రతా భావంతో ఉన్నారు. కానీ ఇది కొత్త పరిణామం కాదు. వారి అభద్రతా భావం, పరాయీకరణ శతాబ్దాలుగా ఉంది. 1707లో ఔరంగజేబు మరణం తర్వాత మొఘల్ సామ్రాజ్యం వేగంగా విచ్ఛిన్నం కావడం నుంచి ఇది మొదలైంది. ఫలితంగా, ముస్లింలు హిందువులను హింసించగలిగే సామర్థ్యం త్వరగా తగ్గిపోయింది. అధికారంలో వచ్చిన ఈ మార్పు వారిని కలవరపరిచింది, ఎందుకంటే వారు ఇకపై గతంలో వలె హిందువులను బాధించి మతపరమైన ‘పుణ్యం’ సంపాదించుకోలేకపోయారు.
మొఘల్ సామ్రాజ్యం పతనం తరువాత అప్పట్లో మరాఠా పతాకం భారతదేశం అంతటా ఎగురుతోంది. ముస్లింలు “అభద్రతా భావానికి గురై” విదేశీ ఆక్రమణదారుల సహాయం కోరారు. ఉత్తర భారత సూఫీ పండితుడు షా వలీవుల్లా దెహ్లావి – ఇతని మేధో వారసత్వం తదనంతరం తాలిబాన్‌ను ప్రేరేపించింది – ఆఫ్ఘన్ పాలకుడు అహ్మద్ షా అబ్దాలీని “కాఫిర్ల”పై ఇస్లామిక్ పాలనను తిరిగి స్థాపించడానికి భారతదేశంపై దండెత్తమని ఆహ్వానించాడు. మూడవ పానిపట్ యుద్ధంలో (1761) అబ్దాలీ విజయం భారతదేశాన్ని బలహీనపరిచింది. 1803 నాటికి దిల్లీలో ఆ తరువాత వచ్చిన బ్రిటీష్ ఆధిపత్యాన్ని సులభతరం చేసింది. వలీవుల్లా అబ్దాలీని పిలవకపోయి ఉంటే భారతదేశ చరిత్ర పూర్తిగా భిన్నమైన దిశ తీసుకుని ఉండేది. అయితే, భారతదేశాన్ని బ్రిటీష్ వారు ఆక్రమించిన తర్వాత, స్థానిక అధికార వ్యవస్థలు పూర్తిగా అంతర్ధానం కావడంతో కొంతకాలం పాటు హిందువులు, ముస్లింలు సమాన స్థాయిలో ఉన్నారు. రెండు వర్గాలు కలిసి రావడంతో 1857 తిరుగుబాటు జరిగింది. ఇది బ్రిటీష్ విజయంతో ముగిసింది.
తమ పాలనను కొనసాగించడానికి బ్రిటీష్ వారు పురాతన రోమన్ సామెత ‘విభజించి పాలించు’ను అమలు చేయడం ప్రారంభించారు. హిందువులను తమ ఇష్టానుసారం అణచివేసిన రోజులను తలచుకుని ఆ అవకాశం కోల్పోయినందుకు కుములిపోతున్న ముస్లిం నాయకత్వం, సంతోషంగా వలసవాద ఉచ్చులోకి నడిచి, బ్రిటీష్ వారికి మిత్రులుగా మారి, స్వాతంత్య్రం కోసం భారతదేశ పోరాటానికి నాయకత్వం వహిస్తున్న హిందువులను, భారత జాతీయ కాంగ్రెస్‌ను వ్యతిరేకించింది. తాము త్వరలో భారతదేశాన్ని విడిచిపెట్టాల్సి వస్తుందని బ్రిటీష్ వారు గ్రహించినప్పుడు, కమ్యూనిస్టుల సహాయంతో వారు ముస్లిం “అభద్రతా” భావాలను ఉపయోగించుకున్నారు. అభద్రతతో ఉన్న ముస్లిం నాయకత్వం మళ్లీ హిందూ రాజ్యం వస్తుందని, బ్రిటీష్ వారు వెళ్లిపోయి కాంగ్రెస్ స్వతంత్ర భారత్ నాయకత్వాన్ని చేపట్టిన తర్వాత ఇస్లాం ప్రమాదంలో పడుతుందనే భయాలను పెంచిపోషించింది. దీనిపై సందేహాలున్నవారు ముస్లిం లీగ్ ఏర్పాటు చేసిన 1938 నాటి పిర్పూర్ కమిటీ నివేదికను చదవాలి. ఈ నివేదికలో కాంగ్రెస్ ఒక హిందూ పునరుజ్జీవన పార్టీ అని, ముస్లిం వ్యతిరేకత ఉందని ‘ఆధారాల’తో ఆరోపించారు. ఈ కమిటీ చేసిన ఆరోపణలు, ఈ రోజు మోదీపైన, బిజెపిపైన ఇస్లామిస్టులు, ‘సెక్యులర్ పార్టీలు’, ముఖ్యంగా కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణల మాదిరిగానే ఉన్నాయని తెలుసుకుని ఆశ్చర్యపోవచ్చు.
ఆ కాలంలో మహాత్మా గాంధీ, పండిట్ నెహ్రూ, ఆచార్య కృపలాని, సర్దార్ పటేల్ వంటి కాంగ్రెస్ నాయకులు అభద్రతతో ఉన్న ముస్లిం సమాజానికి స్వతంత్ర భారతదేశంలో రక్షణ ఉంటుందని హామీ ఇవ్వడానికి తీవ్రంగా ప్రయత్నించారు. వారు ఎంత చిత్తశుద్ధితో, హృదయపూర్వకంగా ఈ అభ్యర్థనలు చేసినా ముస్లింలు ‘అభద్రతా భావం’లోనే ఉండిపోయారు. అభద్రతలో ఉన్న ముస్లింలు ఒక స్వతంత్ర ఇస్లామిక్ దేశం కోసం తమ డిమాండ్‌కు మద్దతుగా హింసాత్మక నిరసనలను జరిపారు, వాటికి నాయకత్వం వహించారు. ఫలితం: అనాదిగా అస్తిత్వంలో ఉన్న భారతదేశం ముక్కలైంది. లక్షల మంది అమాయకులు చనిపోయి, కోట్లమంది నిరాశ్రయులై, ప్రజలు అపరిమితమైన బాధలకు, అవమానాలకు గురై, రక్తం ఏరులై పారిన తర్వాత పాకిస్తాన్ ఆవిర్భవించింది. కనుక ప్రధానమంత్రి మోదీ పాలిస్తున్న భారతదేశంలో ముస్లింలు అభద్రతా భావంతో ఉన్నారనే కథనం ఆశ్చర్యం కలిగించదు. మోదీ లేదా ఆర్‌ఎస్‌ఎస్ పుట్టకముందే ముస్లింలు చాలా కాలంగా ‘అభద్రత’తో ఉన్నారు.
భారతదేశంలోని ముస్లింలు — షియా లేదా సున్నీ, దేవబందీ లేదా బరేల్వీ — సమాన హక్కులను మాత్రమే కాక తరచుగా హిందూ మెజారిటీ కంటే ఎక్కువ రాజ్యాంగ రక్షణలను కూడా అనుభవిస్తున్నారు. ఇది కేవలం ‘సెక్యులర్ రాజ్యాంగం’ ఫలితం కాదు. భారతదేశ బహుళత్వం వేల సంవత్సరాలుగా బహుళత్వాన్ని, సహజీవనాన్ని స్వీకరించిన నాగరికతలో వేళ్లూనుకుని ఉంది. దీనికి విరుద్ధంగా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌లో ప్రతి సంవత్సరం వందలమంది ముస్లింలు తోటి ముస్లింల చేతిలో హతమవుతున్నారు. ఈనాటి ముస్లింలు భారతదేశంలో ఎందుకు అభద్రతా భావంతో ఉన్నారు? వరుసగా భారత్ పై దాడి చేసిన ఇస్లామిక్ ఆక్రమణదారులు హిందువులపై చేసిన అఘాయిత్యాలకు ఈనాటి ముస్లింలను ఎవరూ బాధ్యులను చేయరు. కానీ ఉపఖండంలోని ముస్లింలలో గణనీయమైన భాగం గజనీ, ఘోరీ, బాబర్, ఔరంగజేబు, టిప్పు సుల్తాన్ వంటి వ్యక్తులను ఎందుకు కీర్తిస్తున్నారు? వారిని తమవారిగా ఎందుకు గుర్తిస్తున్నారు? ఒక వ్యక్తిని (కాల్పనికమైనా, చారిత్రకమైనా) కీర్తించడం అంటే వారి చర్యలను ఆమోదించడాన్ని, వాటిని అనుకరించాలనే బలమైన కోరికను సూచిస్తుంది. ఒక ఇటీవలి పరిణామం ఈ వాదనకు బలాన్ని చేకూర్చింది. డిసెంబర్ 6న సస్పెండ్ అయిన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ ముర్షిదాబాద్‌లో “బాబ్రీ మసీదు”కు పునాది రాయి వేశారు. దీనికి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. మసీదును నిర్మించడం సమస్య కాదు – భారతదేశ బహుళత్వ స్ఫూర్తి అన్ని మత విశ్వాసాలను స్వాగతిస్తుంది. కానీ దానికి బాబర్ పేరు ఎందుకు పెట్టాలి? ఆ పేరు భారతీయ మనస్సులో ఆయన సహచరుడు మీర్ బాకీ అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి ఆలయాన్ని ధ్వంసం చేయడాన్ని, దానిని తిరిగి పొందడానికి తదుపరి తరాల హిందువులు చేసిన అంతులేని పోరాటాన్ని గుర్తు చేస్తుంది.
బాబర్ జిహాద్ ద్వారా మొఘల్ పాలనను స్థాపించాడు, తనను తాను ‘ఘాజీ’గా పిలుచుకున్నాడు. అంటే అవిశ్వాసులతో (ఇస్లామేతరులతో) పోరాడటానికి అంకితమైన ఇస్లామిక్ యోధుడు. బాబర్ వంటి వ్యక్తులను ఆదర్శప్రాయులుగా చూడటం ఒక అంతులేని విషవలయాన్ని ప్రారంభిస్తుంది. ముస్లింలలోని అధిక ‘అభద్రత’ ఈ చర్య-ప్రతిచర్య రుగ్మత ఫలితమే. ‘సెక్యులరిస్టుల’ ప్రభావానికి లోనైన ముస్లింలలో ఒక వర్గం ఇస్లామిక్ ‘వీరులను’ కీర్తించాలని కోరుకుంటుంది. వారిని, వారి ఘాతుకాలను అనుకరించాలని ఆకాంక్షిస్తుంది. ఇది అనివార్యంగా ఈ మధ్యయుగ, జిహాదీ మనస్తత్వాన్ని వ్యతిరేకించాలని నిర్ణయించుకున్న పునరుజ్జీవనం పొందుతున్న భారతదేశంతో సంఘర్షణకు దారితీస్తుంది. హిట్లర్‌ను ప్రశంసిస్తూ అతని భయంకరమైన మారణహోమాన్ని విస్మరిస్తూ యూదులతో నిజమైన స్నేహాన్ని ఏర్పరచుకోవడం ఎలా ఆచరణ సాధ్యంకాదో ఇదీ అంతే.
బల్బీర్ పంజ్

