Dhruv 02

ధ్రువ్ 64: మైక్రో చిప్ రంగంలో భారత్ పురోగమనం

భారత్ సెమీకండక్టర్ రంగంలో ఒక చారిత్రాత్మక మైలురాయిని అధిగమించింది. స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన మొట్టమొదటి 1.0 గిగాహెట్జ్, 64-బిట్ డ్యూయల్-కోర్ మైక్రోప్రాసెసర్ ధ్రువ్ 64ను విజయవంతంగా ఆవిష్కరించింది. డిజిటల్ ఇండియా RISC-5 వంటి జాతీయ కార్యక్రమాల అండతో చిప్ డిజైన్, తయారీలో భారత్ స్వయం సమృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సి-డాక్) వారు ‘మైక్రోప్రాసెసర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్’ (MPD) కింద ఈ ధ్రువ్ 64ను అభివృద్ధి చేశారు. ఇది కేవలం ఒక చిప్ మాత్రమే కాదు, భారతదేశ వ్యూహాత్మక, వాణిజ్య అవసరాలను తీర్చే ఒక శక్తిమంతమైన సాధనం. ధ్రువ్ 64 విజయం తర్వాత, తదుపరి తరం ప్రాసెసర్లు అయిన ధనుష్, ధనుష్+ ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్నాయి. మైక్రోప్రాసెసర్లు ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలకు మెదడు వంటివి. మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు, కార్లు, వైద్య పరికరాలు, రక్షణ వ్యవస్థలు, శాటిలైట్లలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. విదేశీ సరఫరాదారులపై ఆధారపడటం తగ్గించుకోవడానికి ఇలాంటి కోర్ (కీలక) టెక్నాలజీలను సొంతంగా కలిగి ఉండటం భారత్‌కు అత్యవసరం.

ధ్రువ్ 64 ప్రత్యేకతలు, ఉపయోగాలు

ధ్రువ్ 64 ఆధునిక ఆర్కిటెక్చర్ ఫీచర్లతో నిర్మితమైంది. ఇది మెరుగైన మల్టీటాస్కింగ్ సామర్థ్యాన్ని, అధిక విశ్వసనీయతను కలిగి ఉంటుంది. దీనిని కింది రంగాలలో విస్తృతంగా ఉపయోగించవచ్చు:

  • 5G మౌలిక సదుపాయాలు: వేగవంతమైన డేటా ప్రాసెసింగ్ కోసం.
  • ఆటోమోటివ్ సిస్టమ్స్: స్మార్ట్ కార్లు, వాహన నియంత్రణ వ్యవస్థల్లో.
  • పారిశ్రామిక ఆటోమేషన్: పరిశ్రమలలో యంత్రాల పనితీరును పర్యవేక్షించడానికి.
  • ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT): అనుసంధానించిన పరికరాల నిర్వహణకు.

వ్యూహాత్మక ప్రాముఖ్యత

ప్రపంచవ్యాప్తంగా తయారయ్యే మైక్రోప్రాసెసర్లలో భారత్ సుమారు 20 శాతం వినియోగిస్తోంది. ధ్రువ్ 64 వంటి స్వదేశీ చిప్‌ల అభివృద్ధి వల్ల దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుంది. గత కొన్ని ఏళ్లుగా భారత్ నిర్మించుకున్న మైక్రోప్రాసెసర్ పర్యావరణ వ్యవస్థను ఇది మరింత బలోపేతం చేస్తుంది.

ధ్రువ్ 64 కేవలం ఒక ఉత్పత్తి మాత్రమే కాదు, ఇది ఒక కొత్త ఆవిష్కరణల యుగానికి నాంది.

  1. స్టార్టప్‌లకు ఊతం: విదేశీ ప్రాసెసర్లపై ఆధారపడకుండా తక్కువ ఖర్చుతో కొత్త కంప్యూటింగ్ ఉత్పత్తులను తయారు చేయవచ్చు.
  2. నైపుణ్యం కలిగిన మానవ వనరులు: ప్రపంచ చిప్ డిజైన్ ఇంజనీర్లలో 20% మంది భారతీయులే. ధ్రువ్ 64 ప్రాజెక్టు ద్వారా మరిన్ని వేల మంది నిపుణులు తయారవుతారు.
  3. తక్కువ ఖర్చు: స్వదేశీ డిజైన్ వల్ల ప్రోటోటైప్ తయారీ ఖర్చు గణనీయంగా తగ్గుతుంది.

డిజిటల్ ఇండియా RISC-5 (DIR-5)

భారత ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతలో భాగంగా DIR-5 కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీని ప్రధాన ఉద్దేశ్యం భారతదేశాన్ని ఎలక్ట్రానిక్స్ వ్యవస్థల డిజైన్, తయారీ కేంద్రంగా మార్చడం.

RISC-5 ఆర్కిటెక్చర్ ప్రాముఖ్యత: RISC-5 అనేది ఒక ఓపెన్ ఆర్కిటెక్చర్. దీనికి ఎటువంటి లైసెన్స్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది పరిశ్రమలు, స్టార్టప్‌లు, పరిశోధనా సంస్థల మధ్య ఉమ్మడి ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది.

అభివృద్ధి పథంలో మరిన్ని అడుగులు

ధ్రువ్ 64 DIR-5 కింద తయారు చేసిన మూడవ చిప్.

  • తేజస్ 32 : మలేషియాలోని సిల్టెరా ప్లాంట్ లో తయారైంది.
  • తేజస్ 64 : మొహాలీలోని సెమీకండక్టర్ ల్యాబ్ లో స్వదేశీంగా తయారైంది.
  • ధ్రువ్ 64 విజయవంతం కావడంతో, ఇప్పుడు మరింత శక్తిమంతమైన ధనుష్ 64, ధనుష్ 64+ సిస్టమ్ ఆన్ చిప్ (SOC) లపై పని జరుగుతోంది.

ప్రోత్సాహక సంస్థలు, పథకాలు

భారతదేశ సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ అనేక పథకాలను అమలు చేస్తోంది:

  • ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM): 2021లో ప్రారంభమైన ఈ మిషన్ కింద 2025 నాటికి రూ.1.6 లక్షల కోట్ల పెట్టుబడితో 10 ప్రాజెక్టులను ఆమోదించారు.
  • చిప్స్ టు స్టార్టప్ (C2S): ఐదేళ్ల కాలానికి రూ.250 కోట్ల కేటాయింపుతో 85,000 మంది నిపుణులను తయారు చేయడమే దీని లక్ష్యం.
  • డిజైన్ అనుసంధానిత ప్రోత్సాహకం (DLI): చిప్ డిజైన్ చేసే కంపెనీలకు ఆర్థిక ప్రోత్సాహకాలు, మౌలిక సదుపాయాల మద్దతును అందిస్తుంది.
  • ISUP-I2I: పరిశోధకులకు, విద్యార్థులకు జాతీయ స్థాయి నానో ఫ్యాబ్రికేషన్ సౌకర్యాలను అందుబాటులోకి తెస్తుంది.

సెమీకండక్టర్ రంగంలో భారతదేశం సాధిస్తున్న ప్రగతి ఆత్మనిర్భర్ భారత్ సంకల్పానికి నిదర్శనం. ధ్రువ్ 64 ఆవిష్కరణతో భారత్ తన సొంత ప్రాసెసర్ పర్యావరణ వ్యవస్థను నిర్మించుకోవడంలో కీలక అడుగు వేసింది. ప్రభుత్వం, విద్యాసంస్థలు, పరిశ్రమల సమన్వయంతో భారత్ భవిష్యత్తులో ప్రపంచ సెమీకండక్టర్ మార్కెట్‌లో అగ్రగామిగా ఎదగడం ఖాయం. తేజస్ నుంచి ధ్రువ్ వరకు, ఇప్పుడు ధనుష్ దిశగా సాగుతున్న ఈ ప్రయాణం భారత సాంకేతిక పటిమను ప్రపంచానికి చాటిచెబుతోంది.