299 టీఎంసీలకు సంతకం చేయడం రాష్ట్రానికి ‘మరణ శాసనం’

కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు నిజమైన న్యాయం జరగాలంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ట్రిబ్యునల్ ద్వారానే సాధ్యమని కేంద్ర జలవనరుల మంత్రిత్వ శాఖ మాజీ సలహాదారు, మహారాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వెదిరె శ్రీరామ్ స్పష్టం చేశారు. 2015లో కృష్ణా జలాల వాటా ఒప్పందంలో 299 టీఎంసీకి సంతకం చేయడం గత 10 ఏళ్లుగా తెలంగాణకు ‘మరణ శాసనం’గా మారిందన్నారు. పాలమూరు-రంగారెడ్డి డీపీఆర్ ను కేంద్రం తిప్పిపంపిందనడం వాస్తవం కాదని, డీపీఆర్ లో తగురీతిలో వివరాలు లేకపోవడంతో సమగ్ర వివరాలు పంపించమని మాత్రమే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిందన్నారు.

కృష్ణా జలాలు, పాలమూరు-రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ విషయంలో బిజెపిపై, కేంద్ర ప్రభుత్వంపై మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తప్పుడు ఆరోపణలు చేసిన నేపథ్యంలో డిసెంబర్ 23న బిజెపి రాష్ట్ర కార్యాలయంలో వెదిరె శ్రీరామ్ కృష్ణా జలాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు కనీసం 500 టీఎంసీ నీళ్ల కోసం గట్టిగా పట్టుబట్టాల్సిన సమయంలో, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం 299 టీఎంసీలకే ఒప్పుకొని సంతకాలు చేయడం తెలంగాణకు తీరని నష్టం చేసింది. తెలంగాణ తరఫున సమర్థంగా వాదించి ఉంటే కనీసం 400–450 టీఎంసీ వరకు నీళ్లు పొందే అవకాశం ఉండేది. పాలమూరు–రంగారెడ్డి, కల్వకుర్తి, నెట్టెంపాడు, ఎస్‌ఎల్‌బీసీ, దిండి, కోయిల్ సాగర్ వంటి ప్రధాన ప్రాజెక్టులకు అవసరమైన నీళ్లను 2015 వాటర్ షేరింగ్ అగ్రిమెంట్‌లో చేర్చకపోవడం ఘోర తప్పిదం. ఈ ప్రాజెక్టులకు కనీసంగా 261.7 టీఎంసీ నీళ్లు అవసరం ఉన్నప్పటికీ, వాటిని పరిగణనలోకి తీసుకోకుండా 299 టీఎంసీలకే ఒప్పుకోవడం అన్యాయం. 299 టీఎంసీ అనేది ఒక్క సంవత్సరానికే అన్న వాదన పూర్తిగా అవాస్తవం. 2016 అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కూడా మరో ఏడాది పాటు అదే ఒప్పందాన్ని కొనసాగిస్తూ అప్పటి ముఖ్యమంత్రులు సంతకాలు చేశారు. దీనికి సంబంధించిన అధికారిక డాక్యుమెంట్లతో సహా ఆధారాలు ఉన్నాయి. 

2016 నుంచి 2020 వరకు ప్రతి సంవత్సరం 299 టీఎంసీ వాటాను కొనసాగిస్తూ సంతకాలు జరిగాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, గత 10 ఏళ్లలో ఒక్క సంవత్సరం కూడా తెలంగాణ 299 టీఎంసీ నీళ్లను పూర్తిగా వినియోగించుకోలేకపోయింది. ప్రాజెక్టులు పూర్తయ్యాయని చెబుతున్నప్పటికీ, కెనాల్స్, డిస్ట్రిబ్యూటరీలు, కమాండ్ ఏరియా డెవలప్‌మెంట్ లేకుండా ఒక్క ఎకరాకు కూడా నీళ్లు అందని పరిస్థితి ఉంది. ఎన్నికల ముందు మోటార్లు ఆన్ చేసి ‘ప్రాజెక్ట్ పూర్తి’ అన్న భావన కల్పించడమే తప్ప, రైతులకు వాస్తవంగా నీళ్లు అందలేదు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్‌లోని పరిమితుల వల్ల తెలంగాణకు అన్యాయం జరిగింది, దీనిని సరిదిద్దేందుకు మోదీ ప్రభుత్వం 6 అక్టోబర్ 2023న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి కొత్త టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఇచ్చింది. కొత్త ట్రిబ్యునల్ ప్రక్రియలో తెలంగాణ ప్రభుత్వం సమర్థంగా వాదిస్తే, 600–700 టీఎంసీల వరకు నీళ్లను రాష్ట్రానికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ విషయంలో అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని ఆలస్యం చేయడం వల్లే ఏపీకి వర్క్ ఆర్డర్లు ఇచ్చే అవకాశం దొరికింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాల హయాంలో పోతిరెడ్డిపాడు ద్వారా నాలుగు టీఎంసీలుగా ఉన్న నీళ్ల చోరీ 10 టీఎంసీలకు పెరిగింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కొత్త ట్రిబ్యునల్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ద్వారా కృష్ణా బేసిన్ మొత్తాన్ని శాస్త్రీయంగా పునర్విభజించే అవకాశం ఏర్పడింది, అయితే రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతమైన టెక్నికల్, లీగల్ వాదనలు వినిపించకపోతే ఈ అవకాశాన్ని కూడా కోల్పోయే ప్రమాదం ఉంది.” అని అన్నారు.