బూత్ నుంచే బలోపేతం కావాలి!
రానున్న మున్సిపల్, జీహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, బూత్ స్థాయి నుంచే పార్టీని మరింత బలోపేతం చేయాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రతి బూత్‌ను బలమైన యూనిట్‌గా తీర్చిదిద్దుతూ, ప్రజలతో మమేకమవ్వాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలని, అదే రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. జనవరి 5న బిజెపి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన బూత్ నిర్మాణ అభియాన్ రాష్ట్ర స్థాయి కార్యశాలలో ఆయన ప్రసంగిస్తూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ‘‘ప్రతి బూత్‌లో కార్యకర్తలకు ఆయా బూత్‌లలోని ఓటర్లపై పూర్తి అవగాహన ఉండాలి. గత ఎన్నికల్లో ఏ బూత్‌లలో తక్కువ ఓట్లు వచ్చాయో గుర్తించాలి. కొన్ని బూత్‌లలో మొదటి స్థానం, మరికొన్నింటిలో రెండో స్థానం సాధించామని గుర్తుంచుకోవాలి. బలహీనతలను బలంగా మార్చాలి. ఉత్తరప్రదేశ్‌లో తొలిసారిగా పన్నా ప్రముఖ్ వ్యవస్థను విజయవంతంగా అమలు చేశారు. గుజరాత్లో కూడా అదే విధానం అనుసరించారు. ప్రతి 50 మంది ఓటర్లకు ఒక కార్యకర్త ఉండేలా పన్నా ప్రముఖ్ నిర్మాణం జరగాలి. ప్రతి బూత్‌ను మనమే సంరక్షించుకోవాలి.
బూత్ నిర్మాణ అభియాన్ అనేది పార్టీ భవిష్యత్తు ఎన్నికలకు పునాది. పార్టీలో బూత్ అధ్యక్షుడే అత్యంత కీలకమైన వ్యక్తి. బూత్ ప్రెసిడెంట్ పార్టీకి మూలస్తంభం. పునాది బలంగా ఉన్నప్పుడే పార్టీ బలంగా ఎదుగుతుంది. బూత్ కమిటీల నిర్మాణమే అసలు లక్ష్యం. బూత్ నిర్మాణం అనేది ఒక రోజు పని కాదు. ఇది నిరంతర బాధ్యత. ప్రతి కార్యకర్త దీనిని తన వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలి. మండల స్థాయి వరకు సంస్థాగత నిర్మాణ పనిని విస్తరించాలి. బూత్ కమిటీ, మండల కమిటీ, జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ – ఇలా అన్ని స్థాయిల్లో కమిటీల నిర్మాణం పూర్తి స్థాయిలో జరగాలి. తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ ప్రభావం, ప్రజాభిమానంతో 8 సీట్లు గెలుచుకున్నాం. అదే ఊపులో పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేస్తే, తెలంగాణలో 16 పార్లమెంట్ సీట్లు గెలుచుకునే సామర్థ్యం బిజెపికి ఉంది.’’ రాంచందర్ రావు అన్నారు.
ఈ సమావేశంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ అభయ్ పాటిల్, రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డా. ఎన్. గౌతం రావు, తూళ్ల వీరేందర్ గౌడ్, వేముల అశోక్, రాష్ట్ర కార్యదర్శి రవికుమార్, భరత్, బిజెపి రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్.వి.సుభాష్, తదితర నాయకులు పాల్గొన్నారు.

