reforms

2025లో వేగం పుంజుకున్న సంస్కరణలు

2025 సంవత్సరం ముగిసిన వేళ నరేంద్ర మోదీ భారత ప్రధానమంత్రిగా తన 12వ ఏడాదిని పూర్తి చేసుకున్నారు. చాలా ప్రజాస్వామ్య దేశాల్లో ఇంత సుదీర్ఘ కాలం అధికారంలో ఉండటం అరుదు. ఒకవేళ ఉన్నా, అది సాధారణంగా పాలనపై పట్టు సాధించడం, జాగ్రత్తగా అడుగులు వేయడం లేదా తమ వారసత్వాన్ని కాపాడుకోవడానికే పరిమితమవుతుంది. కానీ భారత్ విషయంలో మాత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా, ఆశ్చర్యకరంగా ఉంది. ఇక్కడ గడిచిన ప్రతి ఏడూ ఒక విలక్షణమైన ఆలోచనతో సాగడమే కాకుండా, చెరగని ముద్ర వేసింది.

  • 2014: ‘జన్ ధన్’ పథకంతో బ్యాంకింగ్‌ను కేవలం కొందరికే పరిమితమైన సౌకర్యం నుంచి అందరికీ అందుబాటులో ఉండే ఒక మౌలిక వసతిగా మార్చారు. భవిష్యత్తులో నిర్మించబోయే అనేక ఆర్థిక పథకాలకు ఇది పునాది వేసింది.
  • 2015: ‘డిజిటల్ ఇండియా’కు బీజం వేశారు. ఇది కేవలం పథకాల ఆధారిత ప్రభుత్వం నుంచి ఒక ‘ప్లాట్‌ఫామ్ రాజ్యం’గా భారత్‌ను మార్చింది.
  • 2016: ‘స్టార్టప్ ఇండియా’ను ప్రారంభించి, భారత మధ్యతరగతి, ఆకాంక్షభరిత వర్గాల్లో వ్యవస్థాపక సంస్కృతిని సాధారణం చేశారు.
  • 2017: వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని అమలులోకి తెచ్చి, భారత ఆర్థిక ఏకీకరణను, ఉమ్మడి సమాఖ్య సార్వభౌమత్వాన్ని సంపూర్ణం చేశారు.
  • 2018: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ నిధుల ఆరోగ్య బీమా కార్యక్రమం ‘ఆయుష్మాన్ భారత్’ను ప్రారంభించారు.
  • 2019: అధికరణం 370 రద్దుతో భారత్ రాజకీయ ఏకీకరణలో మిగిలిపోయిన ఒక చారిత్రక కర్తవ్యాన్నీ పూర్తి చేశారు.
  • 2020: ప్రపంచ మహమ్మారి సమయంలో, పేదలకు ఆహార భద్రత కల్పించడానికి ‘పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన’ను తీసుకువచ్చారు.
  • 2021: ‘పీఎం గతి శక్తి’ని ప్రవేశపెట్టి, భారీ స్థాయిలో మౌలిక సదుపాయాల ప్రణాళిక, అమలు విధానాన్ని సమూలంగా మార్చేశారు.
  • 2022: ‘అగ్నిపథ్’ ద్వారా సైనిక నియామకాల్లో సంస్కరణలు తెచ్చారు.
  • 2023: మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించి, ‘మహిళల నేతృత్వంలో అభివృద్ధి’ దిశగా నిర్ణయాత్మక అడుగు వేశారు.
  • 2024: 500 ఏళ్ల వనవాసం తర్వాత అయోధ్యలో శ్రీరామచంద్రుడు తన నివాసానికి తిరిగి రావడం ఈ ఏడాది ప్రత్యేకత.

ఇంతటి అద్భుతమైన విజయాలు సాధించినా 2025 మాత్రం గడచినా అన్ని సంవత్సరాల కంటే ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇది కేవలం ఏదో ఒక రంగంలో భారీ సంస్కరణను తెచ్చినందుకు కాదు; ఏకకాలంలో ఆర్థిక వ్యవస్థ, ఇంధనం, వ్యవసాయం, భద్రత, కార్మిక రంగం, సుపరిపాలనలో పలు నిర్మాణాత్మక నిర్ణయాలను అమలు చేసినందుకు.

జీఎస్టీ 2.0, ఆర్థిక సంస్కరణలు

2025లో ‘జీఎస్టీ 2.0’ అమలు భారత విధాన నిర్ణయాల్లో అత్యంత అరుదైన ఫలితాన్ని సాధించింది; అది రాష్ట్రాల ఏకాభిప్రాయంతో పన్ను హేతుబద్ధీకరణ జరగడం. పన్ను రేట్లను మోదీ ప్రభుత్వం సరళతరం చేసింది. దీనివల్ల వినియోగదారులపై భారం తగ్గింది. నిబంధనల అమలు సులభమైంది. ఇది బలవంతంగా కాకుండా, ఎనిమిదేళ్ల సహకారాత్మక సమాఖ్య స్ఫూర్తితో నిర్మించిన నమ్మకం వల్ల సాధ్యమైంది. జీఎస్టీ 2.0 కేవలం పన్ను సవరణ మాత్రమే కాదు; దేశంలో ఏకాభిప్రాయంతో కూడిన భారీ సంస్కరణలు ఇప్పటికీ సాధ్యమేననడానికి ఉదాహరణ.

ఇంధన రంగంలో విప్లవం ‘శాంతి’ బిల్లు

ఈ ఏడాది అత్యంత కీలకమైన ఆర్థిక సంస్కరణ ఇంధన రంగంలో చోటుచేసుకుంది. గతంలో భారత్ అత్యంత జాగ్రత్తగా వ్యవహరించిన అణుశక్తి రంగంలోకి ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ఆహ్వానిస్తూ ‘శాంతి’ బిల్లును తెచ్చారు. పాత చట్టాలను పక్కన పెట్టి, కఠినమైన పర్యవేక్షణలో ప్రైవేట్ సంస్థలు అణు విద్యుత్ ప్లాంట్లను నిర్మించడానికి, నిర్వహించడానికి అనుమతించడం ఒక సాహసోపేతమైన ముందడుగు. వాతావరణ పరిరక్షణ లక్ష్యాలు, ఇంధన భద్రత అవసరమైన ఈ తరుణంలో శుద్ధ ఇంధనం దిశగా భారత్ ప్రయాణంలో ఇది ఒక కీలకమైన మలుపుగా నిలుస్తుంది.

వ్యవసాయ రంగం: పీఎం ధన ధాన్య యోజన

రాజకీయంగా సున్నితమైనదిగా పరిగణించే వ్యవసాయ రంగంలో కూడా కీలక మార్పులు వచ్చాయి. ‘పీఎం ధన ధాన్య యోజన’ ద్వారా వెనుకబడిన వ్యవసాయ జిల్లాలను లక్ష్యంగా చేసుకుని పెట్టుబడులు, పథకాల అనుసంధానం, ఫలితాల ఆధారిత పర్యవేక్షణను ప్రభుత్వం చేపట్టింది. ఇకపై కేవలం మద్దతు ధరలు లేదా సబ్సిడీలకే పరిమితం కాకుండా ఉత్పాదకత, పంటల వైవిధ్యీకరణ, నీటి పారుదల, గిడ్డంగి సౌకర్యాలపై దృష్టి సారించింది. 

అంతర్గత, బాహ్య భద్రత

2025లో వామపక్ష తీవ్రవాదాన్ని దాదాపుగా నియంత్రణలోకి తీసుకురావడం ఒక చారిత్రక ఘట్టం. ఇది దశాబ్ద కాలంగా భద్రతా కార్యకలాపాలు, మౌలిక సదుపాయాల కల్పన, సంక్షేమ పథకాలను మేళవించిన వ్యూహం వల్ల సాధ్యమైంది. ఒకప్పుడు ‘విముక్త మండలాలు’గా పిలవబడే ప్రాంతాలు నేడు రాజ్యాంగబద్ధమైన పరిపాలనతో కూడిన సాధారణ స్థితికి చేరుకున్నాయి. బాహ్య భద్రత విషయంలో భారత రక్షణ విధానం ‘ఆపరేషన్ సింధూర్’తో కొత్త శిఖరాలకు చేరింది. అణు ఆయుధాలు కలిగిన శత్రు దేశంపై క్షిపణి దాడుల ద్వారా భారత్ తన సత్తా చాటింది. అణు సామర్థ్యం ఉన్నంత మాత్రాన ప్రతీకార దాడుల నుంచి రక్షణ ఉండదని పాకిస్తాన్‌కు స్పష్టమైన సందేశం పంపింది. ‘ఉగ్రవాదం అంటే యుద్ధంగానే చూస్తాం’ అనే కొత్త విధానాన్ని భారత్ ఇక్కడ అమలు చేసి చూపింది.

పాలన, ఇతర సంస్కరణలు

రాజకీయంగా ఎవరూ ముట్టుకునే సాహసం చేయని ‘వక్ఫ్ (సవరణ) చట్టం, 2025’ను తీసుకురావడం ద్వారా భూ పరిపాలనలో దశాబ్దాల పారదర్శకత లేని విధానానికి ప్రభుత్వం ముగింపు పలికింది. అలాగే, కాలం చెల్లిన కార్మిక చట్టాల స్థానంలో కొత్త లేబర్ కోడ్‌లను అమలులోకి తెచ్చింది. మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు పరిమితిని రూ.12 లక్షలకు పెంచడం (2014లో ఇది కేవలం రూ.2 లక్షలు), రిజర్వు బ్యాంకు తన నిబంధనల సంఖ్యను 9,000 నుండి 244కు తగ్గించడం, బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (FDI) సంస్కరణలు, పలు దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (FTAలు) ఈ ఏడాది సాధించిన మరికొన్ని విజయాలు.

 సాధారణంగా ఏ నాయకుడైనా అధికారంలోకి వచ్చిన కొత్తలో సంస్కరణలు వేగంగా తీసుకువస్తారు. కానీ కాలక్రమేణా ఆ ఉత్సాహం తగ్గుతుంది. కానీ ప్రధాని మోదీ విషయంలో అందుకు భిన్నంగా జరుగుతోంది. పన్నెండవ ఏట కూడా ఆయన మునుపటి కంటే రెట్టింపు వేగంతో సంస్కరణలు చేపడుతున్నారు. 2025లో జరిగిన ఎన్నికల విజయాలు కూడా దీనికి అద్దం పడుతున్నాయి. 2026 కోసం ఉన్నత విద్య పునర్వ్యవస్థీకరణ నుంచి ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక’ వరకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయి. 2025 సాధించిన ఫలితాలు, 2026 కోసం సిద్ధం చేసిన లక్ష్యాలు.. ప్రజాస్వామ్య పాలనలో ప్రపంచానికే ఒక కొత్త ప్రమాణాన్ని నిర్దేశిస్తున్నాయి.

అఖిలేష్ మిశ్రా,
బ్లూక్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్ సీఈఓ