Revanth Reddy

ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు భయపడుతున్న రేవంత్!

మొదట సర్పంచ్ ఎన్నికల్లో, ఆ తర్వాత మునిసిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి తిరుగులేని విజయం కట్టబెట్టానని ప్రచారం చేసుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిపేందుకు భయపడుతున్నట్లు కనిపిస్తున్నది. మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే వాటి ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తామని చెప్పుకొంటూ వచ్చిన కాంగ్రెస్ నేతలు, మంత్రులు ఇప్పుడు ఆ ప్రస్తావనే తీసుకు రావడం లేదు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని, పుష్కలంగా ఆర్థిక వనరులను విరజిమ్మినా పురపాలక ఎన్నికల్లో 40 శాతం ఓట్లు కూడా పడకపోవడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు తెలుస్తున్నది. సాధారణంగా స్థానిక ఎన్నికలలో అధికార పార్టీ 70 నుండి 80 శాతం వరకు సీట్లు గెల్చుకోవడం ఎక్కడైనా జరుగుతుంది. కానీ ఎన్ని అడ్డదారులు ఆశ్రయించినా 52 శాతం మించి రాకపోవడంతో ఖంగుతిన్నట్లు అయింది.

దిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లిఖార్జున ఖర్గే వంటి అగ్రనేతలు తెలంగాణలో కాంగ్రెస్ విజయం చూసి అభినందనలు కురిపించారని పైకి ప్రచారం చేసుకుంటున్నా కాంగ్రెస్ వర్గాల్లో అంతర్గతంగా ఆందోళనకర పరిస్థితులు వ్యక్తం అవుతున్నాయి. మున్సిపల్ ఫలితాల పట్ల మంత్రుల వద్దనే ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. ఇప్పుడు వెంటనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లేందుకు వెనకడుగు వేస్తున్నారు. అంతా సవ్యంగా సాగితే జూన్‌ తరువాత ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల గురించి ఆలోచన చేద్దామని సీఎం రేవంత్‌రెడ్డి సహచర మంత్రులతో అన్నట్టు చెబుతున్నారు.

ఆరు గ్యారెంటీల్లో ప్రధానంగా మహిళలకు రూ.2,500, తులం బంగారం, ఆసరా పింఛన్‌ పెంపు హామీలు ఇప్పటివరకు అమలు చేయకపోవడంతో గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర వ్యతిరేకత గూడు కట్టుకొని ఉన్నట్టు తెలుస్తుండడంతో రేవంత్‌రెడ్డి పరిషత్‌ ఎన్నికలపై విముఖతతో ఉన్నట్టు తెలిసింది. 2024 జూన్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీకాలం ముగిసింది. దాదాపు 19 నెలల నుంచి ఆశావహులు ప్రాదేశిక ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది ఫిబ్రవరి 10న జీహెచ్‌ఎంసీ పాలకమండలి గడువు కూడా తీరింది. ఈ ఎన్నికలు కూడా నిర్వహించాలని పార్టీ శ్రేణుల నుంచి ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో మార్చిలో ఎన్నికల ప్రక్రియ ముగించాలని ముందుగా నిర్ణయించినట్టు సమాచారం. అయితే ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి మెజారిటీ స్థానాలు వచ్చినట్టు కనిపిస్తున్నా, అధికార పార్టీకి రావాల్సిన స్థాయిలో ఓట్లు పడలేదని సీఎం రేవంత్‌రెడ్డి ఆందోళనతో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. పైగా పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఎక్కువ ఉన్నదని ప్రభుత్వానికి నివేదికలు అందాయని తెలుస్తున్నది.

మార్చి 31లోపు బడ్జెట్‌ సమావేశాలు నిర్వహించాల్సి ఉండడంతో మార్చి రెండో వారంలో నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు ముందు 42 శాతం బీసీ రిజర్వేషన్లపై మరోసారి పూర్తిస్థాయి చర్చ పెట్టాలని ఒక వర్గం మంత్రులు సూచించగా చాలామంది పెదవి విరుస్తున్నట్లు చెబుతున్నారు. రిజర్వేషన్లపై ఆరాటం తప్ప ప్రజల్లో చర్చే లేదని పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో తేలిపోయిందని, పార్టీపరంగా కిప్పుడు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చే అవకాశం లేదని, కోర్టుల్లో కూడా ఇది త్వరగా తేలదని, రిజర్వేషన్లపై చర్చ అనవసరమని భావిస్తున్నట్లు తెలిసింది. తాజా ఎన్నికల్లో పార్టీ పనితీరును అధిష్ఠానం ప్రశంసించడంపై స్వయంగా కాంగ్రెస్ ఎమ్యెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. ఉప ఎన్నికలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు ఎప్పుడూ అధికార పార్టీకే అనుకూలంగా ఉంటాయని స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచారని, మునుగోడు ఉప ఎన్నికలోనూ బీఆర్‌ఎస్‌ గెలిచిందని గుర్తుచేశారు. నిజంగా ప్రజల్లో ఏం ఉన్నది? మనం ఇచ్చిన హామీలు ఎంత మేరకు నెరవేర్చాం? అన్నది ముఖ్యమని అంటూ నేరుగా రేవంత్ రెడ్డి పాలనపై విమర్శలు గుప్పించారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇన్ని శాఖలను తన వద్దే పెట్టుకున్నారా? అని ప్రశ్నించారు.

కృష్ణ చైతన్య