ఇటు మూసీ బాధితులు.. అటు వెలుగుమట్ల నిరాశ్రయులు.. పీడితులకు అండగా బిజెపి
తెలంగాణలో కాంగ్రెస్ అరాచక పాలనలో బలవుతున్న వారికి బిజెపి అండగా నిలుస్తోంది. అభివృద్ధి పేరిట ఇళ్లు కూలగొడుతున్నా.. అక్రమాలంటూ నిరాశ్రయులను చేస్తున్నా.. ఓటుబ్యాంకు రాజకీయాలకు పట్టం కడుతూ హిందువులపై దాడులకు తెగబడుతున్నా.. బిజెపి బాధితుల పక్షాన నిలుస్తోంది. న్యాయం చేయాలంటూ రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. పోరాటాలకూ సిద్ధమవుతోంది. ఇటు మూసీ కానీ.. అటు ఖమ్మం వెలుగుమట్ల కానీ.. బాన్సువాడ కానీ.. బాధితుల్లో బిజెపి నాయకులు భరోసా నింపుతున్నారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 26న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ‘మూసీ గోస – బిజెపి భరోసా’ పరామర్శ యాత్ర నిర్వహించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం బలవంతపు కూల్చివేతలను తీవ్రంగా వ్యతిరేకించారు. ముందుగా రాంచందర్ రావు బాపూఘాట్ వద్ద మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి యాత్రను ప్రారంభించారు. అనంతరం మధుపార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ వాసులతో ముఖాముఖి సమావేశమయ్యారు. మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి పేరుతో ఇళ్లు కోల్పోతున్న బాధిత కుటుంబాల ఆవేదన తెలుసుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే బలవంతపు చర్యలను నిలిపివేసి, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ యాత్ర గంధంగూడ, విఘ్నేశ్వర కాలనీ, కేకే కాలనీ ప్రాంతాల మీదుగా కొనసాగింది. ఇళ్లను కోల్పోతామన్న భయంతో ఉన్న కుటుంబాలను పరామర్శిస్తూ, వారికి భరోసా కల్పించారు. గండి మైసమ్మ ఆలయ సమీపంలో మూసీ నది పరివాహక ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ, ప్రభుత్వ చర్యలపై వాస్తవ పరిస్థితులను అధ్యయనం చేశారు.
గాంధీ పేరుతో కూల్చివేతలా?
మూసీ శుద్ధి పేరుతో పేదల ఇళ్లను కూల్చివేయడం అన్యాయమని, ప్రజల కన్నీళ్లపై అభివృద్ధి నిర్మించకూడదని రాంచందర్ రావు స్పష్టం చేశారు. బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని ప్రకటించారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు మాట్లాడుతూ ”గాంధీ సరోవర్ పేరుతో పేదల ఇళ్లు, జవాన్ల ఫ్లాట్లను కూలగొడుతున్నారు. పేదల ఇండ్లు కూల్చితే ఊరుకోబోం. గుజరాత్‌లో సర్దార్ సరోవర్ ప్రాజెక్టు కోసం పేదల ఇళ్లను కూల్చలేదు. శాస్త్రబద్ధంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేసేలా, ఉపాధి కల్పించేలా చేశారు. పేదల ఇళ్లను కూల్చి బఫర్‌జోన్‌ను పెంచాల్సిన అవసరం లేదు. రైతులు, పేదలు కూరగాయలు సాగు చేసుకుంటున్న భూములు లాక్కోవద్దు. ఆదిత్య ఎన్ క్లేవ్ లో ఇండ్లు బఫర్ జోన్, ఎఫ్టీఎల్ పరిధిలో లేవు. బండ్లగూడ జాగీర్ పరిధిలోని కొన్ని కాలనీలకు, ముఖ్యంగా మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్ వాసులతో పాటు ఆ రెసిడెన్సీలో సుమారు 450కు పైగా ఇళ్లకు, అలాగే విఘ్నేశ్వర కాలనీలో సుమారు 170 ఇళ్లకు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. మూసీ పరివాహక ప్రాంతంలో, హైదర్ గూడ భూములతో పాటు, మూసీకి ఆనుకుని పరివాహక ప్రాంతాల్లో కూరగాయలు పండిస్తూ హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్న రైతుల భూములను కూడా కాంగ్రెస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. రైతుల భూములు గుంజుకొని భూమిలేని వారిగా మార్చే కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే విఘ్నేశ్వర కాలనీలో కూడా 150-200 గజాల స్థలాల్లో చిన్న చిన్న ఇళ్లలో నివసిస్తున్న మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి. ఈఎంఐలు చెల్లిస్తూ, “హైదరాబాద్ నా నగరం” అని గర్వంగా భావిస్తూ జీవిస్తున్న కుటుంబాలను ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం రోడ్డున పడేయాలని చూడటం దారుణం.
మూసీ సుందరీకరణకు మేం వ్యతిరేకం కాదు. మూసీ నది శుద్ధి కావాలి. కాలుష్యం పోవాలి. దుర్వాసన లేని ప్రవాహం ఉండాలి. కానీ సుందరీకరణ పేరుతో పేద ప్రజలను ఇళ్ల నుంచి తరిమేయడం, భూములు లాక్కోవడం, భయపెట్టే పాలన చేయడం సరికాదు. పేదల భూములను బలవంతంగా లాక్కోవడాన్ని మాత్రమే మేం వ్యతిరేకిస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నట్టు నిర్వాసితులకు పరిహారం ఇస్తామని అంటున్నారు. కానీ నిజంగా చెప్పాలంటే.. ప్రభుత్వ వద్ద భూములే లేవు. ప్రభుత్వ భూములన్నీ అమ్మేశారు. 150 కోట్ల ఎకరాల భూమిని అమ్మేసిన ప్రభుత్వం, ఈ ప్రజలకు ఏం పరిహారం ఇస్తుంది? ఎక్కడ నుంచి ఇస్తుంది? ఇది పూర్తిగా మోసం. అందుకే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని నాశనం చేసే, ప్రజలను ఇళ్లులేని వారిగా మార్చే ప్రజా వ్యతిరేక పాలనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. పేదలు, మధ్యతరగతి ప్రజల ఇళ్లు కూల్చి, వారి జీవితాలను బుగ్గిపాలు చేయాలనుకోవడం దుర్మార్గం.
గాంధీ సరోవర్ ప్రాజెక్టును పూర్తిగా రాష్ట్రప్రభుత్వమే చేపట్టింది. అన్ని అనుమతులు తీసుకుని నిర్మించిన ఇళ్లు, అపార్ట్‌మెంట్లను కూల్చుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం పేదల ఇళ్లను కూల్చాలని చూస్తున్నారు. రేవంత్ ప్రభుత్వం మూసీ సుందరీకరణకు ముందు చేపట్టవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. మూసీ నీటిని శుద్ధి చేయడానికి అవసరమైన ప్లాంట్లు నెలకొల్పాలి. పరిశ్రమల నుంచి వెలువడుతున్న రసాయనాలు, వ్యర్థాలు, డ్రైనేజీ కలవకుండా నియంత్రించాలి. భూ నిర్వాసితుల బతుకు పోరాటంలో బిజెపి ముందుంటుంది. ప్రజల పక్షాన నిలబడుతుంది.” అని స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డిది గడ్డపార పాలన
మార్చ్ 1న ఖమ్మం అర్బన్ వెలుగుమట్ల కూల్చివేతల్లో నిరాశ్రయులైన బాధితులను పరామర్శించారు. వారి ఆవేదన చూసి చలించిపోయారు. ఖమ్మం జిల్లా, ఖమ్మం అర్బన్ వెలుగుమట్లలో కలెక్టరేట్ కార్యాలయం సమీపంలోని 147, 148, 149 సర్వే నంబర్ల భూదాన్ భూముల్లో గత అనేక సంవత్సరాలుగా, దాదాపు 2013-14 నుంచి, సుమారు 100 గజాల చొప్పున భూమి తీసుకుని దాదాపు 600 పేద కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ కుటుంబాలు కూలీ పనులు, హమాలీ పనులు చేస్తూ పైసా పైసా కూడబెట్టుకుని, కొందరు బంగారం అమ్ముకుని తమ సొంత సంపాదనతో ఇక్కడ ఇళ్లు కట్టుకుని జీవనం కొనసాగిస్తున్నారు. వారి పిల్లలు కూడా ఇక్కడే చదువుకుంటున్నారు. ఈ 600 కుటుంబాల్లో దాదాపు 1,800 మంది ఈ ప్రాంతంలో నివసిస్తున్నారు. గతంలో ఈ భూములపై కోర్టులో కేసులు నడుస్తున్న సమయంలో అనేక సార్లు స్టేటస్ కో ఆదేశాలు జారీ అయ్యాయి. ఎవిక్షన్ చేయొద్దని, జోక్యం చేసుకోవద్దని కోర్టు స్పష్టంగా చెప్పినా కూడా నోటీసులు ఇచ్చారు. అయినా ప్రభుత్వం కూల్చివేతలు చేపట్టి పేదలకు గూడు లేకుండా చేసింది.వెలుగుమట్ల కూల్చివేతలపై రాంచందర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి ఇక్కడి నుంచే నాంది అని స్పష్టం చేశారు. పేదల హక్కుల కోసం బిజెపి రాజీలేని పోరాటం చేస్తుందన్నారు.
”భూదాన్ బోర్డు, రెవెన్యూ శాఖ సమగ్ర విచారణలో నకిలీ పత్రాలు, అక్రమ కేటాయింపులు వెలుగులోకి వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం దారుణం. కానీ ఆ పేరుతో ఇక్కడ పేదలపై దాడి చేసి, వారిని వేధించి, వారు కట్టుకున్న కలలను కూల్చివేసి రోడ్డున పడేయడం ఏం మానవత్వం? రాష్ట్ర ప్రభుత్వానికి ఈ విధంగా వ్యవహరించే అధికారం ఎవరు ఇచ్చారు? రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేతిలో గడ్డపార వేసుకుని తిరుగుతున్నట్టుగా పేదల ఇళ్లను కూలగొడుతున్నారు. ఇది ప్రజల పట్ల అమానుష వైఖరి.
ఇది పూర్తిగా ప్రజావ్యతిరేక ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గడ్డపార ప్రభుత్వాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపార ప్రయోజనాల కోసం పేదల ఇళ్లను కూల్చివేయడం సరికాదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకొని ఇక్కడే పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాలి. ఇందిరమ్మ ఇళ్ల పేరుతో అయినా గూడు కల్పించాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో కూడా 2023లో ఇక్కడి కుటుంబాలను నిర్వాసితులను చేయాలని ప్రయత్నాలు జరిగాయి. కానీ పేదలకు గూడు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. పేదలకు గూడు, విద్య, కూడు కల్పించాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వానిదే. హైకోర్టు స్టే ఆదేశాలను ధిక్కరిస్తూ ఇంత దారుణంగా కూల్చివేయడం అత్యంత దారుణం. కోర్టులంటే లెక్కలేని పరిస్థితి ఏర్పడింది. చట్టపరమైన ప్రక్రియలను పక్కన పెట్టి బలవంతపు చర్యలు చేపట్టడం దారుణం.
ఇక్కడ కలెక్టరేట్ కార్యాలయం వచ్చిన తర్వాత భూముల విలువ పెరిగింది. హైవే ప్రాజెక్టు కూడా రానున్న నేపథ్యంలో ఈ విలువైన భూముల్లో పేదలు ఉండకూడదనే దురుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వారిని తరిమేయడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిని బిజెపి తీవ్రంగా ఖండిస్తోంది. ఇక్కడే పేద ప్రజలకు శాశ్వత నివాస గృహాలు కట్టించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.” అని రాంచందర్ రావు స్పష్టం చేశారు.
ఓవైసీ కళ్లల్లో ఆనందం కోసమే
మార్చ్ 2న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కామారెడ్డి బిజెపి జిల్లా కార్యాలయంలో బాన్సువాడ బాధిత కుటుంబాలను పరామర్శించి వారు గోడును విన్నారు. వారికి బిజెపి అండగా ఉంటుందని, అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ”బాన్సువాడలో జరిగిందేమిటి? ఎవరు ఎవరి ప్లేస్ లోకి వచ్చి దాడులు చేశారనే విషయంపై వాస్తవ సమాచారం తెలుసుకుని చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సింది పోయి… ఒవైసీ కళ్లల్లో ఆనందం చూడటానికి హిందువులపై అనేక అక్రమ కేసులు బనాయించి అన్యాయంగా అరెస్ట్ చేసి జైల్లో వేయడం దుర్మార్గం. చాలా మంది కూలీనాలీ చేసుకునే యువకులు పోలీసుల వేధింపులకు తాళలేక ఇళ్లను వదిలి పారిపోయారు. ఆరోగ్యం బాగాలేకపోయినా, మాటలు వినబడకపోయినా వీడియోలో కన్పించారనే ఒకే ఒక్క కారణంతో అమాయకుడైన శ్రీనివాస్ ను అన్యాయంగా పట్టుకుపోయి జైల్లో వేయడం సిగ్గు చేటు. దేవుడి ఆలయాలపై, విగ్రహాలపై దాడులు చేస్తున్నా స్పందించని వాళ్లు, అడ్డుకోని వాళ్లు హిందువులు ఎట్లా అవుతారు? పెద్దమ్మ గుడిపై దాడులు చేస్తే అడ్డుకుంటే లాఠీఛార్జ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. బాన్సువాడలో అమాయకులను అరెస్ట్ చేసి జైల్లో వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో అనేక దేవాలయాలను ధ్వంసం చేశారు. ఇంత ఘోరమా? ఇంత అరాచకమా? అయినా ఇంకెంత కాలం భరిద్దాం?
రాహుల్ గాంధీ బాన్సువాడలో అన్యాయంగా, అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో వేసిన బాధిత కుటుంబాలను పరామర్శించాలని కోరుతున్నా. అట్లాగే మూసీ సుందరీకరణ పేరుతో పేదల ఇండ్లను కూల్చివేస్తున్న ప్రాంతాలకు వెళ్లాలని కోరుతున్నా. అట్లాగే ఖమ్మంలో భూదాన్ భూముల పేరుతో పేదల ఇండ్లను కూల్చివేసిన ప్రాంతానికి వెళ్లాలని కోరుతున్నా. అట్లాగే హిందూ దేవాలయాలపై దాడులు జరిగిన బంజారాహిల్స్ పెద్దమ్మ తల్లి, సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయాలను సందర్శించాలని కోరుతున్నా.” అని అన్నారు.
”మీరు బఫర్ జోన్లు, ఎఫ్టీఎల్ పేరుతో ఇకపై పేదల ఇండ్లను కూల్చాలనుకుంటే… అదే ప్లేస్ లో కట్టిన పెద్దల ఇండ్లను, కాంగ్రెస్ నేతల ఇండ్లను కూల్చేసేందుకు బిజెపి కార్యకర్తలు బుల్డోజర్లతో వస్తారు. తాడోపేడో తేల్చుకుంటారు. ఒకవేళ శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమైతే అందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలి”అంటూ బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ”పరీక్షలున్నాయనే సాకుతో చెరువును ఆక్రమించి ఒవైసీ కుటుంబం నిర్మించిన ఫాతిమా కాలేజీని టచ్ కూడా చేయని కాంగ్రెస్ ప్రభుత్వం… ఖమ్మంలో ఇండ్లను నిర్మించుకుని బతుకుతున్న కుటుంబాల్లో టెన్త్, ఇంటర్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు బతిమిలాడినా వినకుండా వాటిని ఎందుకు కూల్చివేశారు? ఫాతిమా కాలేజీకి ఒక న్యాయం? పేదలకు మరో న్యాయమా?” అని ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా హిందువులపై, హిందూ దేవాలయాలపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడులు చేయిస్తూ అరాచకాలకు పాల్పడుతోందన్నారు. ఒవైసీ కళ్లల్లో ఆనందం కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం అరాచకాలు చేస్తోందన్నారు.” హిందువులారా… ఇంకెన్నాళ్లు కాంగ్రెస్ అరాచకాలను భరిద్దాం? ఇంకెన్నాళ్లు బిచ్చపు బతుకులు బతుకుదాం. రాజకీయాలను, పార్టీలను పక్కనపెట్టి కాషాయ జెండా పట్టి ఏకమై కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలకు గుణపాఠం చెప్పేందుకు సిద్ధం కండి” అని పిలుపునిచ్చారు. తాను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అయినప్పటికీ ఒక హిందువుగా మాట్లాడుతున్నానని చెప్పారు.

