ప్రపంచానికి స్థిరత్వాన్నిచ్చే భారత్-ఇజ్రాయిల్ మైత్రి
(ఫిబ్రవరి చివరి వారంలో ఇజ్రాయెల్ పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాసిన వ్యాసం)
తొమ్మిదేళ్ల క్రితం ఇజ్రాయెల్‌ను సందర్శించిన తొలి భారత ప్రధానమంత్రి కావడం నా అదృష్టం. మళ్ళీ ఇక్కడికి రావడం, నేను ఎప్పుడూ ఆకర్షితుడినయ్యే ఈ నేలకు తిరిగి రావడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. అన్నింటికీ మించి, భారతదేశం అధికారికంగా ఇజ్రాయెల్‌ను గుర్తించిన రోజే — సెప్టెంబర్ 17, 1950 — నేను జన్మించాను! అక్టోబర్ 7 (2023) న హమాస్ జరిపిన కిరాతక ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ, తమ ప్రపంచమే ఛిన్నాభిన్నమైన ప్రతి కుటుంబానికి భారత ప్రజల తరఫున నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మేం మీ బాధను అనుభూతి చెందుతున్నాం. మీ దుఃఖంలో మేం పాలు పంచుకుంటున్నాం. ఈ తరుణంలోనే కాకుండా ఎల్లప్పుడూ భారతదేశం పూర్తి దృఢ నిశ్చయంతో ఇజ్రాయెల్ పక్షాన నిలుస్తుంది.
భారత్ కూడా సుదీర్ఘకాలంగా ఉగ్రవాద విషాదాన్ని అనుభవించింది. 26/11 ముంబై దాడులను, అందులో ప్రాణాలు కోల్పోయిన ఇజ్రాయెల్ పౌరులతో సహా అమాయకులను మేం మరచిపోలేదు. మీ లాగే, మాకు కూడా ఉగ్రవాదం పట్ల ఎటువంటి రాజీ లేని, ద్వంద్వ ప్రమాణాలు లేని విధానం ఉంది. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి నిరంతర, సమన్వయంతో కూడిన ప్రపంచ స్థాయి చర్యలు అవసరం, ఎందుకంటే ఎక్కడ ఉగ్రవాదం ఉన్నా అది ప్రతిచోటా శాంతికి ముప్పు కలిగిస్తుంది. కొన్నేళ్ల క్రితం, మీరు అబ్రహం ఒప్పందాలను కుదుర్చుకున్నప్పుడు, మీ ధైర్యాన్ని, దూరదృష్టిని మేం అభినందించాం. సుదీర్ఘకాలంగా అశాంతితో ఉన్న ఆ ప్రాంతానికి అది ఒక కొత్త ఆశను చిగురింపజేసిన క్షణం. అప్పటి నుంచి పరిస్థితి గణనీయంగా మారింది. ప్రస్తుత మార్గం మరింత సవాలుతో కూడుకున్నది. అయినప్పటికీ ఆ ఆశను నిలబెట్టుకోవడం ముఖ్యం. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఆమోదించిన ‘గాజా శాంతి ప్రతిపాదన’ ఒక మార్గాన్ని చూపుతుంది. దీనికి భారత్ తన దృఢమైన మద్దతును వ్యక్తం చేసింది. పాలస్తీనా సమస్య పరిష్కారం సహా ఆ ప్రాంత ప్రజలందరికీ న్యాయబద్ధమైన, శాశ్వతమైన శాంతిని ఇది అందిస్తుందని మేం నమ్ముతున్నాం.
భారత్ లో ఇజ్రాయెల్ పట్టుదల, ధైర్యం, అది సాధించిన విజయాల పట్ల గొప్ప గౌరవం ఉంది. మనం ఆధునిక రాజ్యాలుగా ఏర్పడక ముందే, 2,000 ఏళ్లకు పైగా సంబంధాలు కలిగివున్నాం. ప్రాచీన కాలంలో భారతదేశంతో జరిగిన వాణిజ్యాన్ని తాల్ముడ్ (యూదుల పవిత్ర గ్రంథం) రికార్డు చేసింది. యూదు వ్యాపారులు మధ్యధరా సముద్రాన్ని హిందూ మహాసముద్రంతో కలిపే సముద్ర మార్గాల ద్వారా ప్రయాణించారు. వారు అవకాశాలు, గౌరవం కోసం ఇక్కడికి వచ్చారు. భారతదేశంలో వారు మాలో ఒకరిగా మారిపోయారు. యూదులు ఎటువంటి హింస లేదా వివక్షకు గురికాకుండా భారత్ లో జీవించారు. మహారాష్ట్రకు చెందిన బెనే ఇజ్రాయెల్, కేరళకు చెందిన కొచ్చిన్ యూదులు, కోల్‌కతా, ముంబైలోని బాగ్దాదీ యూదులు, ఈశాన్య భారతానికి చెందిన బ్నెయ్ మెనాషేలు భారతదేశాన్ని సుసంపన్నం చేశారు.
ఎడ్విన్ మైయర్స్ ఫిల్మ్స్ డివిజన్ ఆఫ్ ఇండియాకు ఒక రూపమిచ్చారు. భారతీయ సినిమా చరిత్రలో ఒక కీలక వ్యక్తిగా నిలిచారు. వాల్టర్ కాఫ్మన్ ఆల్ ఇండియా రేడియో సిగ్నేచర్ ట్యూన్‌ను స్వరపరిచారు. డేవిడ్ సాసూన్ ఇప్పటికీ భారతీయ సమాజానికి సేవలందిస్తున్న అనేక సంస్థలను నిర్మించారు. 1971 పాకిస్తాన్ యుద్ధంలో లెఫ్టినెంట్ జనరల్ జె.ఎఫ్.ఆర్ జాకబ్ అందించిన వీరోచిత సహకారం అందరికీ తెలిసిందే. భారతదేశ సుసంపన్నమైన జీవన శైలిలో తమ కృషిని మమేకం చేసిన అసంఖ్యాకమైన ఇతర యూదులు ఉన్నారు. 20వ శతాబ్దం మధ్యలో చాలా మంది భారతీయ యూదులు ఇజ్రాయెల్‌కు వలస వెళ్ళినప్పుడు, భారత్ నుంచి ఇజ్రాయెల్‌కు కూడా కొందరు వలస వెళ్లారు. నేడు ఇక్కడ ఒక శక్తిమంతమైన భారత సంతతి యూదు సమాజం ఉంది. ప్రయోగశాలలు, ఆస్పత్రులు, తరగతి గదులు, యుద్ధభూమిలో కూడా వారు ఆధునిక ఇజ్రాయెల్ నిర్మాణంలో తమ వంతు సహకారాన్ని అందించారు.
ఈ భూమితో భారతదేశానికి ఉన్న అనుబంధం రక్తం, త్యాగాలతో కూడా లిఖించబడింది. మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో, ఈ ప్రాంతంలో 4,000 కంటే ఎక్కువ మంది భారతీయ సైనికులు తమ ప్రాణాలను అర్పించారు. సెప్టెంబర్ 1918లో హైఫా వద్ద జరిగిన అశ్విక దళ దాడి సైనిక చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలిచిపోయింది. ‘హైఫా వీరుడు’గా స్మరించుకునే మేజర్ ఠాకూర్ దల్పత్ సింగ్ ఈ భాగస్వామ్య చరిత్రకు ప్రతీకగా నిలుస్తారు. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యూదులపై జరిగిన మారణహోమం మానవాళి చరిత్రలో అత్యంత చీకటి అధ్యాయాలలో ఒకటిగా నిలిచిపోయింది. అయినప్పటికీ, ఆ కల్లోలిత కాలంలో కూడా కొన్ని మానవీయ చర్యలు ప్రత్యేకంగా నిలిచాయి. గుజరాత్‌లోని నవనగర్ మహారాజా, ఆయనను జామ్ సాహెబ్ అని కూడా పిలిచే వారు, ఎక్కడికీ వెళ్ళలేని యూదు పిల్లలతో సహా పోలిష్ పిల్లలకు ఆశ్రయం కల్పించారు.
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చాలా మంది భారతీయ నాయకులు ఇజ్రాయెల్ ప్రజలతో ఒక అనుబంధాన్ని పెంచుకున్నారు. ఎడారిలో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి ఇజ్రాయెల్ చేస్తున్న కృషి పట్ల 1950ల నాటి భారత పార్లమెంటరీ చర్చలు ఇందుకు నిదర్శనంగా ఉన్నాయి. ఇజ్రాయెల్‌లోని కిబ్బట్జ్ (సమష్టి వ్యవసాయ క్షేత్రాల) ఉద్యమం ఆచార్య వినోబా భావే, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ వంటి మా నాయకులకు స్ఫూర్తినిచ్చింది. 2017లో మన రెండు దేశాలు తమ సంబంధాలను’వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచుకున్నాయి. అప్పటి నుంచి మన సంబంధాల స్థాయి, పరిధి విస్తరించాయి. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉంది. అదే సమయంలో, ఇజ్రాయెల్ ఆవిష్కరణలకు, సాంకేతిక శక్తికి కేంద్రంగా ఉంది. ఇది భవిష్యత్తును దృష్టిలో ఉంచుకున్న భాగస్వామ్యానికి సహజమైన పునాదిని వేస్తుంది. వాణిజ్యాన్ని విస్తరించడానికి, పెట్టుబడుల ప్రవాహాన్ని పెంచేందుకు, ఉమ్మడి మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహించడానికి మేం కట్టుబడి ఉన్నాం. గత ఏడాది కుదుర్చుకున్న ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం మన వ్యాపారాలకు నమ్మకాన్ని, స్పష్టతను అందిస్తుంది. ప్రతిష్టాత్మకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కోసం రెండు దేశాల ప్రతినిధులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. రక్షణ, భద్రత మన భాగస్వామ్యానికి మరొక ముఖ్యమైన స్తంభం. భారత్-ఇజ్రాయెల్ భాగస్వామ్యానికి పునాది మన ప్రజల మధ్య ఉన్న సంబంధాలే. ఇజ్రాయెల్‌లోని భారతీయ సంరక్షణ సిబ్బంది, సైపుణ్య కార్మికులు ఇక్కడి కుటుంబాలకు, ప్రజలకు ఎంతో సహకారం అందిస్తున్నారు. అక్టోబర్ 7 వంటి సంక్షోభ సమయాల్లో కూడా వారు అద్భుతమైన ధైర్యాన్ని, అంకితభావాన్ని ప్రదర్శించారు.
యూదుల ప్రవచనాలు చెప్పినట్టు ‘ఒక్క ప్రాణాన్ని రక్షించినా, అది ప్రపంచాన్ని రక్షించినట్లే’. మనవి రెండు పురాతన నాగరికతలు. మన నాగరిక సంప్రదాయాలు తాత్విక సారూప్యతలను వ్యక్తీకరించడంలో ఆశ్చర్యం లేదు. ఇజ్రాయెల్‌లో ‘తిక్కున్ ఓలమ్’ అనే సూత్రం ప్రపంచాన్ని స్వస్థపరచడం గురించి చెబుతుంది. భారతదేశంలో ‘వసుధైక కుటుంబకం’ ప్రపంచమంతా ఒక్కటే కుటుంబమని చాటుతుంది. యూదు మతం నియమాలు, ఆచరణ ద్వారా దైనందిన ప్రవర్తనను నడిపించే ‘హలఖా’ను నొక్కిచెబితే, హిందూ భావజాలం కర్తవ్యాన్ని, సరైన కార్యాచరణను నిర్దేశించే ‘ధర్మం’ గురించి మాట్లాడుతుంది. రెండు సంప్రదాయాలలోనూ ఆచరణే నైతిక జీవనానికి ఆధారం. అలాగే విశ్వాసం ప్రవర్తన ద్వారా వ్యక్తమవుతుంది. మన పండుగలలో కూడా ఒక అద్భుతమైన పోలిక ఉంది. మీరు కొవ్వొత్తుల వెలుగుతో హనుక్కా జరుపుకొంటారు. అదే సమయంలో మేం దీపాల వెలుగులతో దీపావళిని జరుపుకొంటాం. భారతదేశం హోలీని జరుపుకొన్నట్టే ఇజ్రాయెల్ పురీమ్ జరుపుకొంటుంది. మన ఉమ్మడి ఆదర్శాలే మన ఆధునిక భాగస్వామ్యానికి బలాన్నిచ్చే పటిష్ట పునాదులు. మనవి చరిత్ర ద్వారా రూపుదిద్దుకున్న, భవిష్యత్తుపై దృష్టి సారించిన ప్రజాస్వామ్య దేశాలు. మన బలమైన భాగస్వామ్యం జాతీయ ప్రయోజనాలకే కాకుండా ప్రపంచ స్థిరత్వానికి, శ్రేయస్సుకు కూడా దోహదపడుతుంది. అనిశ్చిత ప్రపంచంలో భారత్, ఇజ్రాయెల్ మైత్రి ఒక బలమైన శక్తిగా ఉండేలా చూసుకుందాం.
నరేంద్ర మోదీ,
భారత ప్రధాని

