ఎన్నికలు జరిగే అన్ని రాష్ట్రాల్లో పెరగనున్న బిజెపి బలం
ఏప్రిల్‌లో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంత అసెంబ్లీలకు జరగనున్న ఎన్నికలు జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్‌లకు నిజమైన పరీక్ష. ఈ దఫా ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎన్నికల యుద్ధభూమిగా మారింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ గత మూడు అసెంబ్లీ ఎన్నికల్లో వరుసగా విజయం సాధించింది. అయితే, ప్రస్తుతం ఆ పార్టీ బిజెపి నుంచి కఠిన సవాలును ఎదుర్కొంటోంది. 2011లో కేవలం 4 శాతంగా ఉన్న బిజెపి ఓట్ల శాతం 2020 నాటికి 38 శాతానికి పెరిగింది. అలాగే, 2011లో ఒక్క సీటు కూడా లేని పరిస్థితి నుంచి పదేళ్ల తర్వాత 77 స్థానాలకు ఆ పార్టీ చేరుకుంది. 2016లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో మూడు సీట్లు, సుమారు 10 శాతం ఓట్ల శాతంతో అడుగుపెట్టిన బిజెపి, టీఎంసీ అసమ్మతి నేతలను, కాంగ్రెస్, వామపక్ష పార్టీల క్షేత్రస్థాయి కార్యకర్తలను పెద్దయెత్తున ఆకర్షించి అనతి కాలంలోనే ఒక ప్రధాన శక్తిగా ఎదిగింది. 2020లో టీఎంసీ సీనియర్ నేత, మమతా బెనర్జీకి బద్ధశత్రువుగా మారిన సువేందు అధికారి తన అనుచరులతో కలిసి బిజెపిలో చేరారు. దీంతో అధికార పార్టీకి బిజెపి ప్రధాన ప్రత్యర్థిగా మారింది. ఆ తర్వాత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నందిగ్రామ్‌లో మమతా బెనర్జీపైనే సువేందు అధికారి పోటీ చేశారు. ఐదేళ్ల తర్వాత, ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, బిజెపి మధ్య మళ్ళీ ప్రత్యక్ష పోరు జరగనుంది.
గత 15 ఏళ్లలో మూడు దశాబ్దాల వామపక్షాల పాలనలో అప్పటికే తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రానికి సమర్థమైన పాలన అందించడంలో మమతా ప్రభుత్వం విఫలమైంది. పశ్చిమ బెంగాల్‌లో ఇప్పటికీ నిరుద్యోగిత స్థాయి ఎక్కువగా ఉంది. ఎన్నికలకు ముందు ప్రకటించిన ‘బంగ్లార్ యువ సాథి’ పథకం కింద నిరుద్యోగ యువతకు నెలకు కేవలం రూ.1,500 మాత్రమే అందిస్తున్నారు. అయినప్పటికీ ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ప్రజలు ఎగబడటం చూస్తుంటే ఉపాధి కల్పనలో, పారిశ్రామిక వృద్ధిని ప్రోత్సహించడంలో మమత ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని స్పష్టమవుతోంది. మమతా బెనర్జీ తన సంప్రదాయ మద్దతుదారులైన మహిళలు, ముస్లింల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు, ఎందుకంటే వారికి వాగ్దానం చేసిన ప్రయోజనాలు అందలేదు. ఆర్.జీ. కర్ మెడికల్ కాలేజీ హత్యాచారం, దుర్గాపూర్‌లో జరిగిన సామూహిక అత్యాచారం వంటి సంఘటనలు రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న హింసకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అయితే, బిజెపి మూడు స్థాయిలలో టీఎంసీని ఎదుర్కోవాల్సి ఉంది. మొదటిది, గతంలో వామపక్షాల మాదిరిగానే, టీఎంసీ కూడా గ్రామ స్థాయి వరకు అధికార యంత్రాంగాన్ని రాజకీయం చేసి దానిని పార్టీ యంత్రాంగంగా మార్చుకుంది. రెండవది, టీఎంసీకి రాష్ట్రవ్యాప్తంగా కండబలంతో కూడిన బలమైన సంస్థాగత ఉనికి ఉంది. మూడవది, ఆ పార్టీ కిరాయి రాజకీయ వ్యూహకర్తలపై కూడా ఆధారపడుతోంది.
బెంగాల్ ఎన్నికలు కేవలం బిజెపికే కాదు, ఎన్నికల సంఘానికి కూడా ఒక సవాలే. ఎన్నికలను శాంతియుతంగా, సక్రమంగా నిర్వహించడం ఒక బృహత్తర కార్యం. ఇప్పటికే ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను ప్రక్షాళన చేసి 61 లక్షల పేర్లను తొలగించింది. మరో 60 లక్షల మంది అనుమానాస్పద ఓటర్లను తమ ఆధారాలను నిరూపించుకోవాలని కోరింది. టీఎంసీ గూండాల ద్వారా ఓటర్లను బెదిరించడం, పోలింగ్ సమయంలో కెమెరాలను ఆపివేయడం, అధికార యంత్రాంగం సహకారంతో రిగ్గింగ్‌కు పాల్పడే అవకాశం వంటి దౌర్జన్యాలను కమిషన్ అడ్డుకోవాల్సి ఉంది. అప్పుడే మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలనకు ముగింపు పలికే నిష్పక్షపాత ఎన్నికలు సాధ్యమవుతాయి.
అస్సాంలో ఎన్నికల ఫలితాలు దాదాపు ఖాయమైనట్లు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అద్భుతమైన కార్యదక్షుడిగా నిరూపించుకున్నారు. ఆయన నాయకత్వంలో అస్సాం దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా నిలిచి జాతీయ సగటు కంటే ఎక్కువ జీడీపీ వృద్ధి రేటును నమోదు చేస్తోంది. ఆయన దూకుడుగా ఉండే రాజకీయ వైఖరితో ప్రజల్లో అత్యంత ప్రజాదరణ పొందారు. మరోవైపు కీలక నేతలు బిజెపిలో చేరుతుండటంతో ప్రియాంక గాంధీ పర్యవేక్షణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గందరగోళంలో ఉంది.
కేరళలో కూడా ఈ సారి ఎన్నికలు ఆసక్తికరంగా ఉండబోతున్నాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఎలా బలహీనపడిందో, రాహుల్ గాంధీ కేరళలో ఉండగానే అక్కడ కూడా పార్టీ పతనం ప్రారంభమైంది. సంప్రదాయబద్ధంగా కేరళలో ఎల్‌డీఎఫ్, యూడీఎఫ్ మధ్య అధికారం మారుతూ ఉంటుంది. కానీ 2021లో ఎల్‌డీఎఫ్ ఆ ఆనవాయితీని అడ్డుకుని వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చింది. అస్సాం తరహాలోనే కేరళ కాంగ్రెస్‌లో కూడా ముఠా తగాదాలు పెరిగిపోయాయి, సీనియర్ నేతలు అసంతృప్తితో ఉన్నారు. తమిళనాడు, పుదుచ్చేరి దశాబ్దాలుగా ప్రాంతీయ పార్టీల కోటలుగా ఉన్నాయి. జాతీయ పార్టీలు దీర్ఘకాలిక వ్యూహంతో స్వతంత్రంగా ఎదిగే ప్రయత్నం చేస్తున్నాయి.
మొత్తానికి ఎన్నికలు జరగనున్న అన్ని ప్రాంతాల్లో బిజెపి బలం పుంజుకునే అవకాశం ఉంది. అసలైన సవాలు ఎదుర్కొంటున్నది మాత్రం కాంగ్రెస్ పార్టీనే. నాయకులు ఎన్ని గొప్పలు చెప్పుకున్నా అస్సాంలో ఆ పార్టీ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. కేరళలో ఆ పార్టీకి ఇది అగ్నిపరీక్ష. అక్కడ గనుక ఓడిపోతే రాష్ట్రంలో పార్టీ విచ్ఛిన్నం అయ్యే ప్రమాదం ఉంది. ఇది ఒక రకంగా వారసత్వ రాజకీయాలకు గడ్డుకాలం.
రామ్ మాధవ్,
బిజెపి సీనియర్ నాయకుడు

