Gajendra Shekawat

ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు

Sardar Patel Birth మే 31న హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ‘భారత్ భారతి’ ఆధ్వర్యంలో జరిగిన “ఏక్ భారత్ – శ్రేష్ఠ భారత్” కార్యక్రమంలో భాగంగా ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు తదితరులు పాల్గొన్నారు. దేశ సమైక్యత, సమగ్రతలో సర్దార్ పటేల్ పోషించిన చారిత్రాత్మక పాత్రను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

ఈ సందర్భంగా గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ, సర్దార్ పటేల్ కేవలం ఒక చారిత్రక వ్యక్తి మాత్రమే కాదని, ఆయన ఒక ‘కాలాతీత శక్తి’ అని అభివర్ణించారు. “బ్రిటిష్ పాలకులు భారత్‌ను 562 చిన్న చిన్న రాజ్యాలుగా విభజించి, దేశాన్ని బలహీనపరిచి వెళ్లాలని చూశారు. ఆ సమయంలో సర్దార్ పటేల్ తన అద్భుతమైన దౌత్యం, రాజనీతిజ్ఞత, ధైర్యంతో ఆ సంస్థానాలన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చి, నేటి అఖండ భారతావనిని నిర్మించారు. ఒకవేళ సర్దార్ పటేల్ లేకపోతే, నేడు మనం చూస్తున్న భౌగోళిక భారతం ఉండేది కాదు,” అని ఆయన స్పష్టం చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, “మహాత్మా గాంధీ, వీర్ సావర్కర్ వంటి మహనీయుల బలిదానాల పునాదులపై మనకు స్వాతంత్ర్యం లభించింది. ఇప్పుడు వారి ఆశయాలకు అనుగుణంగా, అభివృద్ధి చెందిన భారతావనిని నిర్మించడమే మన ముందున్న ప్రధాన లక్ష్యం. 140 కోట్ల మంది భారతీయులు ఈ సంకల్పాన్ని స్వీకరించి, దేశ పురోభివృద్ధిలో భాగస్వాములు కావాలని గజేంద్ర సింగ్ షెకావత్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రాంచందర్ రావు మాట్లాడుతూ, “హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనం కావడంలో సర్దార్ పటేల్ దృఢ సంకల్పం, దూరదృష్టి కీలక పాత్ర పోషించాయి. నాటి నిజాం పాలనలో హైదరాబాద్‌ను భారత్ నుండి వేరు చేయడానికి లేదా పాకిస్థాన్‌లో విలీనం చేయడానికి జరిగిన ప్రయత్నాలను తనదైన వ్యూహంతో సర్దార్ పటేల్ తిప్పికొట్టారు. నేడు మనం అనుభవిస్తున్న సమైక్య భారతం ఆయన వేసిన పునాది ఫలితమే.” అని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తుచేసుకుంటూ, వారి ఆశయాలను కొనసాగించాల్సిన బాధ్యత నేటి యువతపై ఉందని రాంచందర్ రావు పిలుపునిచ్చారు. దేశ ఐక్యతను, సమగ్రతను, సామాజిక సామరస్యాన్ని కాపాడుకుంటూ, అభివృద్ధి చెందిన భారతావని నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. మహనీయుల ఆశయ సాధన దిశగా పయనించడమే వారికి మనం ఇచ్చే నిజమైన నివాళి అని ఆయన స్పష్టం చేశారు.