Modi 12 Years

మోదీ పాలన.. నవ భారత నిర్మాణ గాథ

Modi 12 Yearsభారత రాజకీయ చరిత్రలో కొన్ని దశాబ్దాలు కేవలం కాలగమనంగా కాకుండా దేశ దిశను మార్చిన మేలిమలుపులుగా గుర్తుండిపోతాయి. 2014లో నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రారంభమైన ప్రయాణం అలాంటి మేలిమలుపు అనడంలో అతిశయోక్తి లేదు. కేంద్రంలో మోదీ నాయకత్వానికి 12 సంవత్సరాలు పూర్తవుతున్న వేళ, “విశ్వాసం, అభివృద్ధి, సంక్షేమం” అనే మూడు ప్రధాన స్తంభాలపై నిర్మితమైన ఈ కాలం నవ భారత నిర్మాణ యుగం అని చెప్పవచ్చు. ఈ 12 ఏళ్ల ప్రయాణంలో భారతదేశం ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, అంతర్జాతీయ రంగాల్లో గణనీయమైన మార్పులను చూసింది. ప్రజల విశ్వాసాన్ని చూరగొంటూ, అభివృద్ధిని వేగవంతం చేస్తూ, పేదల సంక్షేమాన్ని కేంద్రబిందువుగా సాగిన మోదీ పాలన ‘వికసిత్ భారత్’కు గట్టి పునాది వేసింది.

‌‌విశ్వాసానికి పునాది వేసిన నాయకత్వం

ప్రజాస్వామ్యంలో ఎన్నికల విజయం కంటే ప్రజల విశ్వాసం గొప్పది. 2014లో తొలిసారి మోదీ సారథ్యంలో ఎన్డీఏ గెలుపు అప్పటి యూపీఏ పాలనపై వ్యతిరేకత అని సరిపెట్టుకోవచ్చు. కానీ, 2019లో అంతకుమించిన భారీ మెజారిటీతో విజయం సాధించడం అంటే మోదీ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని చూరగొందనడానికి నిదర్శనం. ప్రజాస్వామ్యంలో వరుసగా పదేళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వంపై సహజంగా ఉండే ప్రభుత్వ వ్యతిరేకత స్థానంలో ప్రభుత్వ సానుకూలత ఏర్పడి, 2024లో వరుసగా మూడోసారి అధికారంలోకి రావడం మోదీ నాయకత్వంపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసాన్ని స్థిరపరుస్తోంది.

మోదీ పట్ల ప్రజల్లో విశ్వాసం ఉంది కాబట్టే ప్రధాని పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, స్వదేశీ పిలుపులు ప్రజా ఉద్యమాలుగా మారాయి. కరోనా వేళ వైద్యులు, నర్సులు, పారిశుధ్య కార్మికులు, పోలీసు సిబ్బంది సేవలను గుర్తింపుగా ప్రజలు గంటలు మోగించారు, దీపం వెలిగించారు. ‘హర్ ఘర్ తిరంగా’లో భాగంగా గ్రామాల వీధుల నుండి నగరాల ఎత్తైన భవనాల వరకు, పాఠశాలల నుంచి మార్కెట్ల వరకు, ప్రతి పౌరుడి చేతిలో త్రివర్ణ పతాకం కనిపించింది. స్వచ్ఛ భారత్ అభియాన్ (క్లీన్ ఇండియా మిషన్) ప్రజా ఉద్యమంగా మారింది. ‘ఫిట్ ఇండియా ఉద్యమం’లో భాగంగా పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థల్లో ఫిట్ నెస్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ‘ఏక్ పేడ్ మా కే నామ్’, ‘వోకల్ ఫర్ లోకల్’, ‘ఆత్మనిర్భర్ భారత్’ ఏ పిలుపైనా సరే ప్రజలు స్వచ్ఛందంగా స్పందించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై, ఆయన నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రజల్లో నెలకొన్న విశ్వాసం ప్రచారంతో సృష్టించింది కాదు, సాహసోపేత నిర్ణయాలతో సంక్లిష్ట పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొన్న తీరు వల్ల ఈ విశ్వాసం ఏర్పడింది. ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కోవిడ్ మహమ్మారి 140 కోట్లకు పైగా జనాభా ఉన్న భారతదేశంలో విశృంఖలంగా రెచ్చిపోకుండా చేయకుండా, దానిని అదుపు చేసేందుకు చేపట్టిన చర్యలు, జాతీయ భద్రత విషయంలో రాజీలేని ధోరణితో ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యానికి గురి చేయడమే కాదు, భారత సత్తా చాటేలా తీసుకున్న నిర్ణయాలు, ‘మన్ కీ బాత్’, ‘పరీక్షా పే చర్చా’ వంటి కార్యక్రమాలతో ప్రత్యక్ష ప్రజా సంభాషణలు ఈ విశ్వాసాన్ని మరింత బలోపేతం చేశాయి. దేశ యువతకు అభివృద్ధిపై ఆశ, మహిళలకు సాధికారతపై నమ్మకం, రైతులకు ప్రభుత్వ మద్దతుపై భరోసా కల్పించడంలో మోదీ పాలన కీలక పాత్ర పోషించింది. గత 12 సంవత్సరాలుగా దేశ ప్రయోజనాల కోసం తీసుకున్న నిర్ణయాలు కేవలం పాలనపరమైనవి మాత్రమే కాదు.. అవి సేవకు సాధనాలుగా మారాయి. అందుకే ప్రజలు మోదీ ప్రభుత్వ నిర్ణయాలకు అండగా నిలుస్తున్నారు, తమ సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విశ్వాసం ఫలితం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కొనసాగడమే కాదు, దేశవ్యాప్తంగా 22 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎన్డీఏ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి.

అభివృద్ధి: భారత ముఖచిత్రాన్ని‌‌ మార్చిన మౌలిక వసతులు

మోదీ ప్రభుత్వ 12 ఏళ్లలో మౌలిక వసతుల రంగంలో అత్యంత స్పష్టంగా మార్పు  కనిపిస్తుంది. జాతీయ రహదారుల విస్తరణ, రైల్వేల ఆధునీకరణ, విమానాశ్రయాల నిర్మాణం, మెట్రో నెట్వర్క్ విస్తరణ దేశ అభివృద్ధి కథనంలో ప్రధాన భాగాలుగా నిలిచాయి. 2014లో 91 వేల కిలోమీటర్లుగా ఉన్న జాతీయ రహదారుల నెట్వర్క్ నేడు 1.46 లక్షల కిలోమీటర్లకు చేరుకుంది. రోజుకు 11 కిలోమీటర్ల రహదారి నిర్మాణం నుంచి 34 కిలోమీటర్లకు పైగా నిర్మాణం జరిగే స్థాయికి దేశం ఎదిగింది. చీనాబ్ వంతెన, అటల్ టన్నెల్, పంబన్ బ్రిడ్జ్ వంటి ప్రాజెక్టులు కేవలం నిర్మాణాలు మాత్రమే కాదు, సాంకేతిక సామర్థ్యానికి చిహ్నాలుగా నిలిచాయి. వందే భారత్ రైళ్లు, అమృత్ భారత్ స్టేషన్లు, రైల్వే విద్యుదీకరణ భారత రవాణా వ్యవస్థను కొత్త దశకు తీసుకెళ్లాయి. మెట్రో రైలు వ్యవస్థ 5 నగరాల నుంచి 26 నగరాలకు విస్తరించింది. విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 164కు పెరిగింది. సంపన్నులకే సాధ్యం అనుకున్న విమాన ప్రయాణం ‘ఉడాన్’ పథకం ద్వారా సామాన్యులకు కూడా అందుబాటులోకి వచ్చింది.

డిజిటల్ ఇండియా: సాంకేతికతతో సాధికారత‌‌

మోదీ పాలనలో అత్యంత ప్రభావవంతమైన పరివర్తనల్లో డిజిటల్ విప్లవం ఒకటి. జన్ ధన్-ఆధార్-మొబైల్ (JAM) త్రయం ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధి నేరుగా ప్రజల ఖాతాల్లోకి చేరే వ్యవస్థ ఏర్పడింది. దీని ద్వారా రూ.51 లక్షల కోట్లకు పైగా నిధులు నగదు బదిలీ ద్వారా నేరుగా లబ్ధిదారులకే చేరాయి. అంతేకాదు, ఈ వ్యవస్థ కోట్లాది నకిలీ లబ్ధిదారులను కూడా తొలగించింది. తద్వారా ప్రభుత్వ ఖర్చులో పారదర్శకత పెరిగింది. ఇక యూపీఐ విప్లవం భారతదేశాన్ని ప్రపంచ డిజిటల్ చెల్లింపుల రాజధానిగా నిలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా డిజిటల్ సేవలు విస్తరించాయి. సామాన్యుడి జీవితంలో సాంకేతికత భాగమైంది.

రైతు సంక్షేమం నుంచి పేదల సాధికార‌‌త వరకు

మోదీ ప్రభుత్వ సంక్షేమ విధానాలకు పేదలు, రైతులు, మహిళలు, యువతే కేంద్రబిందువు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా కోట్లాది మంది రైతులకు నేరుగా ఆర్థిక సహాయం అందుతోంది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా కోవిడ్ సమయంలో 81 కోట్ల మందికి పైగా ఉచిత రేషన్ అందించారు. ఈ పథకాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. జన్ ధన్ ఖాతాలు, ముద్ర రుణాలు, ఆయుష్మాన్ భారత్, ఉజ్జ్వల యోజన, ఆవాస్ యోజన, జల్ జీవన్ మిషన్ వంటి పథకాలు కోట్లాది కుటుంబాల జీవన ప్రమాణాలను గణనీయంగా మెరుగుపరిచాయి. ప్రత్యేకించి మహిళల సాధికారతపై దృష్టి సారిస్తూ ఉజ్జ్వల గ్యాస్ కనెక్షన్లు, సుకన్య సమృద్ధి పథకం, లఖ్‌పతి దీదీ కార్యక్రమాలు అమలు చేశారు. దేశం ముందుకు సాగుతోందని నేటి భారత యువత విశ్వాసంగా ఉంది. దేశ నిర్మాణంలో తమ భాగస్వామ్యం ముఖ్యమైనదని మహిళలు నమ్ముతున్నారు. దిల్లీలో తమ గొంతు వినిపిస్తుందనే భరోసా రైతులకు లభించింది.

సాంస్కృతిక పు‌నరుజ్జీవనం: ‘వికాస్ భీ, విరాసత్ భీ’

అభివృద్ధితో పాటు వారసత్వ పరిరక్షణకు కూడా సమాన ప్రాధాన్యం ఇచ్చిన ప్రభుత్వంగా మోదీ పాలన ప్రత్యేకతను సంతరించుకుంది. అయోధ్యలో శ్రీరామ మందిరం నిర్మాణం, కాశీ విశ్వనాథ్ కారిడార్, మహాకాళ్ లోక్, కేదార్‌నాథ్ పునర్నిర్మాణం వంటి కార్యక్రమాలు భారత సాంస్కృతిక చైతన్యానికి కొత్త ఊపునిచ్చాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వారసత్వాన్ని గుర్తుచేస్తూ పంచతీర్థాల అభివృద్ధి చేయడం, బిర్సా ముండా జయంతిని జనజాతీయ గౌరవ్ దివస్‌గా ప్రకటించడం, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ నిర్మాణం వంటి చర్యలు చారిత్రక వ్యక్తులకు కొత్త గుర్తింపు తెచ్చాయి. బాబాసాహెబ్ డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కు సంబంధించిన ఐదు ప్రదేశాలను ‘పంచతీర్థ’గా అభివృద్ధి చేయడం కేవలం స్మారక చిహ్నాలను నిర్మించడం మాత్రమే కాదు, ఇది సామాజిక న్యాయం, సమ్మిళితత్వం, రాజ్యాంగ విలువలను జాతీయ చైతన్యంలో పొందుపరిచే ప్రయత్నం. మవు నుండి లండన్, నాగ్ పూర్, దిల్లీ, ముంబై వరకు, బాబాసాహెబ్ జీవితంతో ముడిపడిన ప్రదేశాలు నేడు స్ఫూర్తిదాయక కేంద్రాలుగా మారాయి.

గిరిజన యోధుడు బిర్సా ముండా జయంతిని ‘జనజాతీయ గౌరవ్ దివస్’ (గిరిజన గౌరవ దినోత్సవం) గా ప్రకటించడం ద్వారా, భారతదేశ చరిత్ర కేవలం రాజభవనాలకే పరిమితం కాదని, అడవులు, గిరిజనులు, పోరాటాల చరిత్ర కూడా అనే సందేశాన్ని మోదీ ప్రభుత్వం అందించింది. ఏళ్ల తరబడి నిర్లక్ష్యానికి గురైన వీర వీరులకు జాతీయ గుర్తింపు ఇవ్వడం ద్వారా మోదీ ప్రభుత్వం వారిని సత్కరించింది. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు అంకితం చేసిన అద్భుతమైన ‘స్టాచ్యూ ఆఫ్ యూనిటీ’ ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం మాత్రమే కాదు, నవ భారతదేశం ఉన్నతమైన ఆలోచనకు చిహ్నం. గొప్ప పోరాటం, దృఢ సంకల్పం ద్వారా భారతదేశ ఐక్యత ఎలా ఏర్పడిందో భవిష్యత్ తరాలకు ఇది తెలియజేస్తుంది. మన వీర సైనికుల గౌరవార్థం నిర్మించిన జాతీయ యుద్ధ స్మారక చిహ్నం కూడా ఈ జాతీయ చైతన్యానికి చిహ్నం. ఇది కేవలం రాతి నిర్మాణం మాత్రమే కాదు, దేశ రక్షణ కోసం సర్వస్వం అర్పించిన వారి అమర త్యాగాలకు సజీవ నిదర్శనం. రాజ్‌పథ్‌ను కర్తవ్య పథ్‌గా మార్చడం, ఇండియా గేట్ వద్ద నేతాజీ విగ్రహం ఏర్పాటు, కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం వలసవాద చిహ్నాల నుంచి భారతీయత వైపు సాగిన ప్రయాణానికి ప్రతీకలుగా నిలిచాయి.

ప్రపంచ వేదికపై భా‌‌రత ప్రభావం

గత 12 సంవత్సరాల్లో భారత విదేశాంగ విధానం కొత్త దిశను సంతరించుకుంది. మోదీ ప్రభుత్వంలో జీ20 అధ్యక్ష బాధ్యతలను విజయవంతంగా నిర్వహించిన భారతదేశం ప్రపంచ దేశాల కితాబు అందుకుంది. కరోనా వేళ వ్యాక్సిన్ మైత్రి కార్యక్రమం కింద 99 దేశాలకు ఉచితంగా వ్యాక్సిన్ అందించడం భారత ప్రతిష్టను మరింత ఇనుమడింప చేసింది. మోదీ పాలనలో కుదిరిన అనేక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు భారతదేశాన్ని ప్రపంచ వేదికపై కీలక భాగస్వామిగా నిలిపాయి. 38 దేశాలతో వాణిజ్య ఒప్పందాలు కుదిరాయి. సాంస్కృతిక వారసత్వ పరిరక్షణలో భాగంగా 44 యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు భారత్ లో ఉన్నాయి. సాంస్కృతిక సంపదను తిరిగి తీసుకురావడానికి చేసిన ప్రయత్నాల ఫలితంగా 668 అరుదైన కళాఖండాలు భారతదేశానికి తిరిగి వచ్చాయి. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా పాటించడానికి 177 దేశాలు మద్దతు ఇచ్చాయి. ప్రపంచంలోని వివిధ దేశాలు ప్రధాని నరేంద్ర మోదీకి 32 అంతర్జాతీయ అవార్డులు ప్రదానం చేశాయి. ఈ పురస్కారాలు వ్యక్తిగత విజయాలకు కాదు, 140 కోట్ల భారతీయుల సామర్థ్యానికి, పెరుగుతున్న భారత ప్రతిష్టకు చిహ్నం. విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో భారత్  స్థాయి బలోపేతమైంది. నేడు భారతదేశం ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. మూడో స్థానాన్ని లక్ష్యంగా దూసుకెళ్తోంది.

ఆత్మనిర్భర్ భారత్ నుంచి వికసిత్ భా‌రత్ వరకు

మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ వంటి కార్యక్రమాలు దేశీయ తయారీ, ఆవిష్కరణలకు కొత్త ఊపునిచ్చాయి. మొబైల్ ఫోన్ తయారీ, ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి, సెమీకండక్టర్ రంగాల్లో భారత్ కొత్త అవకాశాలను సృష్టించింది. రక్షణ రంగంలో స్వదేశీ తయారీ పెరగడం ద్వారా దేశం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించింది. స్టార్టప్ పర్యావరణ వ్యవస్థలో ప్రపంచంలోని ప్రధాన కేంద్రాల్లో భారత్ ఒకటిగా మారింది. వేలాది కొత్త సంస్థలు, వందలాది యూనికార్న్‌లు యువతకు కొత్త అవకాశాలను తెరిచాయి. 2014లో దేశంలో కేవలం 500 స్టార్టప్ లు, కేవలం 4 యునికార్న్ లు మాత్రమే ఉన్నాయి. నేడు  2.06 లక్షల స్టార్టప్ లు, 120 యునికార్న్ లకు పెరిగాయంటే ఈ పథకం సాధించిన విజయాన్ని అర్థం చేసుకోవచ్చు.

 PLI (ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్) పథకం తయారీ రంగంలో అద్భుతాలు చేసింది. ఇది దేశంలోని యువతకు 12 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలను సృష్టించింది. భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి 2014-15లో రూ.1.9 లక్షల కోట్ల నుంచి 2024-25 లో రూ.11.3 లక్షల కోట్లకు పెరిగింది. ఇది దాదాపు ఆరు రెట్ల వృద్ధి. ఒకప్పుడు భారతదేశం సాంకేతిక అవసరాల కోసం పూర్తిగా విదేశాలపై ఆధారపడి ఉండేది. కానీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దార్శనికతతో భారతదేశం నేడు సెమీకండక్టర్ తయారీకి ప్రపంచ కేంద్రంగా మారుతోంది. దేశంలో సెమీకండక్టర్ తయారీ పర్యావరణ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి సుమారు రూ.1.64 లక్షల కోట్ల పెట్టుబడి హామీతో 12 ప్రాజెక్టులను ప్రభుత్వం ఆమోదించింది. ఈ చారిత్రాత్మక ప్రాజెక్టులు భారతదేశంలో ప్రత్యక్ష, పరోక్ష హైటెక్ ఉపాధిని సృష్టిస్తున్నాయి. ఇప్పుడు, “మేడ్ ఇన్ ఇండియా” చిప్స్ ప్రపంచానికి శక్తినిస్తాయి. భారతదేశం నేడు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగా ఉంది. 2014లో మన మొబైల్ ఫోన్లలో 90% దిగుమతి చేసుకున్నాం. నేడు మొబైల్ ఎగుమతులు అపూర్వమైన 163 రెట్లు పెరిగాయి. 2014లో కేవలం రెండు యూనిట్లతో పోలిస్తే నేడు దేశంలో 300కు పైగా తయారీ యూనిట్లు పనిచేస్తున్నాయి.

మోదీ ప్రభుత్వం ఈ 12 సంవత్సరాలలో భారతదేశ రక్షణ రంగం స్వావలంబన వైపు కీలకమైన ముందడుగు వేసింది. భారతదేశాన్ని ప్రధాన ఆయుధ దిగుమతిదారు నుండి ముఖ్యమైన తయారీదారు, ఎగుమతిదారుగా మార్చింది. భారతదేశ రక్షణ పరికరాలలో కనీసం 65% ఇప్పుడు దేశీయంగా తయారవుతున్నాయి. గతంలో సుమారు 65-70% దిగుమతులపై ఆధారపడేవాళ్లం. దేశీయ రక్షణ ఉత్పత్తి 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.46,429 కోట్ల నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.1.54 లక్షల కోట్లకు రికార్డు స్థాయిలో పెరిగాయి. 2014 ముందు భారతదేశం కేవలం రూ.686 కోట్ల విలువైన రక్షణ పరికరాలను ఎగుమతి చేసింది. నేడు, మన రక్షణ ఎగుమతులు రూ.38,400 కోట్లు దాటాయి. నేడు, ప్రపంచవ్యాప్తంగా 100 కి పైగా దేశాలు భారతదేశ స్వదేశీ ఆయుధాలను కొనుగోలు చేస్తున్నాయి.

మోదీ ప్రభుత్వం ఈ 12 సంవత్సరాల ప్రయాణం “విశ్వాసం నుంచి వికాసం వరకు సాగిన కథ”. మౌలిక వసతుల విస్తరణ, డిజిటల్ పరివర్తన, సంక్షేమ పథకాలు, సాంస్కృతిక పునరుజ్జీవనం, అంతర్జాతీయ ప్రతిష్ఠ – ఈ అన్ని అంశాలు కలిసి నవ భారత నిర్మాణానికి పునాది వేసిన దశాబ్దం. 2047 నాటికి “వికసిత్ భారత్” లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్పంతో దేశం ముందుకు సాగుతున్న వేళ, మోదీ ప్రభుత్వంలోని ఈ 12 సంవత్సరాలు ఆ ప్రయాణానికి పునాది వేసిన అధ్యాయంగా భారత రాజకీయ చరిత్రలో నిలిచిపోతుందనడంలో సందేహం లేదు.

‌మోదీ ప్రభుత్వంలో భారత్ విజయాలు

  • ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సర్జికల్ స్ట్రైక్, వైమానిక దాడి, ఆపరేషన్ సిందూర్ వంటి నిర్ణయాత్మక చర్యలు.
  • నక్సలిజం నుండి దేశం విముక్తి. 
  • 2014 నుండి సుమారు 25 కోట్ల మంది పేదరికం నుంచి విముక్తి.
  • రూ.345 లక్షల కోట్లు దాటిన భారతదేశ జీడీపీ.
  • సుమారు రూ.67 లక్షల కోట్లకు విదేశీ మారక నిల్వలు.
  • ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశం 71% వృద్ధి, 12,000 లక్షల మెట్రిక్ టన్నులు దాటిన ఆహార ధాన్యాల ఉత్పత్తి. 
  • ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి దేశంగా భారత్. 247 మిలియన్ టన్నులకు చేరిన పాల ఉత్పత్తులు.
  • ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన ‘పర్ డ్రాప్ మోర్ క్రాప్’ కింద, 2015-16 నుండి 109 లక్షల హెక్టార్లకు పైగా వ్యవసాయ భూమిని సూక్ష్మ నీటిపారుదల పరిధిలోకి వచ్చింది. 
  • దేశంలో జాతీయ రహదారుల నెట్వర్క్ 91,287 కి.మీ నుంచి 1.46 లక్షల కిలోమీటర్లకు విస్తరించింది.
  • 12 సంవత్సరాలలో 4 లక్షల కిలోమీటర్లు గ్రామీణ రహదారుల నిర్మాణం
  • ప్రతిరోజూ 34 కిలోమీటర్లకు పైగా కొత్త రహదారుల నిర్మాణం.
  • నేడు దేశవ్యాప్తంగా 99.6% కంటే ఎక్కువ బ్రాడ్-గేజ్ రైల్వే విద్యుదీకరణ.
  • 164 కు పైగా వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు. 
  • మెట్రో సేవలు 5 నుంచి 26 నగరాలకు, మెట్రో నెట్వర్క్ 248 కిలోమీటర్ల నుంచి 1,095 కి.మీ.లకు విస్తరణ.
  • 74 నుంచి 164కు పెరిగిన విమానాశ్రయాలు.
  • విదేశాల్లో ఉన్న 668 అరుదైన కళాఖండాలు భారతదేశానికి తిరిగి వచ్చాయి. 
  • జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా పాటించడానికి 177 దేశాలు మద్దతు ఇచ్చాయి.
  • ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భారతదేశం ర్యాంకింగ్ 142వ స్థానం నుండి 63వ స్థానానికి వృద్ధి.
  • భారత్ నెట్ ప్రాజెక్టు కింద దేశవ్యాప్తంగా 2.14 లక్షలకు పైగా గ్రామ పంచాయతీలు ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ తో అనుసంధానం.
  • భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి 2014-15లో రూ.1.9 లక్షల కోట్ల నుంచి 2024-25 లో రూ.11.3 లక్షల కోట్లకు పెరిగింది.
  • ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారు భారత్, 2014లో కేవలం రెండు యూనిట్లతో పోలిస్తే నేడు దేశంలో 300కు పైగా తయారీ యూనిట్లు.
  • భారతదేశ రక్షణ పరికరాలలో కనీసం 65% ఇప్పుడు దేశీయంగా తయారవుతున్నాయి. దేశీయ రక్షణ ఉత్పత్తి 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ.46,429 కోట్ల నుంచి 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.1.54 లక్షల కోట్లకు రికార్డు స్థాయిలో పెరిగాయి.
  • 2014 ముందు భారతదేశం కేవలం రూ.686 కోట్ల విలువైన రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తే నేటి రక్షణ రంగ ఎగమతులు రూ.38,400 కోట్లు దాటాయి. ప్రపంచవ్యాప్తంగా 100 కి పైగా దేశాలు భారతదేశ స్వదేశీ ఆయుధాలను కొనుగోలు చేస్తున్నాయి.
  • 2014లో దేశంలో కేవలం 500 స్టార్టప్ లు, కేవలం 4 యునికార్న్ లు మాత్రమే ఉండగా, నేడు 2.06 లక్షల స్టార్టప్ లు, 120 యునికార్న్ లకు పెరిగాయి.
  • షెడ్యూల్ కంటే ఐదు సంవత్సరాల ముందుగానే శిలాజేతర ఇంధన వనరుల నుండి 50% విద్యుత్తును ఉత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని సాధించిన భారత్. 
  • దేశంలో శిలాజేతర ఇంధన వనరుల స్థాపిత సామర్థ్యం మొత్తం 283.46 గిగావాట్లు. పునరుత్పాదక ఇంధన స్థాపిత సామర్థ్యంలో భారతదేశం ప్రపంచవ్యాప్తంగా మూడవ స్థానం.
  • నగదు బదిలీ (DBT), ఆధార్ ప్రామాణీకరణ లక్షలాది మంది అక్రమ లబ్ధిదారుల తొలగింపు, ఫలితంగా రూ.4.31 లక్షల కోట్లు ఆదా.

 

మోదీ పథకాలు – ప్రజలకు అందుతున్న ఫలాలు

  • ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద 81 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉచిత రేషన్.
  • జన్ ధన్ యోజన కింద 58 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు, వీటిలో 32 కోట్లకు పైగా మహిళలు. 
  • ప్రధాన మంత్రి ముద్రా యోజన ద్వారా 57.79 కోట్లకు పైగా రుణాలు మంజూరు.
  • ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితిని రూ.2 లక్షల నుంచి రూ.12.75 లక్షలకు పెంపు. 
  • ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు సంవత్సరానికి రూ.6,000 నగదు సహాయం. ఇప్పటివరకు 11 కోట్ల మందికి పైగా రైతులకు రూ.4.3 లక్షల కోట్లు బదిలీ.
  • గత 12 ఏళ్లలో కిసాన్ క్రెడిట్ కార్డు (KCC) పథకం కింద 7.71 కోట్ల మంది రైతులకు సుమారు రూ.10 లక్షల కోట్ల రుణాలు. 
  • ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన కింద 60 కోట్లకు పైగా వైద్య బీమా.
  • ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన ద్వారా ఇప్పటివరకు 58.09 కోట్ల మందికి పైగా ప్రజలు లబ్ధి.
  • ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద 4 కోట్ల పక్కా ఇళ్లు.
  • ప్రధాన మంత్రి స్వనిధి యోజన కింద 74 లక్షల మందికి పైగా వీధి వ్యాపారులు రుణాలు. 
  • స్టాండప్ ఇండియా కింద ఎస్సీ/ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ.15,000 కోట్లకు పైగా రుణాలు.
  • ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన కింద 30 లక్షల మంది సాంప్రదాయ కళాకారులకు నైపుణ్యం ఆధారిత రుణాలు.
  • ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన ద్వారా దేశవ్యాప్తంగా సుమారు 11 కోట్ల మంది మ హిళలకు ఉచిత గ్యాస్ (LPG) కనెక్షన్లు.
  • లఖ్ పతి దీదీ యోజన కింద 3 కోట్ల మందికి పైగా మహిళలు లబ్ధి.
  • 4.5 కోట్లకు పైగా ప్రధాన మంత్రి సుకన్య సమృద్ధి ఖాతాలు.
  • భద్రతా దళాలలో మహిళా అధికారుల సంఖ్య 3,000 నుండి 11,000 కు పెరిగింది.
  • గత 12 సంవత్సరాలలో 23 కొత్త ఎయిమ్స్, వైద్య కళాశాలలు.
  • మిషన్ ఇంద్రధనుష్ ద్వారా 5.4 కోట్ల మందికి పైగా పిల్లలకు ఉచిత టీకాలు.
  • స్వచ్ఛ భారత్ మిషన్ కింద దేశవ్యాప్తంగా 12 కోట్లకు పైగా మరుగుదొడ్లు నిర్మాణం.
  • జల్ జీవన్ మిషన్ కింద ఇప్పుడు 16 కోట్లకు పైగా కుటుంబాలు నల్లా కనెక్షన్లు.
  • సౌభాగ్య యోజన ద్వారా దేశవ్యాప్తంగా అన్ని గృహాలకు 100% విద్యుదీకరణ.