Electricity

ప్రగతి పథంలో విద్యుత్ రంగం పరుగులు

కప్పుడు భారతదేశ విద్యుత్ వ్యవస్థలోనే అత్యంత బలహీనమైన లింకుగా ఉన్న దేశీయ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఒక చారిత్రాత్మక మైలురాయిని అధిగమించాయి. ఇటీవలి ఆర్థిక సంవత్సరం 2024-25లో అవి ఏకంగా రూ. 2,701 కోట్ల లాభాన్ని ఆర్జించాయి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత డిస్కంలు ఈ స్థాయి పనితీరును కనబరచడం ఇదే తొలిసారి. సరిగ్గా ఏడాది క్రితం ఇవే సంస్థలు రూ.25,553 కోట్ల నష్టాల్లో కూరుకుపోగా, 2013-14 ఆర్థిక సంవత్సరంలో వీటి నష్టాలు ఏకంగా రూ.67,962 కోట్ల దిగ్భ్రాంతికర స్థాయికి చేరాయి.

విద్యుత్ రంగాన్ని పదే పదే వేధించే కరెంటు కోతల యుగం నుంచి రికార్డు స్థాయి స్థిరత్వం వైపు నడిపించిన విధానాన్ని బట్టి చూస్తే ఈ పునరుజ్జీవనం నిజంగా అసామాన్యం.

ఇంతటి అద్భుతమైన మార్పు ఎలా సాధ్యమైంది? విద్యుత్ మంత్రిత్వ శాఖ ద్వారా నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం నిరంతరాయంగా, నిర్దిష్ట వ్యూహాలతో అమలు చేసిన సంస్కరణల ఫలితమే ఇది. 

ఆలస్యంగా చెల్లింపులు జరగడం, వ్యయాలు, ఆదాయాల మధ్య వ్యత్యాసాలు, భారీ నష్టాలు, లోపభూయిష్టమైన మీటరింగ్ వంటి దీర్ఘకాలిక సమస్యలను ఈ సంస్కరణలు పరిష్కరించాయి. తద్వారా విద్యుత్ రంగం మొత్తం పురోగతికి ఇవి కారణమయ్యాయి.

ఈ ప్రగతిని రెండు ప్రధాన సూచికలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి:

  • మొదటిది,ఉత్పత్తి వ్యయం-వసూళ్ల మధ్య వ్యత్యాసం భారీగా తగ్గడం: 2013-14 ఆర్థిక సంవత్సరంలో ప్రతి యూనిట్‌కు 78 పైసలుగా ఉన్న నష్టం, 2024-25 ఆర్థిక సంవత్సరం నాటికి కేవలం ఆరు పైసలకు పరిమితమైంది.
  • రెండవది, సాంకేతిక, వాణిజ్య నష్టాలు గణనీయంగా తగ్గడం: 2013-14 ఆర్థిక సంవత్సరంలో 22.62 శాతంగా ఉన్న ఈ నష్టాలు, 2024-25 నాటికి 15.04 శాతానికి పడిపోయాయి.

ఇవే కాకుండా చెల్లింపులలో క్రమశిక్షణ కూడా మెరుగైంది. సగటు చెల్లింపు కాలం 2020-21 ఆర్థిక సంవత్సరంలో 178 రోజులుగా ఉండగా, అది 2024-25 నాటికి 113 రోజులకు తగ్గింది. 13 రాష్ట్రాల పరిధిలో పేరుకుపోయిన పాత బకాయిలు 2022లో రూ.1,39,947 కోట్లుగా ఉండగా, ఫిబ్రవరి 10, 2026 నాటికి అవి రూ.4,109 కోట్లకు భారీగా క్షీణించాయి.

‌కీలక సంస్కరణలు తెచ్చిన మార్పు 

ఈ మార్పును సుసాధ్యం చేసిన అనేక చర్యలతో ముఖ్యంగా ప్రస్తావించాల్సినవి:

  • విద్యుత్ (ఆలస్యంగా చెల్లింపుల సర్ ఛార్జ్) నిబంధనలు, 2022.
  • నెలవారీ ఇంధన వ్యయాల సర్దుబాటు కోసం తెచ్చిన విద్యుత్ (సవరణ) నిబంధనలు, 2022.
  • దాదాపు 20 కోట్ల మంది వినియోగదారులకు స్మార్ట్ మీటరింగ్‌ను లక్ష్యంగా పెట్టుకున్న ‘పునర్వ్యవస్థీకృత పంపిణీ రంగ పథకం (ఆర్ డిఎస్ఎస్’ (డిసెంబర్ 2025 నాటికి 3.9 కోట్ల మీటర్ల ఏర్పాటు పూర్తయింది).
  • సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు వాటి జీడీపీ లో అదనంగా 0.5 శాతం వరకు అప్పులు తీసుకునే వెసులుబాటు కల్పించిన ‘పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు’ 

పైన పేర్కొన్న పంపిణీ సంస్కరణలు విస్తృతమైన మార్పుల్లో ఒక భాగం మాత్రమే. జూలై 2012లో 20 రాష్ట్రాల వ్యాప్తంగా 60 కోట్ల మందికి పైగా ప్రజలను అంధకారంలోకి నెట్టేసిన.. ప్రపంచంలోనే అతిపెద్ద ‘బ్లాకౌట్’ ఉదంతం నుంచి భారత్ నేడు అత్యుత్తమ గ్రిడ్ స్థిరత్వం వైపు పయనించింది. ఏప్రిల్ 24, 2026 న ఎలాంటి గ్రిడ్ వైఫల్యం లేకుండా దేశం రికార్డు స్థాయిలో 256 గిగావాట్ల విద్యుత్ డిమాండ్‌ను విజయవంతంగా అందుకోగలిగింది. ఇందులో గరిష్ట వినియోగ సమయాల్లో సౌర విద్యుత్ వాటా దాదాపు 22 శాతంగా ఉండటం గమనార్హం.

దేశ స్థాపిత విద్యుత్ సామర్థ్యం 520.51 గిగావాట్లకు (జనవరి 2026 నాటికి) చేరింది. అదే సమయంలో విద్యుత్ కొరత 2013-14 ఆర్థిక సంవత్సరంలో 4.2 శాతం ఉండగా, అది 2025-26 ఆర్థిక సంవత్సరంలో (డిసెంబర్ 2025 నాటికి ) కేవలం 0.03 శాతానికి పడిపోయింది. రూ.1.85 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో 2021 నాటికి దాదాపు దేశంలోని అన్ని గృహాలకు విద్యుద్దీకరణ పూర్తయింది. దీని ద్వారా 18,374 గ్రామాలకు విద్యుత్ సరఫరా చేరడమే కాకుండా, 2.86 కోట్ల ఇళ్లకు కనెక్షన్లు లభించాయి.

గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా కూడా ఊహించని విధంగా మెరుగైంది. 2014లో రోజుకు సగటున 12.5 గంటలు మాత్రమే అందుబాటులో ఉన్న విద్యుత్, 2025 నాటికి 22.6 గంటలకు పెరిగింది. 

కాగా పట్టణ ప్రాంతాల్లో ప్రస్తుతం 23.4 గంటల సరఫరా నమోదవుతోంది. 2014 నుంచి పునరుత్పాదక (శిలాజేతర) విద్యుత్ సామర్థ్యం 180 శాతం వృద్ధి చెందింది. రికార్డు నమోదైన ఆ రోజున (ఏప్రిల్ 24, 2026), ఒక్క సౌర విద్యుత్తే 60.5 గిగావాట్లు కాగా మొత్తం పునరుత్పాదక ఇంధన వనరులు (సౌర, జల, పవన విద్యుత్) కలిసి 76 గిగావాట్లకు పైగా అందించాయి. గరిష్ట డిమాండ్‌ను తట్టుకోవడంలో వీటి వాటా 2023లో 10.9 శాతం ఉండగా, 2025 నాటికి 15.4 శాతానికి పెరిగింది. గత దశాబ్ద కాలంలో పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి వృద్ధి చెందిన వేగాన్ని పరిశీలిస్తే, ఇది ఈమాత్రం చిన్న విషయమేమీ కాదు.

అనిశ్చితి, రోజువారీ విద్యుత్ కోతల నుంచి రికార్డు స్థాయి డిమాండ్‌ను స్థిరంగా ఎదుర్కొంటూ దాదాపు 24 గంటలూ నిరంతర సరఫరా అందించే స్థాయికి భారతదేశ విద్యుత్ రంగ రూపురేఖలు మారిపోయాయి. నిరంతర సంస్కరణలు, స్మార్ట్ మీటరింగ్, పునరుత్పాదక ఇంధన అనుసంధానం, పటిష్టమైన గ్రిడ్ మౌలిక సదుపాయాలు కలిసి… ఒకప్పుడు అసాధ్యమని భావించిన ‘అందరికీ నమ్మకమైన విద్యుత్’ అనే లక్ష్యాన్ని సాకారం చేశాయి. గత దశాబ్ద కాలంలో సాధించిన ఈ ప్రగతి మరింత ఊపందుకుని దేశ విద్యుత్ రంగం శాశ్వత లక్షణంగా మారాలంటే ఇప్పుడు కావాల్సిందల్లా రాష్ట్రాల నిరంతర సహకారం, మరింత లోతైన సంస్కరణలు మాత్రమే.

షెహజాద్ పూనావాలా,
బిజెపి జాతీయ అధికార ప్రతినిధి