అంగరంగ వైభవంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో సికింద్రాబాద్ ఫరేడ్ గ్రౌండ్ లో జూన్ 20న 1డే కౌంట్ డౌన్ ఈవెంట్ లో భాగంగా యోగా వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా, భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె. లక్ష్మణ్ లతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, సినీతారలు, సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆసనాలు వేశారు. ఈ యోగా మహోత్సవానికి నగర నలుమూలల నుండి యువతీ యువకులు, విద్యార్థులు, మహిళలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. వేదిక ప్రాంగణమంతా యోగా సాధకులతో కిక్కిరిసిపోయింది.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ప్రసంగిస్తూ.. “ఈ రోజు మనం కేవలం ఒక శారీరక వ్యాయామ విధానాన్ని మాత్రమే జరుపుకోవడం కాదు వేల సంవత్సరాలుగా మానవాళికి ఆరోగ్యకరమైన జీవనం, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సమతుల్యతకు మార్గం చూపిన భారతదేశపు సనాతన జ్ఞాన సంప్రదాయానికి గౌరవం తెలుపుతున్నాం. భారతదేశం ప్రపంచానికి అందించిన ఈ అమూల్య వారసత్వాన్ని నేడు ప్రపంచమంతా స్వీకరించడం మనకు గర్వకారణం. ప్రధానమంత్రి రేంద్ర మోదీ కృషి ఫలితంగా ఐక్యరాజ్యసమితి జూన్ 21ను అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించింది. నేడు యోగా దేశాల సరిహద్దులు, భాషలు, సంస్కృతులను దాటి ప్రపంచ మానవాళిని ఏకం చేసే శక్తిగా నిలిచింది. ఈ ఏడాది యోగా దినోత్సవం మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని అందిస్తోంది. ఆధునిక జీవితంలోని సవాళ్లు, ఒత్తిళ్లు, అసమతుల్యతల మధ్య యోగా మనకు ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, సానుకూల శక్తిని ప్రసాదించే మహత్తర సాధనం. ఏ దేశానికైనా అసలైన బలం కేవలం దాని ఆర్థిక వ్యవస్థలో, సహజ వనరుల్లో లేదా సాంకేతిక పురోగతిలో ఉండదు. ఆ దేశపు సంస్కృతి, నాగరికత, విలువలలోనే దాని నిజమైన శక్తి దాగి ఉంటుంది. ఒక సమాజం తన మూలాలతో అనుసంధానమై ఉన్నప్పుడే భవిష్యత్తు వైపు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతుంది. ముఖ్యంగా, ప్రపంచానికి భారతదేశం అందించిన యోగా నేడు ఒక ప్రపంచవ్యాప్త ప్రజా ఉద్యమంగా మారింది. గత కొన్ని సంవత్సరాలలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాలలో 26 కోట్లకు పైగా ప్రజలు పాల్గొనడం, భారతదేశపు ఈ ప్రాచీన జ్ఞానం ప్రపంచ మానవాళి శ్రేయస్సుకు ఎంతగానో దోహదపడుతోందని స్పష్టం చేస్తోంది. యోగా మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. అభివృద్ధి, సంప్రదాయం పరస్పర విరుద్ధమైనవి కావు. ఆధునికతను స్వీకరిస్తూనే మన సాంస్కృతిక మూలాలతో అనుసంధానమై ఉండవచ్చు. అదే భారతదేశ మార్గం, అదే మన ప్రత్యేకత, అదే మన అతి పెద్ద బలం. ప్రపంచానికి శాంతి, మానవ సంక్షేమ మార్గాన్ని చూపే భారతదేశ నిర్మాణానికి కలిసి కృషి చేద్దాం.” అని అన్నారు.
వెంకయ్య నాయుడు యోగా విశిష్టతను, నేటి సమాజానికి దాని ఆవశ్యకతను వివరిస్తూ “యోగాను ఏదో ఒక మతానికి పరిమితం చేసి చూడటం ముూర్ఖత్వమే అవుతుంది. యోగా అనేది ఒక నిర్దిష్ట మతానికి సంబంధించింది కాదు అది సర్వమానవ సౌభ్రాతృత్వానికి, విశ్వశాంతికి దోహదపడే అద్భుత సాధనం. మన పూర్వీకులు ఎంతో పరిశోధించి, రంగరించి మానవాళికి అందించిన ఒక పరిపూర్ణ జీవన విధానం ఇది. భారతదేశం విశ్వగురువుగా నిలవడానికి మన సంస్కృతి, సంప్రదాయాలే కారణం. ప్రపంచానికి మన దేశం అందించిన అత్యంత గొప్ప, అపురూపమైన కానుక ‘యోగా’. నేడు ప్రపంచం మొత్తం పాశ్చాత్య సంస్కృతి వ్యామోహంలో పడి అటు ఇటు కొట్టుమిట్టాడుతోంది. ఇలాంటి సమయంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి యోగా ఒక్కటే శరణ్యం. యోగా అనేది కేవలం కొన్ని శారీరక ఆసనాలు మాత్రమే కాదు.. అది మనిషిని సమగ్రమైన, సంపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దుతుంది. మానవ చైతన్యానికి నిదర్శనమైన యోగా ద్వారా సర్వతోముఖాభివృద్ధి సాధ్యమవుతుంది. ఇది మనిషికి, ప్రకృతి మాతకు మధ్య అనుసంధానాన్ని పెంచే ఒక గొప్ప వరం. నేటి ఆధునిక కాలంలో మనుషులను పీడిస్తున్న మానసిక ఒత్తిడిని దూరం చేసి, గుండె నిండా స్థైర్యాన్ని, ఆధ్యాత్మిక భావనను పెంపొందించే శక్తి యోగాకు ఉంది. ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అనే నానుడిని నిజం చేయాలంటే ప్రతి ఒక్కరూ ప్రకృతి ఒడిలో జీవించడం అలవాటు చేసుకోవాలి. నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలి.” అని అన్నారు.
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. “యోగా అనేది అందరినీ ఏకం చేసే ఒక అద్భుత సాధనం. ఇందులో ఎలాంటి సామాజిక భేదభావాలు, కులమతాల పట్టింపులు ఉండవు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవన విధానంలో ఒక భాగంగా చేసుకోవాలి. ఇది సమాజంలో సమరసతను పెంపొందిస్తుంది. యోగా అంటే కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదు అది మనసును, బుద్ధిని ప్రశాంతంగా, ధృఢంగా ఉంచే ఒక గొప్ప మార్గం. మారుతున్న కాలంలో ఒత్తిడిని అధిగమించి, సరైన నిర్ణయాలు తీసుకునే మానసిక స్థైర్యాన్ని యోగా మనకు ప్రసాదిస్తుంది. యోగా అనేది జీవితాన్ని సంపూర్ణంగా జీవించేలా నేర్పే ఒక విశిష్టమైన కళ. అదే సమయంలో నిత్యం ఎదురయ్యే అనారోగ్య సమస్యల నుండి మనల్ని కాపాడే ఒక దివ్యమైన మందు (ఔషధం) లాంటిది. శారీరక దృఢత్వానికి, మానసిక ప్రశాంతతకు యోగాను మించిన ప్రత్యామ్నాయం లేదు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ఆరోగ్యవంతులైన పౌరులు అవసరం. కాబట్టి, వయస్సుతో నిమిత్తం లేకుండా చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ యోగాను ఒక అలవాటుగా మార్చుకోవాలి. నిత్యం యోగా సాధన చేస్తూ సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలి.
భారతదేశానికి చెందిన అత్యంత ప్రాచీనమైన, విశిష్టమైన యోగాసనాలను అంతర్జాతీయ స్థాయిలో విశేష ప్రాచుర్యం కల్పించిన వ్యక్తి ప్రధాని మోదీ అని జి. కిషన్ రెడ్డి అన్నారు. “మోదీ చొరవతోనే ఐక్యరాజ్యసమితి (UN) అధికారికంగా జూన్ 21వ తేదీని ‘అంతర్జాతీయ యోగా దినోత్సవం’గా ప్రకటించింది. ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. దేశ ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంతో, ఆనందంగా ఉండాలనేదే కేంద్ర ప్రభుత్వ సంకల్పం. ప్రతి ఒక్కరూ యోగాను కేవలం ఒక వ్యాయామంగా కాకుండా, తమ దైనందిన జీవన విధానంలో (Life Style) ఒక భాగంగా చేసుకోవాలి. అప్పుడే ఆరోగ్యకరమైన, దృఢమైన భారతదేశ నిర్మాణం సాధ్యమవుతుంది.” అని అన్నారు
రాజ్యసభ సభ్యులు, బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్ మాట్లాడుతూ.. “యోగా అనేది భారతదేశం ప్రపంచానికి అందించిన అత్యంత విలువైపన సంపద. మన దేశ గొప్పదనాన్ని, ప్రాచీన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయడంలో యోగా కీలక పాత్ర పోషించింది. యోగా అనేది ఈనాటి వ్యాయామం కాదు, అది మన పూర్వీకులు జీవన విధానంలో భాగంగా ఆచరించిన అత్యంత ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయం. నేటి ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరికీ శారీరక ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మిక చింతన కూడా ఎంతో అవసరం.” అని అన్నారు. మానసిక ప్రశాంతతను అందిస్తూ, మనిషిని అంతర్గతంగా దృఢపరిచే శక్తి ఒక్క యోగాకే ఉందని, దీనిని ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. “భారతదేశ ప్రాచీన సంస్కృతి, సాంప్రదాయాలలో యోగా ఒక భాగం. నరేంద్ర మోదీ దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాతే, మన దేశ సంపదైన యోగాను ప్రపంచ దేశాలన్నింటికీ పరిచయం చేశారు. నేడు ప్రపంచవ్యాప్తంగా యోగా వేడుకలను ఘనంగా జరుపుకోవడం ప్రతి భారతీయుడికి ఎంతో సంతోషాన్నిచ్చే విషయం. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంది. నేటి యువత మానసికంగా ప్రశాంతంగా, శారీరకంగా దృఢంగా ఉండాలంటే నిత్యం యోగాసనాలు వేయడం ఎంతో అవసరం. యువత ఒత్తిడిని అధిగమించి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారేందుకు యోగా ఒక అద్భుత సాధనంగా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరూ యోగాను అలవాటు చేసుకొని ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలి.” అని పిలుపునిచ్చారు.
యోగా భారతదేశం ప్రపంచానికి అందించిన వరం
యోగా ప్రపంచానికి భారతదేశం అందించిన శాశ్వతమైన నాగరికతా వరమని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు స్పష్టం చేశారు. యోగాను అంతర్జాతీయ వేదికపైకి తీసుకెళ్లి, దానిని ఒక ప్రపంచవ్యాప్త ఉద్యమంగా మార్చిన ఘనత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి దక్కుతుందని తెలిపారు. ప్రపంచమంతా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని అత్యంత ఉత్సాహంగా జరుపుకొంటోందని అన్నారు. జూన్ 21న సికింద్రాబాద్ మహంకాళీ జిల్లా అధ్యక్షుడు గుండగోని భరత్ గౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్లో నిర్వహించిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, యోగా అనేది కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాదని, అది మానసిక ఆరోగ్యాన్ని, శ్రేయస్సును బలోపేతం చేసే సంపూర్ణ జీవన విధానమని పేర్కొన్నారు.
నేటి ఉరుకులు పరుగుల జీవితంలో ప్రజలు ఒత్తిడి, నిరాశ, జీవనశైలి సంబంధిత ఆరోగ్య సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్నారని, అటువంటి పరిస్థితుల్లో యోగా సహజమైన, శక్తివంతమైన పరిష్కారాన్ని అందిస్తుందని అన్నారు. ప్రతి చిన్న ఆరోగ్య సమస్యకైనా ప్రజలు మాత్రలు, మందులపై ఆధారపడుతున్నారని, అయితే యోగాను క్రమం తప్పకుండా అభ్యసించడం ద్వారా ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన, సమతుల్యమైన జీవితాన్ని గడపవచ్చని పేర్కొన్నారు. యోగా మానసిక దృఢత్వాన్ని పెంపొందించడమే కాకుండా, సమగ్ర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని తెలిపారు. ప్రత్యేకంగా విద్యార్థులు, యువత ప్రతిరోజూ యోగాను తమ జీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. అనేక పాఠశాలలు కూడా విద్యార్థులను యోగా వైపు ప్రోత్సహించడం సంతోషకరమైన విషయమని, ఇది చిన్న వయస్సు నుంచే పిల్లల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చేందుకు దోహదపడుతుందని అన్నారు. యోగాను ప్రతి ఒక్కరూ తమ నిత్యజీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

