Bastar

బస్తర్‌లో 12 ఏళ్ల శాంతి, పురోగతుల ప్రస్థానం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన భారతదేశంలో పెను మార్పులను తీసుకువచ్చింది. దేశ భద్రత, అభివృద్ధి పరంగా ఇదొక సువర్ణ అధ్యాయం. భద్రత, రహదారులు, విద్యుత్, గృహనిర్మాణం, డిజిటల్ సేవలు, సంక్షేమ పథకాలలో దేశం గణనీయమైన పురోగతిని సాధించింది. బలమైన నాయకత్వం దేశాన్ని ఆత్మవిశ్వాసంతో ముందుకు నడిపించడంలో సహాయపడింది. ఛత్తీస్‌గఢ్‌కు ఇది ఒక కీలకమైన మార్పు. గతంలో బస్తర్, ఇతర గిరిజన ప్రాంతాలు నక్సలైట్ హింస, అధ్వాన రహదారులు, ప్రాథమిక వసతుల లేమికి మారుపేరుగా ఉండేవి. నేడు మెరుగైన భద్రత, రోడ్లు, సంక్షేమ పథకాలతో పరిస్థితి మెరుగుపడుతోంది, ఇది కొత్త ఆశలను చిగురింపజేస్తోంది.

దశాబ్దం క్రితం భారతదేశం ఉగ్రవాదాన్ని, వామపక్ష తీవ్రవాదాన్ని ఎదుర్కొంది. ఈ సవాళ్లను అధిగమించేందుకు ప్రభుత్వం కఠినమైన చర్యలు చేపట్టింది. అధికరణం 370 రద్దు జాతీయ ఐక్యతను బలోపేతం చేసింది. నక్సలిజానికి వ్యతిరేకంగా చేపట్టిన చర్యలు బస్తర్‌తో సహా పలు ప్రాంతాలలో హింసను తగ్గించాయి, తద్వారా నిర్లక్ష్యానికి గురైన ప్రాంతాలలో సైతం అభివృద్ధి ప్రారంభమైంది. బస్తర్‌లో ‘నియాద్ నెల్లానార్ యోజన’ కింద 17 శాఖలకు చెందిన 43 పథకాల ప్రయోజనాలు భద్రతా క్యాంపుల సమీపంలోని 525 గ్రామాలకు అందుతున్నాయి. మెరుగైన సేవలు అందించడం కోసం ఈ క్యాంపులను ‘వీర్ షహీద్ గుండంధూర్ సేవా డేరా’లుగా మారుస్తున్నారు. గడిచిన 12 ఏళ్లలో గిరిజన ప్రాంతాలకు అభివృద్ధిని తీసుకురావడంలో కేంద్ర ప్రభుత్వ పథకాలు కీలక పాత్ర పోషించాయి. ‘పీఎం ఆవాస్ యోజన’ కింద ఛత్తీస్‌గఢ్‌లో 2.43 లక్షల పట్టణ గృహాలు మంజూరవగా, 2.16 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ‘పీఎం జన్ మన్ యోజన’ బాగా వెనుకబడిన గిరిజన సమూహాలకు గృహాలు, రహదారులు, వైద్యం, విద్యను అందిస్తూ మద్దతుగా నిలుస్తోంది. ‘ధర్తీ ఆబా’ కార్యక్రమం గిరిజన గ్రామాల్లోని అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, స్థానిక సేవలను మెరుగుపరుస్తోంది.

‘స్వస్థ్య బస్తర్’ ప్రచారం కింద 36 లక్షల మందికి ప్రాథమిక పరీక్షలు చేసి 4.96 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు, 5,600 మందిని ఉన్నతస్థాయి ఆస్పత్రులకు పంపించారు. ‘మహాతరి వందన్ యోజన’ ద్వారా 69 లక్షల మంది మహిళలు నెలకు రూ.1,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని పొందుతున్నారు, దీని కింద ఇప్పటివరకు రూ.17,500 కోట్లకు పైగా నిధులు బదిలీ అయ్యాయి. ‘పీఎం-కిసాన్’ రైతన్నలకు అండగా నిలుస్తోంది. ‘కృషక్ ఉన్నతి యోజన’ కింద ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2025-26లో 1.41 కోట్ల మెట్రిక్ టన్నుల వరిని రూ.33,431 కోట్ల మద్దతు ధర, రూ.10,324 కోట్ల పెట్టుబడి ఆర్థిక సాయం అందించి సేకరించడం జరిగింది. ‘పీఎం సూర్య ఘర్’ కింద 61,000 ఇళ్లకు రూఫ్‌టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు, ఇది ఖర్చులను తగ్గించడమే కాకుండా స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది. సింగిల్-విండో విధానం వ్యాపారాల నిర్వహణను సులభతరం చేస్తూ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) పెట్టుబడి వాతావరణాన్ని మెరుగుపరిచింది.

‘బస్తర్ ఒలింపిక్స్’, ‘బస్తర్ పండుమ్’ గిరిజన సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాయి. చిత్రకూట్‌ను ఒక ప్రధాన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తుండటం వల్ల స్థానికంగా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా లబ్ధిదారులకు ఎలాంటి ఆలస్యం లేదా అవినీతి లేకుండా నేరుగా నిధులు అందుతున్నాయి. సుదూర గ్రామాల్లో మొబైల్ కనెక్టివిటీ, ఇంటర్నెట్ సౌకర్యాలు పెరగడం వల్ల ప్రజలు ప్రభుత్వ సేవలను సులభంగా పొందగలుగుతున్నారు. స్వయం సహాయక సంఘాలు, అటవీ ఆధారిత జీవనోపాధి, సహకార నమూనాల ద్వారా బస్తర్ సామాజిక, ఆర్థిక మార్పులను చూస్తోంది. చిన్నతరహా అటవీ ఉత్పత్తుల సేకరణ, వాటికి విలువ జోడింపు ద్వారా గిరిజన కుటుంబాల ఆదాయం పెరుగుతోంది. ‘అగ్రిస్ట్యాక్’, ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ వంటి డిజిటల్ వ్యవసాయ కార్యక్రమాలు పారదర్శకతను పెంచుతూ, సబ్సిడీల పంపిణీలో ఆలస్యాన్ని తగ్గిస్తున్నాయి. రైతులు ఇప్పుడు పంట బీమా, కనీస మద్దతు ధర ప్రయోజనాలు, భూసార సమాచారాన్ని మరింత సమర్ధంగా పొందగలుగుతున్నారు. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు యువతను జాతీయ, అంతర్జాతీయ అవకాశాలకు సిద్ధం చేస్తున్నాయి. ఐటీ, ఏఐ వంటి నూతన రంగాలలో శిక్షణ ఇవ్వడం వల్ల యువత ఉద్యోగాలకు అర్హులుగా మారుతున్నారు. మెరుగైన రహదారులు, విద్యుదీకరణ, తాగునీటి సరఫరా వంటివి గతంలో వెనుకబడిన గ్రామాలలో ప్రాథమిక అవసరాలను తీరుస్తున్నాయి. ప్రభుత్వ పథకాలు పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య ఉన్న అసమానతలను తగ్గిస్తున్నాయి.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి వ్యూహాల ప్రభావం బస్తర్‌లోని ప్రతి రంగంలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఇది నేడు ఒక పరివర్తన నమూనాగా ఎదుగుతోంది. పాలనపై ప్రజల్లో నమ్మకం పెరిగింది, పౌరుల చురుకైన భాగస్వామ్యం కనిపిస్తోంది, భవిష్యత్తుకై అవకాశాలు మెరుగవుతున్నాయి. భారతదేశం ‘వికసిత్ భారత్ 2047’ వైపు అడుగులు వేస్తున్న తరుణంలో, అభివృద్ధి ఫలాలు ప్రతి పౌరుడికీ అందేలా చూసేందుకు ఛత్తీస్‌గఢ్ నిరంతరం కృషిచేస్తోంది. లక్ష్య ఆధారిత పాలన, సంక్షేమ పథకాల సమర్ధ అమలు ద్వారా ఎంతటి దుర్గమ ప్రాంతాలలోనైనా జీవితాలను ఎలా మార్చవచ్చో, అందరికీ సురక్షితమైన, ఆశాజనకమైన భవిష్యత్తును ఎలా అందించవచ్చో బస్తర్ లో మారిన పరిస్థితి నిరూపిస్తోంది. ఈ పురోగతి నిరంతర కృషి, బలమైన నాయకత్వం, ప్రజలే కేంద్రంగా సాగే విధానాలు, వివిధ ప్రభుత్వ స్థాయిల మధ్య సమన్వయంతో కూడిన అమలు ఫలితం.

విష్ణు దేవ్ సాయి,
ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి